Hero Naveen Polisetti (Agent sai sreenivasa atreya)

 

 

Hero naveen polisetti

 

 

ఆ రోజంతా… ఏడుస్తూనే ఉన్నాను!

నవీన్‌ పొలిశెట్టి… తెలుగబ్బాయే కానీ ఉత్తరాదివాళ్లు అతణ్ణి తమ వాడే అనుకుంటారు. పొలిశెట్టిని కాస్తా ‘పాలీ షెట్టీ’ అని పలుకుతారు! అతను చేసిన ‘ఏఐబీ’ యూట్యూబ్‌ వీడియోలు అక్కడంత ఫేమస్‌. నిజానికి, ఆ సిరీస్‌ కారణంగానే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’గా మనముందుకు రాగలిగాడు. కత్తిమీద సాములాంటి కామెడీ డిటెక్టివ్‌ హీరోగా కడుపుబ్బా నవ్వించగలిగాడు. ప్రేక్షకుల్ని ఇంతగా నవ్వించినా ఆ సినిమా విడుదలైన రోజు తను మాత్రం ఏడుస్తూ ఉండిపోయాడట. అది ఎందుకో తెలుసుకోవడానికి మనమూ ‘ఏజెంట్‌’ కానక్కర్లేదు… తన కథ చదివితే చాలు…!

చిరంజీవి ఠాగూర్‌ సినిమాలో ‘తెలుగులో నాకు నచ్చని ఒకే పదం… క్షమాపణ’ అని డైలాగ్‌ ఉంటుంది కదా! నాకూ ఇంగ్లిషులో అలాంటి పదం ఒకటుంది… గత పదేళ్లలో నన్ను బాగా వేదించిన ఆ పదం ‘సెటిల్‌’. కనిపించిన ప్రతి ఒక్కరూ ‘వాడు చూడు నీకంటే జూనియర్‌. భార్యాపిల్లలతో అమెరికాలో ‘సెటిల్‌’ అయిపోయాడు. నీ పరిస్థితేమిటో మేం చెప్పక్కర్లేదు…’ అంటుండేవారు. ‘అసలు నా ప్రయత్నమంతా ఆ రకంగా సెటిల్‌ అయిపోకూడదనే కదా!’ అనేవాణ్ణి నేను. నిజానికి, ఈ విజయాలన్నింటినీ నేనెప్పుడో సాధించేశాను. ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేసి లండన్‌లో పనిచేశాను. కారూ, సొంత ఫ్లాటూ… ఇలా అన్ని లగ్జరీలూ అనుభవించాను. అలా ‘సెటిల్‌’ అయిన నేను అవన్నీ వదులుకుని, ఫ్రస్ట్రేషన్‌ అంచులకి వెళ్లడానికి కారణం… నటనపట్ల నాకున్న ఆసక్తి! ఆ వైరస్‌ నాకు చాలా చిన్నప్పుడే సోకింది. నా పంచప్రాణాలనీ తన సొంతం చేసేసుకుంది. చెబితే నమ్మరుకానీ ఇదంతా నా నాలుగో తరగతి నుంచే మొదలైంది!

నేను తల్లిపాత్రలో..!
ప్రహ్లాదుడి కథ తెలుసు కదా మీకు! వాళ్ల నాన్నకేమో విష్ణువంటే పడదు… కొడుకేమో పరమ హరిభక్తుడు. నాకూ అంతే. నాన్నకి సినిమాలంటే నచ్చదు. పిల్లలు సినిమాలు చూడటమన్న ఆలోచనే అసలు పడదు. చిన్నప్పటి నుంచీ టెన్త్‌దాకా మా ఇంట్లోని టీవీలో మేం చూసిన సినిమాలు రెండే. ఒకటి… జగదేకవీరుడు అతిలోక సుందరి రెండోది హిందీ సినిమా ‘మిస్టర్‌ ఇండియా’. నాన్న మా దగ్గరున్న ఆ రెండు వీసీడీలనే మళ్లీ మళ్లీ చూడమనేవాడు తప్ప కొత్త సినిమాలకి అవకాశమిచ్చేవాడు కాదు. కానీ నటన మీద మోహం ఏర్పడటానికి అవి రెండే సరిపోయాయి. ఆ రెండు కథల్లోని మాయ, ఆ దృశ్యాల్లోని అందాలూ నా మనసంతా ఆక్రమించుకునేశాయి. దానికి తోడు నేను చదివే స్కూల్లోని టీచర్లు ప్రతి యానివర్సరీకీ నాచేత నాటకాలు వేయించేవారు. ‘వీడి నవ్వు చాలా బావుంటుంది… అమ్మ వేషాలు వేయిద్దాం’ అని ఆ పాత్రలే ఇచ్చేవారు. ఆ వేషంతో బెరుకులేకుండా స్టేజీ మధ్యలోకెళ్లి నటించడం నవ్వించడం నాకేదో కిక్కిచ్చేది. పదో తరగతికి వచ్చాక ఆ పిచ్చి బాగా ముదిరింది. ఇక ఇంటర్‌ చదివేటప్పుడు దిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’లో చేరడమే నా లక్ష్యమైంది. నాన్నతో ఆ విషయమే చెబితే… బెల్టుకి పనిచెప్పాడు. రెండేళ్లపాటు నేను ఎన్నోసార్లు ఆ బెల్టు దెబ్బ రుచి చూడాల్సి వచ్చింది. ఆయన తరం పెంపకం తీరు అది.  నాన్న ఫార్మాస్యూటికల్స్‌ వ్యాపారం చేస్తుండేవాడు. అమ్మ బ్యాంకు ఉద్యోగిని. పిల్లలందరూ క్రమశిక్షణతో పెద్ద చదువులు చదివి గొప్పవాళ్లు కావాలని కోరుకునే సగటు మధ్యతరగతి ఇంటి పెద్ద ఆయన! కాకపోతే ఆ విషయాన్ని కటువుగానే చెప్పేవాడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే- ఎప్పుడూ ఊహాలోకంలో విహరించే నేను, ఆపాటి క్రమశిక్షణ లేకపోయుంటే పక్కదారిపట్టేవాణ్ణేమో అనిపిస్తోంది. ఏదేమైనా నాన్న బెల్టు భయంతోనే ఎన్‌ఐటీ-భోపాల్‌లో సీటు సాధించాను.

అదయ్యాక ఓ టెలికమ్యూనికేషన్‌ సంస్థలో లండన్‌ శాఖలో ఉద్యోగం వస్తే చేరాను. ఏడాది గడిచిందో లేదో… ‘నటనా వైరస్‌’ తీవ్రస్థాయిలో తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఆ రంగంలోకి ఈ వయసులో వెళితే తప్ప నటుణ్ణి కాలేనని అనుకున్నాను. ఎవరికీ చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ వచ్చాను. అమ్మానాన్నా మొదట నేను బ్రేక్‌ తీసుకునే వచ్చానని అనుకున్నారు. ఆ తర్వాత మెల్లగా విషయం చెప్పాను. ఒకప్పుడైతే నాన్న బెల్టు తీసేవాడేకానీ… చెట్టంత ఎదిగినవాణ్ణి ఏం కొడతాడు! ‘నటన గొప్ప కళేకానీ మన స్థాయికి ఆ కల చాలా పెద్దదిరా! నిన్ను కోట్లు పెట్టి సినిమా యాక్టర్‌ని చేసే స్థోమత నాకు లేదు. ఆ రంగంలో మనకు తెలిసినవాళ్లూ ఎవరూ లేరు. అనవసరంగా అటువైపు వెళ్తే నీ జీవితం ఏమవుతుందన్నదే నా బాధ, అర్థం చేసుకో!’ అన్నాడు. ‘నటన తప్ప ఇంకేది చేసినా నేను జీవించినట్టు కాదు నాన్నా!’ అని తేల్చి చెప్పేశాను. బెంగళూరులో ఓ ఫ్రెండ్‌ ద్వారా అక్కడి నాటక సమాజాల్లో చేరాను. ఆ తర్వాత చెన్నైలోని కొన్ని నాటక సంస్థల్లోనూ పనిచేశాను. నాటకరంగంలో వాళ్లు రిహార్సల్స్‌ చేసే తీరూ, నటన రాబట్టే విధానాలూ నటుడిగా నన్ను తీర్చిదిద్దాయి కానీ… కడుపు నిండాలి కదా! నెలంతా కష్టపడి చేసినా ఓ ప్రదర్శనకి 750 రూపాయలే ఇచ్చేవారు. దాంతో సినిమాల వైపే వెళ్లాలనుకున్నాను. తెలుగులో ఆ అవకాశాలుండవనే అపనమ్మకంతో ముంబయిలో అడుగుపెట్టాను! అక్కడికెళ్లిన రెండు నెలల్లోనే నా సేవింగ్స్‌ మొత్తం కరిగిపోయాయి!

చిన్నాచితక పనులెన్నో…
ముంబయిలో ఊపిరిపీల్చి వదలాలన్నా కూడా డబ్బు కక్కాల్సిందే! సేవింగ్స్‌ అన్నీ అయిపోయాక నా ఖర్చులన్నీ తగ్గించుకోవడం మొదలుపెట్టాను. ఒకే గది ఉన్న పోర్షన్‌ తీసుకున్నాను. ఉదయం లేస్తే ఆకలేస్తుందనీ… బ్రేక్‌ ఫాస్ట్‌ తినాల్సొస్తుందనీ… అలారం పెట్టుకుని మరీ మధ్యాహ్నం రెండుగంటలకి లేచేవాణ్ణి. ఏదో ఒకటి వండుకుతిని బయటపడేవాణ్ణి. రోజువారీ ఖర్చుల కోసం పెద్ద పెద్ద మాల్స్‌కి వెళ్లి అక్కడి షాపులవాళ్లు కొత్తగా లాంచ్‌ చేసే పరికరాలకు ఆడుతూపాడుతూ ప్రచారం చేసేవాణ్ణి. అప్పట్లో మొబైల్‌ ఫోన్‌లలో క్రికెట్‌ గేమ్స్‌ ఉండేవి. వినియోగదారులు వాటిని ఆడుతున్నప్పుడు క్రికెట్‌ కామెంటేటర్స్‌లాగా ‘వావ్‌ ఇటీజ్‌ ఫోర్‌’ అంటూ రికార్డెడ్‌ వాయిస్‌ వినిపిస్తుంటుంది. ఆ వాయిస్‌ ఓవరింగ్‌ కూడా చేశాను. వీటి మధ్యే ఆడిషన్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. బాలీవుడ్‌లో ప్రతి ఆడిషన్‌కీ దాదాపు ఐదు వందల మంది హాజరవుతుంటారు. ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లా ఉండే ఆఫీసుల్లో కిక్కిరిసిపోయి నిల్చుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్‌ చేశాకకానీ మనకి పిలుపురాదు. ఎన్ని వందలమంది పాల్గొన్నా తుది జాబితాలో నేనుండేవాణ్ణి… అది కూడా ‘ఫైనల్‌ 3’లో. అంతదూరం వెళ్లాక ‘బాసూ… నువ్వు అన్నిరకాలా సెట్‌ అయ్యావుకానీ మిగతావాళ్ల లుక్స్‌ ఇంకా కరెక్ట్‌గా సెట్‌ అయ్యాయి’ అనేవాళ్లు. మొదట్లోనో, మధ్యలోనో వెళ్లిపోతే ఇంత బాధ ఉండదుకానీ… ఇన్ని ఆశలు పెంచుకున్నాక బయటకు వెళ్లడం చాలా నిస్పృహని కలిగించేది. వీటి మధ్యనే అనుకోకుండా తెలుగు సినిమాల అవకాశాలొచ్చాయి.

చిన్న చిన్న పాత్రలు…
ఓసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఆడిషన్స్‌కి వెళ్లాను. వెళ్లాను కాదు… వెళ్లాము. నాతోపాటూ ‘రౌడీ’ విజయ్‌ దేవరకొండ కూడా వచ్చాడు. నాకు నాటకాల్లో నటిస్తున్నప్పటి నుంచీ విజయ్‌ పరిచయం. ఇద్దరమూ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’కి సెలెక్ట్‌ అయ్యాం. మమ్మల్ని మొదట ప్రధాన పాత్రలకే తీసుకున్నారు కానీ… ‘మీ ఫేస్‌లో ఓ రిచ్‌ లుక్‌ ఉందండీ!’ అంటూ హీరోని వ్యతిరేకించే గ్యాంగ్‌లో పడేశారు. అలా ఆ సినిమాతోనే నేనూ, విజయ్‌ తెరపైకొచ్చాం. తర్వాత ‘నేనొక్కడినే’ సినిమాలోనూ అవకాశం వచ్చింది. ఆ రెండింటి తర్వాత మళ్లీ ముంబయికే వెళ్లాల్సి వచ్చింది. 2012లో ఓసారి అక్కడ స్టాండప్‌ కామెడీ పోటీలు నిర్వహిస్తే అందులో నాకు ఫస్ట్‌ ప్రైజు వచ్చింది. ఆ పోటీలకి జడ్జిలుగా ‘ఏఐబీ’(ఆలిండియా బక్చోద్‌)యూట్యూబ్‌ ఛానెల్‌ వాళ్లు వచ్చారు. వాళ్లు నా టైమింగ్‌ నచ్చి తమతో పనిచేయమన్నారు. వాళ్లే నా చేత కలం పట్టించి రైటర్ని చేశారు. అలా వాళ్లతో కలిసి చేసిన ‘హ్యాష్‌ట్యాగ్‌ వెడ్డింగ్‌’, ‘ఆనెస్ట్‌ ఇంజినీరింగ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌’ వంటి వెబ్‌సిరీస్‌లు బాగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘ది ట్రూత్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’ వీడియో ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. దానిపైన దేశవిదేశాల్లో మా చేత కార్యక్రమాలు ఇప్పించారు. ఇలా వైరల్‌ అయిన ఆ వీడియోని ఎవరో వాట్సాప్‌ ద్వారా మా అమ్మానాన్నలకీ పంపించారట. వాటిని చూశాకే నాన్న ‘నువ్వు ఈ రంగంలో పైకొస్తావనే నమ్మకం మాకు ఇప్పుడొచ్చిందిరా!’ అని ఫోన్‌ చేశాడు. ఆ యూట్యూబ్‌ వీడియోలని చూసే స్వరూప్‌ రెడ్డి ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ కథని చెప్పాడు. అది చూశాక ‘ఇంతకాలం నేను ఎదురుచూస్తున్నది ఇటువంటి స్క్రిప్టు కోసమే…’ అనిపించింది. నేనే స్క్రీన్‌ ప్లే రాయడం మొదలుపెట్టాను.

‘రెండు షో’లకే అవకాశం…
ఏజెంట్‌ గుక్క తిప్పుకోకుండా నెల్లూరు యాస మాట్లాడాలి, రకరకాల వేషాలూ వేయాలి కాబట్టి ఏడాది పాటు అన్నింటి మీదా దృష్టి పెట్టాను. ఇంతచేసీ ఈ సినిమాని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు! ‘సినిమాలో రొమాన్స్‌ లేదు… హీరోకి కండల్లేవు ఎవరు చూస్తారు’ అనేశారు. దాదాపు ఏడాది ప్రయత్నించాక నక్కా రాహుల్‌ నిర్మాతగా వచ్చాడు. సినిమా పూర్తయ్యాక మాకెవ్వరూ థియేటర్‌లు ఇవ్వలేదు. ఎంతో బతిమిలాడితే రోజుకి రెండు షోలు ఇస్తామన్నారు. ఎవరో దయతలచి అమెరికాలోనూ విడుదలచేస్తామన్నారు. సినిమా రిలీజుకి వారం ముందు నుంచీ స్వరూప్‌కీ, నాకూ టెన్షన్‌ మొదలైంది. రిలీజు ముందు రోజు అర్ధరాత్రి రెండుగంటలకి నాకు ఫోన్‌ వచ్చింది. అప్పటికే అమెరికాలో రెండు షోలు వేయడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ నాకు ఫోన్‌ చేశాడు. భయం భయంగానే రిసీవర్‌ తీసుకున్నాను ‘మీ సినిమాకి రెస్పాన్స్‌ అదిరిపోయింది. ఆ నవ్వులూ, చప్పట్లూ చూడండి’!’ అంటూ వీడియో కాల్‌లో చూపించాడు. ఆ తర్వాత నిద్రపట్టలేదు నాకు. ఉదయం ఎనిమిదిగంటలకి హైదరాబాద్‌లో ప్రివ్యూ వేశారు. సినిమా పూర్తై నేనూ స్వరూప్‌ మెట్లు దిగేసరికి కింద దాదాపు రెండొందల మంది మా చుట్టూ చేరి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ స్పందన చూశాక… ఎన్నాళ్లు నాలో గూడుకట్టుకున్నాయో… ఏయే అవమానాలప్పుడు నేను దాచుకున్నవో… ఎప్పుడెప్పుడు బయటకు రావాలని చూస్తున్నాయో… ఆ కన్నీళ్లు… ఒక్కసారిగా ఎగజిమ్ముకొచ్చాయి! అంతమంది ముందు స్వరూప్‌ని పట్టుకుని భోరుమని ఏడ్చేశాను. నిజానికి ఆ రోజంతా ఏడుస్తూనే ఉండిపోయాను!

నవ్వుల ఉత్సవం!
‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రిలీజైన కొన్ని రోజులకే నేను ప్రధాన పాత్రలో నటించిన ‘చిచోరే’ హిందీ సినిమా వచ్చింది. అది కూడా సూపర్‌హిట్టయింది. అటు టాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌లోనూ నటుడిగా పరిచయమైన చిత్రాలు రెండూ హిట్టు కొట్టడం… ఏ నటుడికైనా గొప్ప అనుభవం! ఆ రెండు చిత్రాల తర్వాత పెద్ద సంస్థలే ఆఫర్లు ఇచ్చాయికానీ… ప్రేక్షకుల ముందుకు మరింత వైవిధ్యమైన కథతో రావాలనుకున్నాను. అలా ‘జాతిరత్నాలు’ చేశాను. ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన చిత్రం అది. ఆయన ద్వారా దర్శకుడు అనుదీప్‌ కథ చెబుతున్నప్పుడే కడుపు చెక్కలయ్యేలా… కళ్లలో నీళ్లు తిరిగేలా నవ్వుకున్నాను. షూటింగ్‌ పూర్తయి లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టాం. లాక్‌డౌన్‌ ముగిశాక… కరోనా మహమ్మారిని ఏదోరకంగా జయించామనే ఆనందంలో మనందరం కలిసిఆనందాన్ని పంచుకునే రోజు ఒకటొస్తుంది. ఆ వేడుకల వేళ జీవితాంతం మరచిపోలేని నవ్వుల జ్ఞాపకాలని మిగిల్చేలా ఉంటుంది మా సినిమా… మీరే చూస్తారుగా…!