అమితాబ్, బెన్‌కింగ్స్‌లే, మాధవన్ ఆ సినిమాలో నటించారు. మంచి అవకాశం అనిపించింది. ఇంట్లో అప్పుడు చెప్పాను. నిజానికి నాది అందులో తక్కువ నిడివి ఉన్న పాత్ర. అయినా కథ నచ్చి చేశాను. కారణం ఏదైనా చదువు మధ్యలో వదిలేయకపోవడమే మంచిది. కాలేజీ రోజులు మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికీ, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికీ మంచి అవకాశం. దాన్ని మిస్సవకూడదెవరూ.
అవకాశాలు వరసకట్టలేదు…
నేనెవరో తెలియకుండానే మొదటి సినిమాలో అవకాశం వచ్చింది. అందులో అమితాబ్‌తో కలిసి చేసినపుడు చాలా నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన చాలా అభిమానంగా, హోమ్లీగా ఉంటూ నా భయాన్ని పోగొట్టారు. రెండో సినిమా యశ్‌రాజ్ ఫిల్మ్స్ ‘లవ్ కా ది ఎండ్’. దీనికి కూడా ఆడిషన్ చేశారు. ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆడిషన్స్ చేసి నన్ను తీసుకున్నవాళ్లు తిరిగి ఫోన్‌చేసి వద్దని చెప్పిన సందర్భాలున్నాయి. కుటుంబ నేపథ్యంకంటే కూడా మన సినిమాలు బాగా ఆడితేనే ఇక్కడ స్థానం, లేకుంటే కష్టం…
ఆ విషయం నాకు మొదట్లోనే అర్థమైంది. మూడో సినిమా ‘ఆషికీ 2’నే నా మొదటి సినిమా అనుకుంటారు చాలామంది.
యశ్‌రాజ్ ఫిల్మ్స్‌లో మూడు సినిమాలకు ఒప్పందం కుదిరింది. ‘లవ్ కా ది ఎండ్’ మొదటి సినిమా. అది అంతగా ఆడలేదు. తర్వాత ‘ఔరంగజేబ్’లో అవకాశం ఇచ్చారు. అదే టైమ్‌కి ‘ఆషికీ 2’ ఆఫర్ వచ్చింది.
ఈ కథ నాకు బాగా నచ్చడంతో ధైర్యంచేసి యశ్‌రాజ్… ఒప్పందం క్యాన్సిల్‌చేశాను. మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఆషికీ 2’లో సింగర్‌గా కనిపించాను. సినిమా పెద్ద హిట్. అందులోని నా పాత్ర ‘ఆరోహీ’ పేరుతోనే నన్ను ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. తర్వాత మోహిత్ దర్శకత్వంలోనే ‘ఏక్ విలన్’లో చేశాను. అది కూడా మంచి హిట్. నా మొదటి రూ.100 కోట్ల సినిమా అది. కమర్షియల్ సినిమాల పరంగా ముందుకు వెళ్తుండగా ప్రయోగాత్మక చిత్రం ‘హైదర్’లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా కూడా మంచి హిట్. తర్వాత ‘ఏబీసీడీ 2’… ఇలా వరస హిట్‌లు వచ్చాయి. అదే సమయంలో తర్వాత వచ్చిన ‘రాక్‌స్టార్ 2’, ‘ఓకే జానూ’ అంతగా ఆడలేదు. గతేడాది వచ్చిన ‘స్త్రీ’తో మరో హిట్ అందుకున్నాను. హిట్‌లు ఆనందించడానికీ, ఫ్లాప్‌లు చింతించడానికీ కాదూ, అన్నీ నేర్చుకోవడానికే అన్నది నా సిద్ధాంతం.
కథల ఎంపిక…
ఏదైనా కథ విన్నాక ఆ పాత్రని నేను చేస్తే బావుంటుందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాను తప్ప ఈ సినిమా చేస్తే నాకేం వస్తుందనే కోణంలో ఆలోచించను. మొదట్లోకంటే ఇప్పుడు ఒక పాత్రని ఎంచుకోవడంలో ఇంకొన్ని ఎక్కువ ప్రశ్నలు వేసుకుంటున్నాను. దర్శకుడు నా పాత్రని బాగా చూపిస్తాడా, సెట్‌లో ప్రతిరోజునీ ఆస్వాదించగలనా లేదా అని కూడా చూసుకుంటాను. ఎందుకంటే ఒక్కో సినిమా మూడు నెలల నుంచి ఏడాదిపాటు ఉంటుంది. ఇష్టంలేకపోతే చేయడం కష్టం. అందుకే మనస్ఫూర్తిగా ఓకే అనుకుంటేనే చేస్తానని చెబుతాను. ఎప్పటికప్పుడు వినూత్నమైన పాత్రలు చేయకపోతే ప్రేక్షకులకే కాదు, నటులకీ బోర్ కొట్టేస్తుంది.
ఆ కోణంలోనూ ఆలోచిస్తాను.
నాన్నే చూసుకుంటారు…
నేను ఒంటరిగా ఉండగలనేమోనని పరీక్షించుకోవడానికి కొన్నేళ్ల కిందట ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాను. ఒక నెలరోజులుండి చూద్దాం అనుకున్నాను. కానీ అది విమానాశ్రయానికి చాలా దగ్గరగా ఉండటంతో నిత్యం శబ్దాలతో నిద్ర పట్టేది కాదు. విషయం నాన్నకి తెలిసి వెంటనే జుహూలోని మా అపార్ట్‌మెంట్‌కి తీసుకువెళ్లారు. నెల అనుకున్నది వారం కూడా సాధ్యంకాలేదు. ఆర్థిక ప్రణాళికల్లో నేను ఇంకా పూర్. నా ఆర్థిక వ్యవహారాలన్నీ నాన్నే చూస్తారు. షాపింగ్ మాత్రమే నేను చేసుకుంటాను. మేం ఉంటున్న ఫ్లాట్‌కి పక్కనే సొంతంగా ఫ్లాట్ కొన్నాను. దాన్ని నా ఆఫీసులా ఉపయోగించుకుంటాను. ఫ్రెండ్స్‌తో భేటీలూ అక్కడే. భవిష్యత్తులో కూడా ఏం కొన్నా కొనకపోయినా స్థిరాస్తిలో మాత్రం పెట్టుబడి పెడతాను. ఇది నాన్న చూపిన బాట. ఆయన కూడా అందులోనే పెట్టుబడులు పెడుతూ వచ్చారు.
ఆయనతో సినిమా నా కోరిక
బాలీవుడ్‌లో ప్రముఖవ్యక్తుల నెట్‌వర్క్‌లో ఉంటేనే సినిమాలు వస్తాయని ప్రారంభంలో కొందరు సలహా ఇచ్చారు. కానీ అవసరం కోసం స్నేహాలు కలుపుకోవడం నాకు చేతకాదు. ‘ఏబీసీడీ 2’లో హిప్ హాప్ డాన్సర్‌గా చేశాను. అప్పుడే డాన్స్‌లో ఏబీసీడీలు నేర్చుకున్నాను. ‘హసీనా పార్కర్’ పాత్ర చేసినపుడు ఎనిమిది కిలోలు బరువు పెరగాల్సి వచ్చింది. వాళ్ల కుటుంబ సభ్యులతో కొద్దిరోజులు మాట్లాడాను. ఆమె గురించి చాలా చదివాను కూడా. ఏక్ విలన్, హైదర్,
ఏబీసీడీ 2, బాఘీ, రాక్‌ఆన్ 2, హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ సినిమాల్లో పాటలూ పాడాను. అలా నా సినిమా కోసం చేయగలిగిందంతా చేస్తాను. ప్రస్తుతం ఛిఛోరే, స్ట్రీట్ డ్యాన్సర్ సినిమాలు చేస్తున్నాను.
సినిమాల్లోకి వచ్చి దశాబ్దం కావొస్తోంది. ఇప్పటివరకూ జర్నీ బాగుంది. ఎన్నో భిన్నమైన పాత్రలు చేశాను. ఛాలెంజింగ్‌గా అనిపిస్తే నెగెటివ్ పాత్ర చేయడానికైనా సిద్ధమే. సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో చేయాలన్నదే ఇక్కడ నాకింకా తీరాల్సిన కోరిక. సినిమాలవల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యుల్నీ స్నేహితుల్నీ మిస్సవుతాను. నేను వర్కహాలిక్. పనిని ప్రేమిస్తాను. పనిలో పడితే మిగతా ప్రపంచాన్ని మర్చిపోతాను. అలాకాకుండా పనినీ, వ్యక్తిగత జీవితాన్నీ సమంగా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నా కోరిక, ప్రయత్నం.
సాహో… ఎందుకంటే…బాహుబలి ప్రభాస్ సరసన చేయడం, అదీ ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరకడం, తెలుగు-హిందీ భాషల్లో చిత్రీకరించడంతోపాటు మరో రెండు దక్షిణాది భాషల్లోకి డబ్ కావడం… ఇవన్నీ ఒక్క సినిమాతో సాధ్యమవుతుంటే ఎవరు కాదంటారు. దాదాపు రెండేళ్లపాటు సాహోతో ప్రయాణించాను. సెట్‌లో అడుగుపెట్టిన రోజునుంచే ఒక కుటుంబంతో ఉన్నట్టు ఫీలయ్యాను. ప్రభాస్‌ది చాలా కూల్ యాటిట్యూడ్. నిజాయతీగా, సరదాగా, స్నేహపూర్వకంగా ఉంటాడు. దర్శకుడూ, నిర్మాతలూ కూడా అంతే. దాదాపు సెట్‌లో ఉన్న ప్రతిరోజూ నాకు ఇంటి భోజనమే వచ్చేది. నావల్ల ఎలాంటి ఆలస్యమూ, ఇబ్బంది ఉండకూడదని ప్రయత్నిస్తూ నాకిచ్చిన తెలుగు డైలాగుల్ని ఎంత కష్టమైనా కంఠతా చెప్పేసేదాన్ని. షూటింగ్ పూర్తయిన రోజున… ‘సినిమా అప్పుడే అయిపోయిందా’ అన్న భావన కలిగింది. సినిమా రిలీజ్ దగ్గరపడుతున్నకొద్దీ నాకు టెన్షన్ పెరుగుతుంది, వణుకు మొదలవుతుంది. అవన్నీ ఓ చిరునవ్వు చాటున దాచేయాలని చూస్తానుకానీ కుదరదు. 24 గంటల ముందునుంచీ అమ్మని పట్టుకుని కూర్చుంటాను. ‘దేవుడా ఈ ఒక్కరోజునీ ఏదోలా ముందుకు నడిపించు, నన్ను గెలిపించు’ అని కోరుకుంటాను. |
శాకాహారిగా మారిపోయా!స్కూల్ రోజుల్లో నవలలు బాగా చదివేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక టైమ్ అంతగా దొరకడంలేదు. రెండేళ్లుగా మళ్లీ చదవడం ప్రారంభించాను. ఆ తర్వాత నా జీవనశైలిలో కొన్ని మార్పులు వచ్చాయి. వెజిటేరియన్‌గా మారాను. * ఒకట్రెండు రోజులు టైమ్ దొరికితే ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులూ, ఫ్రెండ్స్‌తో కాలక్షేపం చేస్తాను. సినిమాలు చూస్తాను. * ఎప్పుడైనా బ్రేక్ తీసుకుని విహారానికి వెళ్తే రోజంతా హోటల్ రూమ్‌లోనే ఉండి… సాయంత్రాలు మాత్రమే బయటకు వెళ్తాను. అప్పటివరకూ హోటల్‌లో రకరకాల రుచుల్ని ఆస్వాదిస్తాను. ఎక్కడికి వెళ్లినా జ్ఞాపకంగా ఏదో ఒక వస్తువుని నాతోపాటు తెస్తాను. * స్కూల్ రోజుల్లో ఒకబ్బాయిమీద క్రష్ ఉండేది. సినీ హీరోల్లో హృతిక్‌రోషన్ అంటే క్రష్. అది ఎప్పటికీ పోదేమో! * ఇన్‌స్టాగ్రామ్‌లో నావి ఫ్యాషన్ ఫొటోలకంటే కూడా సాధారణమైన ఫొటోలే పెడతాను. అక్కడైనా నన్ను నేనో మామూలు వ్యక్తిగా చూసుకోవాలనుకుంటాను. * పుకార్లని అస్సలు పట్టించుకోను. ఎవరో ఏదో రాస్తారు, అవన్నీ పట్టించుకుని వాటికి తగ్గట్టు నన్ను మార్చుకోలేను. * టొమాటో, పెరుగు మిశ్రమంతో ఫేస్‌ప్యాక్ చేయించుకుంటాను. ఇంట్లో కలబంద మొక్క ఉంది. తరచూ కలబంద గుజ్జు రాస్తాను. అవి నా చర్మానికి అద్భుతంగా పనిచేస్తాయి. * అమ్మచేసే సంప్రదాయ మహారాష్ట్రియన్ ఫుడ్ బాగా ఇష్టం. * పరిశ్రమలో వరుణ్ ధావన్, మోహిత్ సూరి, ఆదిత్య కపూర్… నాకు మంచి మిత్రులు. * తనకంటూ ఒక గుర్తింపుతోపాటు మంచి వ్యక్తిత్వం ఉండే వ్యక్తినే పెళ్లిచేసుకుంటా. అది ఎప్పుడన్నది చెప్పలేను. * నటిని కాకపోతే గాయనినయ్యేదాన్ని. |