నవీన్: మా ముగ్గురిదీ విజయవాడ. చిన్ననాటి స్నేహితులం. దాదాపు ఒకటే వయసు. మా ముగ్గురి మధ్యనా మరో కామన్ విషయం సినిమా పిచ్చి. స్కూల్ రోజులనుంచీ సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. కాస్త పెద్దయ్యాక రిలీజ్ సినిమాలు చూడ్డం అలవాటైంది. అలాగని చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అది ఉంటేనే ఆటలు సాగుతాయని మాకు తెలుసు. ముగ్గురం వేర్వేరు చోట్ల ఇంజినీరింగ్ చేశాం. ఆ తర్వాత నేనూ, మోహన్ అమెరికా వెళ్లి ఐటీ రంగంలో స్థిరపడ్డాం. రవి హైదరాబాద్‌లో ఉంటూ వ్యాపారం చేసేవాడు. తన స్నేహితుల్లో కొందరు సినీ నిర్మాణంలో ఉంటే వాళ్లతోపాటు కొన్నాళ్లు జర్నీ చేశాడు. మేం అమెరికాలో 2000 ప్రాంతంలో సొంత ఐటీ కంపెనీలు పెట్టాం. అవి విజయవంతంగా నడుస్తున్నాయి.
మోహన్: మేం ఎక్కడున్నా, ఏ పనిచేస్తున్నా సినిమాపైన ఆసక్తి మాత్రం మాతోపాటు కొనసాగుతూనే ఉండేది. ఓసారి మాటల మధ్యలో అమెరికాలో తెలుగు సినిమాల్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఆలోచన మా మధ్య చర్చకు వచ్చింది. 2006లో ‘రాఖీ’తో డిస్ట్రిబ్యూషన్‌ని ప్రారంభించాం. 2017 వరకూ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నాం. మేం పంపిణీ చేసినవాటిలో అరుంధతి, రోబో, దూకుడు, అత్తారింటికి దారేది… చాలా పెద్ద హిట్‌లు అయ్యాయి. తెలుగులో వచ్చిన ప్రతి సినిమానీ మేం డిస్ట్రిబ్యూట్ చేయలేదు. మాకు కథ నచ్చితేనో, హీరో-దర్శకుల కాంబినేషన్ బావుంటేనో ఎంపికచేసుకునేవాళ్లం. ఒక ప్రేక్షకుడిగా సినిమా అభిరుచి అక్కడ పనిచేసింది. సినిమా జయాపజయాల ప్రభావం ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్‌పైనే ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్‌లో చేతులు కాల్చుకున్న వాళ్ల ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ మేం అక్కడ లాభాలు పొందగలిగాం. కారణం కథల ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలే. మేం సినిమాని తీసుకుని అమెరికాలోని వివిధ నగరాల్లో మళ్లీ విడివిడిగా అమ్మేసేవాళ్లం. దానిద్వారా సినిమా ఫలితానికి ముందే మా చేతికి డబ్బు వచ్చేది. కొన్ని నగరాల్లో మా దగ్గరే హక్కులు పెట్టుకునేవాళ్లం. అలా కూడా లాభాల్ని పొందగలిగేవాళ్లం.
రవి: డిస్ట్రిబ్యూషన్ అనుభవంతో సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాం. 2013 నుంచి కథ కోసం వేట మొదలుపెట్టాం. ఆ ప్రయత్నంలో కొరటాల శివగారిని కలిశాం. మహేష్‌బాబు గారితో ఆయన యూటీవీ మూవీస్‌కి ఒక సినిమా చేయాల్సి ఉంది. ఏవో కారణాలవల్ల ఆఖరి క్షణంలో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అదే ‘శ్రీమంతుడు’. శివగారు ఆ కథ మాకు వినిపించారు. బ్రహ్మాండంగా ఉందనిపించింది. మేం ఇండస్ట్రీకి కొత్త. మాతో సినిమా చేయడానికి మహేష్ ఏమంటారోనని చిన్న సందేహం ఉండేది. సినిమా గురించి మాట్లాడ్డానికి మేం ఆయన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో కలిశాం. తర్వాత చేయడానికి అంగీకరించారు. ఫిల్మ్‌సిటీ నుంచి జూబ్లీహిల్స్‌లోని మా ఆఫీసుకి వచ్చేంతవరకూ అది కలా నిజమా అన్నట్టు అనిపించింది. మహేష్ వెనక ఎంత మంది నిర్మాతలు క్యూలో ఉంటారో తెలియంది కాదు. దానికితోడు మేం దాదాపు ఏడాదిగా కథ కోసమే వెతికాం. అలాంటిది ఏకంగా మహేష్‌తోనే మొదటి సినిమా ఛాన్స్ వచ్చేసరికి లంకెబిందెలు దొరికినంత సంబరపడ్డాం. ఆ కథ మా దగ్గరికి రావడం, మహేష్ మాతో సినిమాకి అంగీకరించడం… ఇవన్నీ వారంరోజుల్లోనే జరిగిపోయాయి. డిస్ట్రిబ్యూషన్ అనుభవం, నిర్మాతల్లో ఎన్నారైలూ ఉండటంతో ఆయన మా గురించి సందేహించలేదు. డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నపుడూ మహేష్‌ని తరచూ కలిసేవాళ్లం. అలా ముందునుంచీ పరిచయం ఉండటంతో షూటింగ్ చాలా సాఫీగా సాగిపోయింది. శివ-మహేష్ కాంబినేషన్ తిరుగులేనిది. మేం చేయాల్సిందల్లా సినిమాకి ఏం అవసరమో అది తెచ్చివ్వడమే. అదే చేశాం. ఆ సినిమాకి బడ్జెట్ అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే అయింది. కానీ సినిమా విడుదలకి ముందే అంతకంటే ఎక్కువ బిజినెస్ చేయడంవల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోలేదు. ‘ఒక మంచి సినిమా తీస్తున్నాం’ అనుకున్నాం. 2015లో వచ్చిన ఆ సినిమాకి మార్నింగ్ షోకే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అలా మొదటి సినిమాతో హిట్ కొట్టడం మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
నవీన్: శ్రీమంతుడు సమయంలోనే శివ మాకు ‘జనతా గ్యారేజ్’ కథ చెప్పారు. బాగా నచ్చింది. ఎన్టీఆర్‌తో సినిమా తీయాలని ముందు నుంచీ అనుకుంటున్నాం. ఆయనకీ కథ నచ్చడంతో వెంటనే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కింది. మొదటి సినిమాతో మా బ్యానర్‌కు ఒక గుర్తింపు వచ్చింది. రెండో సినిమాలో తేడా జరిగితే, మొదటి సినిమా గాలివాటంలా వచ్చిన హిట్ అనుకుంటారేమోనని ఇంకాస్త జాగ్రత్తగా పనిచేశాం. నిర్మాతగా కథలో మేం వేలుపెట్టలేం. సినిమాలో భారీతనం కోసం ఏదైనా చేయాలనుకున్నాం. అలా మోహన్‌లాల్‌గారిని తీసుకొచ్చాం. కొన్ని పాటల్ని భారీ సెట్‌లు వేసి తీశాం. ‘జనతా గ్యారేజ్’తో మరో విజయం సొంతమైంది.
మోహన్: కథ ఏంటో కూడా అడగకుండా సుకుమార్ గారితో సినిమాకి ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆయన మీద మాకున్న నమ్మకం అలాంటిది. అయితే పక్కా కమర్షియల్ సినిమా తీస్తానని సుక్కూ మాటిచ్చాడు. అలా ‘రంగస్థలం’ కథ వినిపించాడు. రామ్‌చరణ్‌ని హీరోగా పెట్టాలన్న ఆలోచన ఆయనదే. ఆ సినిమా షూటింగ్ 2017 ఏప్రిల్‌లో మొదలైంది. గోదావరి జిల్లాల్లోనే చేయాలనుకున్నాం. కానీ ఎండలూ, ఉక్కపోత బాగా ఎక్కువగా ఉండటంతో అక్కడ షూట్ చేసే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్‌లో ‘రంగస్థలం’ ఊరు సెట్ వేసి తీశాం. రామ్‌చరణ్ తన బెస్ట్ నటనని చూపించారందులో…. మొదటిరోజునుంచీ ఆ సినిమా మీద మాకు నమ్మకం ఉండేది కానీ రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకోలేదు.
రవి: మేం పక్కా కమర్షియల్ సినిమాలే తీయాలని పరిశ్రమలోకి వచ్చాం. కానీ మా మొదటి మూడు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్‌తోపాటు మెసేజ్ కూడా ఉండటం యాదృచ్ఛికంగా జరిగింది. అందువల్ల మా బ్యానర్‌కి మరింత విలువ పెరిగింది. తొలి మూడు సినిమాల్లో ముగ్గురు స్టార్ హీరోలూ, ఇద్దరు గొప్ప దర్శకులూ, ఒక మంచి సంగీత దర్శకుడితో పనిచేశాం. ఆ ఆరుగురినీ మా సంస్థ ఎప్పటికీ మర్చిపోదు. వాళ్లతో మళ్లీ మళ్లీ పనిచేయడానికి ఎదురు చూస్తుంటాం. ఇప్పటికే సుకుమార్- అల్లుఅర్జున్ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయింది. దేవీ ఎంత బిజీ అయినా మా బ్యానర్‌లో సినిమాకి ఎప్పుడూ ‘నో’ చెప్పలేదు. అంతకంటే ముఖ్యంగా ఆయనిచ్చిన నాలుగు సినిమాల్లోనూ ఒక్కపాట కూడా బాగోలేదనడానికి లేదు. అందుకే ఆయనంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. ఆయనతో మా అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది.
నవీన్: నేను డెట్రాయిట్‌లో మోహన్ న్యూజెర్సీలో ఉంటాం. మా కుటుంబాలు ఉండేదీ అక్కడే. మాకు సినిమాలు కాకుండా ఇక్కడ ఇతర వ్యాపారాలూ ఉన్నాయి. నెలలో ఒకసారైనా ఇండియా వచ్చిపోతుంటాం. అప్పుడు షూటింగ్ స్పాట్‌లకూ వెళ్తుంటాం. సినిమా రిలీజ్ సమయంలో మాత్రం నెలన్నరపాటు ఇక్కడే ఉంటాం. ఒక విధంగా అక్కడ ఆరు నెలలు, ఇక్కడ ఆరు నెలలూ ఉంటాం. రవి మాత్రం పూర్తిగా ఇక్కడే ఉంటాడు. ఎక్కడున్నా రోజూ రెండు మూడు గంటలు మా సినిమాల గురించి చర్చిస్తాం. సినిమా రంగంలో సక్సెస్ రేట్ చాలా తక్కువ. అదృష్టవశాత్తూ మా బ్యానర్‌లో విజయాల శాతం బావుంది. సక్సెస్ మీట్‌లు పెట్టినపుడు డిస్ట్రిబ్యూటర్లూ, ఎగ్జిబిటర్లూ వచ్చి సంతోషం వ్యక్తం చేస్తుంటే… ఇంకో హిట్ ఇవ్వాల్సిన బాధ్యత గుర్తొస్తుంది. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొన్ని సంవత్సరాల తర్వాత మా సినిమాలతోనే తిరిగి ఆర్థికంగా నిలదొక్కుకో గలిగామని చెబుతుంటారు.
మోహన్: పరిశ్రమలోని అందరు హీరోలూ, దర్శకులతో పనిచేయాలనేది మా అభిలాష. రవి తరచూ కథలు వింటాడు. ఏదైనా కథ బావుందనిపిస్తే మాకు చెబుతాడు. ముగ్గురం కథ విన్నాకే కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం. నిర్మాణ సమయంలో మాత్రం కొన్నిసార్లు అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటపుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా మిగతా ఇద్దరూ ఆమోదిస్తారు. ప్రతి సినిమా బృందంతోనూ ఎంతో సానుకూల వాతావరణంలో పనిచేస్తాం. హెల్దీ వాతావరణంలో పనిచేస్తే ఫలితం కూడా అలానే ఉంటుందనేది మా నమ్మకం. ఒకసారి కథనీ, దర్శకుణ్నీ నమ్మాక వాళ్లకి ఏం కావాలంటే అది ఇవ్వడమే మా బాధ్యత. సవ్యసాచిలో మాధవన్ ఉంటే బావుంటుందని డైరెక్టర్ అనగానే అంగీకరించాం. రంగస్థలంలో టైటిల్ సాంగ్‌ని వెయ్యి మందితో భారీగా తీశాం. దాన్ని వందమందితోనూ తీసేయెచ్చు. కానీ దర్శకుడు భారీగా తీద్దాం అనేసరికి మాకూ సబబుగానే అనిపించింది. భవిష్యత్తులోనూ ఇదే విధంగా పనిచేస్తాం.
రవి: ‘అర్జున్‌రెడ్డి’ని రిలీజ్ రోజునే ముగ్గురమూ చూశాం. ఆఫీసుకి తిరిగొచ్చి దాదాపు నాలుగు గంటలపాటు దాని గురించే చర్చించుకున్నాం. తర్వాత వెంటనే విజయ్‌ని కలిసి సినిమా తీయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. ‘డియర్ కామ్రేడ్’తో రెండేళ్లు ప్రయాణించాం. అందరూ ఎంతో కష్టపడ్డారు. ఫలితమే ఈ విజయం. మా బ్యానర్‌లో ఇకనుంచి ఏటా అయిదారు సినిమాలైనా వస్తాయి. నెలకు సగటున పది కథలైనా వింటాం. వాటిలో ఒక్కటి నచ్చినా గొప్ప విషయమే! మేం తీసిన మొదటి మూడూ భారీ బడ్జెట్ సినిమాలు. కానీ పరిశ్రమలో ఇప్పుడు చిన్న, మధ్యస్థాయి బడ్జెట్ సినిమాలు ఎక్కువగా విజయం సాధిస్తున్నాయి. అందుకే మేం కూడా అలాంటి సినిమాలు తీయడం మొదలుపెట్టాం. దానివల్ల భిన్నమైన జోనర్లలో ప్రయోగాత్మక సినిమాలు చేసే అవకాశమూ వస్తుంది. అలా తీసిన ‘సవ్యసాచి’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘చిత్రలహరి’ మా నమ్మకాన్ని నిలబెట్టింది. త్వరలో మా బ్యానర్‌నుంచి నానీ ‘గ్యాంగ్ లీడర్’ వస్తోంది. ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థతో కలిసి సుకుమార్‌కి అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా ‘ఉప్పెన’ తీస్తున్నాం.
సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ దీంట్లో హీరో. మరో నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
మా విజయానికి కారణం సినిమామీద ఉన్న ఇష్టమే. కథలు వినడం నుంచి స్క్రిప్టులు చదవడం, షూటింగ్‌కి వెళ్లి పనుల్ని చూడటం, దర్శకులూ హీరోలతో ట్రావెల్ చేయడం దాకా… సినిమా ప్రపంచంలో ఇష్టంగా జర్నీ చేస్తున్నాం. ఆ ఇష్టంలేకుంటే ఇక్కడ విజయం సాధించలేం.