కళ్లతోనే వేల భావాలు పలికిస్తుంది. నవ్వుతో మాయ చేస్తుంది. మాట అయితే భలే ముద్దుగా ఉంటుంది. హుషారుకు పెట్టింది పేరైన కన్నడ కస్తూరి నందిత శ్వేత గురించే ఇదంతా. అందం, అభినయం, పాత్రల ఎంపిక… ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె ప్రత్యేకమే. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ… ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రమ్2’తో పాటు… ‘కల్కి’, ‘అక్షర’ చిత్రాలు చేస్తోంది. చిన్ననాటి సంగతులు, కుటుంబం, స్నేహితులు… ఇలా పలు విషయాలు పంచుకుంది.
* ఇంతటి పోటీలోనూ వరుసగా అవకాశాలు సొంతం చేసుకొంటున్నారు. ఏమిటా రహస్యం?
అన్ని సినిమాలు హిట్టు కావాలి. నిర్మాతకి డబ్బు రావాలి. నేను ఆలోచించేది అంతవరకే. ఎవరు గొప్ప అనేది నేనో, నాకు పోటీ అనుకుంటున్న కథానాయికలో కలిసి నిర్ణయించుకోలేం కదా. అది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అందుకే పోటీ గురించి ఎప్పుడూ ఆలోచించను. 2018లో దాదాపు పది సినిమాలకి సంతకం చేశా.
* తెలుగులో తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు కనిపించలేదెందుకు?
‘ఈ అమ్మాయి అభినయం శక్తివంతంగా ఉంటుంది. ఇలాంటి పాత్ర ఇవ్వడం కరెక్టా కాదా?’ అని చాలామంది దర్శకులు మాట్లాడుకొన్నారట. కొద్దిమంది నన్ను ఎంపిక చేసుకోవాలనుకొన్నా… గందరగోళానికి గురయ్యారట. ఆ విషయం చాలా మంది చెప్పారు నాకు. నేను అన్ని రకాల పాత్రల్లో మెప్పించగలనని నిరూపించడానికి కొంచెం సమయం పట్టింది. అయితే నాకొచ్చిన గుర్తింపు మాత్రం సంతోషాన్నిచ్చింది. ఈ యేడాది ఫక్తు వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లోనూ కనిపిస్తా.
* తెలుగు, తమిళం, కన్నడ… ఏ భాషలోకి వెళితే ఆ భాష మాట్లాడేస్తున్నారు. అదెలా సాధ్యమవుతోంది?
ఒక ఉద్యోగం చేయాలంటే, దానికి ఏమేం కావాలో ముందే నేర్చుకుంటారు కదా. ఇదీ అంతే. తమిళంలోకి వెళ్లిన కొత్తలో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను తప్ప… ఎక్కడా భాష పరంగా సమస్య ఎదురు కాలేదు. ఇక తెలుగంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. అందుకే తొలి సినిమా చేస్తున్నప్పుడే నేర్చుకున్నా.
* మీ అసలు పేరు శ్వేత అంట కదా. నందిత శ్వేత అని ఎందుకు మార్చుకున్నారు?
నా తొలి సినిమానే నా పేరును మార్చేసింది. కన్నడంలో ‘నంద లవ్స్ నందిత’ అనే సినిమాతో పరిచయమయ్యా. ఆ చిత్ర దర్శకనిర్మాతలు జ్యోతిష్యుడిని సంప్రదించి నా పేరు నందిత అయితే బాగుంటుందని అలా మార్చారు. అయితే నా అసలు పేరును వదులుకోవడం ఇష్టం లేక… నేను నందిత శ్వేత అని మార్చుకున్నా.
* కథానాయిక కావాలని చిన్నప్పుడే అనుకున్నారా?
చిన్నప్పుడు అసలు సినిమా ఆలోచనలే ఉండేవి కాదు. ఒక అబ్బాయిలాగా అల్లరి చేసేదాన్ని. డ్యాన్స్, బ్యాడ్మింటన్ అంటే ఇష్టం ఉండేది. ఎక్కడో నేను చేసిన డ్యాన్స్ చూసి, ఇంకెవరో చెప్పడంతో నాకు కన్నడంలో తొలి సినిమా అవకాశం వచ్చింది. అయితే స్కూల్‌లోనే నేనొక సెలబ్రిటీని. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండటంతో నన్నంతా గుర్తుపట్టి, ప్రత్యేకంగా చూసేవాళ్లు.
* సినిమా రంగంలోకి వెళతానన్నప్పుడు ఇంట్లో అభ్యంతరం చెప్పారా?
మొదట నాన్న వద్దన్నారు. నేను నాలుగు రోజులు అన్నం తినలేదు. ఎంతోమంది ప్రయత్నిస్తే కానీ రాని అవకాశం నాకు అనుకోకుండా వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా అనేది నా తాపత్రయం. అదే విషయం ఇంట్లో చెప్పి ఒప్పించా. కానీ ఇప్పుడు నా సినీ ప్రయాణం చూసి మా ఇంట్లో అంతా సంతోషిస్తుంటారు.
* కామెడీ అంటే నాకు బాగా ఇష్టం. తమిళంలో కామెడీ చేశాను కానీ, తెలుగులోనే ఆ అవకాశం రాలేదు. రొమాంటిక్‌గా సాగే ప్రేమకథల్లోనూ నటించాలని ఉంది. |
*నేను చేసిన కొన్ని సినిమాల్ని చూసి నన్ను హోమ్‌లీ అంటుంటారు కానీ… నేను చాలా ట్రెండీ. బెంగళూరు అమ్మాయినండీ, నేను చాలా హాట్(నవ్వుతూ). |
* నా చిన్నప్పటి మిత్రులు నలుగురున్నారు. ఏదైనా వాళ్లతోనే పంచుకుంటుంటా. తెరపై నన్ను చూసి వాళ్లు ఆటపట్టిస్తుంటారు. వాళ్లతో కలిసి నా సినిమా చూస్తున్నప్పుడు భలే సరదాగా ఉంటుంది. |
*ప్రేమపై నమ్మకముంది. స్కూల్‌లో, కాలేజీలో ఇలా ఒక్కోసారి ఒకొక్కరు నచ్చేవారు. క్రష్ అనేది సహజమే కదా. కానీ ఎప్పుడూ సీరియస్‌గా ప్రేమలో మాత్రం పడలేదు. ప్రేమలో పడాలని నాకూ ఉంది. కానీ అది ఒక సినిమాకి సంతకం చేసినట్టుగా, ప్రణాళికతో చేసేది కాదు కదా. అనుకోకుండా పుట్టాలి. చూద్దాం… ఎవరితో ప్రేమలో పడతానో! |