కళాతపస్వి కె. విశ్వనాథ్

sakshi k viswanadh sakshi k viswanadh 1


 

 

ఏ విజయమూ నా తలకెక్కలేదు

సరిగమల గురించి… హార్మోనియం పెట్టెకు.. నాట్యం గురించి… కాలి మువ్వలకు ఏం చెబుతాం? కె.విశ్వనాథ్‌ గురించి తెలుగువాళ్లకు చెప్పడం కూడా అంతే. ప్రేక్షకులనే భక్తులుగా భావించి.. తానో బస్సు డ్రైవర్‌గా మారి వాళ్లని ‘దేవస్థానం’లాంటి సినిమాకి తీసుకెళ్లి ‘విశ్వదర్శనం’ చేయించిన దర్శకుడు కె.విశ్వనాథ్‌. కళాతపస్వికి భక్తుడిగా ఆయనతో ‘దేవస్థానం’ సినిమా తీసి, ఇప్పుడు ‘విశ్వ దర్శనం’ అంటూ విశ్వనాథుని కథని వెండితెరపై చెప్పబోతున్న కథకుడు… జనార్దన మహర్షి. ఎందరో హీరోల్ని విశ్వనాథ్‌ ‘నటులు’గా మారిస్తే.. ఆయన్నే నటుడిగా చేసుకుని సినిమాలు తీశారు జనార్దన మహర్షి. అందుకే విశ్వనాథుని అంతరంగాల్ని ఆవిష్కరించే బాధ్యత ‘హాయ్‌’ జనార్దన మహర్షికి అప్పగించింది. ఇది ఇంటర్వ్యూ కాదు.. సందేహ నివృత్తి! ఎంతోమంది అభిమానుల మనసులో ఉన్న సందేహాలను జనార్దన మహర్షి… విశ్వనాథుని ముందుంచారు. మరి ఆయన ఏమన్నారు..

ఆ ప్రయత్నం చేయలేదు..
‘మీ శైలిలో మీ ముద్ర ఉంటూనే ఓ క్రైమ్‌ సినిమా తీస్తే బాగుంటుంద’ని చిరంజీవి అనేవాడు. కానీ నేనెప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు. తెలియని విద్య కోసం ప్రయత్నించి చేతులు కాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. నిజానికి సంగీతం, నాట్యం అనే కాన్వాస్‌ దొరకడం కూడా చాలా కష్టం. అందుకే దాన్ని వదల్లేకపోయాను. ఏదైనా ఓ గొప్ప  సినిమా చూసి ‘నేను కూడా ఇలా తీయాలి.. వాళ్లని అనుకరించాలి’ అని ఒక్కసారి కూడా అనుకోలేదు.
ఎవరెస్ట్‌ ఎక్కినప్పుడే సన్మానం
‘శంకరాభరణం’ విడుదలైనప్పుడు ఆత్రేయ గూడూరులో సన్మానం ఏర్పాటు చేశారు. ‘అప్పుడే తొందరపడొద్దండీ… శంకరాభరణం నిజంగా ఆడుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఈ ఊపు గాలివాటమేమో! కొన్ని రోజులు ఆగుదాం’ అన్నాను. కానీ ఆయన మాత్రం ‘ఎవరెస్టు ఎవరైనా ఒక్కసారే ఎక్కుతారు. అలా ఎక్కినప్పుడే సన్మానాలు చేస్తారు. అలా చేసినప్పుడు చేయించుకోవాలి.. నో చెప్పే హక్కు నీకు లేదు’ అన్నారు.
నా దగ్గర స్టాక్‌ లేదు

ఎదుటివాళ్లకు సలహా ఇచ్చే స్థాయిలో నేను లేను. ఇచ్చినా వినడం లేదు. నా మాట మనవలు, మనవరాళ్లే వినడం లేదు. ఇక బయటివాళ్లు ఎందుకు వింటారు? అలాంటప్పుడు చెప్పడంలో అర్థం ఏముంటుంది? 30 ఏళ్లొచ్చినవాడ్ని పెళ్లి చేసుకోమంటే ‘ఇప్పుడే ఎందుకు?’ అని అడుగుతున్నాడు. వీళ్లకు మనం ఏం చెబుతాం. ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటున్నారు. ఇది వరకు మన పెద్దలు ఏం చెప్పేవారు కాదు.. అయినా చెప్పినంత ఎఫెక్ట్‌ ఉండేది. మా నాన్న, మా అమ్మ నాకు ప్రత్యేకంగా ఓ పాఠంలా, వాక్యంలా నీతి బోధ చేయలేదు. వాళ్ల జీవితాలు, నడవడిక చూసి మేం నేర్చుకున్నాం. అందుకే మేం బాగున్నాం. ఈనాటి యువ దర్శకులకు ‘రక్తపాతం వద్దు’ అంటే వింటారా? అదే ఓ వ్యాపార సూత్రమైపోయింది. ఆ పాయింట్‌తోనే  సినిమాలు తీసి హిట్లు కొడుతున్నారు. ఇక వాళ్లకేం చెబుతాం? అయినా నా దగ్గర చెప్పడానికి స్టాకు ఏం లేదు.

జనార్దన మహర్షి: ప్రతి మనిషి కలలు కంటాడు. కలలుగని దాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాడు. అందులో కొన్ని ఫలిస్తాయి, ఇంకొన్ని కలలుగానే మిగిలిపోతాయి. జీవితంలో అన్నీ సాధించి, అన్ని దశల్నీ దాటి వచ్చిన మీకు ఇప్పుడు ఎలాంటి కలలు వస్తుంటాయి? ఆ కలలకు అర్థం, పరమార్థం ఏమిటి? అనేవి ఆలోచిస్తుంటారా?
విశ్వనాథ్‌: నేను సినిమాలు తీస్తూ, సినిమాలే లోకంగా బతికినప్పుడు కలలు వచ్చేవి కావు. ఎందుకంటే.. అప్పుడు అసలు పడుకునే తీరికే ఉండేది కాదు. అలాంటప్పుడు కలలకు ఆస్కారమెక్కడ? ఇప్పుడెందుకో.. విచిత్రంగా కలలు వస్తున్నాయి. ఉదయాన్నే షూటింగ్‌కి బయల్దేరుతున్నట్టు, ప్రొడక్షన్‌ వాళ్లు నాకు బండి పంపుతున్నట్లు, ‘నేను ఎవరో మీకు తెలుసా?’ అని వచ్చినవాళ్లని అడుగుతున్నట్టు.. చిత్రవిచిత్రమైన కలలు. నాకు తెలియని వ్యక్తులు కూడా కలల్లో కనిపిస్తున్నారు. నిజానికి ఒక రకమైన విసుగులోంచి ఇలాంటి కలలు వస్తాయి. నేనిప్పుడు సినిమాల గురించి ఆలోచించడం లేదు. పగటి పూట మనం ఏం ఆలోచిస్తే రాత్రిపూట అవే కలలుగా వస్తాయి. తీరని కోరికలు ఉండిపోతే.. కలలొస్తాయి. కానీ నాకు అలాంటివేం లేవు. దత్తస్వామిగారికి నా కలల గురించి చెప్పా. ‘పడుకునే ముందు మంచి సంగీతం విని పడుకోండి’ అని సలహా ఇచ్చారు.

* రాత్రి పడుకునే ముందు ప్రశాంతత కోసం మీ సినిమాలోని పాటలే వింటుంటాం. మరి.. మీరు ఎలాంటి సంగీతం వింటారు?
హిందీ పాటలు ఎక్కువగా వింటా. ఆర్డీ బర్మన్‌, ఎస్డీ బర్మన్‌ పాటలు ఎక్కువగా మోగుతుంటాయి. ప్రతి అక్షరం విని, అర్థం చేసుకుని ఆనందపడడానికి కాదు. ఓ పక్క రన్‌ అవుతుందంతే. నామ్‌ కే వాస్తే. అందుకే దాని ప్రభావం ఎంత? అనేది చెప్పలేను. ప్రతీ నిమిషం ఆ పాట గురించి ఆలోచిస్తూ, ప్రతి పదాన్నీ ఆస్వాదిస్తున్నప్పుడే అనుభూతి కలుగుతుంది. కానీ నేను అలా కాదు. పాటలు ఆన్‌ చేసి.. అలా పడుకుంటా. నిద్రపడితే పడుతుంది, లేదంటే లేదు. ఈ మధ్య పడుకోవడం బాగా తక్కువైపోయింది.

* ఓ సన్నివేశాన్ని ఎక్కడ కుదించాలో అక్కడ కుదించి, ఎక్కడ శబ్దాన్ని జోడించాలో అక్కడ జోడించి, ఎక్కడ ఏ పాత్రతో ఎంత మాట్లాడించాలో అంత మాట్లాడిస్తే ఓ మంచి సినిమా వచ్చేస్తుందని ఓ సందర్భంలో మీరే అన్నారు. మరి ఓ జీవితం సూపర్‌ హిట్‌ అవ్వాలంటే ఎక్కడ, ఏ విషయాల్ని కుదించుకోవాలి? ఎక్కడ ఎడిటింగ్‌ చేసుకోవాలి?
నా జీవితంలో ఎడిటింగ్‌, రీరికార్డింగ్‌ చేసుకోవాల్సిన పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. జీవితంలో మనం ఊహించని విపత్కర సంఘటనలు ఎదురైనప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు కలగలేదు. నా కుటుంబం కలగనివ్వలేదు. నా కుటుంబం కూడా నాతో పాటే ప్రయాణం చేసింది. నన్ను అర్థం చేసుకుంది. ‘ఇక్కడ ఇలా ఉంటేనే నయం..’ అని ఎప్పుడూ చెప్పలేదు. నా జీవితం చాలా సాఫీగా వెళ్లిపోయింది. ఎలాంటి ఒడుదొడుకులూ లేవు.

సినిమా అనేది వెండితెరపై నుంచి ప్రేక్షకుడి చేతుల్లోకి వచ్చేసింది. ఇది వరకు సినిమా చూసేవాళ్లు వెయ్యిమంది అయితే అందులో 999 మంది ప్రేక్షకులు..  ఒక్కడే విమర్శకుడు. ఇప్పుడు 999 మంది విమర్శకులే.. ఈ దశలో సినిమా తీసేవాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వాళ్లకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు?
జాగ్రత్త ఎప్పుడూ ఒక్కటేనండీ. సినిమా చూసేది వెయ్యిమంది అయినా.. ఒక్కడే అయినా.. మనం చేసే పనిపై మనకు శ్రద్ధ ఉండాలి. నిజాయతీగా చేస్తున్నామా? లేదా? అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. అన్నింటికంటే సినిమాపై భక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్న రోజున తప్పకుండా దైవానుగ్రహం మనపై ఉంటుంది. అప్పుడు ఏదీ మనకు అడ్డురాదు. మనం చేసే పని ఓడిపోదు.

* ‘సిరిసిరి మువ్వ’ నుంచి మీ గమ్యం పూర్తిగా మారిపోయింది. నాట్యం, సంగీతంపై దృష్టి పెట్టారు. ‘ఇదే నా గమ్యం’ అనుకున్నారా? లేదంటే.. దాన్ని ఓ కంఫర్ట్‌ జోన్‌గా భావించారా?
‘సిరిసిరి మువ్వ’ నుంచి ఓ బ్రాడ్‌ లైన్‌ పెట్టుకున్నా. సంగీతం, నృత్యం మృగ్యం అయిపోతున్నాయి. వాటి ప్రాధాన్యం తగ్గిపోతోంది అనే బాధ నాలో ఎక్కువగా ఉండేది. దీన్ని ఎలాగైనా పునరుద్ధరించడానికి…  ఇక్కడ పునరుద్ధరణ చాలా పెద్ద పదం అనుకుంటా. నా వంతు బాధ్యతగా ఏదైనా చేయాలి అనే ఆలోచనతో కథలు అల్లుకున్నా.

* మీ కథలకు, ఆలోచనలకు మొదటి శ్రోతగా మీ శ్రీమతి ఉండేవారని, ఎప్పుడు షూటింగ్‌కి వెళ్లినా అమ్మానాన్నల ఆశీస్సులు తీసుకుని వెళ్లేవారని చెబుతుంటారు…
శ్రీమతికి కథలు చెప్పాలన్న ఆరాటం మనకున్నా, వినే ఓపిక వాళ్లకూ ఉండాలి. అలాంటి ఓపిక ఉండే శ్రీమతి దొరకాలి. పొద్దుట నుంచి అనేకానేక పనులతో సతమతమవుతున్న భార్యని పిలిచి ‘కథ  చెబుతా ఉండు..’ అంటే కుదరదు. మరోవైపు వంట తగలడిపోతుంది. మా ఇంట్లో మాత్రం అలాంటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. బయటకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులకు దండం పెట్టి వెళ్లడం ముందు నుంచీ నాకున్న అలవాటు.

* మీ విజయాల్లో మీ స్వయంకృషి ఎంత? దైవానుగ్రహం ఎంత?
నా విషయంలో దైవానుగ్రహమే ఎక్కువ. దానికి స్వయంకృషి తోడయ్యింది అంతే. నా ఉద్దేశంలో 20 శాతం నా కష్టం.. మిగిలిన 80 శాతం.. దేవుడి కృప. నా విజయాల్లో నా కష్టమే ఎక్కువ అనుకుంటే అది పొరపాటు. నా చదువేమిటో నాకు తెలుసు. నేనేమీ రామాయణం, భారతం, భాగవతం చదవలేదు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని తయారు చేసిన కథలు కావు. అలాంటప్పుడు ఇలాంటి సినిమాలు చేయాలి? ఇలాంటి కథలు ఎంచుకోవాలి? అనే ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చినట్టు..? విద్య అయినా ఉండాలి, లేదంటే ఎక్స్‌పోజర్‌ అయినా అయి ఉండాలి. నాకు ఇవేం లేవు. కాబట్టి ఇదంతా దైవానుగ్రహం కాకపోతే ఇంకేమైనట్టు..?

* దైవానుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? పూజలు చేస్తే దేవుడు అనుగ్రహిస్తాడా?
ఇవేం చేయనవసరం లేదు. మన పనిమీద శ్రద్ధ పెడితే చాలు. ఎవరినో ఉద్ధరించడానికి అని కాకుండా, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి పనిచెయ్‌. నేనూ పూజలు చేస్తా. కానీ నా పూజెప్పుడూ దొంగపూజే. దేవుడికి దండం పెట్టుకుంటూనే ‘ఈ సన్నివేశం ఎలా తీయాలి’ అని ఆలోచించేవాడ్ని. పని గురించి ఆలోచించడం కూడా పూజే అనుకునేవాడ్ని.

* మీకు నాట్యం తెలీదు. సంగీతం తెలీదు. ఆయా వస్తువులతో గొప్ప సినిమాలు తీశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది?
సంగీతం, నాట్యం.. ఈ రెండు విషయాల్లో మాత్రం వేలు పెట్టేవాడ్ని. అలాగని నాకు సంగీతం తెలీదు. సంగీత దర్శకుల నుంచి నాకు కావల్సిన రీతిలో, నా పద్ధతిలో సంగీతం రాబట్టుకోవాలి అనే తపన మాత్రమే ఉండేది. సంగీతం రాబట్టుకోవడానికి ఓ థియరీ, ప్లాన్‌ అంటూ నా దగ్గర ఉండేవి కావు. ‘నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు’ అని ఎవరైనా అడిగితే నేనేం చెప్పను? ‘ఇంకా బాగుంటే బాగుంటుంది’ అని చెబితే వేళాకోళం అనిపిస్తుంది. కేవీ మహదేవన్‌, ఇళయరాజా లాంటి మహానుభావుల దగ్గర ఇలాంటి మాటలు మాట్లాడితే అవన్నీ వెర్రి కూతలు అవుతాయి. నృత్యం కూడా అంతే. నాకు తెలిసినంత వరకూ జోక్యం చేసుకునేవాడ్ని. వాళ్లు చాలా సహృదయంతో వినేవాళ్లు. అందుకే మంచి ఫలితం వచ్చింది.

* మీరు తీసిన చిత్రాల్లో ‘శంకరాభరణం’ శిఖరాగ్ర సమానం. ఆ సినిమా తరవాత.. మీ నుంచి ఓ సినిమా వస్తోందంటే ప్రేక్షకులు, విమర్శకులు ఓ ప్రత్యేకమైన అంచనాలతో సిద్ధమయ్యేవారు. ఆ ఒత్తిడిని మీరెలా తట్టుకునేవారు?
ఏ సినిమాకి ఆ సినిమానే అనుకునేవాడ్ని. ఓ విజయం నెత్తికెక్కితే అలాంటి భయం ఉంటుందేమో. ‘శంకరాభరణం’ విజయం నాకెప్పుడూ తలకెక్కలేదు. ‘దీనికంటే మంచి సినిమా తీయాలి’ అనే కొలతలతో ఎప్పుడూ సినిమాలు చేయలేదు. ‘శంకరాభరణం’ తరవాత వచ్చిన ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’ కూడా మామూలు సినిమాలే అనుకున్నా. శంకరాభరణం నీడ ఏ సినిమాపైనా పడలేదు. నాపై అస్సలు పడలేదు. నా విజయాలు నన్ను ప్రభావితం చేయకపోవడానికి రెండు కారణాలు ఉండి ఉండాలి. ఒకటి.. నాలో దేన్నయినా సమదృష్టితో చూడగలిగే గుణం ఉండడం. రెండోది దున్నపోతుమీద వాన పడినట్టు నేను ఎలాంటి భావోద్వేగాలకూ లోను కాని బండ మనిషినైనా అయ్యి ఉండాలి.

ఖాకీ కథ ఇది

సెట్‌లో ఖాకీ యూనిఫామ్‌ది చాలా పెద్ద కథ. సౌండ్‌ రికార్డిస్ట్‌గా ఉండి దర్శకుడ్ని అయినవాడ్ని. ఓ రకంగా తలబిరుసు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడ్ని. ఎమ్మెల్యే అయినవాడు మంత్రి అవ్వాలనుకుంటాడు. మంత్రి అయినవాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటాడు. సినిమాల్లోనూ అంతే. ఏ విభాగంలో అడుగుపెట్టినా.. చిట్టచివరి లక్ష్యం దర్శకుడి కుర్చీనే. అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నా. దర్శకుడ్ని అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయడం నాకిష్టం లేదు. నేనూ అందరిలానే మామూలు మనిషిలాగానే ఉండాలనుకున్నా. నిజాయతీగా చేసిన ప్రయత్నం. నా సెట్లో పనిచేసే  పెయింటర్స్‌, లైట్‌బోయ్స్‌, హెల్పర్స్‌..  అందరికీ ఖాకీ దుస్తులే. కాకపోతే వాళ్లకు నిక్కరు, నాకు ప్యాంటు అంతే తేడా. ‘మీరు ఖాకీ డ్రస్సు వేసుకోవడం ఏమిటండీ..’ అని మా ఆర్ట్‌ డైరెక్టర్‌ తెగ గొడవ పడేవాడు. ‘మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవరుగా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. ఓ జత రెడీ ఉన్నట్టుంటుంది’ అని చెప్పా! అది దొంగ మాటే అయినా.. అందులో కొంత నిజం  లేకపోలేదు. తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేది. నాకు తెలిసిన పాత్రికేయులు ‘మీ సినిమా కోసం రాస్తాం’ అంటుంటే.. ‘మొదటి సినిమాకి ఏం రాయొద్దు. ఎందుకంటే నా సినిమా తుస్సుమంటే మీరేం రాసినా ఉపయోగం ఉండదు. రెండు, మూడు సినిమాలు తీశాక, నాలో ప్రతిభ ఉంది అనిపిస్తే రాయండి’ అనేవాడ్ని.

118 ఏళ్లు బతకాలనుకోవాలట..జీవితం అంటే మరేదో కాదు.. జీవించడమే. ఇప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించినా, ఆలోచించకపోయినా.. ఓ భయం మాత్రం ఉంటుంది. అది మరణం గురించే. ఇలాంటి భయాలు ఉండకూడదు అని నాతో చాలా మంది చెప్పారు. ఎవరైనా సరే.. 118 ఏళ్లు బతుకుతాం అనుకోవాలట. 118వ పుట్టిన రోజున ఏం బట్టలు వేసుకోవాలి? ఎవర్ని పిలవాలి? కేక్‌ ఎలా కట్‌ చేయాలి? అనే ఆలోచనలతో బతకాలట. 90 ఏళ్లకు వచ్చేశాం.. మొత్తం జీవితం అయిపోయింది అనుకోకూడదట. పిల్లలు సెటిలైపోయారు. వాళ్ల గురించి బెంగ లేదు.  ఈ వయసులో బెంగలు విచిత్రంగా ఉంటాయి. ముని మనవడికి ఏమైనా అయితే.. మనసు తట్టుకోలేదు. వాళ్లకు జ్వరం వస్తే ధ్యాసంతా అటే ఉంటుంది.

* 70 ఏళ్ల ప్రయాణంలో సినిమాని వ్యాపారం అనుకున్నారా? కళగా చూశారా? వృత్తిగా భావించారా?
కమర్షియల్‌ ఆర్ట్‌ అనుకున్నాను. సినిమా అనేది నలుగురూ చూడాలనే కదా తీసేది. నేనెప్పుడూ కళ కోసమే సినిమాలు తీస్తున్నా అని చెప్పలేదు. కొన్ని సార్లు నిర్మాతలకు నా ఆలోచనల్ని చెప్పి ఒప్పించి సినిమా తీశా. ఇంకొన్ని సార్లు నిర్మాతలకు ఏం కావాలో తెలుసుకుని సినిమాలు తీశా. సినిమాలో ఇవి ఉండాలి.. అని అనుకుని, ఆ పద్ధతుల్లోనూ సినిమాలు తీశాం. ఎనిమిదో నెంబరు జోడు కావాలంటే.. ఆ సైజు ఉన్న నెంబరే కొనుక్కోవాలి. పదో నెంబరు, ఏడో నెంబరు పనిచేయదు. అలానే కథని బట్టి కూడా కమర్షియల్‌ హంగులు మారుతూ ఉంటాయి.

ఫొటోలు: మధు