రవిబాబుని తిట్టేద్దామనుకున్నా!
ప్రాణం పెట్టే అమ్మానాన్నల చాటున హాయిగా సాగే జీవితం ఆ కుర్రాడిది. కానీ పదో తరగతిలోనే నాన్న మరణం అంతా తలకిందులు చేసింది. పదహారేళ్లకే ఇంటికి పెద్ద దిక్కయ్యాడు, కుటుంబాన్ని నడిపించాడు. చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలే ప్రేరణగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. మాటలూ, పాటల రచయితగా పేరు తెచ్చుకున్నాడు. ‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాలకు సంభాషణలు అందించిన ఆ రచయిత లక్ష్మీ భూపాల్ కథ ఇది!!
సీన్ 1… సినిమా పేరు.. ‘సోగ్గాడు’. తొలిసారి కలం పట్టిన సినిమా అది. అంతకు ముందు రచయితగా పనిచేసిన అనుభవం ఏమాత్రం లేదు. సెట్లో అడుగుపెట్టడం కూడా అదే మొదటిసారి. రాసిన తొలి సన్నివేశంలోనే ‘ప్రేమొచ్చింది’ అనే పదం చూసి ఆ చిత్ర దర్శకుడు రవిబాబుకి చిరాకొచ్చింది.‘జ్వరమొచ్చింది, కోపమొచ్చిందిలా ఈ ప్రేమొచ్చింది ఏంటి? బాలేదు.. మార్చు’ అన్నారు. తొలి సినిమా… తొలి సీన్. ఎవరైనా అయితే ‘ఓకే సార్’ అంటూ వెంటనే మార్చేస్తారు. నేను మాత్రం ‘లేదు సార్… ఇదో కొత్త ఎక్స్‌ప్రెషన్. మార్చడం కుదరదు’ అంటూ పెన్నూ పేపరూ పక్కన పడేసి వెళ్లిపోయాను.
సీన్ 2… సినిమా పేరు ‘చందమామ’. తక్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. సెట్లో 250మంది ఆర్టిస్టులు. సీన్ ఇంకా సిద్ధం కాలేదు. కృష్ణవంశీ ఏదో చెబుతున్నారు. కానీ… మనసుకు ఎక్కడం లేదు.
‘‘సార్…కథకి ఈ సన్నివేశమే మూలం. దీన్ని ఇంకాస్త బలంగా చెప్పాలి. అందుకోసం లెంగ్త్ తీసుకోవాలి’’ అన్నాన్నేను.‘‘అవసరం లేదు. ఈ సీన్‌ని త్వరగా కానిచ్చేద్దాం’’ ఆయన ఆర్డరు. కృష్ణవంశీ లాంటి దర్శకుడు చెబితే.. ‘నో’ అనడానికి ఆస్కారం లేదు. కానీ, నేను ‘‘లెంగ్త్‌లోనే చెప్పాలి… లేదంటే బాగోదు’’ అనేశాను. ‘‘ఈ సీన్ గురించి నాకు తెలుసా… నీకు తెలుసా’’ కృష్ణవంశీ స్వరం పెరిగింది. ‘‘మీ ఇష్టం సార్…’’ అంటూ సెట్లోంచి వడివడిగా వచ్చేశాను. ఈ రెండు సంఘటనలు చాలు. నా మనస్తత్వం ఏమిటో చెప్పడానికి. ఎవరికైనా తలవంచడం, మనస్సాక్షికి విరుద్ధంగా బతకడం నాకు ఇష్టంలేని విషయాలు.
మాది ఏలూరు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకుందీ అక్కడే. ఇంటర్ వరకూ సీరియస్‌గానే చదివా. ఆ తరవాతే గాడితప్పింది. కారణం… నాన్నగారి అకాల మరణం. ఆయన పేరు పెద్దిరాజు. ఆర్టీసీలో ఉద్యోగి. మాది బాగా బతికిన కుటుంబమే. అయితే నాన్న మరణంతో ఒక్కసారిగా స్క్రీన్‌ప్లే మొత్తం మారిపోయింది. సొంత ఇల్లు కూడా అమ్మేసి అద్దింట్లోకి రావాల్సిన పరిస్థితి. నాకు ఇద్దరు చెల్లాయిలు. నాన్న దూరమయ్యేనాటికి వాళ్లకి ఊహ తెలిసే వయసు కూడా రాలేదు. అన్నలా, తండ్రిలా వాళ్లని పెంచాల్సి వచ్చింది. అమ్మ కనకలక్ష్మి. నామీద నాకంటే తనకే చాలా నమ్మకం. ‘వీడేం చేసినా కరెక్టే’ అనుకునే సగటు అమ్మ.
ఉద్యోగం మానేశా
ఇల్లు గడవడం కోసం ఆ వయసు నుంచే సంపాదనలో పడ్డా. చిన్నప్పటి నుంచీ బొమ్మలేయడం అలవాటు. అది ఈ సమయంలో అక్కరకొచ్చింది. సైన్ బోర్డులు, హోర్డింగులు, బ్యానర్లు… ఇలా జీవితానికి కొత్త రంగులొచ్చాయి. ఎన్నికలొస్తే మహా బిజీ. టీవీఎస్ 50 ఎక్కి తెలుగు నేలంతా తిరిగేశా. కొన్నాళ్లకు నాన్నగారి ఉద్యోగం నాకొచ్చింది. ఆర్టీసీలో మెకానిక్‌గా చేరా. ప్రభుత్వ ఉద్యోగమే అయినా ఎక్కడో అసంతృప్తి. ‘ఇది మన ఏరియా కాదు’ అనిపించేది.
అందుకే మూడేళ్లకే ఉద్యోగం వదిలేశా. ‘బంగారంలాంటి ఉద్యోగం వదిలేశాడు’ అని అందరూ తిట్టారు, అమ్మ తప్ప. ఆ సమయంలోనే సిటీ కేబుల్‌లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ నుంచి వచ్చిన జీకేతో పరిచయం అయింది. జెమినీ, ఈటీవీల్లో ఆయన పోగ్రామ్స్ డిజైన్ చేసేవారు. ‘నెక్ట్స్ లెవెల్‌కి వెళ్లాలనుకుంటే నాతోపాటు హైదరాబాద్ వచ్చేయ్’ అన్నారు. అంతే హైదరాబాద్ వచ్చేశా. ఆయన చేసిన చాలా కార్యక్రమాలకు సహాయకుడిగా ఉన్నాను. ‘విజన్ 2020’ కోసం రాఘవేంద్రరావు కొన్ని ప్రకటనలు డిజైన్ చేశారు. వాటికీ పనిచేశా. ఓ టీమ్‌లో హేమంత్ ఆప్టే, మీర్, నేనూ ఉండేవాళ్లం. రాజమౌళి, వర ముళ్లపూడి మరో బ్యాచ్.
కోతి నుంచి ఇంకా నేర్చుకోవాలా…
మీకు గుర్తుండే ఉంటుంది. రోడ్డుపైన అరటి తొక్కలు పడేస్తే, ఓ కోతి వాటిని చెత్త కుండీలో వేసే సన్నివేశం. ‘కోతి నుంచి మనమింకా నేర్చుకోవాలా’ అనే స్లోగన్‌తో ఆ ప్రకటనను డిజైన్ చేశాం. ఆ ఆలోచన నాదే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం కూడా ఓ యాడ్ చేశా. కాస్త నిలదొక్కుకుంటున్న తరుణంలో మళ్లీ ఏలూరు వెళ్లాల్సివచ్చింది. అక్కడ రెండు నెలలు ఉండి వచ్చేద్దాం అనుకుంటే అదికాస్తా నాలుగేళ్లు పట్టింది. తిరిగొచ్చాక జీకేని కలిస్తే ‘మనం కలసి పనిచేద్దాం.. టచ్‌లో ఉండు’ అని అభయమిచ్చారు. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నా.
ఈలోగా హాస్యనటుడు లక్ష్మీపతిని కలుసుకున్నా. ‘మీరు రైటర్ కదా.. అటు వైపు ప్రయత్నాలు చేయొచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. ‘సోగ్గాడు’ సినిమా జరుగుతోంది. దానికి నివాస్ డైలాగులు రాస్తున్నారు. అందులో కొన్ని సన్నివేశాల్ని మరో రచయిత చేత రాయించుకోవాలనుకొంటున్నారు.. ప్రయత్నిస్తారా?? – అంటూ తొలిసారి ‘సినిమా’ బీజం నాటారాయన.
సినిమా… అనేసరికి ఉత్సాహం వేసింది. మర్నాడు రవిబాబు దగ్గరకు తీసుకెళ్లారు. ‘రైటర్ కావాలన్నారుగా’ అంటూ నన్ను రవిబాబుకి పరిచయం చేశారు లక్ష్మీపతి. అప్పటికి నా అవతారం కాస్త విచిత్రంగా ఉండేది. దానికి తగ్గట్టే రవిబాబు నా వంక చూసి ‘ఈడు రైటరా’ అన్నారు. దాంతో నాకు కోపం వచ్చేసింది. నన్ను ‘వీడు’ అంటే వినడానికి ఏదో ఇబ్బందిగా అనిపించింది. ‘రేపు కలుద్దాం’ అని పంపించేశారు. రెండోరోజు మళ్లీ వెళ్లా, పట్టించుకోలేదు. మూడోరోజు సెట్‌కి వెళ్తే… అసలు అక్కడ షూటింగే లేదు. అర్జెంటుగా రవిబాబు నంబరు కనుక్కుని ఫోన్ చేసి తిట్టేద్దామని డిసైడయ్యా. సహాయకుడు ప్రతాప్ నంబరు దొరికితే కాల్ చేశా. ‘మీ కోసం వెదుకుతుంటే, ఎక్కడికి వెళ్లిపోయారు. అర్జెంటుగా రామానాయుడు స్డూడియోకి రండి. రవిబాబు వెయిటింగ్’ అనేసరికి కోపం ఎగిరిపోయింది. వెంటనే స్డూడియోకి వెళ్తే, రవిబాబు ఓ సన్నివేశం అప్పగించారు. పరుచూరి బ్రదర్స్, నివాస్ అప్పటికే రెండు వెర్షన్‌లు రాశారు. ‘ఇలాకాకుండా కొత్తగా రాయి’ అంటూ ఆ సీన్ పేపర్లు చేతిలో పెట్టారు. నిజానికి అసలు ఓ సినిమా కోసం డైలాగులు ఎలా రాస్తారూ, ఆ పద్ధతేంటీ అన్నది అప్పటికి తెలీదు. వారిద్దరూ రాసిన సీన్ పేపర్ చూశాకే అర్థమైంది. గంటలో సీన్ రాసి పట్టుకెళ్లా.
అది చదివి… ‘ఊ’ అంటూ వెళ్లిపోయారు. ఆ సౌండ్‌కి అర్థమేంటో తెలీలేదు. ఇంతలో ప్రతాప్ వచ్చి.. ‘ఇక నుంచీ మా టీమ్‌లో నువ్వూ ఒకడివి’ అనేంత వరకూ టెన్షన్ తగ్గలేదు. అలా.. ‘సోగ్గాడు’తో రచయితగా నా ప్రయాణం మొదలైంది.
ఎఫ్.ఎమ్.లో పనిచేశా
‘సోగ్గాడు’తో రైటర్‌ని అయిపోయినా తెరపైన నా పేరు పడలేదు. నేను ఆ సినిమాకి పనిచేసినట్టే ఎవరికీ తెలీదు. ఆ సమయంలో ‘సంభవామి యుగే యుగే’ కోసం పిలుపొచ్చింది. తెరపైన నాపేరు చూసుకుంది ఈ సినిమాతోనే. ఆ తరవాత రెండేళ్లలో డజను సినిమాలు రాసేశా. దర్శకుడు ఎవరూ… రెమ్యునరేషన్ ఎంతా… అనే విషయాలేం పట్టించుకోలేదు. మరోవైపు ఎఫ్.ఎమ్‌లో పని చేసేవాణ్ణి. ‘మేనేజర్ మాణిక్యం’, ‘బేబీ మమ్మీ’, ‘చంటీ బంటీ’లాంటి కార్యక్రమాలు బాగా పేలాయి. అవే నా జీవితాన్ని మలుపు తిప్పాయి కూడా.
వజ్రోత్సవాలు జరుగుతున్న రోజులవి. అందుకోసం ఉత్తేజ్ కొన్ని స్క్రిప్టులు రెడీ చేసుకుంటున్నారు. ‘ఎఫ్.ఎమ్‌లో మీ కౌంటర్లు నాకు బాగా నచ్చాయి.. నాకో స్కిట్ రాస్తారా’ అని అడిగారు. రాసిచ్చాను. కానీ సమయాభావంవల్ల వాటిని ప్రదర్శించలేదు. కొన్ని రోజులకి ఆయన్నుంచి పిలుపొచ్చింది… ‘ఓ సినిమాకి మాటలు రాయాలి..’ అంటే వెళ్లాను. తీరా చూస్తే… అక్కడున్నది కృష్ణవంశీ. అప్పటికి ఆయన సినిమా ‘రాఖీ’ విడుదలైంది. ‘సినిమా నచ్చిందా? నీ అభిప్రాయం ఏమిటీ?’ అని అడిగారు. ‘ఎన్టీఆర్‌ని సరిగా వాడుకోలేదేమో’ అని చెప్పా.
నా నిజాయతీ నచ్చిందేమో ‘రెండు సీన్లు ఇస్తా, ట్రై చేయ్’ అన్నారు. అవి రాసిస్తే, నిర్మాత సి.కల్యాణ్‌ని పిలిచి – ‘మన సినిమాకి రైటర్ దొరికేశాడు’ అని చెప్పారు. ఆ చిత్రమే ‘చందమామ’. లక్ష్మీభూపాల్ అనే రైటర్ ఒకడున్నాడన్న విషయాన్ని సినీ ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా అది. ఆహుతి ప్రసాద్‌కి గోదావరి యాస నేనే నేర్పించా.
క్లైమాక్స్ విషయంలో నాకూ, కృష్ణవంశీకీ మధ్య భారీ చర్చ నడిచింది. చివరికి నా అభిప్రాయాన్ని గౌరవించారు. ‘శశిరేఖా పరిణయం’, ‘మహాత్మ’ చిత్రాలకూ పనిచేశా. ‘చందమామ’ తరవాత అంతటి పేరొచ్చిన సినిమా ‘అలా మొదలైంది’. ఇక, తేజ దర్శకత్వం వహించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ రచయితగా మరోసారి నా పేరు వినిపించేలా చేసింది.
మెగాఫోన్ పడతా..
‘లక్ష్మీభూపాల సినిమా థియేటర్’ పేరుతో కథాబలమున్న చిత్రాలు చేయాలని వుంది. ప్రస్తుతం అందుకు తగిన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నిర్మాతగానూ నిరూపించుకున్న తరవాత దర్శకత్వం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. నందినీరెడ్డి కథ అందించిన ‘మా ముగ్గురి లవ్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌కి సంభాషణలు అందించా. అందులో ఓ పాట కూడా రాశా. పరిశ్రమలో ఏముహూర్తాన అడుగుపెట్టానో, ఇప్పటి వరకూ ఒక్కరోజు కూడా ఖాళీగా లేను. భవిష్యత్తు గురించి పెద్ద పెద్ద కోరికలేం లేవు. ఈ లైఫ్ ఇలా సాగిపోతే చాలు.
కృష్ణవంశీ పెట్టిన పేరునా అసలు పేరు ఎతిరాజ్. భూపాల్ ఇంటి పేరు. ‘సంభవామి యుగే యుగే’లో ఎతిరాజ్ లక్కీభూపాల్ అని పడింది. ‘లక్కీ’ అమ్మ పేరన్నమాట. ‘చందమామ’ సమయంలో ‘ఎతిరాజ్ లక్కీ భూపాల్’ పేరు ఉత్తరాది వాడిలా ఉంది… అంటూ ‘లక్ష్మీభూపాల్’గా మార్చేశారు వంశీ. * ‘చందమామ’కి దాదాపుగా ఓ సహాయ దర్శకుడిగా పనిచేశా. ‘ట్యూన్ వచ్చింది.. పాట రాలేదేంటి?’ అని వంశీగార్ని విసిగించేస్తే.. ‘రాకపోతే నువ్వే రాసేసేవాడిలా అలా హడావుడి చేస్తావేం’ అని నన్ను రెచ్చగొట్టారు. ‘పాట రాయలేనా’ అన్నాను. ‘అయితే రాసేయ్’ అన్నారు. గంటలో ‘సక్కు బాయినే’ పాట రాసేసి ఇచ్చేశా. అలా ఆయనే నన్ను గీత రచయితని చేశారు. ‘జజ్జనక జజ్జనక’(మహాత్మ), ఏదో అనుకుంటే (అలా మొదలైంది), ‘నువ్‌నా తెల్ల పిల్ల బుజ్జిపిల్లా’ (పోటుగాడు), ఏజన్మ బంధమో (కల్యాణ వైభోగమే) పాటలు సంతృప్తినిచ్చాయి. కల్యాణ వైభోగమే సినిమాకి అన్ని పాటలూ నేనే రాశా. * శ్రీశ్రీ, త్రిపురనేని గోపీచంద్, బుచ్చిబాబు, చలం, రావిశాస్త్రి, రావూరి భరద్వాజ, తిలక్… వీళ్లు రాసిన పుస్తకాలన్నీ స్కూల్ రోజుల్లోనే చదివేశా. భగవద్గీత బట్టీ పట్టేశా. ఇంటర్‌లో బైబిల్ పూర్తి చేశా. ఆ తరవాత తెలుగు ఖురాన్ చదివా. పరిశ్రమకొచ్చాక పుస్తకాలు తగ్గి మనుషుల్ని చదవడం ఎక్కువైంది. * చెల్లాయిల చదువులూ, కెరీర్ వ్యాపకాల్లో పడి నాదంటూ ఓ సొంత జీవితం ఉంటుందనే విషయం మర్చిపోయా. అందుకే ఇంత వరకూ పెళ్లి చేసుకోలేదు. చూద్దాం… ఆ కల్యాణ వైభోగం ఎప్పుడో! * కమల్‌హాసన్ అంటే చాలా ఇష్టం. సముద్రాల, పింగళి, ఆత్రేయ, ముళ్లపూడి… వీళ్లంతా కూడా నాకు ఇష్టులే. జంథ్యాలతో గొప్ప రచయితల తరం ఆగిపోయింది. త్రివిక్రమ్ ఓ మ్యాజికల్ రైటర్. |