villain sonu sood

55577910_08-crop--6ded15

 

 

అందుకే ముంబయి  వచ్చానేమో!

 
గతేడాది కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ పెట్టినపుడు… చాలామంది ఇళ్లలో ఉంటూ తమ హాబీలకు సమయం కేటాయించారు. ఇంకొందరు కొత్త హాబీలను నేర్చుకున్నారు. కానీ సినీ నటుడు సోనూసూద్‌ మాత్రం ఉపాధిలేక, తిరిగి సొంతూళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కూలీల్ని క్షేమంగా గూటికి చేర్చాడు. కొవిడ్‌ మరోసారి విజృంభించినపుడు ఆక్సిజన్‌ బ్యాంకుల్ని ఏర్పాటుచేశాడు. సినిమాల్లో ఉత్తమ విలన్‌గా పేరొందిన సోనూ… బయట సిసలైన హీరో అనిపించుకున్నాడు. తన సేవా కార్యక్రమాలూ, కుటుంబం, భవిష్యత్తు కార్యక్రమాల గురించి సోనూ ఏం చెబుతున్నాడంటే…

పంజాబ్‌లోని మోగా… మా సొంతూరు. అమ్మ ప్రొఫెసర్‌. నాన్న బట్టల దుకాణాన్ని నడిపేవారు. వారానికోసారి మా దుకాణం ఎదుట అన్నదాన కార్యక్రమం చేపట్టేవారు. దాదాపు 100 మంది ఆరోజు అక్కడ ఆకలి తీర్చుకునేవారు. వాటిలో నేనూ పాల్గొనేవాణ్ని. నలుగురికీ సాయపడటంలో కలిగే ఆనందం అలా నాకు చిన్నపుడే అనుభవమైంది. ‘జీవితంలో నువ్వు ఎంత పైస్థాయికి వెళ్లినా, ఎంత డబ్బు సంపాదించినా కూడా… అవసరంలో ఉన్నవారికి సాయపడినపుడే- అది కూడా వాళ్లు నీనుంచి సాయం అడగకుండానే అందించినపుడే- నువ్వు జీవితంలో విజయవంతమైనట్టు’ అని చెబుతుండేది అమ్మ. స్కూల్‌, కాలేజీ రోజుల్లోనూ అక్కా, చెల్లీ, నేనూ అవసరమైనవారికి చేతనైన సాయం చేసేవాళ్లం. అలా ఇప్పుడు చేస్తున్న పనులన్నింటికీ బీజం నా చిన్నపుడే పడిందని చెప్పాలి. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో స్నేహితులతో కలిసి ముందు ఉచిత భోజనం అందించడం మొదలుపెట్టాను. వేల మంది సుదూరాల్లోని తమ ఊళ్లకు నడిచి వెళ్తుంటే వాళ్లనలా చూస్తూ ఊరకే ఉండలేకపోయాను. మొదట కొద్దిమందినైనా బస్సుల్లో పంపాలనుకున్నా. క్రమంగా అది లక్షల మందిని తమ ఇళ్లకు చేర్చే కార్యక్రమం అయింది. ఇదంతా నా కుటుంబం వల్లనే సాధ్యమైంది. కుటుంబం అంటే నా భార్యా పిల్లలే కాదు, స్నేహితులూ, కారు డ్రైవర్‌, పాలు పోసే అబ్బాయి… వీళ్లందరూ. క్రమంగా ఆ కుటుంబంలో వేలమంది సభ్యులయ్యారు. దాదాపు ఎనిమిది లక్షల మందిని తమ సొంతూళ్లకు బస్సులూ, రైళ్లూ, విమానాల్లో పంపించాం. వీరిలో విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులూ ఉన్నారు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో కొందరు సాయం కోసం నన్ను సంప్రదించినపుడు కాదనలేకపోయాను. చదువులు, ఉపాధి, వైద్యం… ఇలాంటి విషయాల్లో అడిగినవాళ్లందరికీ సాయం చేస్తూ వచ్చా. ఏడున్నర వేలమందికి వివిధ రకాల సర్జరీలు చేయించాం. కొవిడ్‌ రెండో దశలో ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులూ కావాల్సినపుడు వాటిని అందించాం. అంబులెన్స్‌లూ, ఎయిర్‌ అంబులెన్స్‌లూ ఏర్పాటుచేశాం. ఈసారి నా బృందంలో మా నుంచి సాయం పొందినవాళ్లూ, మా సాయం గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందినవాళ్లూ.. ఇలా ఎందరో భాగమైపోయారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతిచోటా మా బృందాలు ఉన్నాయి. మంచివైపు మనం ఒక అడుగు వేస్తే చాలు మనతో ఎంత దూరమైనా నడిచే వ్యక్తులు ఉంటారనడానికి ఇదే నిదర్శనం. ఇదే సమయంలో నన్ను విమర్శించినవాళ్లూ ఉన్నారు. అయితే వాళ్లకి సంజాయిషీ ఇస్తూ కూర్చునే బదులు ఆ టైమ్‌లో మరికొందరికి సాయపడవచ్చనే ఉద్దేశంతో వాళ్లని పట్టించుకోవడం మానేశాను. తర్వాత వాళ్లలో కొందరు తమ మనసు మార్చుకుని మాతో కలిసి పనిచేసినవాళ్లూ ఉన్నారు.

కోట్ల మందికి ఉపాధి

సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి మొదటిసారి వచ్చినపుడు రైల్లో అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌తో వచ్చా. ఈరోజు నేను ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నా. రెండు దశాబ్దాల కెరీర్‌లో నటుడిగా వివిధ భాషా చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించాను. కానీ, నిజ జీవితంలో, నిజమైన సమస్యకు స్పందించడమే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర. దీనికోసమే ముంబయి వచ్చానేమో అనిపిస్తుంటుంది. కొవిడ్‌కు ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశా కానీ ఈ అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే మనం చేసిన సాయం ఒక వ్యక్తికే కాదు, వారి కుటుంబానికీ, ఓ తరానికీ మంచి భవిష్యత్తుని ఇస్తుంది. అందుకే ఫౌండేషన్‌ పనులు మరింత చురుగ్గా చేపడుతున్నా. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన… ఈ విభాగాల్లో వివిధ కార్యక్రమాల్ని ప్రారంభించాం. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లకీ, యువతకూ ఉపాధి కల్పించే ఉద్దేశంతో గతేడాది ‘ప్రవాసి రోజ్‌గార్‌’ ఆప్‌ తెచ్చాం. దీనిద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. వచ్చే నాలుగైదేళ్లలో 10 కోట్ల మందికి ఉపాధి చూపాలన్నదే మా లక్ష్యం. వైద్య చికిత్సలకు ఇబ్బంది పడేవాళ్లకి ఆర్థికంగా సాయపడేందుకు ‘ఇలాజ్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ఈ ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. దీనిద్వారా ఇప్పటికే వందల మందికి వైద్యం అందించాం. యువత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటే సమాజంలో మార్పు తేవచ్చనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యేవాళ్లకు ‘సంభవం’ పేరుతో శిక్షణా స్కాలర్‌షిప్‌లు మొదలుపెడుతున్నాం. ఇప్పటికే వీటికోసం లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా ఏటా 100 మంది అధికారులుగా వచ్చినా ఎంతో మార్పు తేవచ్చు. ముఖ్యంగా అవినీతిని అంతమొందించేందుకు ఇది సాయపడుతుంది. ఎందుకంటే ఇలాంటివారు నీతినిజాయతీలతో పనిచేస్తారనేది నా నమ్మకం. ఇంతమందికి సాయం చేయడానికి నా దగ్గర వనరులు లేవు. నాకు అలాంటి అనుభవమూ లేదు. కానీ సాయం పొందినవారి ముఖాల్లో నవ్వూ, వారి మాటల్లో ఆనందం చూస్తే- ఇంతకు పదింతల సాయం చేయాలన్నంత ఉత్సాహం కలుగుతుంది. సూద్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాల్ని నా తర్వాత కూడా మా కుటుంబం కొనసాగించేలా చూస్తా.

తెలుగింటి ఆడపడుచు…

నా ప్రయాణంలో నా భార్య సొనాలీది కీలక పాత్ర. గత 15-16 నెలలుగా రోజూ దాదాపు 24 గంటలూ ఫౌండేషన్‌ తరఫునే పనిచేస్తున్నా. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు రెండుమూడు గంటలే నిద్రపోయేవాణ్ని. అయినా సొనాలీ నుంచి నాకు పూర్తి మద్దతు దొరికింది. సొనాలీ మహారాష్ట్రలో పెరిగిన తెలుగమ్మాయి. వీరి పూర్వికులు పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందినవాళ్లు. ఇంటిపేరు పసుపులేటి. వీళ్ల తాతయ్య మొదట హైదరాబాద్‌కీ, అక్కణ్నుంచి ముంబయికి వలస వచ్చారు. సోనాలీ తండ్రి ఆర్బీఐ ఉద్యోగి. వీరి కుటుంబం నాగ్‌పుర్‌లో స్థిరపడింది. నేను నాగ్‌పుర్‌లో ఇంజినీరింగ్‌ చేశాను. తను అక్కడ మీడియా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసేది. ఒక ఫ్యాషన్‌ షోలో మాకు పరిచయమైంది. స్నేహితులుగా అందరికీ తెలుసు. అప్పటికి ఇద్దరం టీనేజర్లం. రోజూ తనకో గ్రీటింగ్‌ కార్డు కొనిచ్చేవాణ్ని. చివరికోరోజు ప్రపోజ్‌ చేశా. ‘నువ్వు మంచి అబ్బాయివని తెలుసు. కానీ నాకు కొంత సమయం కావాలి’ అని చెప్పింది. తర్వాత తను ఎంబీఏ చేసి ముంబయిలో ఉద్యోగం చేసేది. మేం 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాం. నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు తనకు అభ్యంతరం లేదు కానీ, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తుచేస్తుంటుంది. ఇద్దరం షిర్డీసాయి భక్తులం. ఆధ్యాత్మిక విషయాల్నీ మేం మాట్లాడుకుంటాం. షూటింగ్‌ల పనిమీద నేను బయటకు వెళ్లినపుడు ఇంటి పనులు తనే చూసుకుంటుంది. ఇంట్లో అందరూ ఫోన్‌ తక్కువగా వాడాలనే నియమం పెట్టుకున్నాం. తను అందరినీ గమనించి హెచ్చరిస్తుంటుంది. పిల్లలతో కలిసి ఏడాదికోసారైనా టూర్‌కి వెళ్తాం. ఇది కాకుండా తరచూ మా సొంతూరు మోగాకి వెళ్లి వస్తుంటాం. ఇవన్నీ తనే ప్లాన్‌ చేస్తుంది. అంతేకాదు, అందరం కలిసి గార్డెనింగ్‌ చేయడం, సరదాగా బయటకు వెళ్లి పానీపూరి తినడంలాంటి పనులకూ సమయం కేటాయించేలా చూస్తుంది.

వాళ్లే నాకు నేర్పుతారు!

మా పెద్దబ్బాయి ఇషాన్‌… ప్లస్‌టూ పూర్తిచేశాడు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరనున్నాడు. విదేశాల్లో బిజినెస్‌ స్టడీస్‌ చేయాలనేది వాడి ఆలోచన. దాంతోపాటు థియేటర్‌ ఆర్ట్స్‌లోనూ చేరతాడు. చదువు పూర్తయ్యాక వాడికి ఇష్టమైన రంగంలోకి వెళ్తాడు. చిన్నబ్బాయి అయాన్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. వాడికి క్రికెట్‌ అంటే ఇష్టం. మా పిల్లలకి టైమ్‌ ప్రాధాన్యత చెబుతాను. నా అనుభవాలూ, కెరీర్‌ కోసం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరిస్తాను. అవే పాఠాలు వాళ్లు నేర్చుకోవడానికి మళ్లీ అంత సమయం తీసుకోకుండా జాగ్రత్త పడతారని ఇవన్నీ చెబుతా. కొవిడ్‌ సమయంలో సాయం కోసం ఎవరైనా మెసేజ్‌లు పంపితే, పిల్లలు వాటిని నాకు పంపేవారు. సానుభూతి, మంచితనం, కష్టపడి పనిచేయడం లాంటి విషయాల్ని వారు ఈ ఏడాదిలో చాలా దగ్గరగా నేర్చుకున్నారు. కోట్లు ఖర్చుపెట్టినా వాళ్లు బయట ఇలాంటి పాఠాలు నేర్చుకోలేరేమో. షూటింగ్‌ పనిమీద హైదరాబాద్‌, లేదంటే మరోచోటికి వెళ్లినపుడు ఇంటికి ఎవరైనా సాయం కోరి వస్తే వాళ్లే అప్పటికప్పుడు స్పందిస్తారు. నేనెప్పుడూ పిల్లలను కోప్పడను. ఓ మంచి మాటతో వారిని ఆలోచనల్లో పడేస్తాను. నేను నేర్పడమే కాదు, వాళ్లూ నాకు ఎన్నో విషయాలు నేర్పుతారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం గురించి వాళ్ల దగ్గరే టిప్స్‌ తీసుకుంటా. ఫొటోలు ఎడిట్‌ చేయడం, క్యాప్షన్లు పెట్టడం లాంటివి చెబుతారు. పిల్లలు సోషల్‌ మీడియాలో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో 24 గంటలూ పరిశీలించడం కష్టం కాబట్టి మంచీచెడూ అన్న స్పృహ వాళ్లలో కలిగేలా చూడాలి.

రెండు గంటలు వ్యాయామానికే…

సాధారణ రోజుల్లో రోజుకు 22 గంటలే అనుకుంటా. మిగతా రెండు గంటలూ వ్యాయామానికే కేటాయిస్తా. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఇంట్లో అందరికీ వ్యాయామంపైన శ్రద్ధ ఎక్కువే. ఒక్కోసారి నలుగురం ఒకేసారి జిమ్‌లో ఉంటాం. నేను బరువులెత్తుతుంటే సొనాలీ ట్రెడ్‌మిల్‌ చేస్తుంటుంది, ఇషాన్‌ పుషప్స్‌ తీస్తుంటే, అయాన్‌ ఏదో ఒక వర్కవుట్‌ చేస్తుంటాడు. ఇషాన్‌ నాతోపాటు కష్టమైన వర్కవుట్‌లు చేస్తుంటాడు. నాతోపాటు కిక్‌ బాక్సింగ్‌ క్లాసులకి వస్తుంటాడు. వాణ్ని చూస్తుంటే ‘నిన్నమొన్న పుట్టాడే అప్పుడే ఇవన్నీ చేస్తున్నాడు’ అనిపిస్తుంది. చిన్నబ్బాయితో క్రికెట్‌ ఆడతాను. వాడు వాళ్ల స్కూల్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కూడా.

అదొక్కటే కోరుకుంటున్నా…

చాలామంది తమ పిల్లలకు నా పేరు పెట్టుకుంటున్నారు, కొందరు తమ సంస్థలకూ, దుకాణాలకీ పెడుతున్నారు. గుళ్లు కట్టినవాళ్లూ ఉన్నారు. ఓ విమానంపైనా నా ఫొటో పెట్టారు. ఇవన్నీ చూసినపుడు నేను మరింత అణుకువగా ఉండాలనీ, నా బాధ్యత మరింత పెరిగిందనీ అనిపిస్తుంది. ఇంకొందరికి సాయపడే శక్తినివ్వమని దేవుణ్ని ప్రార్థిస్తాను. ఒక్కోసారి అమ్మానాన్న గుర్తొస్తారు. వాళ్ల చలవే ఇదంతా అనుకుంటా. అమ్మ పదిహేనేళ్ల కింద సినిమాల్లో నా సక్సెస్‌ చూడకముందే చనిపోయింది. నాన్న చనిపోయి రెండేళ్లవుతోంది. వాళ్లది పెద్ద వయసు కాకపోయినా, మమ్మల్ని ముందే విడిచి వెళ్లిపోయారు. వాళ్లుంటే ఇంకా సంతోషించేవారు. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒకటే… కరోనా సమయంలో చాలామంది తమ ప్రాంతాల్లో సేవాపథంలో తొలి అడుగులు వేశారు. వాళ్లని ఎందరో అనుసరించారు. వీరంతా తమ సేవా కార్యక్రమాల్ని ఇకముందూ కొనసాగించాలి. కొవిడ్‌ కాకపోతే మరొకటి.. ఏదో ఒక సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలి. దీని ప్రభావం ఎంతో ఉంటుంది. ఆ ఫలాలు ఈతరానికే కాదు, భవిష్యత్తు తరాలకూ అందుతాయి.*

378b604f-cbfb-4a88-abc7-5cd2ffb7c91b