director kartik subbaraaju

రజినీకాంత్‌ ఫోన్‌ చేస్తే నమ్మలేకపోయా!
 

రజినీకాంత్‌ ఫోన్‌ చేస్తే నమ్మలేకపోయా!

చూడటానికి కాస్త బొద్దుగా ఉన్న ఇంటర్‌ విద్యార్థిలా అనిపిస్తాడు కానీ…కార్తిక్‌ సుబ్బరాజ్‌ చాలా లోతైనవాడు! జీవితంపైన స్పష్టత ఉన్నవాడు. ఆ లోతూ, స్పష్టతలకి తనదైన కొత్త సినిమాటిక్‌ వ్యక్తీకరణని జోడించి నయాతరం దర్శకుల్లో జీనియస్‌ అనిపించుకుంటున్నాడు. అందుకే అతితక్కువ కాలంలోనే సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ సినిమాకి కెప్టెన్‌ కాగలిగాడు. ‘పేట’ హిట్‌ కొట్టిన ఆనందంతో ఉన్న సుబ్బరాజ్‌ని పలకరిస్తే…

మూడేళ్లకిందటి మాట. ఆరోజు రజినీకాంత్‌గారిని కలవాలి. ఇప్పటికే ఓసారి ఆయన్ని కలిసి ఉన్నా… ఇప్పుడు వెళ్లబోయేది ఆయనకు కథ చెప్పడానికి! కథ నచ్చి దర్శకుడిగా నాకు ఒక్క ఛాన్స్‌ ఇస్తే చాలు… నా జీవిత లక్ష్యాల్లో ఒకటి నెరవేరినట్టే.
నేను కథని చక్కగా రాస్తాను కానీ… దాన్ని మాటల్లో చెప్పడం రాదు. నేను అప్పటిదాకా పనిచేసిన ఏ హీరోకీ పదినిమిషాలకంటే ఎక్కువ కథ చెప్పింది లేదు… అదీ తడబడుతూనే చెప్పేవాణ్ణి. కేవలం బ్రీఫ్‌ ఇచ్చి… ‘మిగతాది ఈ స్క్రిప్టులో చదువుకోండి సార్‌!’ అని బౌండ్‌ కాపీ ఇచ్చేసేవాణ్ణి. కానీ రజినీకాంత్‌ అంతటివాడికి అంత పెద్ద పుస్తకం చేతిలో పెట్టి ‘చదవండి సార్‌!’ అంటే బావుండదు. కథ చెప్పి తీరాలి. అందులో నేను ఫెయిలైతే ఎలా! ఎందుకైనా మంచిదని నా కథ మొత్తాన్ని ఓ పదిపేజీలకి కుదించి రాసుకున్నాను. ఒకవేళ నేను బాగా చెప్పలేకపోతే ఆ పది పేజీలన్నా చదవండి అని రిక్వెస్ట్‌ చేద్దామన్నది ప్లాన్‌. మొత్తానికి ఆయన ఎదుట వాలిపోయాను. పదినిమిషాలు అతికష్టంపైన చెప్పాక ‘కథ సమ్మరీ ఇక్కడుంది సార్‌… చదవండి!’ అన్నాను. ‘మీరు కథ చెప్పే తీరు చాలా బావుంది కార్తిక్‌! కంటిన్యూ చేయండి!’ అన్నారు. ఈ వ్యక్తి కొత్తవాళ్లని ఎంతగా ప్రోత్సహిస్తాడో అప్పుడు అర్థమైంది. వెయ్యేనుగుల బలం వచ్చినట్టయింది. నా కెరీర్‌లో తొలిసారి గంటసేపు కథ చెప్పాను. అది విన్నాక రజినీకాంత్‌గారి రియాక్షనేమిటో… మళ్లీ చెబుతాను. ఈలోపు నా సొంత కథ కాస్త వివరిస్తాను…

రజినీకాంత్‌ ఫోన్‌ చేస్తే నమ్మలేకపోయా!

వేయి కళ్లతో ఎదురుచూశా…
మానాన్న బ్యాంకు ఉద్యోగి. అమ్మ గృహిణి. ఇంట్లో అక్కా, నేనూ. చదువులో యావరేజ్‌గానే ఉన్నా మైమ్‌, స్కిట్స్‌లో అదరగొట్టేసేవాణ్ణి. రజినీకాంత్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ‘తలైవర్‌’ని చిన్న కామెంట్‌ చేసినా కొట్లాడేవాణ్ణి. అలా చొక్కాలు చించుకుని ఇంటికొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి! 2000లో నేను ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. మా నాన్న మదురైలో మా ఫ్రెండ్స్‌, బంధువుల కోసం ‘మిలీనియల్‌ ఫంక్షన్‌’ అని ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమం కోసం కార్గిల్‌ యుద్ధం నేపథ్యంలో నేనో స్కిట్‌ రాశాను. డైలాగులేవీ లేకుండా కేవలం సినిమా పాటల నేపథ్యంతో సాగిన ఆ నాటికని అందరూ అభినందించారు. అవన్నీ నాపైన బాగా పనిచేశాయి. నాటికలు రాయడం మొదలుపెట్టా. ఇక అదే నా జీవితం అనుకుని ‘విజువల్‌ కమ్యూనికేషన్స్‌’లో డిగ్రీ చేద్దామనుకున్నా. ‘అది అన్నం పెట్టని డిగ్రీ’ అంటూ మా ఇంట్లోవాళ్ళు
నా మాటల్ని కొట్టేశారు. ఇంజినీరింగ్‌లో చేరి సెటిలయ్యాక… నాటకాల వైపు వెళ్లమన్నారు. నాకు వేరే దారిలేదు. అలా అని ఇంజినీరింగ్‌పైనా పెద్దగా విముఖతలేదు. పైగా అక్కడా నా కథలూ, కవితలూ, నాటకాలతో మెప్పించాను. బీఈ పట్టాతోపాటూ ‘బెస్ట్‌ కల్చరల్‌ ఛాంపియన్‌’ అవార్డుతోనే బయటకొచ్చాను. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను.
క్రియేటివిటీ ఉన్న ప్రోగ్రామర్‌గా పేరు తెచ్చుకున్నాను. వారాంతాల్లో షార్ట్‌ఫిల్మ్స్‌ తీయడం మొదలుపెట్టాను. అందుకోసం కెమెరా, లైటింగ్‌ పరికరాలు కొనుక్కున్నాను. వాటితో ప్రతి శనివారం షార్ట్‌ఫిల్స్మ్‌ తీసి అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాను.
పెట్టాక వారమంతా దానికి వచ్చే కామెంట్‌లూ, లైకుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండేవాణ్ణి! రోజుకి ఇరవైమంది అదనంగా చూసినా నా జన్మధన్యమైందన్నట్టు సంతోషించేవాణ్ణి. నాకంటూ ఆన్‌లైన్‌లో ఓ ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది!

‘గెట్‌ అవుట్‌’ అన్నారు
అప్పుడే ఓ తమిళ ఛానెల్‌లో ‘రేపటి దర్శకులు’ పేరుతో ఓ షో మొదలైంది. మాలాంటి షార్ట్‌ఫిల్మ్‌ జీవులమంతా అందులో పాల్గొనాలని తహతహలాడుతుండేవాళ్లం. నేను పంపిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ దానికి సెలెక్ట్‌ అయ్యింది. కానీ ఆ షో సెలెక్షన్‌తోనే ఆగిపోదు. మనం ఆ టీవీవాళ్లతోనే ఉండి ఐదు కొత్త షార్ట్‌ఫిల్మ్‌లు తీయాలి. దీనికంతటికీ కనీసం రెండునెలలు పడుతుంది. నా వారాంతపు సెలవుల్లో ఆ టీవీ టీమ్‌తో ఉండి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నాకు ఓ చిక్కొచ్చింది. ఆఫీసులో నా పనితీరు నచ్చి నన్ను ఓ కొత్త ప్రాజెక్టు కోసం ఫ్రాన్స్‌కి పంపిస్తామన్నారు! ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఎగిరిగంతేయాల్సిన అవకాశమే కానీ… నా షార్ట్‌ఫిల్మ్స్‌ కల ఏం కావాలి?! అందుకే మా హెచ్‌ఆర్‌ దగ్గర నేను ఫ్రాన్స్‌కి వెళ్లలేనని చెప్పేశాను. నన్ను పిచ్చివాడిలా చూడటమే కాదు… తూలనాడారు. నాకూ కోపం వచ్చి మాటామాటా పెరిగింది. ఒకస్థాయిలో ఆవేశంతో రిజైన్‌ చేస్తానని చెప్పేశాను! చెప్పి లంచ్‌ చేద్దామని బయటకు వచ్చాను. బయటకొచ్చాక ఒక్కసారిగా నన్ను భయం ఆవహించేసింది. ‘ఉన్నపళంగా ఇలా ఉద్యోగం వదిలేస్తే ఎలా? టీవీ షోలో సక్సెస్‌ కాకపోతే ఏం చేద్దాం!’ అనే ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడే ‘రిజిగ్నేషన్‌ ఇచ్చాక రెండునెలలు నోటీస్‌ పిరియడ్‌ ఉంటుంది. టీవీ షోలో సక్సెస్‌ కాకపోతే ఈలోపు మళ్లీ వచ్చి ఇక్కడ జాయిన్‌ కావొచ్చు. కాబట్టి ఇప్పుడు రిజిగ్నేషన్‌ ఇచ్చేద్దాం’ అనుకున్నా. ఆ ధీమాతో మళ్లీ ఆఫీసులోకి వెళ్లాను. ఆక్సెస్‌ పాయింట్‌ దగ్గర నా ఐడీ కార్డుని ఫ్లాష్‌ చేశాను కానీ… అది లోపలికి అనుమతించలేదు. ‘మీరు హెచ్‌.ఆర్‌.తో మాట్లాడండి’ అని మెసేజ్‌ వచ్చింది. ఆయనతో మాట్లాడితే ‘మీరు ఇక రానక్కర్లేదు వెళ్లొచ్చు…’ అన్నారు. అదేమిటీ, రెండునెలలు టైమ్‌ పిరియడ్‌ ఉంటుంది కదా… అని అడిగాను.
‘మేమే మిమ్మల్ని తొలగిస్తున్నాం కాబట్టి మీకు ఆ అవకాశం లేదు..!’ అన్నారు. కనీసం ఆఫీసు లోపలికెళ్లి నా బ్యాగు తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్లు. సెక్యూరిటీ చేత తెప్పించి నా మొహాన కొట్టినంత పనిచేశారు!

ఛాంపియనే కానీ…
ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పాను. నేను భయపడ్డట్టు వాళ్లేమీ కుంగిపోలేదు. ‘ఇది కూడా నీ మంచికే అనుకో. షార్ట్‌ఫిల్మ్స్‌లో ఏం సాధించగలవో చూడు. అక్కడ సక్సెస్‌ కాకపోతే ఇంకో ఉద్యోగం వెతుక్కో’ అన్నారు. అలా చెన్నై వచ్చి టీవీ షోలో పాల్గొన్నాను. ఓ సినిమా తీయడమంటే ఎంత సీరియస్సయిన విషయమో నాకు తెలిసింది అప్పుడే. ఆ కార్యక్రమంలో నేనే ఛాంపియన్‌గా నిలిచాను. ఆ ప్రోగ్రామ్‌తో తమిళనాడులో ఫేమస్‌ అయిపోయాను. ఇక సినిమా రంగంలోకి దూకేయడమే తరువాయి అనుకున్నాను! టీవీ షోలో నా అనుభవాల ఆధారంగానే కథ రాసుకున్నాను. నన్ను ఏ నిర్మాతా తిరస్కరించలేదు. తిరస్కరించినా సమస్య ఉండేది కాదు… కానీ వాళ్ల పద్ధతి వేరు. నేను కథ చెప్పగానే ‘తప్పకుండా చేద్దాం!’ అనేవాళ్లు. నాకోసం ఆఫీసునూ, సిబ్బందినీ ఇచ్చేవాళ్లు. చివరికి వాళ్లేదో కథ చెప్పి దాన్ని తీయమనేవారు… లేదా నా కథనే వాళ్లకు తగ్గట్టు మార్చమనేవారు. అవి రెండూ చేయలేక బయటకొచ్చేసేవాణ్ణి. అలా చూస్తుండగానే రెండేళ్లు వృథా అయిపోయాయి!

రజినీకాంత్‌ ఫోన్‌ చేస్తే నమ్మలేకపోయా!

చివరికి సీవీ కుమార్‌ అనే నిర్మాత అసలు విషయం చెప్పాడు… ‘సమస్య మీ కథలోనే ఉందండి. దానికయ్యే బడ్జెట్‌ ఎక్కువ. ఓ కొత్త యువకుణ్ణి నమ్మి ఎవరూ ఆ రిస్కు తీసుకోలేరు. రెండు నెలల్లో సినిమా తీసేలా ఓ చిన్న కథ రాయండి. నేను నిర్మిస్తా!’ అన్నాడు. అలా ఒక్క వారంలోనే హారర్‌ నేపథ్యంతో ‘పిజ్జా’ కథ రాశాను. చిత్రం పెద్ద హిట్టయింది. తెలుగులో కూడా డబ్‌ అయి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నేను మొదట రాసుకున్న కథ ఆధారంగా సిద్ధార్థ్‌ హీరోగా ‘జిగర్తాండ’ సినిమా తీశాను(తెలుగులో ‘చిక్కడూ దొరకడు’గా డబ్‌ అయ్యింది. అది హిట్టుకావడమే కాదు మనదేశంలోని గొప్ప దర్శకులందరి మన్ననలందుకుంది. ‘నాకు నచ్చిన యువతరం దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజే. దక్షిణాదిన కొత్త శకం ప్రారంభించాడు’ అన్నారట మణిరత్నం!

రజినీకాంత్‌ ఫోన్‌…
నా మొదటి సినిమా ‘పిజ్జా’ రిలీజైన వారం రోజుల్లోనే రజినీకాంత్‌ ఫోన్‌ చేశారు. మొదట్లో ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నా. తీరా చూస్తే ఆయనే! ‘బ్రిలియంట్‌ ఫిల్మ్‌.. గురూ’ అన్నారు. ‘జిగర్తాండ’ సినిమా విడుదలయ్యాక నేనే వెళ్లి కలుద్దామనుకున్నాను! నేను వెళ్లగానే ‘విలన్‌ పాత్రకి కాస్త నా స్టైల్‌ ఉందేమిటీ?’ అని అడిగారు. ‘ఆ పాత్రే కాదు సార్‌ నా జీవితం మొత్తానికీ మీరే స్ఫూర్తి’ అన్నాను. ‘అయితే ఆ విలన్‌పాత్రకి నన్ను అడిగితే చేసి ఉండేవాణ్ణి కదా!’ అన్నారు. అంతేకాదు… ‘మంచి కథతో రండి చూద్దాం!’ అనీ చెప్పారు. ఆయనతో నా ప్రయాణం ఆ రకంగా మొదలైంది. అలా, ముందే చెప్పినట్టు, ఆయన కోసం కథ రాసుకున్నాను కానీ ఎలా చెప్పాలన్నదే సమస్యగా మారి కూర్చుంది! మొత్తానికి కథ చెప్పగానే ‘బావుంది. ఎవరైనా నిర్మాత ముందుకొస్తే చేద్దాం’ అన్నారు. కానీ మా సినిమా పట్టాలకెక్కడానికి మూడేళ్లు పట్టింది. ఈలోపు రెండు సినిమాలు తీశాను. ఆ తర్వాత స్త్రీలపైన జరిగే మానసిక హింస గురించి ప్రశ్నిస్తూ ‘ఇరైవి’ తీశాను. కార్పొరేట్‌ సంస్థల దోపిడిపై ప్రభుదేవా హీరోగా ‘మెర్క్యురీ’ మూకీ సినిమా చేశాను. అవి రెండూ విమర్శకుల నుంచి ప్రశంసలు తెచ్చినా బాక్సాఫీసుని మెప్పించలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో నా తర్వాతి చిత్రం రజినీకాంత్‌తో ఉంటుందని అస్సలు ఊహించనేలేదు.

నా టచ్‌ తగ్గించాను…
సన్‌ పిక్చర్స్‌ సంస్థవాళ్లు రజినీసార్‌తో ఓ సినిమా నిర్మిస్తామనగానే ఆయన నా కథ గురించే చెప్పారట. వాళ్లూ ఓకే అనేశారు. అలా నా కథ సెట్స్‌పైకెళ్లింది. సాధారణంగా నా సినిమాల్లో అసలు కథతోపాటూ సబ్‌-ప్లాట్స్‌ ఎక్కువగా ఉంటాయి… చెప్పీచెప్పని ఉద్వేగాలు ఉంటాయి. కానీ ‘పేట’ కోసం వాటన్నింటినీ కాస్త పక్కనపెట్టి రజినీకాంత్‌ నుంచి అభిమానులు ఏవి ఆశిస్తారో వాటికే ప్రాధాన్యమిచ్చాను. 1980ల నుంచి ఆయన సూపర్‌హిట్టు సినిమాలన్నింటినీ గుర్తుచేసి అభిమానుల్ని కిర్రెక్కించాలనుకున్నాను. అందుకోసం నాదైన టచెస్‌ కొన్ని వాడాను. ఓ అభిమానిగా నేను ఆయనకు రాసిన ఓ లేఖ లాంటిది ఈ సినిమా!

తను భయపెట్టేస్తుంది…!

రజినీకాంత్‌ ఫోన్‌ చేస్తే నమ్మలేకపోయా!

నా భార్య శక్తి ఎప్పుడూ హారర్‌ నవలలు చదువుతుంటుంది. దెయ్యం సినిమాలూ చూస్తుంటుంది… అదీ రాత్రివేళ! ఒక్కోసారి ఆ శబ్దాలకి తన రూమ్‌వైపు వెళ్లడానికే భయమేస్తుంది నాకు! తన స్ఫూర్తి తోనే ‘పిజ్జా’లో హీరోయిన్‌ పాత్రని మలిచాను. అప్పటి నుంచి నేను తీసిన కథానాయికల పాత్రలకి నాకు తెలియకుండానే తన ఛాయలు వచ్చేస్తున్నాయి! రజినీకాంత్‌కి కథ చెప్పాక సినిమాగా తీయడానికి ఎన్నో అవాంతరాలొచ్చాయి. చాలా పెద్దసంస్థలు ఒప్పుకుని చేతులెత్తేశాయి. ఆ పరిణామాలు నన్ను కుంగదీశాయి. అప్పుడు నా భార్యే భరోసా ఇచ్చింది. ‘నువ్వ ‘తలైవర్‌’తో తీస్తావ్‌రా… అందులో డౌటేలేదు!’ అంటూ ధైర్యం చెప్పేది. అదే నిజమైంది!