Comedian Priyadarsi

‘పెళ్లి చూపులు’కి పిలవకున్నా వెళ్లా!

‘నా సావు నే సత్తా నీకెందుకు?’ అని ‘పెళ్లిచూపులు’తో మొదలుపెట్టి వరసగా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని నవ్విస్తూ వచ్చిన హాస్యనటుడు ప్రియదర్శి పులికొండ. హాస్యానికి కేరాఫ్‌ అడ్రెస్‌గా మారిన ప్రియదర్శి… ‘మల్లేశం’లో తొలిసారి తనలోని ఆల్‌రౌండ్‌ నటనని చూపాడు. గత మూడేళ్లలో 30కి పైగా సినిమాలు చేసిన దర్శి… తన సినిమా కష్టాలూ, జ్ఞాపకాలూ, అనుభవాల్ని మనతో పంచుకుంటున్నాడిలా…

పదో తరగతి పూర్తయ్యాక అందరిలాంటి సమస్యే నాకూ వచ్చింది…

‘ఏ గ్రూప్‌ తీసుకోవాలి’ అని. నేనేమో సైన్స్‌, మ్యాథ్స్‌లో యావరేజీ కూడా కాదు పూర్‌. అందుకే ఇంటర్మీడియెట్‌లో సీఈసీ చేద్దామనుకున్నా. కానీ ఆర్ట్స్‌ చదువు అంటే అదో నేరం చేసినట్లు భావిస్తారు కదా మనవాళ్లు. దాంతో ఎంపీసీలో చేర్పించారు. ఎన్నో డింకీలు కొట్టి చివరకు ఇంటర్‌ పాసయ్యాను. మనకి ఎంసెట్‌లో ర్యాంకు ఎక్కడొస్తుంది… నేను ఊహించినట్లే రాకపోయేసరికి ‘హమ్మయ్యా’ అని ఊపిరి పీల్చుకున్నా. డిగ్రీలోనైనా ఆర్ట్స్‌లో చేరతానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. దాంతో బీఎస్సీ స్టాటిస్టిక్స్‌లో చేరాను. స్టాటిస్టిక్స్‌ లెక్కలకి తమ్ముడు. కాబట్టి నా కష్టాలు అక్కడా కొనసాగాయి. ఇంట్లోవాళ్ల గోల భరించలేక ఎలాగోలా డిగ్రీ పూర్తిచేశాను. ఆ తర్వాత ఎంతో ధైర్యం కూడగట్టుకుని ‘ఈ సైన్స్‌ చదువులు నా వల్లకాదు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టీవీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌టీఐఐ)లో చేరి సినిమాటోగ్రఫీ కోర్సు చేస్తా’ అని ఇంట్లో చెప్పాను. అమ్మానాన్నా ఓకే అనేసరికి ఎగిరిగంతేయలేదు కానీ, మనసులో అదే ఫీలింగ్‌ వచ్చింది. నాన్న సుబ్బాచారి… కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేసి ఈమధ్యే రిటైరయ్యారు. అమ్మ జయలక్ష్మి ఓల్డ్‌ బి.ఎ. చెల్లి నగజ చదువుల్లో టాపర్‌. ప్రస్తుతం ‘నావల్‌ కమాండర్‌’గా పనిచేస్తోంది. ఇంతమంది చదువర్ల మధ్య నాకు మాత్రం చదువు మీదకంటే సినిమాపైనే ఇష్టం ఏర్పడింది. ఆ మాట ఇంట్లో చెబితే ఎక్కడ కోప్పడతారో అని, సినిమాటోగ్రఫీ అయితే, కొంతవరకూ ఓకే చెబుతారని అలా చెప్పాను. అలాగైనా సినిమాల్లోకి వెళ్లొచ్చని నా ఆశ. కానీ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రాలేదు. దాంతో ఏం చేయాలో తోచలేదు. అప్పుడే కమ్యునికేషన్స్‌లో పీజీ చేయమని సూచించారు నాన్న. కాస్త కష్టపడి హైదరాబాద్‌్ సెంట్రల్‌ యూనివర్సిటీలో కమ్యూనికేషన్స్‌ అండ్‌ జర్నలిజంలో సీటు సంపాదించాను. టెన్త్‌ తర్వాత ఇష్టంగా క్లాస్‌రూమ్‌కి వెళ్లింది అక్కడే. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకెన్నో అనవసరమైన విషయాల్ని బుర్రలోంచి డిలీట్‌ చేశాను. అక్కడికి వెళ్లాక ప్రపంచాన్ని చూసే కోణం మారింది. సినిమా మీద మరింత ఇష్టం ఏర్పడింది. నన్ను నేను సరికొత్తగా మలచుకోవడానికి ఆ వాతావరణం బాగా ఉపయోగపడింది.

డైరెక్టర్‌ అవ్వాలనుకున్నా!
2011లో పీజీ పూర్తయింది. నా అసలు లక్ష్యం ‘సినిమా’. అందుకే పీజీ అయ్యాక భిక్షు, అరుణ భిక్షుల దగ్గర ప్రత్యేకించి మూడు నెలలు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. వీళ్లు పీజీలో నాకు ప్రొఫెసర్లు కూడా. ఆ శిక్షణ తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ఓ అయిదేళ్లు ప్రయత్నించాలని లక్ష్యం పెట్టుకున్నాను. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇంటర్నెట్‌లో సినిమా సమాచారం ఎక్కువగా చదివేవాణ్ని. ఫేస్‌బుక్‌లో కూడా సినిమావాళ్లతో టచ్‌లో ఉండేవాణ్ని. మేమపుడు చందానగర్‌లో ఉండేవాళ్లం. ఆడిషన్స్‌ ఉన్నాయంటే ఫిల్మ్‌నగర్‌, కృష్ణానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌… ఇలా నగరంలో ఎక్కడికైనా వెళ్లిపోయేవాణ్ని. కొందరు మొహంమీదే ‘నీకు ఛాన్స్‌లేదు’ అని చెప్పేవాళ్లు. ఇంకొందరు ‘ఫోన్‌చేసి చెబుతాం’ అనేవాళ్లు. ఒక్కోసారి ‘క్యారెక్టర్‌ ఉంది, ఫలానా రోజు రండి’ అని చెప్పేవాళ్లు. తీరా వెళ్తే పెద్ద గ్రూప్‌లో ఏదో ఒక మూలన నిల్చొనే పాత్ర దొరికేది. అది కూడా వంద ప్రయత్నాలు చేస్తే ఒక ఛాన్స్‌ వచ్చేది. సాయంత్రానికి ఐదొందలో, వెయ్యో చేతిలో పెట్టేవారు. దానికే నేనెంతో హ్యాపీగా ఫీలైపోయేవాణ్ని. 2012-13 ప్రాంతంలో షార్ట్‌ఫిల్మ్స్‌ ట్రెండ్‌ బాగా ఊపందుకుంది. ఆ ప్రభావం నామీదా పడింది. అలా నాకు నగరంలోని షార్ట్‌ఫిల్మ్స్‌ సర్కిల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ దశలో తరుణ్‌ భాస్కర్‌, విజయ్‌ దేవరకొండ, రాహుల్‌ రామకృష్ణ, సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌లతో స్నేహం ఏర్పడింది. నేనూ రెండు షార్ట్‌ఫిల్మ్స్‌ తీశాను. మొదట దర్శకత్వం అనుకొని వచ్చిన నాకు నటనలో కిక్‌ ఉందనిపించింది. కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించాను. వాటిలో తరుణ్‌ భాస్కర్‌ తీసిన ‘జునూన్‌’ ఒకటి. ఈ పదానికి అర్థం ‘ఇష్టం’ ‘పిచ్చి’ అని. ‘అది లేకపోతే ఏదీ సాధించలేం’ అని మెసేజ్‌ ఉంటుంది అందులో. అలా నేను కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాను. క్రమంగా కాస్త ఎక్కువ నిడివి ఉన్న పాత్రలు వచ్చాయి. శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘టెర్రర్‌’లో విలన్‌గా కనిపిస్తాను. ఆ సినిమాలో పది నిమిషాల పాత్ర ఉంటుంది నాకు. నిజానికి విలన్‌ అవ్వొచ్చన్న నమ్మకం నాకు ఎక్కువగా ఉండేది… కాస్త పొడుగుంటాను కదా, ఒళ్లు పెంచితే సరిపోతాను’ అనుకునేవాణ్ని.

బిత్తిరిసత్తి పాఠాలు
తరుణ్‌, నేనూ మంచి ఫ్రెండ్స్‌ అయినా కూడా ‘పెళ్లిచూపులు’ ఆడిషన్స్‌కి పిలవలేదు. అందులో నాకు సరిపోయే క్యారెక్టర్‌ లేదనుకున్నాడు. ఆ సినిమాకి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ప్రశాంత్‌ పీజీలో నా క్లాస్‌మేట్‌. వాడు మాటల మధ్యలో ‘ఓ ట్రయల్‌ వేసిపో’ అన్నాడు. నేను ఆడిషన్స్‌కి వెళ్లేసరికి ఆశ్చర్యపోయాడు తరుణ్‌. నేనప్పటికి నలుగురిలో కాస్త కామ్‌గా ఉంటుండేవాణ్ని. చేసినవి కొన్ని పాత్రలైనా సీరియస్‌గా ఉండేవే చేశాను. ఆ కథలో సీరియస్‌ పాత్రలేవీ లేవు. అదే వాడి ఆశ్చర్యానికి కారణం. వెళ్లి ఆడిషన్‌ ఇచ్చాక, కౌశిక్‌ పాత్రకి నన్ను ఎంపికచేశారు. ఆ స్క్రిప్టు విన్నవాళ్లందరూ ‘కౌశిక్‌ పాత్రని ఎవరు చేస్తారా’ అని ఆసక్తిగా చూస్తుండేవారు. దానికున్న ప్రత్యేకత అలాంటిది. చివరకు అది నాకు దక్కింది. చిన్నపుడు కొన్నాళ్లు పాతబస్తీలో పెరిగాను. హైదరాబాద్‌ శైలి భాష బాగా తెలుసు కానీ తెలంగాణ మాండలికం మీద పూర్తిగా అవగాహనలేదు. కౌశిక్‌ పాత్రకి అది బాగా అవసరం. సెట్‌లో సిద్ధిపేట్‌కు చెందిన అభయ్‌ అనే కుర్రాడు ఉండేవాడు. వాడితో మాట్లాడుతూ కొంత నేర్చుకున్నాను. యూట్యూబ్‌లో రోజూ బిత్తిరిసత్తి వీడియోలు చూసేవాణ్ని. దాంతో భాషతో పాటు బాడీలాంగ్వేజ్‌ కూడా కొంతవరకూ తెలుసుకోగలిగాను. ఆ సినిమా నెలరోజుల్లో పూర్తయిపోయింది. అంతా స్నేహితులమే, ఆడుతూపాడుతూ చేసుకున్నాం. కానీ షూటింగ్‌ పూర్తయి నెలలు గడుస్తున్నా సినిమా రిలీజ్‌ కాలేదు.  సినిమా రిలీజయ్యాక మాత్రం షోలమీద షోలు పడుతున్నాయి. ఫోన్లమీద ఫోన్లు వస్తున్నాయి. అందులోని ‘నా సావు నే సత్తా…’ డైలాగు యూత్‌లో పాపులర్‌ అయింది. ఈ సినిమాతో అయిదేళ్ల కష్టం ఫలించింది. తర్వాత వరసగా ఆఫర్లు వచ్చాయి. చేతిలో డబ్బుల్లేక పెళ్లిచూపులు షూటింగ్‌ తర్వాత కూడా కొన్ని పెళ్లి వీడియోలు తీసి ఎడిటింగ్‌ చేసేవాణ్ని. ఆ సినిమా తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకున్నాను. పెళ్లిచూపులు రిలీజ్‌కు ముందే ‘స్పైడర్‌’కి ఆడిషన్‌ ఇచ్చాను. రిలీజ్‌ తర్వాత మురుగదాస్‌గారు ఓరోజు హైదరాబాద్‌ వచ్చారు. ‘ఏ సినిమా చేశావ్‌’ అన్నారు. ‘పెళ్లిచూపులు’ అన్నాను. ‘ఓహ్‌ పెద్ద హిట్‌ కదా, ఇంకేం, వచ్చేసేయ్‌’ అన్నారు. అలా 2016లోనే సూపర్‌స్టార్‌ మహేష్‌, స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌లతో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా అంతగా ఆడకపోయినా నాకు మాత్రం చాలా పాఠాలు నేర్చుకునే అవకాశం ఇచ్చింది. అర్జున్‌రెడ్డి, ఉన్నది ఒకటే జిందగీ, జై లవ కుశ, తొలిప్రేమ, అ, ఎంసీఏ, ఎఫ్‌2… మూడేళ్ల వ్యవధిలో దాదాపు 30 సినిమాల్లో నటించా.

మల్లేశం ఓ మైలురాయి…
వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాను. కొన్ని పాత్రలకు గుర్తింపు వచ్చింది. మరికొన్ని నాకే గుర్తులేవు. భిన్నమైన పాత్రలు చేస్తున్నప్పటికీ హాస్యనటుడిగానే గుర్తింపు ఉంది. ఈ దశలో ‘మల్లేశం’ రూపంలో నాకు ఓ వరం లభించింది. నా జీవితంలో మైలురాయి లాంటి సినిమా ఇది. ఆసు యంత్రం కనిపెట్టిన చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవితకథ ఇది. నేనేదో హీరో అయిపోదామని ఈ సినిమా చేయలేదు. నేనైతే ఈ పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి డైరెక్టర్‌ రాజు నా దగ్గరకి వచ్చారు. ‘మీకు నమ్మకం ఉంది కదా’ అని ఒకటికి రెండుసార్లు అడిగాను. ఆయన ‘పక్కా’ అన్నారు. కథ విన్నాక ఇలాంటి కథ బయట ప్రపంచానికి తెలియాలి అనిపించింది. ఎందుకంటే మల్లేశంది ఒక స్ఫూర్తిమంతమైన జీవితం. ఆయన గురించి బయట ప్రపంచానికి తెలీదు కాబట్టి ఆయన్ని అనుకరించకుండా నాదైన శైలిలో చేయమని డైరెక్టర్‌ చెప్పారు. కానీ ఎంతైనా ఆయన కథ కదా! శరీరం నాదే అయినా ఆత్మ ఆయనది ఉండేలా చూడాలనుకున్నాను. షూటింగ్‌ ప్రారంభానికి ముందు ఆయన్నీ ఆయన కుటుంబ సభ్యుల్నీ దగ్గరుండి పరిశీలించాను. ఆయన టెడెక్స్‌ టాక్‌ని ఓ వెయ్యిసార్లు చూసుంటాను. ఈరోజుకీ కూడా మల్లేశం ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కుర్చీలో కూర్చునేటపుడు నడుము వెనక్కి వాల్చడు. అలాగే మగ్గం నేసే చోట రోజంతా కూర్చొని చూశాను. మగ్గం పనిలో ఉండే ప్రాథమిక విషయాలు నేర్చుకున్నాను. పోచంపల్లి, రేవణ్‌పల్లి వెళ్లి చేనేత కార్మికులతో మాట్లాడాను.

‘బ్రోచేవారెవరురా’ నా కెరీర్‌లో మరో విజయవంతమైన సినిమాగా నిలుస్తుందని ముందే తెలుసు. ప్రస్తుతం నానీ ‘గ్యాంగ్‌లీడర్‌’తోపాటు శర్వానంద్‌ సినిమాలోనూ నటిస్తున్నాను. నవరసాలూ పండించగలిగే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యం. సినిమాల్లోకి వచ్చాక నా జీవన విధానంలో మార్పులేమీ రాలేదు. షాపింగ్‌కి వెళ్లి నా బట్టలు నేనే కొనుక్కుంటా. బయట మామూలుగా తిరుగుతా. కాకపోతే ఇదివరకు నేనే సెల్ఫీలు దిగేవాణ్ని, ఇప్పుడు ఎవరో ఒకరు సెల్ఫీ అడుగుతుంటారు. అంతకుమించి మార్పేమీలేదు. టైమ్‌ దొరికితే కుటుంబ సభ్యులతో పర్యటనలకు వెళ్లడానికి ఇష్టపడతా, సినిమాలు చూస్తా, పుస్తకాలు చదువుకుంటా.

నా వెనక ఆమె…పీజీలో నా క్లాస్‌మేట్‌ రిచా శర్మ. తను పుస్తకాల పురుగు. నాకు సినిమాల పిచ్చి. దాంతో ఆ రెండేళ్లలో మేం హాయ్‌, బై అనుకునేవాళ్లం తప్పించి పెద్దగా మాట్లాడింది లేదు. తర్వాత ఫేస్‌బుక్‌లో తను ఇంగ్లిష్‌ పోయెట్రీ రాసి పెడుతుండేది. వాటికి ఫిదా అయిపోయా. తను సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చిందనిపించింది. సినిమా అవకాశాలు పెద్దగా రానపుడు తను నాలో చాలా టాలెంట్‌ ఉందని గుర్తుచేస్తూ ప్రోత్సహించేది. గతేడాది మేం పెళ్లి చేసుకున్నాం. తను రచయిత్రి. ఆంగ్లంలో ఓ నవల రాసే పనిలోఉంది. మరోవైపు టూరిజం రంగంలో స్నేహితులతో కలిసి ఒక స్టార్టప్‌ని ప్రారంభించింది కూడా.

– సుంకరి చంద్రశేఖర్‌

30 జూన్‌ 20194e578fc9-b678-4051-87b8-2445095b75b2 e80f079d-034c-4a11-b329-d075f66987a0