నా గురువుల్ని చూసి భయమేసింది!
ఆరు సినిమాలూ, ఆరు విజయాలూ – ఇదీ తెలుగులో సంగీత దర్శకుడు గోపీ సుందర్ ట్రాక్ రికార్డు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘వూపిరి’, ‘మజ్ను’, ‘ప్రేమమ్’ లాంటి సినిమాలతో మెలొడీ పాటలకు కొత్త పాఠాలు నేర్పాడు. తెలుగు, మలయాళంలో కలిపి ఏటా ఇరవైకి పైగా సినిమాలు చేస్తూ, జాతీయ అవార్డును సైతం అందుకొని దూసుకెళ్తున్నాడు. గోపీ పాటలు సముద్రపు గాలిలా మనసుకు హాయినిస్తే, అతడి జీవితం సముద్రపు అలలా పడుతూ లేస్తూ గుండెని బరువెక్కిస్తుంది.
ఒకప్పుడు నేను పదో తరగతిలో ఫెయిలయ్యాను. తెలిసినవాళ్లంతా నా భవిష్యత్తు ఏమవుతుందోనని బాధపడ్డారు. ఇంకొందరైతే ఎందుకూ పనికిరాకుండా పోతానని నిశ్చయించుకున్నారు. అదే నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు వాళ్లే సంబరపడ్డారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నప్పుడు ‘గోపీ మావాడే’ అని పొంగిపోయారు. ఈ ఏడాదినే తీసుకుంటే, ‘వూపిరి’, ‘మజ్ను’, ‘ప్రేమమ్’ సినిమాలతో తెలుగుతో పాటు మలయాళంలోనూ నావి బోలెడు సినిమాలు హిట్టయ్యాయి. గతేడాది ఏకంగా 22 సినిమాలకు సంగీతం అందించా. ఇప్పుడిలా చేతి నిండా పనితో క్షణం తీరికలేకుండా గడుపుతున్నా, తొలి సినిమా అవకాశం కోసం ఏకంగా పద్నాలుగేళ్లు ఎదురుచూశా. ఈ విజయాలూ, ఎదురుచూపులూ, పొగడ్తలూ, విమర్శలూ… అన్నీ చిన్నప్పట్నుంచీ నా జీవితంలో భాగమవుతూ వస్తున్నాయి. నేను పుట్టిపెరిగిందంతా కేరళలోని కొచ్చీలో. మా అమ్మకు సంగీతమంటే చాలా ఇష్టం. రేడియోలో పాటలు వింటూనే రోజువారీ పనులు చేసుకునేది. అలా తెలీకుండానే నాకూ సంగీతంపైన ఆసక్తి పెరిగింది.
పదితో చదువాగింది
ఆరో తరగతిలో ఉన్నప్పుడు తొలిసారి బయట ఓ గురువు దగ్గర తబలా నేర్చుకోవడం మొదలుపెట్టా. క్రమంగా అందులో నైపుణ్యం పెరుగుతూ వచ్చింది. స్కూల్లో స్నేహితులు డ్రామాలు వేసినప్పుడు నేను వాటికి బ్యాక్‌గ్రౌండ్‌లో తబలా వాయించేవాణ్ణి. దాంతో స్కూల్లోనూ మంచి గుర్తింపొచ్చింది. అలా క్రమంగా సంగీతం ధ్యాసలో పడి చదువుని నిర్లక్ష్యం చేశా. నా తీరు మార్చడానికి అమ్మానాన్నా పదేళ్లలో తొమ్మిది స్కూళ్లు మార్చారు. అయినా ఫలితం లేదు. చివరికి పదో తరగతిలో ఓ సబ్జెక్టులో ఫెయిలైనా నాకు పెద్ద బాధగా అనిపించలేదు. భవిష్యత్తులో నేను సంగీతంతోనే డబ్బు సంపాదిస్తానన్న నమ్మకంతో ఉండేవాణ్ణి. దానికోసం కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లు నేర్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. అందుకే మళ్లీ పరీక్ష రాయకూడదని నిర్ణయించుకున్నా. బలవంతంగా నాకు ఆసక్తిలేని చదువుని నెత్తిన రుద్దడం అమ్మావాళ్లకూ ఇష్టంలేక ఒత్తిడి చేయలేదు. అలాగని నన్ను ఇంట్లో కూర్చొబెట్టి పోషించడానికి మాదేం సంపన్న కుటుంబమూ కాదు. అప్పటికే వాళ్లను బాధపెట్టి చదువు మానేసిన నేను, ఇంటికి మరింత భారం కాకూడదని నిర్ణయించుకున్నా. దాంతో పదిహేనేళ్ల వయసులో సంగీతంపైన ఇష్టంతో, తబలా వాయించడంలో కాస్త ప్రావీణ్యంతో, చేతిలో కనీసం పదో తరగతి సర్టిఫికెట్ కూడా లేకుండా జీవితంలో పోరాడటానికీ, నా కాళ్లపైన నేను నిలబడటానికీ సిద్ధమయ్యా.
కోర్సు పూర్తిచేయకుండానే…
మొదట్లో కొన్నాళ్లు ఆర్కెస్ట్రాల్లో పనిచేస్తూ రకరకాల వేడుకలకు తబలా వాయించేవాణ్ణి. ఇతర స్కూళ్లలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకూ పనిచేసేవాణ్ణి. ఆపైన ఎఫ్‌ఎం, రేడియో కార్యక్రమాలూ, యూత్ ఫెస్టివల్స్ లాంటి వాటికీ పనిచేశా. అలా ఎక్కువకాలం కొనసాగితే జీవితంలో పైకెదగడం కష్టమనిపించింది. ఇంకా బాగా సంగీతం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో మద్రాస్ మ్యూజిక్ కాలేజీలో మృదంగం డిప్లొమా కోర్సులో చేరా. స్కూల్లో చదివే రోజుల్లో నేనెప్పుడూ వెనకబడ్డ విద్యార్థినే. కానీ నాకిష్టమైన సంగీత కోర్సులో మాత్రం నేను టాపర్‌ని. అక్కడుండగానే మృదంగంపైన మంచి పట్టొచ్చింది. కాలేజీలో చివరి సెమిస్టర్ దగ్గరికొచ్చిన సమయానికి ఓ రోజు నాకు సంగీతం నేర్పే మాస్టారింటికి వెళ్లా. ఆ ఇంటిని చూడగానే ఆయన ఆర్థిక పరిస్థితేంటో అర్థమైంది. సంగీతంలో ఎన్నో డిగ్రీలున్న ఆయన అన్నేళ్ల తరవాత కూడా డబ్బులకు ఇబ్బంది పడుతుంటే, ఆయన అడుగు జాడల్లో నడిస్తే నా పరిస్థితి కూడా భవిష్యత్తులో అలానే తయారవుతుందేమోనని భయమేసింది. దాంతో చివరి సెమిస్టర్ కూడా పూర్తిచేయకుండానే అప్పటికప్పుడు సంపాదన కోసం వేరే ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో చెన్నై వదిలి ఇంటికి బయల్దేరా. అలా మళ్లీ చదువులో డ్రాపవుట్‌గానే మిగిలిపోయా. కాకపోతే సర్టిఫికెట్లు రాకపోయినా ఈసారి సంగీతంపైన మంచి పట్టొచ్చింది.
పేరుకే అసిస్టెంట్‌ని!
కొచ్చీకి వచ్చాక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఔసెపచ్చన్ అనే ఓ సినీ సంగీత దర్శకుడి దగ్గరికి మానాన్న నన్ను తీసుకెళ్లారు. ఆయనా మా నాన్నా చదువుకునే రోజుల్లో స్నేహితులు. ఆ పరిచయంతోనే నన్ను ఔసెపచ్చన్‌కు అసిస్టెంట్‌గా చేర్పించారు. పేరుకి అసిస్టెంట్‌నే అయినా మొదట్లో నేనక్కడ చేసిందంతా ఆఫీస్‌బాయ్ పనే. స్టూడియోకు ఆయన కారు రాగానే హార్మోనియం దించి లోపల పెట్టడం, మళ్లీ సాయంత్రం దాన్ని కార్లో పెట్టడం… చాలా రోజుల వరకూ అక్కడదే నా పని. ఇంకొన్ని రోజుల తరవాత ఆయన రోజూ ఓ రెండు మూడు ట్యూన్లు వినిపించి అందులో ఏది బావుందో చెప్పమని నన్నడిగేవారు. అలా చూస్తుండగానే చాలా నెలలు గడిచిపోయాయి. ఔసెపచ్చన్ అక్కడ పేరున్న సంగీత దర్శకుడు. నేను ఆయన దగ్గర చేరేనాటికే ఆయనకు పరిశ్రమలో 20ఏళ్ల అనుభవం ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయారు. అక్కడ పారితోషికాలు తక్కువగా ఉండటమే దానికి కారణం. దాంతో నాలో మళ్లీ ఆందోళన… ఇరవై ఏళ్ల తరవాత నా పరిస్థితీ అలానే ఉంటుందేమోనన్న భయం. అందుకే ఆయనకు అసిస్టెంట్‌గా ఉంటూనే వేరే పనులూ చేయాలని నిర్ణయించుకుని ఇతర ఆదాయ మార్గాల కోసం అన్వేషణ మొదలుపెట్టా.
ఐదు వేల ప్రకటనలు…
ఔసెపచ్చన్ దగ్గర ఉన్నప్పుడు ఆయన చేసే సినిమాలకు కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా పనిచేసేవాణ్ణి. తబలా, మృదంగంపైన కూడా మంచి పట్టుండటంతో రేడియో కార్యక్రమాలకు నేపథ్య సంగీతాన్ని అందించడం ప్రారంభించా. ఆ క్రమంలోనే కొందరు యాడ్ ఏజెన్సీ వాళ్లతోనూ పరిచయమైంది. వాళ్ల సాయంతోనే టీవీ ప్రకటనలకు జింగిల్స్ చేయడం మొదలుపెట్టా. వాటికి మంచి పేరు రావడంతో జింగిల్స్ అవకాశాలూ పెరుగుతూ వచ్చాయి. ఓ పక్క ఔసెపచ్చన్‌కు సహాయకుడిగా ఉంటూనే రేడియో కార్యక్రమాలూ జింగిల్స్ చేస్తుండేవాణ్ణి. అలా స్థానిక ప్రకటనలతో పాటు, రాష్ట్ర జాతీయ స్థాయివన్నీ కలిపి ఐదు వేలకుపైగా ప్రకటనలకు నేపథ్య సంగీతం అందించా. యాడ్స్ చేయడానికి ఎక్కువ సమయం ఉండేది కాదు. దాంతో వేగంగా పనిచేయడం అలవాటైంది. ఔసెపచ్చన్ సాయంతో సినిమాలకు సంగీతం అందించడంపైన పూర్తి అవగాహన వచ్చింది. ఆయనతో ఉన్నప్పుడే కొందరు నిర్మాతలూ, దర్శకులతో పరిచయం పెరిగింది. అలా చాలా ఏళ్ల తరవాత ఓ దర్శకుడు తన సినిమాకు నన్ను సంగీతం అందించమన్నాడు. మంచి అవకాశమే అయినా, నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించింది. మానసికంగా పూర్తిగా సిద్ధమయ్యాకే సినిమాల్లోకి వెళ్లాలనిపించి ఆ అవకాశాన్ని వదులుకున్నా.
తెలుగులో అవకాశం
తొలి సినిమా వదిలేశాక అడపాదడపా కొన్ని అవకాశాలు వస్తూనే ఉండేవి. ఓ ఐదేళ్ల తరవాత రోషన్ ఆండ్రూస్ అనే యువ దర్శకుడు ‘నోట్‌బుక్’ అనే సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేయమని అడిగాడు. అతడితో ఉన్న పరిచయంతో పాటు, అప్పటి దాకా సంపాదించిన అనుభవంపైన నమ్మకంతో ఆ ప్రాజెక్టు ఒప్పుకున్నాను. దానికి ఎంత మంచి పేరొచ్చిందంటే దాని తరవాత దర్శకుడు ప్రియదర్శన్ హిందీలో తీసిన ‘ధోల్’కు నాతోనే నేపథ్య సంగీతం చేయించారు. ఆపైన మోహన్‌లాల్ సినిమా ‘ఫ్లాష్’తో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా కెరీర్ మొదలైంది. మూడో సినిమా ‘అన్వర్’కు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడంతో ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మలయాళంలో వరసబెట్టి అవకాశాలు వచ్చాయి. ‘ఉస్తాద్ హోటల్’, ‘బ్యాంగళొర్ డేస్’, ‘చార్లీ’, ‘ఏబీసీడీ’… ఇలా గత పదేళ్లలో మలయాళంలో భారీ విజయాలు సాధించిన ఎన్నో సినిమాలకు సంగీతం అందించా. ‘1983’ అనే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డూ దక్కింది. ఆ క్రమంలోనే ఓ రోజు దర్శకుడు క్రాంతి మాధవ్ ఫోన్ చేసి తెలుగులో తాను చేయబోయే సినిమాకు పనిచేయమని అడిగారు. మలయాళంలో నేను చేసిన పాటలు బాగా నచ్చడంతో ఆయనే నా గురించి తెలుసుకొని వచ్చారు. అప్పటికే మలయాళంతో పాటు తమిళం, హిందీ భాషల్లో పనిచేసిన నాకు తెలుగులో పనిచేయాలని ఆసక్తిగా ఉండేది. ఆ కోరిక ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమా రూపంలో నిజమైంది. ఆ సినిమా మంచి మ్యూజికల్ హిట్టయి ఇక్కడి సంగీతాభిమానులూ నా గురించి చర్చించేలా చేసింది.
వరసగా విజయాలే
తెలుగులో తొలిసినిమాతోనే వచ్చిన పేరుతో, నా పాటలు ఇక్కడి వాళ్లకూ నచ్చుతాయని అర్థమైంది. ఆ తరవాత చేసిన ‘భలే భలే మగాడివోయ్’, ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాలతో కమర్షియల్ విజయాలు ఖాతాలో పడ్డాయి. ‘వూపిరి’ తెలుగుతో పాటు తమిళంలోనూ పెద్ద హిట్టయింది. గత నెలలో ‘మజ్ను’, ‘ప్రేమమ్’ సినిమాలు సంగీత పరంగానూ మంచి విజయాల్ని నమోదు చేశాయి. ఇవి కాకుండా ‘బ్రహ్మోత్సవం’, ‘అభినేత్రి’ సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించా. మలయాళంతో పోలిస్తే తెలుగు పరిశ్రమలో పారితోషికంతో పాటు ప్రతిభ ఉన్నవాళ్లకు గుర్తింపూ, ప్రోత్సాహమూ ఎక్కువే. అందుకే వరసగా ఇక్కడా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం నానీ నటిస్తున్న మరో సినిమాకు సంగీతం అందిస్తున్నా. ఇంకొన్ని సినిమాలూ చర్చల్లో ఉన్నాయి.
గత మూడేళ్లుగా సగటున నాది మూడు వారాలకో సినిమా విడుదలవుతోంది. అంత వేగంగా సినిమాలెలా చేస్తానని చాలా మంది అడుగుతుంటారు. కానీ అంతకు ముందు దాదాపు పద్నాలుగేళ్లు ఓ సంగీత దర్శకుడి దగ్గర పనిచేశాక కానీ నాకు తొలి అవకాశం రాలేదు. ఆ సుదీర్ఘ అనుభవమే ఇప్పుడిలా వేగంగా పనిచేయడానికి పనికొస్తోంది. చిన్నప్పుడు నేనెందుకూ పనికిరానేమో అనుకున్నవాళ్లందరికీ నా ఎదుగుదలే సమాధానం చెప్పింది. భవిష్యత్తులో నా గురువుల్లానే ఆర్థిక ఇబ్బందులు తప్పవేమో అన్న బెంగ కూడా ఇప్పుడు తీరిపోయింది. నాకున్న ఒకే లక్ష్యం జీవితంలో ప్రతిక్షణం సంతోషంగా ఉండటం. అన్నం తిన్నా, సినిమా చేసినా, స్నేహితులతో మాట్లాడినా, ఎలాంటి పనైనా నవ్వుతూ చేయాలన్నదే నా కోరిక. ఓ నెల రోజుల తరవాత నా పరిస్థితి ఎలా ఉంటుందో కూడా నేను చెప్పలేను. కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ బతికేయడమే నాకున్న ఏకైక ప్రణాళిక.
సర్టిఫికెట్ ఫేస్‌బుక్‌లో…
తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీ సినిమాలకూ సంగీతం అందించా. సంగీత దర్శకులు విశాల్-శేఖర్ దగ్గర కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా ఉంటూ ‘ఓం శాంతి ఓం’, ‘బ్లఫ్ మాస్టర్’, ‘షాదీ కా ఘర్’ లాంటి సినిమాలకు పనిచేయడంతో పాటు ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో ఓ పాట కూడా పాడా.
* గత మూడేళ్లలో మూడు భాషల్లో కలిపి నావి యాభైకి పైగా సినిమాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా పదహారొచ్చాయి. భవిష్యత్తులో సినిమాల సంఖ్య తగ్గించి ఆలస్యమైనా మరింత వైవిధ్యమైన సంగీతాన్ని అందించాలన్న ఆలోచన ఉంది.
* గతేడాది పదో తరగతి ఫలితాలు విడుదలైన సందర్భంలో నా మార్కులిస్టును ఫేస్‌బుక్‌లో పెట్టి, ఫెయిలైన వాళ్లకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేశా. నేను ఇంగ్లిష్‌తో పాటు మరో మూడు భాషలు బాగా మాట్లాడగలను. నేను చదివిన స్కూలు వార్షికోత్సవాలకే రెండుసార్లు చీఫ్ గెస్ట్‌గా వెళ్లా. జీవితంలోనూ ఎంతో కొంత సాధించా. అందుకే చదువే సర్వస్వం కాదని చెప్పడానికే ఆ సర్టిఫికెట్లు పెట్టా.
* నా బలం మెలొడీ గీతాలు. ఆ విషయంలో ఇళయరాజాగారే నాకు స్ఫూర్తి. ఆయన బాటలోనే మెలొడీ ప్రధానంగా పాటలు చేయడానికి ప్రయత్నిస్తుంటా. ఈమధ్యే ఓ మ్యూజిక్ బ్యాండ్‌నూ మొదలుపెట్టి దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తున్నా.