Heroine Vidyabalan

ఆరోజు బాగా ఏడ్చేశాను..!

బాలీవుడ్‌లో స్టార్‌ హీరో అనగానే వాళ్ల పేరు చివరన ఖాన్‌, కపూర్‌, సింగ్‌ పదాలు వినిపిస్తాయి. కానీ స్టార్‌ హీరోయిన్‌ అంటే మాత్రం విద్యాబాలన్‌ పేరు వినిపిస్తుంది. మహిళా ప్రధాన పాత్రలతో సినిమాల్ని చేస్తూ తనకంటూ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న నటి విద్య. ‘ఎన్టీఆర్‌’ జీవితకథలో ‘బసవతారకం’ పాత్రతో తెలుగువారి ప్రశంసలూ అందుకున్న విద్య తన సినిమా ప్రస్థానం గురించి చెబుతోందిలా…

దక్షిణాది అమ్మాయినే అయినా ఇక్కడ సినిమాలు చేయని లోటు కెరీర్‌ మొదలుపెట్టిన 15 ఏళ్ల తర్వాత ‘ఎన్టీఆర్‌’తో తీరింది. డైరెక్టర్‌ క్రిష్‌, హీరో బాలకృష్ణ నన్ను బసవతారకం క్యారెక్టర్‌ చేయమని అడిగినపుడు ‘ఈ పాత్ర చేయడానికి పెద్దగా ఏముంటుందిలే’ అనుకున్నా. కానీ వాళ్లిద్దరూ ఆమె వ్యక్తిత్వం, ఎన్టీఆర్‌తో ఆమెకున్న అనుబంధం, పిల్లలపట్ల ఆమె అనురాగం… ఇలా ఒక్కో విషయమూ చెబుతుంటే నోరు తెరుచుకుని విన్నా. అప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. సినిమా షూటింగ్‌ మొదలవ్వక ముందే వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ వచ్చి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ బసవతారకంగారి గురించి  తెలుసుకునేదాన్ని. ఈ సినిమాతో మరో మంచి పాత్ర చేశానన్న సంతృప్తి కలిగింది. నా సినిమా ప్రస్థానాన్ని మొదట్నుంచీ చెప్పాలంటే మాత్రం ముంబయి నుంచి మొదలుపెట్టాలి.
17 ఏళ్ల వయసులో మా నాన్న పాలక్కడ్‌ రామయ్యర్‌ బాలన్‌ కేరళ నుంచి ముంబయికి వలసవచ్చారు. టైపిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టి వివిధ హోదాల్లో పనిచేసి డిజీ కేబుల్‌లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ సరస్వతి. అమ్మానాన్నలకు మేం ఇద్దరం ఆడపిల్లలం. నేను పుట్టి పెరిగింది ముంబయిలోనే. ‘ఏక్‌ దో తీన్‌…’ పాటలో మాధురీదీక్షిత్‌ని చూశాక సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన మొదటిసారి వచ్చింది. మాది కేరళలో స్థిరపడ్డ తమిళ అయ్యంగార్ల కుటుంబం. అప్పట్లో ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో వచ్చే తమిళ, మలయాళీ సినిమాల్నీ మా అక్క ప్రియా, నేనూ చూసేవాళ్లం. ప్రియ ఒక యాడ్‌ ఏజెన్సీలో పనిచేసేది. నా ఫొటోల్ని ఆ ఏజెన్సీ వాళ్లకి చూపిస్తే ప్రకటనల్లో అవకాశాలు ఇచ్చారు. ఇంటర్మీడియెట్‌ నుంచీ ప్రకటనలకు మోడలింగ్‌ చేసేదాన్ని. ఇంటర్‌ తర్వాత సెయింట్‌ జేవియర్స్‌లో సోషియాలజీ మేజర్‌ తీసుకుని డిగ్రీలో చేరాను. నటి అవ్వడానికి నేనేమీ యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకోలేదు. మోడల్‌గా చేస్తూనే యాడ్స్‌ తీసే మా స్నేహితుల్లో కొందరు షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తుంటే వాటిలో నటించేదాన్ని. ప్రకటనలకు వాయిస్‌ ఓవర్లు చెప్పేదాన్ని. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే సమావేశాల్లో వ్యాఖ్యాతగా ఉండేదాన్ని. కానీ సినిమా అవకాశం కావాలంటూ ఎవరినీ అడగలేదు. ఎందుకంటే అలా ఒకరి దగ్గర చేయి చాస్తే అమ్మాయిలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చాలామంది దగ్గర విన్నాను. ఆ పరిస్థితి వద్దనుకున్నాను.

పరిణీతతో మొదలు…
ప్రకటనల్లో చూసినవాళ్లు నన్ను సినిమాలకి సంప్రదించేవాళ్లు. చాలా మలయాళీ సినిమాల్లో ముందు నన్ను ఎంపికచేసినట్టు చెప్పి మళ్లీ వేరేవాళ్లని తీసుకునేవారు. ఒక సినిమా అయితే షూటింగ్‌ పూర్తయినా రిలీజ్‌ కాకుండా ఆగిపోయింది. తమిళంలోనూ అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోయేవి. బాలీవుడ్‌లోనూ ఇలాంటి అనుభవాలే. మా ఇంటి దగ్గర్లో సాయిబాబా గుడి ఉంటుంది. అవకాశాలు వచ్చిపోయినప్పుడల్లా అక్కడ కూర్చుని బాధతో ఏడ్చేసేదాన్ని.

ఇక సినిమాలు వద్దు అనుకునేదాన్ని. కానీ మర్నాడు నిద్రలేచి మళ్లీ అద్దంలో చూసుకోగానే సినిమానే గుర్తొచ్చేది. ఆ దశలో కొన్ని టీవీ సీరియల్స్‌లో అవకాశం వస్తే అయిష్టంగానే చేశాను.
89 యాడ్స్‌, మూడు మ్యూజిక్‌ వీడియోలు, రెండు సీరియళ్లు చేశాక, పన్నెండు సినిమాల్లో వచ్చిన అవకాశాలు పోయిన తర్వాత 2003లో ఓ బెంగాలీ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. తర్వాత రెండేళ్లకు హిందీలో ‘పరిణీత’ ఛాన్స్‌ వచ్చింది. నాతో ప్రకటనలూ, వీడియో ఆల్బమ్‌లూ చేసిన ప్రదీప్‌ సర్కార్‌ నాకు అందులో ఛాన్స్‌ ఇచ్చారు. అప్పట్నుంచీ ఆయనే నా మార్గదర్శి. నా ముఖం కుడివైపుకంటే కూడా ఎడమవైపు అందంగా కనిపిస్తుందని ప్రదీప్‌ చెప్పారు. అప్పట్నుంచీ నా ఫొటోల్నీ, వీడియోల్నీ ఎడమవైపే ఎక్కువగా తీయమని చెబుతుంటా.

‘పరిణీత’తో మంచి విజయాన్ని అందుకున్నాను. రెండో చిత్రం ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ కూడా మంచి హిట్‌. తర్వాత వరసగా ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో ఎన్నో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘విద్య నటన అంత బాగుండదు’, ‘లావుగా ఉంది’, ‘డ్రెస్‌ సెన్స్‌ లేదు’, ‘ఫ్యాషన్లు తెలీదు’… ఇలాంటి మాటలు ఎన్నో విన్నాను. ‘ఎంత చక్కగా ఉంది నీ ముఖం. కాస్త ఒళ్లు తగ్గించుకోవచ్చు కదా!’ అన్న మాటలు సినిమాల్లోకి రాకముందు కూడా తరచూ వింటుండేదాన్ని. ఆ మాటలు వినీ వినీ నా శరీరాకృతిని నేనే అసహ్యించుకునేదాన్ని. కష్టపడి మరీ వ్యాయామం చేసేదాన్ని. దాంతో శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్‌ తప్పేది. బరువు తగ్గడం, పెరగడం… ఇదే రొటీన్‌ అయ్యేది. ఈ క్రమంలోనే నా శరీరం తీరుని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా శరీరాన్ని కష్టమైన వ్యాయామాలతో నరకయాతన పెట్టను. ఆహార నియమాలతో కడుపు మాడ్చుకోను. ‘మన శరీరాన్ని మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు’ అనే పాలసీకి వచ్చేశాను. ఇప్పుడు జనం కూడా నన్ను ఇలాగే చూడ్డానికి ఇష్టపడుతున్నారు.

ఆ దశను దాటేశాను…
నేను ఎక్కువగా పాతికేళ్ల మహిళ, గృహిణి పాత్రల్ని పోషిస్తూ వచ్చాను. ‘ఇలా అయితే నీ కెరీర్‌ త్వరలోనే ముగుస్తుంది’ అనేవారు. అందుకే హే బేబీ, కిస్మత్‌ కనెక్షన్‌లాంటి సినిమాల్లో కాలేజీ అమ్మాయి, పెళ్లికాని అమ్మాయి పాత్రల్లో నటించాను. కానీ వాటిలో అనుకున్నంతగా మెప్పించలేకపోయాను. అందుకే తర్వాత నుంచీ అమ్మాయిల పాత్రలు మానేసి నా వయసుకీ, శరీరాకృతికీ సరిపోయే క్యారెక్టర్లని చేయడం మొదలుపెట్టాను. దాంతో మళ్లీ సక్సెస్‌ రుచి చూశాను. నేను చేసిన ‘ఇష్కియా’, ‘పా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’ లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’కిగానూ ఉత్తమనటిగా జాతీయ అవార్డునీ అందుకున్నాను. ఆ తర్వాత కూడా నావి కొన్ని సినిమాలు బాగా ఆడలేదు. నటులు ఎవరైనా ఈ దశలన్నీ దాటాల్సిందేనని తర్వాత అర్థమైంది. లేకుంటే మనకు ఏది సరైనదో తెలియదు. ఈ ప్రయాణంలో నాకు అర్థమైందేంటంటే హిట్లు మనల్ని ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉండేలా చేయలేవు, అలాగే ఫ్లాప్‌లూ ఇక్కణ్నుంచి బయటకు పంపేయలేవు. వైఫల్యాలు ఎదురైనపుడు తమలోని ఉత్సాహాన్ని కోల్పోనివాళ్లే విజయవంతమవుతారు. ఏదైనా పాత్ర వచ్చినపుడు దర్శకుడిని సందేహాలు అడిగి క్యారెక్టర్‌ని లోతుగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను. పాత్రకు న్యాయం చేయడానికి అవసరమైన పుస్తకాలు చదువుతాను, సినిమాలు చూస్తాను, వ్యక్తుల్ని కలుస్తాను. నేను చేసినవాటిలో ఎక్కువగా కష్టాలూ, బాధల్ని ఎదుర్కొన్న పాత్రలు ఉన్నాయి. ‘హమారీ అధూరీ కహానీ’లో కోపంగా కనిపించే పాత్రను చేశాను. 2017లో వచ్చిన ‘తుమ్హారీ సులు’ సినిమాలో పూర్తి నిడివి కామెడీ పాత్ర చేశాను. ఇప్పుడు జీవితంలోనూ చాలా సంతోషంగా, నవ్వుతూ ఉంటున్నాను. అందుకేనేమో ఆ క్యారెక్టర్‌ బాగా పండింది. ప్రతి సినిమాకీ ఒక ప్రత్యేకమైన ఫెర్‌ఫ్యూమ్‌ని వాడతాను. ఆ క్యారెక్టర్‌ స్వభావానికి సరిపోయేలా ఘాటుగా లేదంటే మృదువుగా ఉండే ఫ్లేవర్లని ఎంచుకుంటాను. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం నుంచి ప్రమోషన్ల వరకూ అదే వాడతాను. నటిగా నన్ను నేనొక ఆడపులిగా భావిస్తాను. ప్రతి సినిమా తర్వాత నటన పరంగా నా ఆకలిని మరింత పెôచుకుంటాను.

అనుభవంతో అందం!
ఈ మధ్య వయసుతోపాటు అందం కూడా పెరుగుతోందని కాంప్లిమెంట్‌లు ఇస్తున్నారు. వయసుతో చాలా విషయాలు తెలుస్తాయి. మనల్ని మనం అర్థం చేసుకుంటాం. మన పరిధిలో లేని విషయాల గురించి తక్కువ ఆలోచిస్తాం. ఈ మార్పులవల్ల మనం సంతోషంగా ఉంటాం. అది ముఖంలో కనిపిస్తుంది. 20లలో ఉన్నపుడు నా కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచించాను. 30లలో నన్ను నేను తెలుసుకోవడం గురించి ఆలోచించాను. నలభైకి దగ్గరయ్యాక నన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టాను.
అందుకేనేమో అందంగా కనిపిస్తున్నాను.


నేను… న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!

నేను పుట్టింది 1979 జనవరి 1న. అందుకే  మా వాళ్లంతా నన్ను కొత్త సంవత్సరం కానుక అనేవారు.
*మావారు సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌. సినీ నిర్మాత. మా వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. ఇద్దరం కలిసి పనిచేయడం గురించి చాలామంది అడుగుతారు. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య గ్యాప్‌ ఉండటానికి మేం కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాం. పిల్లలు ఎప్పుడు అని సన్నిహితులు అడుగుతుంటారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే!
* నేను పుట్టిపెరిగింది చెంబూరులో. నా పెళ్లి అయ్యేంత వరకూ అదే ప్రాంతంలో ఉన్నాను. అక్కడ మాకో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ఉండేది.
ఈ మధ్యనే అది అమ్మేశాం. ఆరోజు నేను బాగా ఏడ్చేశాను. ఎందుకంటే నా జీవితంలో ఎక్కువ కాలం ఉన్నది ఆ ఇంట్లోనే.
* వేడుక ఏదైనాసరే చీరలో వెళ్లడానికే ఇష్టపడతాను. చాలామంది నన్ను చీరకట్టుకే ట్రేడ్‌మార్క్‌ అంటారు.
* నటి ప్రియమణి నాకు కజిన్‌.
* ఇంట్లో తమిళం, మలయాళం మాట్లాడుకుంటాం. నాకు హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ భాషలూ వచ్చు.
* ప్రస్తుతం తమిళంలో ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నాను.
* నేను పనిచేసిన సినిమా షూటింగ్‌ ఆఖరి రోజున తోటి నటులకు బహుమతులు ఇవ్వడం అలవాటు. అది ఒక విధంగా వాళ్లకి థ్యాంక్స్‌ చెప్పడమే.