లాక్‌డౌన్ కాలం ఇది. ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాదు ఆర్థికంగానూ, అనుబంధాల పరంగానూ కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని అభద్రత గూడుకట్టుకున్న కాలం. ఇలాంటి వేళ మనపైన మనకి నమ్మకాన్ని పెంచే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కాసింత సానుకూలంగా చూపగలిగే ఓ జీవితం గురించి తెలుసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది! శరత్‌కుమార్ జీవితం అలాంటిదే. బెంగళూరు వీధుల్లో పేపర్లు వేసిన శరత్ పేరున్న నటుడిగా ఎదగడం వెనక ఎంతో పోరాటం ఉంది. అది ఆయన మాటల్లోనే…
అది 1977… అప్పట్లో బెంగళూరు ఇప్పటికన్నా ఎక్కువ చల్లగా ఉండేది. ఆ చలిలో ఉదయం ఐదుగంటలకి రైల్వేస్టేషన్‌కి వెళ్లి ‘మద్రాసు మెయిల్’ కోసం ఎదురుచూస్తూ నిల్చునేవాణ్ణి. ఆ రైలులోనే నేను పనిచేసే తమిళ పత్రికకి సంబంధించిన 150 కాపీలొస్తాయి. వాటిని తీసుకుని సైకిల్ మీద బెంగళూరులోని ప్రధాన కూడళ్లలోని షాపులకి చేరవేసేవాణ్ణి. అదే నా కెరీర్‌లో తొలి ఉద్యోగం. నిజానికి మాది అప్పర్ మిడిల్‌క్లాస్ కుటుంబం. నాన్న రామనాథం దిల్లీ ఆకాశవాణిలో న్యూస్‌రీడర్‌గా పనిచేసేవారు. ఆయన బదిలీపైన చెన్నై వచ్చాక నేను అక్కడే బీఎస్సీ దాకా చదువుకున్నాను. చదువు పూర్తికాగానే నా కాళ్లపైన నేను నిలబడాలనుకున్నాను. అప్పట్లో ‘దినకరన్’ అనే తమిళ పత్రిక ప్రారంభిస్తుంటే అక్కడ ఉద్యోగం కోసం వెళ్లాను. కాలేజీలో ఉన్నప్పటి నుంచే నాకు కాస్త రచనావ్యాసంగంపైన ఇష్టం ఉండటంతో రిపోర్టర్‌గా చేరాలనే అనుకున్నాను. కానీ వాళ్లు నన్ను బెంగళూరులో సేల్స్ బాధ్యతలు తీసుకోమనడంతో ఆ నగరానికి వెళ్లాను. మాది కొత్త పత్రిక కాబట్టి పేపర్ ఏజెంట్లుకానీ, బాయ్స్‌కానీ ఎవరూ ఉండేవారు కాదు. దాంతో పత్రిక కాపీలు షాపులకి సరైన సమయానికి వెళ్లక చాలావరకూ మిగిలిపోయేవి. అందుకనే నేనే స్వయంగా ‘పేపర్ బాయ్’ అవతారమెత్తి… ఉదయం ఐదుకంతా షాపులకి చేరవేయడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ దాదాపు ఇరవై కిలోమీటర్లదాకా సైకిల్‌పైన తిరుగుతూ బెంగళూర్‌లోని ప్రధాన కూడళ్లన్నీ కవర్ చేసేవాణ్ణి. అలా ఏడాది కష్టపడ్డాక పత్రిక సేల్స్ పెరిగాయి. అది చూసి నాకు బెంగళూరు సర్క్యులేషన్ అండ్ యాడ్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. నేను అక్కడితో ఊరుకోకుండా, ఈ పనులన్నీ మధ్యాహ్నంలోపే ముగించి, ఆ తర్వాత రిపోర్టర్‌గానూ పని చేయడం మొదలుపెట్టాను. ఇన్ని బాధ్యతలు చూస్తూ… బెంగళూరులో మా పత్రిక సర్క్యులేషన్‌ని గణనీయంగా పెంచగలిగాను. ఇదంతా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓ సంస్థని నడపగలననే విశ్వాసాన్ని నాకిచ్చింది. ఆ విశ్వాసంతోనే ఓ ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించాను. అదే నన్ను సినిమాలకి దగ్గరచేసింది.
తెలుగుతోనే మొదలు…
నాకు చిన్నప్పటి నుంచే తమిళ సూపర్‌స్టార్ ఎంజీఆర్‌లా నటుడిగా మారి రాజకీయనాయకుణ్ణి అవ్వాలనే కల ఉండేది. నా ‘ఫిజిక్’ కూడా ఇందుకో కారణం. మానాన్న చిన్నప్పటి నుంచీ వ్యాయామాలూ, క్రీడల్ని మా జీవితంలో భాగం చేశారు. దాంతో పదో తరగతి నాటికే ఫుట్‌బాల్ స్టేట్ ఛాంపియన్‌గా మారాను. ఎన్‌సీసీలో చేరి ప్రతిష్ఠాత్మక ‘రిపబ్లిక్ పరేడ్’లోనూ పాల్గొన్నాను. కాలేజీలో చదివేటప్పుడే బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొని ‘మిస్టర్ మద్రాస్’ టైటిల్ సాధించాను! ‘నేనెలాగూ అందగాణ్ణి కాబట్టి ప్రయత్నించడం ఆలస్యం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయిలే’ అనే భ్రమలో ఉండేవాణ్ణి. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. అప్పుడే బెంగళూరులో నేను ట్రావెల్ ఏజెన్సీ నడుపుతుండగా పరిచయమైన మిత్రుడొకడు నిర్మాతగా ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమా తీస్తూ నన్ను లెక్కలూ, రాతకోతలన్నీ చూసుకోవాలన్నాడు. షూటింగ్ మొదలుపెట్టిన తొలివారంలోనే అందులో విలన్ పాత్ర చేస్తున్న వ్యక్తి డుమ్మా కొట్టేశాడు. దాంతో నిర్మాత ఆ పాత్రని నన్నే చేయమన్నాడు. నా తొలి షాట్ హీరోయిన్ విజయశాంతితో. అప్పటికే తన ఫ్లైట్‌కి టైమవుతోందనే హడావుడిలో ఉన్నారామె. నాకేమో తెలుగు డైలాగులు చెప్పడం చేతకావడం లేదు. అందువల్ల, టేకులపైన టేకులు తీసుకుంటున్నాను. దాంతో విజయశాంతి కోపంతో మండిపడ్డారు. ‘కాస్త డబ్బులుపెట్టి మంచి ఆర్టిస్టుని పెట్టుకోలేరా! ఇలాంటివాళ్లతో నా సమయాన్ని వేస్ట్ చేస్తారెందుకు?’ అంటూ నిర్మాతని చెడామడా తిట్టేశారు. ఆమె మాటలకి నేను బిక్కచచ్చిపోయి నిల్చుండి…పోయాను. అప్పుడు ఓ కెమెరా అసిస్టెంట్ నా దగ్గరకొచ్చి ‘ఆమెని చూసి భయపడకండి సార్. ఓ మామూలు వ్యక్తితో ఎలా మాట్లాడతారో… అలాగే డైలాగులు చెప్పండి చాలు!’ అన్నారు. అతనిచ్చిన ధైర్యంతోనే ఆ తెలుగు డైలాగులు చెప్పి షాట్ ‘ఓకే’ చేయించుకున్నాను.
విజయ్‌కాంత్‌కి విలన్‌గా…
నా తొలి సినిమా పాత్ర చిన్నదే అయినా దానితో నా సినిమా కలలు పెద్దవయ్యాయి. నిర్మాతగా మారి కార్తిక్ హీరోగా ఓ సినిమా తీస్తే అది హిట్టయింది. అప్పుడే నన్ను విజయ్‌కాంత్ మేకప్‌మ్యాన్ రాజు చూసి ‘పోలీసు అధికారి’ సినిమాలో విలన్‌గా నా పేరుని సిఫార్సు చేశాడు. ఆ సినిమా విడుదలైన రోజు నుంచే నాకు తమిళం, తెలుగుల్లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. నెల తిరక్కుండానే ముప్ఫై సినిమాల్లో బుక్ అయ్యాను. ఓ తెలుగు సినిమా కోసం గోల్కొండలో ఫైట్ సీన్ తీస్తుండగా… చాలా ఎత్తు నుంచి కిందపడిపోయాను. మెడ ఎముక విరిగింది. ఇక బతకననే అందరూ అనుకున్నారట. వారం తర్వాత ఎలాగో కళ్లు తెరిచాను. మెడ వెనక భాగాన రెండు రాడ్లు పెట్టారు డాక్టర్లు. సినిమాలు పోతేపోనీ కనీసం జీవితంలో గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా పోయింది. నన్ను నటుడిగా బుక్ చేసుకున్న ముప్ఫై మంది నిర్మాతల్లో 29 మంది నాకిచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నారు. ఆ ఒక్క నిర్మాత ఎప్పుడు వస్తాడా అని చూస్తుండగా ఆయన తరపున డైరెక్టర్ వచ్చాడు. వచ్చినవాడు అడ్వాన్స్ అడగకపోగా ‘యాక్సిడెంట్ అయినంత మాత్రాన మిమ్మల్ని నా సినిమా నుంచి తీసేయలేను. ఏడాదైనా నా సినిమా షూటింగ్ ఆపుతాను!’ అన్నాడు. అది అతని తొలి సినిమా. అప్పటిదాకా సినిమా వాళ్లలో కనీస మానవత్వం ఉండదేమిటా అనుకుంటూ ఉన్న నన్ను అతని మాటలు కదిలించాయి..! అతనికోసమైనా నేను పైకి లేవాలనుకున్నాను. వైద్యుల పర్యవేక్షణలో పట్టుబట్టి మరీ చిన్నపాటి వ్యాయామాలూ చేయడం ప్రారంభించాను. అవి నా విల్‌పవర్‌ని పెంచి… ఆరునెలల్లోనే నడిచేలా చేశాయి. అలా ఆ కొత్త డైరెక్టర్ తీసిన సినిమాలో పాల్గొన్నాను. ‘పురియాద పుదిర్’ అనే ఆ తమిళ సినిమా నాకూ, ఆ డైరెక్టర్‌కీ కొత్త జీవితాన్నిచ్చింది. ఆ డైరెక్టర్… కేఎస్ రవికుమార్. అతనితో అలా మొదలైన నా ప్రయాణం ఎన్నో సూపర్‌డూపర్ హిట్ సినిమాల మైలురాళ్లతో సాగింది.
నేనూ చిరూ…
‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమాతోనే చిరంజీవితో పరిచయం. ఆ సినిమాలో విలన్‌గా చేశాక ‘గ్యాంగ్‌లీడర్’లో సాఫ్ట్ నేచర్ ఉన్న పాత్ర ఇచ్చారు. అక్కడ కనిపించిన విజయశాంతి ‘మీ సినిమాలు చూస్తున్నానండీ… బాగా చేస్తున్నారు!’ అని కితాబిచ్చారు. నేను ‘నా తొలి సినిమా మీతోనే చేశానండీ!’ అని చెబితే నమ్మలేక పోయారు. ఆ రోజు ఆమె చిర్రుబుర్రులాడిన విధానం గుర్తుచేస్తే ‘అయ్యో… సారీ సారీ’ అంటూ నవ్వేశారు. ‘గ్యాంగ్‌లీడర్’ సినిమా పూర్తవుతుండగా చిరంజీవితో ‘అన్నా! తర్వాత సినిమాకి కూడా నాకు అవకాశం ఇవ్వవా!’ అని అడిగాను. ‘రేయ్… నీకు ఆ అవసరం రాదు. ఇంతలో నువ్వు హీరోవైపోతావు చూస్తూ ఉండు!’ అన్నాడు. ఆయన నోటి చలవేమో నాకు హీరో అవకాశం వచ్చింది. తమిళంలో ‘సూరియన్’(తెలుగులో ‘మండే సూర్యుడు’) అనే సినిమా నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది! ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు వచ్చాయి. నా వందో సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీగా ఖర్చుపెట్టి తీస్తే… అది ఆడలేదు సరికదా నన్ను పీకల్లోతు అప్పుల్లో ముంచేసింది. నాకు ఊపిరాడక ఓ నిర్మాతని సాయం అడిగాను. ఆయన చాలా కూల్‌గా ‘నీకు చిరంజీవి మంచి స్నేహితుడు కదా! ఆయన కాల్షీట్లు ఇప్పించు. ఆ సినిమాకి వచ్చిన లాభాల్లో నీకు కొంత ఇస్తాను!’ అన్నాడు. అది సరికాదు అనిపించినా నాకు వేరే దార్లేదు. వెంటనే హైదరాబాద్ బయల్దేరాను. ఇక్కడికొస్తే ఆయనేదో షూటింగ్‌లో ఉన్నాడు. ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అన్నా!’ అంటే షూటింగ్ క్యాన్సిల్ చేసి మరీ నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్లమ్మగారితో భోజనం పెట్టించి నేను కాస్త కుదుటపడ్డాక విషయం ఏమిటన్నాడు. అంతా విని… ‘సరే! ఆ నిర్మాతకి నేను ఓకే చెప్పానని చెప్పు’ అన్నాడు. ఆ తర్వాత నేను తడబడుతూనే ‘నీకు నేను ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో చెబితే…’ అంటూ నసిగాను. ‘నాకు ఇచ్చేంత స్థితిలో ఉన్నావా నువ్వు. ఒక్క పైసా వద్దు… నువ్వు కోలుకుంటే అంతే చాలు!’ అన్నాడు. ఆ సందర్భంలోనే కాదు… ఆ సంఘటనని ఎప్పుడు గుర్తుచేసుకున్నా కన్నీళ్లు ఆగవు నాకు. నా కెరీర్‌కి ఓ రకంగా పునర్జన్మని ఇచ్చారాయన!
మళ్లీ తెలుగులో…
ఓ వైపు సినిమాలూ, మరోవైపు రాజకీయాలు… వీటితో తెలుగులో ఎక్కువ నటించలేదు. సుదీర్ఘవిరామం తర్వాత ‘బన్నీ’లో కనిపించాను. ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా వాటన్నింటికన్నా రాఘవ లారెన్స్ ‘కాంచన’ పాత్ర నన్ను కొత్తతరానికి ఎక్కువ చేరువచేసింది. కండలవీరుడిగా పేరున్న నా ద్వారా హిజ్రాల కష్టం చెప్పడమనే ఆలోచన నాకు చాలా నచ్చింది. నటన పరంగా ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా నవ్వులపాలవుతామని తెలిసినా ధైర్యంగానే ఆ పాత్రని చేశాను. అందులో కాంచనగా నేను స్టేజీపైకెక్కి మాట్లాడే సీనుంటుంది గుర్తుందా! అదే మేం తీసిన తొలి షాట్. అది చేస్తున్నప్పుడు గ్లిజరిన్ లేకుండానే ఉద్వేగానికి గురై ఏడ్చేశాను. చుట్టూ చూస్తే ఆ షూటింగ్ కోసమని వచ్చిన ఏడొందలమందీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడే అనిపించింది ‘ఈ పాత్ర కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతుందీ’ అని!
తెరిచిన పుస్తకమే…
సినిమాల్లోకి రావడానికి ముందే ఛాయని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాను. కాకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. మా మనస్పర్థల మధ్య మా పిల్లలు వరలక్ష్మి, పూజా ఎదగడం మంచిదికాదని విడాకులు తీసుకున్నాం. నాలాగే వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న రాధిక స్నేహితురాలిగా పరిచయమై జీవిత భాగస్వామి అయింది. సహజంగానే మొదట్లో మేం ఎన్నో ఒడుదొడుకులూ, ఒత్తిళ్లూ, విమర్శలూ, విసుర్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ అధిగమించాక ఇప్పుడింత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు రాధికా, నేనూ, మా పిల్లలు వరలక్ష్మి, పూజ, రేయాన్, రాహుల్‌లతో కూడిన పెద్ద కుటుంబం మాది! విదేశాల్లో చదువుకున్న మా అమ్మాయి వరలక్ష్మి సినిమాల్లోకి రావడం నాకు బొత్తిగా ఇష్టంలేదు. అందుకే తన మొదటి సినిమా ప్రచారానికీ వెళ్లలేదు. నా సహకారం లేకుండానే తను సొంతంగా ఎదగడం చూశాక మొదట్లో వద్దన్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. త్వరలో నేనూ, రాధికా, వరూ కలిసి ఓ సినిమా కూడా చేయబోతున్నాం!