చింతకింది మల్లేశం.. ఆసుయంత్రం రూపకర్త. అయితే ఏంటి? భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. అందుకే సినిమా తీసేయాలా? ఓ పల్లెటూరి మనిషి జీవితంలో సినిమా తీసేంత ఏముంటుంది? అని ఆలోచించలేదు దర్శకుడు రాజ్. మల్లేశం బతుకు పోరాటంలోని స్ఫూర్తిని చూశాడతను. మల్లేశం అనుభవించిన కష్టాలను చూశాడతను. ప్రతి మనిషి జీవితంలోనూ ఉండే ఎమోషన్స్‌ను పసిగట్టాడతను. అందుకే ఓ సామాన్యుడిని ‘హీరో’గా చేస్తూ ‘మల్లేశం’ సినిమా తీశాడు. ఆ చిత్రం ఈనెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రయాణంలోని అనుభవాలను పంచుకున్నాడిలా…
చింతకింది మల్లేశం జీవితాన్ని అమెరికాలో ఉన్న మీరు ఎందుకు తెరకెక్కించాలనుకున్నారు?
రాజ్ : అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న నాకు ఓ రోజు వాట్సప్‌లో ఓ లింక్ వచ్చింది. అది నా స్నేహితుడు పంపాడు. ఆ యూట్యూబ్ వీడియో చింతకింది మల్లేశం టెడ్‌ఎక్స్‌వీడియో. ఆరోజంతా వెంటాడింది మల్లేశం జీవిత కథ! దీంతో ఆయన కథను రాయటం మొదలెట్టా (అప్పటికే 11 ఏళ్లక్రితం ఓ తమిళ సినిమాకు స్క్రీన్‌ప్లే రాసి నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్నా. మూడుకోట్ల రూపాయలు పోయి బాధలు, కష్టాలు వచ్చాయి. దీంతో అమెరికావెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నా). మల్లేశం జీవితంలో ఎన్నో సంఘటనలు మనసును కదిలించేవి ఉన్నాయి కాబట్టి సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. మార్కెట్లో వర్క్‌అవుట్ కాదని స్నేహితులు చెప్పారు. ఎవరెన్ని చెప్పినా.. నా మనసుకు ఆ సినిమా చేయాలనే అన్పించింది. దీంతో వెంటనే నా స్నేహితుడ్ని మల్లేశం ఇంటికి పంపించి విషయం చెప్పమన్నా.
‘మల్లేశం’ ఎందుకు మీకు అంతగా నచ్చాడు?
రాజ్ : ఆరోతరగతిలోనే బడి మానేసిన మల్లేశం.. ఏడేళ్లపాటు కొన్ని వందల సార్లు ఫెయిలయ్యాడు. అయినా వెనక్కితగ్గలేదు. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేశాడు. చివరికి ఆసుయంత్రం కనిపెట్టాడు. అమ్మకష్టాలు చూసి.. ఆ కష్టాల్ని అమ్మకే కాదు మరే అమ్మకూ రాకూడదనే ఆలోచనతో ఈ పనిచేశాడాయన. పద్మశ్రీ అయ్యాడు. పట్టింది వదలని ఆ తత్వమే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నా జీవితమూ అంతే. సినిమా తీయాలని కోలీవుడ్‌కి వెళ్లా. తీశా. ఫెయిలయ్యా. అయినా మళ్లీ కథలు రాసుకుంటున్నా. ఎన్ని కష్టాలొచ్చినా దర్శకుడిగా పనిచేయాలనే ఆశయం, స్ఫూర్తి మల్లేశం జీవితం నుంచే పొందా.
మీరు సినీ ప్రయాణం ఎలా మొదలెట్టారు?
రాజ్ : మాది కరీంనగర్. నేను పుట్టి పెరిగింది రామగుండంలోని ఎఫ్‌సీఐలో. మా నాన్న అకౌంట్ ఆఫీసర్. అమ్మ గృహిణి. అక్కడే ఇంటర్‌వరకూ చదివా. ‘ఓయూ’లో ఇంజినీరింగ్ చేశా. ఆర్వాత సత్యం సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశా. 1998లో అమెరికా వెళ్లా. నేను అమెరికాకి వెళ్లినపుడు అక్కడ షార్ట్‌ఫిల్మ్స్ కల్చర్ ఉండేది. మేకింగ్ గురించి ఏమీ తెలియని వాళ్లు అసిస్టెంట్‌గా పనిచేసేవారు. నేను బ్యాచిలర్‌ని కాబట్టి ఆ పనే చేశా. ఆ తర్వాత పెళ్లికావటంతో షార్ట్‌ఫిల్మ్స్ గురించి అసలే ఆలోచించలేదు. చిన్న కథలు రాస్తూ ఉండేవాణ్ణి.
మీరేమో అమెరికా… సినిమా కోసం తెలంగాణ గ్రామీణ నాడి ఎలా పట్టారు?
రాజ్ : స్క్రీన్‌ప్లేపై నమ్మకమున్నా డైలాగ్స్ మంచివి రాసుకోలేదు. అలాంటి సమయంలో రచయిత పెద్దింటి అశోక్‌కుమార్‌ను కలిశా. తర్వాత ఈ కథ మంచి స్థాయికి వెళ్లింది. నేను పుట్టిపెరిగింది తెలంగాణలో అయినా పల్లెజీవితం అనుభవించలేదు. అందుకే ఓ ఆలోచనకి వచ్చా. ప్రీప్రొడక్షన్ అంతా హైదరాబాద్‌లో కాకుండా ఓ మూరుమూల ఊర్లో చేయాలనుకున్నా. అలా నటులు, టెక్నీషియన్లంతా కలిపి నలభైమందిమి.. నాలుగైదు నెలలపాటు పోచంపల్లి పక్కన ఉండే రేవణపల్లిలో ఉన్నాం. అక్కడ మగ్గంమీద బతికే జీవితాల్ని దగ్గరగా చూశాం. ఆర్ట్‌డైరెక్టర్‌గా లక్ష్మణ్ ఏలేగారిని ఎంచుకున్నా. మగ్గం దాంతో ముడిపడిన జీవితాలు ఆయనకు తెలుసు, తెలంగాణ చరిత్ర, అనుభవం ఆయనుకుంది. సింక్‌సౌండ్ కోసం బాలీవుడ్‌లో ‘తితీ‘ అనే ఇంటర్నేషనల్ అవార్డ్ ఫిల్మ్‌కి పనిచేసిన నితిన్ లుకోజ్‌ను తీసుకున్నా. ఈ టెక్నిక్‌కే ఇరవై ఐదు లక్షలు ఖర్చుపెట్టా. కెమెరామెన్ బాలు, ఎడిటర్ రఘు.. ఇలా తెలంగాణ వ్యక్తులు కావటంతో అందరూ ప్రీప్రొడక్షన్‌లోనే సాయం చేసేవారు. చిన్న సినిమా కావటం వల్ల ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాక షూటింగ్‌కి ఐదు నెలలు పట్టింది. మల్లేశం పాత్రలో నటించిన దర్శి, అమ్మపాత్రలో నటించిన ఝాన్సీ, మల్లేశం భార్యపాత్రలో నటించిన అనన్య చేసిన హోమ్ వర్క్ అద్భుతం. ఈ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నా.