DIRECTORS

దర్శకురాలు లక్ష్మీ సౌజన్య

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

‘రాక్షసి’, ‘మొండిది’, ‘రాతిగుండె’… వరుడు కావలెను సినిమా కథానాయిక భూమిక గురించి అందరూ అనుకునే మాటలివి! పనిలో దిగితే తననూ అలాగే అంటారంటుంది నవ యువ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య. కాకపోతే, భూమికది ప్రేమ పోరాటమైతే… ఆ పాత్ర సృష్టికర్త సౌజన్యది బతుకు పోరాటం. సినిమా కథల్ని మించిన ఆ పోరాటగాథ తన మాటల్లోనే..

11 ఏళ్లకే ఎస్‌ఎస్‌సీ పాస్‌..   బాలిక రికార్డు! – 1995లో నా గురించి వచ్చిన ఓ వార్త హెడ్డింగ్‌ ఇది. మరో పదమూడేళ్ల తర్వాత మళ్లీ నా పేరు వార్తల్లోకెక్కింది. ఈసారి విభిన్నమైన కారణంతో. దాని శీర్షిక…తండ్రికి తలకొరివి పెట్టిన తనయ -అని. సరిగ్గా ఇంకో పదమూడేళ్లకి… కొత్త దర్శకురాలితో ‘వరుడు కావలెను’ – అన్న హెడ్డింగ్‌తో మరో వార్త వచ్చింది…
ఈ మూడు వార్తలకూ అటూ-ఇటూ ఉన్నదే నా జీవితం అని చెప్పాలి. ఆ వార్తల్లో ఇమడ్చని ఎన్నో కష్టనష్టాలూ, చూసిన జయాపజయాల పడుగూపేకే నా ఈ ప్రయాణం…స్వాతంత్య్రం తర్వాత గుంటూరు కరవు మండలాల నుంచి రాయలసీమ తుంగభద్ర నది పక్కన స్థిరపడ్డ రైతు కుటుంబాల్లో… మాదీ ఒకటి. నాన్నకి ఐదేళ్లున్నప్పుడే మా తాతయ్యవాళ్లు కర్నూలు దగ్గర్లోని వెంకటాపురం అన్న గ్రామానికొచ్చారట. నాన్న అక్కడే చదువుకుని ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్టయ్యాడు. కాకపోతే 1970ల నాటి కర్నూలులోని యువకుల్లాగే అక్కడి ఫ్యాక్షన్‌ రాజకీయాలతో ఆయనకి పరిచయాలేర్పడ్డాయి. మా ఇంట్లోనూ తుపాకులూ బాంబులూ ఉండేవంటారు! ఆ తర్వాత నాన్న అవన్నీ వదిలేసి గుంటూరు నరసరావుపేటకొచ్చారు. నేను అక్కడే చదువుకున్నాను. మూడో తరగతి నుంచి నేరుగా ఐదో తరగతిలోకి, అట్నుంచటు ఏడుకి, తర్వాత ఏకంగా పదో తరగతిలోకి చేర్చుకున్నారు. ప్రత్యేక అనుమతులతో పదకొండేళ్లకే పదో తరగతి పరీక్ష రాసి పాసయ్యాను. నాన్న ప్రయివేటు ట్యూషన్‌లు చెప్పినా సరైన ఆదాయం లేకపోవడంతో పొలం పనులూ చేసేవారు. చిన్నప్పటి నుంచి నేనూ ఆ పనులన్నీ నేర్చుకున్నాను. మా అన్నయ్య నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఏదో అంతుతెలియని వ్యాధితో కాళ్లూచేతులూ పడిపోయాయట. మాటలూ రాక మంచానికే పరిమితమయ్యాడు. అమ్మా నేనే తనకన్నీ చూసేవాళ్లం. ఆడపిల్లనైనా సరే పగలూ రాత్రని చూడకుండా సైకిల్‌మీద వెళ్లి ఇంటిక్కావాల్సిన సమస్తం తెచ్చిపెడుతుండేదాన్ని. ఈ పనుల వల్లో లేక నా స్వభావమే అంతేనేమో తెలియదు కానీ మా ప్రాంతంలో నేనో మగరాయుడిలా మారిపోయాను. దానికి మొండితనమూ జతైంది. అది ఎలా మొదలైందో చెబుతాను…
వార్డెన్‌ని కొట్టేశాను…
నాన్న తనలాగే నేనూ ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడలిస్టుని కావాలని ఎంపీసీలో చేర్చారు. నాకేమో మ్యాథ్స్‌ అంటే చచ్చేంత భయం. నేను వద్దంటున్నా విన్లేదు. దాంతో లెక్కలపైనున్న భయాన్నంతా కోపంగా మార్చుకున్నాను. అప్పటికే టీనేజీలోకి వచ్చేశాను కదా… అబ్బాయిలెవరైనా వెకిలి వేషాలేస్తే చుక్కలు చూపించేదాన్ని. శ్రావణ శుక్రవారాలప్పుడు అనుకుంటా… అమ్మాయిలం అందరం ఓణీలు వేసుకుని వెళ్లేవాళ్లం. ఆ ఓణీలతో మేం నడిచి వెళ్లే అందం చూడాలనుకున్నాడేమో… మా క్లాసు తుంటరి ఒకడు మా సైకిల్‌ టైర్‌ల గాలి తీసేస్తుండేవాడు! మేం సైకిల్‌ తోసుకుంటూ వెళ్లడాన్ని సరదాగా చూస్తుండేవాడు. నాకెందుకో అనుమానం వచ్చి ఓ రోజు నిఘాపెడితే… అసలు నిజం బయటపడింది. అంతే… అసెంబ్లీలో నిలబెట్టి వాడికి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ పీకాను. మరోసారి, మా వార్డెన్‌ ఎందుకో కోపంతో నాలుక మడిచి కొట్టడానికి పైపైకి వస్తుంటే గెడ్డంకేసి గట్టిగా కొట్టాను. నోరంతా రక్తంతో నిండిపోయి విలవిల్లాడిపోయాడు. ఇలాంటివాటికి తోడు నా బుర్రకి మ్యాథ్స్‌ బొత్తిగా ఎక్కకపోవడంతో ఇంటర్‌ మొదటి ఏడాది ఫెయిలైపోయాను! ‘ఇంటికెళ్లి గేదెలు మేపుకోమ్మా’ అంటూ గేలిచేశారు అందరూ. అప్పటికి జ్ఞానోదయమై నాన్న దగ్గర బుద్ధిగా మ్యాథ్స్‌ నేర్చుకుని ఇంటర్‌ ముగించాను. ఇంతలో నాన్న నర్సరావుపేటలో నా పేరుతోనే ‘సౌజన్యా రెసిడెన్షియల్‌ స్కూల్‌’ అని పెట్టారు. ఆయనతోపాటూ నేనూ దాన్ని చూసుకోవడం ప్రారంభించాను. అందుకని డిగ్రీ కరస్పాండెన్స్‌లోనే చేశాను. ఉపాధ్యాయ వృత్తిలో తనకి తోడుగా నిలుస్తున్నానని నాన్న సంబరపడుతున్నప్పుడే… సినిమాలు నా దారిని మార్చాయి…

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

న్యూస్‌రీడర్‌గా నేను…
సినిమాలపైన మొదట్నుంచి నాకు పెద్ద ఆసక్తేమీ లేదు… ఊళ్ళో సెలవులప్పుడు నేలటికెట్టుతో పాత చిత్రాలు చూడటం తప్ప. కానీ లోలోపల నాకో దుగ్ధ ఉండేది. నాన్నకి ఉపాధ్యాయుడిగా ఎంత మంచి పేరున్నా బంధువులు ఆయన్ని బతకలేని బడిపంతులుగానే చూసేవారు. ప్రభుత్వోద్యోగులుగానూ, వ్యాపారస్తులుగానూ స్థిరపడ్డ తమకి ఆయన సాటికాదన్నట్టు ఉండేవారు. నాన్నని వాళ్ల మధ్య సగౌరవంగా నిలబెట్టాలంటే నాకు రెండే దారులు ఉన్నాయనుకునేదాన్ని. ఒకటి క్రీడలూ, రెండు…  సినిమాలు. నేను కబడ్డీ ఛాంపియన్‌ని. అటువైపు మరింతగా ముందుకెళ్లాలంటే సరైన శిక్షణా, పోషణా కావాలి. మాకు అంత డబ్బులేదు. దాంతో నా దృష్టి సినిమాల వైపు మళ్ళింది. అదీ సినిమాల్లో డైరెక్టర్‌కే అందరూ ఎక్కువగా విలువిస్తారని విని… నేనూ ఆ ఛెయిర్‌లో కూర్చోవాలనుకున్నాను. దొరికిన సినిమా పత్రికలన్నీ చదవడం మొదలుపెట్టాను.
ఓ రోజు నాన్నకి ఈ విషయం చెబితే ‘ఇదేం పిచ్చి?! మనకి అందులో ఎవరు తెలుసని…?’ అంటూ వారించాడు. ఆయన వద్దనేకొద్దీ నాలో పట్టుదల పెరిగింది. ఆరునెలల తర్వాత ‘నువ్వు రాకపోతే పో… నేను హైదరాబాద్‌ వెళతాను!’ అని బయల్దేరబోయాను. చివరికి ‘ఇంత మొండితనం పనికిరాదు’ అని తిట్టి నన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. ఆయన స్నేహితుల సాయంతో దేవదాస్‌ కనకాల యాక్టింగ్‌ స్కూల్‌లో చేర్చారు. అక్కడే యాంకర్‌ సుమతో నాకు పరిచయమైంది. మొదట్లో హాస్టల్‌లో ఉంటూ వచ్చిన నేను ఆ తర్వాత వాళ్లింట్లోకి మారిపోయాను. సుమతో కలిసి అప్పుడప్పుడూ షూటింగ్‌లకి వెళుతుండేదాన్ని. ఓ లోకల్‌ ఛానెల్‌లో న్యూస్‌రీడర్‌గా అవకాశం వస్తే చేరిపోయాను. ఆ తర్వాత ఈటీవీ, జెమిని టీవీల్లో యాంకరింగ్‌ చేశాను. అలా ఓసారి మహేశ్‌బాబునీ ఇంటర్వ్యూ చేసే అవకాశం దక్కింది. ఈ మధ్యలో దేవదాస్‌ కనకాల ఇన్‌స్టిట్యూట్‌ సాయంతో చెన్నైలోని అడయార్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వం కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత చిన్నపాటి యాడ్స్‌ తీయడం ప్రారంభించాను. ఓసారి దూరదర్శన్‌ నుంచి పిలిచి ఓ యాడ్‌ చేయమన్నారు. ‘నేను చేయాలా?’ అని మొదట్లో తటపటాయించినా ‘దర్శకత్వం అన్నాక ఆడామగా అన్న తేడా లేదు. అన్నీ చేయాల్సిందే’ అనుకుని రంగంలోకి దిగాను… ఇంతకీ వాళ్లు చేసివ్వమన్నది ఓ కండోమ్‌ యాడ్‌..!

ది బెస్ట్‌ ‘ఏడీ’…
నేను చేసిన యాడ్‌ వెలుగులోకి రాగానే ‘ఈ యాడ్‌ ఎవరో అమ్మాయి చేసిందట!’ అన్న టాక్‌ యాడ్‌ రంగంలోనే కాదు… ఇటు సినిమాల్లోనూ వ్యాపించింది. ఆ యాడ్‌ చూశాకే దర్శకుడు తేజ తన ‘ధైర్యం’ సినిమాలో సహాయ దర్శకురాలిగా రమ్మన్నారు. అంతకన్నా కావాల్సిందేముంది… ఆ సెట్‌లో శాయశక్తులా శ్రమించి మంచి పేరు తెచ్చుకున్నాను. ఆ తర్వాత శేఖర్‌ కమ్ములగారి ‘గోదావరి’ సినిమాకీ పనిచేశాను. ఆ రెండు సినిమాలతో పరిశ్రమలో నాకు మంచి ‘ఏడీ’గా పేరొచ్చేసింది. మంచానికే పరిమితమైన మా అన్నయ్య చనిపోవడంతో అమ్మా నాన్నల్ని నా దగ్గరకి తెచ్చుకున్నాను. తర్వాత కృష్ణవంశీగారి దగ్గర చేరాను. జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘రాఖీ’తో మొదలుపెట్టి మూడు సినిమాలకి పనిచేశాను. నాకు ‘రాక్షసి’ అని పేరుపెట్టింది ఆయనే!
కృష్ణవంశీగారి ‘శశిరేఖా పరిణయం’ సినిమాలో పనిచేస్తుండగానే… హైదరాబాద్‌లోని ఓ పెద్ద ప్రయివేటు ఆసుపత్రి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ నాన్నగారు ఇక్కడ చెకప్‌కి వచ్చారు. ఓసారి మీతో మాట్లాడాలి…’ అని చెప్పారు అక్కడి చీఫ్‌ డాక్టర్‌.

ఆయన మాటలే…
ఉరుకులు పరుగుల మీద అక్కడికి చేరుకున్నాను. ‘మీ నాన్నకి పాంక్రియాస్‌ క్యాన్సర్‌ వచ్చిందమ్మా… ఫోర్త్‌ స్టేజీ! ఆరు నెలలకన్నా బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు. మెదడంతా ఒక్కసారిగా మొద్దుబారిపోయింది… నిలువునా పాతాళంలోకి కూరుకుపోతున్నట్టే అనిపించింది. నాన్నని తీసుకుని ఇంటికెళ్లేలోపే- పెళ్ళి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకో మగతోడు కావాలన్నది అందుకు కారణం కాదు. ‘ఒక్కగానొక్క కూతురికి పెళ్ళి చేయకుండా పోయాడే’ అన్న మాట నాన్నకి రాకూడదనుకున్నాను. ఆయన దగ్గరకెళ్లి ‘మీరు ఎవర్ని చూసినా ఓకే నాన్నా… తాళి కట్టించుకుంటాను!’ అన్నాను. నాన్న నావైపు సూటిగా చూసి ‘నిన్ను ఎవడో ఒకడి చేతుల్లో పెట్టి ‘నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకో బాబూ!’ అని చెప్పేంత అబలగా నేను నిన్ను పెంచలేదు. దర్శకురాలివి కావాలి అన్న లక్ష్యంతో నువ్వు జర్నీ చేస్తున్నావు. అవసరమైతే ఆ ప్రయాణంలో చచ్చిపోకానీ… దాన్ని వదిలి మాత్రం రావొద్దు!’ అన్నాడు. ఆ మాటలకి ఆయన చేతులు పట్టుకుని భోరున ఏడ్చేశాను. నాన్న ఎంత ఠీవిగా చావుని ఆహ్వానించారంటే… తనని 51 ఏళ్లకే మరణం కబళిస్తున్నా ఏ క్షణంలోనూ భయపడ్డది లేదు. పైగా ‘నేను పోతే నువ్వు అందరిలా ఏడవకూడదురా సౌజీ! అన్ని పనులూ నువ్వే దగ్గరుండి చూడాలి. అమ్మకి పసుపుకుంకుమలు తీసే తతంగమంతా వద్దు… తన బొట్టు నాతోనే వచ్చింది కాదు… నాతో పోనూకూడదు’ అన్నారు. వైద్యులు చెప్పిందానికన్నా ఓ నెలముందే… ఓ రోజు రాత్రి ఒంటిగంటకి కన్నుమూశారు నాన్న. అప్పటికప్పుడు ఆయన భౌతికకాయంతో నరసరావుపేటలోని మా సొంతింటికెళ్లాను. తలకొరివి పెట్టడానికి – కొడుకు వరసైన అబ్బాయిలు తటపటాయిస్తుంటే… ఆ పని నేనే చేశాను. గుండెలో బాధ సుడులు తిరుగుతున్నా… నాన్నకిచ్చిన మాట ప్రకారం చుక్క కన్నీరు రానివ్వలేదు. కర్మ తర్వాత నాన్న కోరుకున్నట్టే అమ్మ చేతికి బంగారు గాజులు తొడిగాను. ఇరుగుపొరుగు నోళ్లు నొక్కుకున్నా పట్టించుకోకుండా అమ్మ బొట్టుని అలాగే ఉంచేశాను..!

నాన్నపోతే.. చుక్క కన్నీరు కార్చలా

అవే కథలయ్యాయి…
నాన్న తన మరణాన్ని ఎదుర్కొన్న విధానం, స్త్రీలపైన ఆయనకున్న ఆ గౌరవం నా గుండెల్లో నిలిచిపోయాయి. వాటిలో నుంచి ఎన్నో కథలు పుట్టాయి..! ఆ కథల్నే ఊతంగా మార్చుకుని దర్శకురాలిని అయి తీరాలన్న పట్టుదలతో అడుగులేశాను. కథతో ఓ కామెడీ హీరో దగ్గరకెళితే ఆడవాళ్ల దర్శకత్వంలో చేయనని మొహానే చెప్పేశాడు. శర్వానంద్‌తో మరో సినిమా పట్టాలకెక్కినట్టే ఎక్కి ఆగిపోయింది. ఇన్ని ఇబ్బందులున్నా… మళ్లీ ఏడీగా వెళ్లదలచుకోలేదు. అలా వెళితే డబ్బొస్తుంది కానీ… ఎప్పటికీ దర్శకురాల్ని కాలేను అనిపించింది. దాంతో ఆర్థిక బాధలు చుట్టుముట్టాయి. చివరికి ఓ ఫ్రెండ్‌తో కలిసి చిన్న క్యాంటిన్‌ నడిపాను. సినిమా ప్రయత్నాలు ఏవీ కుదరక నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న దశలోనే బాహుబలి ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు నన్ను నిర్మాత చినబాబు దగ్గరకు తీసుకెళ్లారు. ‘వరుడు కావలెను’ కథ చెప్పగానే ఆయనకి నచ్చింది. అప్పటి నుంచి నా తల్లిదండ్రుల తర్వాత నేను గౌరవించే వ్యక్తిగా మారారు! 2020లో మేం షూటింగ్‌ మొదలుపెట్టగానే కరోనా లాక్‌డౌన్‌, ఇతరత్రా కారణాలతో షూటింగ్‌ ఆగిపోయింది. మొదలయ్యాకా మళ్లీ ఎన్నెన్నో సమస్యలు. వాటన్నింటినీ దాటుకుని ఎన్నో ఏళ్ల నా కలని ఇప్పుడు సినిమాగా మీ ముందుకు తెచ్చాను. దీని ఫలితం నాకెంతో సంతృప్తినిచ్చినా.. నాన్న ఈ విజయాన్ని చూసుంటే బావుండేది అన్న బాధ మనసులోతుల్లో కదలాడుతూనే ఉంది.

Director Jeetu Josef (Drusyam)

ప్రేమ, సినిమా… ఏది కావాలో తేల్చుకో… అంది!

 

ఏడేళ్ల క్రితం దృశ్యం, ఇప్పుడు దృశ్యం-2…! ఉత్కంఠతో ప్రేక్షకుల గుండె లయని పరుగులెత్తించడమే కాదు… వాళ్ల కళ్లనీ తడిచేయడం వల్లే ఈ సినిమాలు కోట్లు కురిపిస్తున్నాయి. దేశంమెచ్చిన ఈ చిత్రాల సృష్తికర్త జీతూ జోసఫ్‌. ఓ పెద్ద సంక్షోభాన్ని ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం ‘ఒకరి కోసం ఒకరం’ అన్నట్టు ఎదుర్కొనే తీరే ఈ సినిమాలని మిగతా క్రైమ్‌ థ్రిల్లర్‌లకన్నా భిన్నంగా నిలుపుతోంది! ‘ఆ ఫ్యామిలీ సెంటిమెంట్‌’ నా జీవితంలో నేను స్వయంగా చూసింది… నిజానికి అదే నా జీవితాన్ని నిలిపింది!’ అంటాడు జీతూ. ఎందుకో చూడండి…

‘అదో చర్చ్‌. అప్పుడే ప్రార్థన ముగిసి అందరూ బయటకొస్తున్నారు. మెట్లు దిగి వస్తున్న వాళ్ల మధ్య అప్పుడే విరిసిన గులాబీలా ఆ అమ్మాయి! మెట్లు ఎక్కుతూ ఉన్న ఆ అబ్బాయి తనని కన్నార్పకుండా చూస్తున్నాడు. ‘రేయ్‌… ఇది చర్చ్‌ రా!’ అని ఫ్రెండ్స్‌ కసురుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రార్థన కోసం కళ్లుమూసినా తనే కనిపిస్తుందని… చర్చ్‌లోపలకీ వెళ్లలేదు ఆ అబ్బాయి. బదులుగా ఆ అమ్మాయి ఏ కాలేజీయో ఆరాలు తీయడం మొదలు పెట్టాడు. తర్వాతి రోజే ఆ కాలేజీకెళ్లాడు. ఆ అమ్మాయి దగ్గరకెళ్లి ‘నిన్న మిమ్మల్ని చర్చ్‌లో చూశాను!’ అంటూ నసిగాడు. ‘అవును… నేనూ చూశా నీ వాలకాన్ని!’ విసురుగా అంది ఆ అమ్మాయి. ‘మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను!’ అన్నాడు. ‘అదొట్టి ఆకర్షణ… ప్రేమ కాదు!’ అంది. ‘కాదండీ… నాది ప్రేమే. నా లవ్‌ ప్రపోజల్‌కి సాక్షిగా మా అమ్మానాన్నల్నీ అక్కయ్యల్నీ పిలుచు కొచ్చాను చూడండి!’ అంటూ వాళ్లవైపు చూపించాడు. వాళ్లని చూశాక ఆ అమ్మాయికి మతిపోయింది ‘ఓ ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటారా!’ అని నవ్వేసింది. అతని తల్లి దండ్రులూ నవ్వుతూ దగ్గరకొచ్చారు. ఆమెతో మాట్లాడారు. ‘నా డిగ్రీ పూర్తికానివ్వండి… తర్వాత ఆలోచిద్దాం!’ అంటూ వెళ్లిపోయింది. పోతూపోతూ అతనికి మాత్రమే వినిపించేలా ‘ఐ లైక్‌ ఇట్‌’ అని చెప్పింది. అతని పెదాలపైన చిర్నవ్వు విరిసింది. తిన్నా, పడుకున్నా ఆ చిర్నవ్వు చెక్కుచెదరడం లేదు. అలా ఏడాది గడిచింది. ఆ అమ్మాయిని చూడటానికి వెళ్లాడతను. ‘పెళ్ళి నాకిష్టమే కానీ… జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావ్‌!’ అని అడిగింది. ‘సినిమా డైరెక్టర్‌ని అవుదామనుకుంటున్నా!’ అని చెప్పాడు. ఆ అమ్మాయి అతనివైపు సాలోచనగా చూస్తూ ‘ఆ మాట చెబితే మావాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. వాళ్లే కాదు సదాచార సిరియన్‌ క్రైస్తవ కుటుంబా లేవీ అంగీకరించవు. ఆలోచించుకో!’ అంది. ‘నాకు నీ ఇష్టం ఏమిటన్నదే ముఖ్యం..!’ అన్నాడతను. ‘మావాళ్ల ఇష్టమే నాది కూడా. సినిమానా… నాతో పెళ్లా… ఏదో ఒకటి తేల్చుకో!’ అంది. గుండెని ఎవరో రంపంతో కోస్తున్నంత బాధ అతనికి. కన్నీళ్లతో ఆ అమ్మాయిని చూస్తూ చెప్పాడు ‘నాకు నువ్వే కావాలి… లిండా!’ అని..’ – ఇదేదో నేను సినిమా కోసం రాసుకున్న స్క్రిప్టు కాదు. పాతికేళ్లకిందట నా జీవితంలో ఎదురైన సంఘటనలివి. అలా సినిమా ఊసెత్త కూడదనే షరతుతోనే లిండా నా జీవితం లోకి అడుగుపెట్టింది. తనకిచ్చిన మాటని అక్షరాలా పాటించాను. కానీ ఇద్దరం కలిసి సినిమాకెళ్లినప్పుడు అందులోని అద్భుతమైన షాట్లు చూసి అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు ‘ప్చ్‌… నేనూ ఇలాంటి ప్రశంసలు అందుకోవాల్సినవాణ్ణే కదా!’ అనుకుని కన్నీళ్లు పెట్టుకునేవాణ్ణి. ఈ బాధ పెరుగుతున్న కొద్దీ… అసలీ సినిమా వ్యామోహం నాలో పుట్టించినవాళ్లని చంపేయాలన్నంత కసి వచ్చేది. వాళ్లెవరంటారా… చెబుతాను.

‘వావ్‌… వాట్‌ ఏ టేక్‌!’
కేరళలో ఎర్నాకుళం జిల్లాలోని ఎలంజి అనే చిన్న గ్రామం మాది. నాన్న వి.వి.జోసఫ్‌ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ఇంట్లో నాకు ముగ్గురన్నయ్యలూ, ఓ అక్క. అందరూ బాగా చదువుకుని ఉన్నతస్థానాల్లో ఉన్నవాళ్లే. నేనే వాళ్ల దృష్టిలో దారి తప్పిన తమ్ముణ్ణయ్యాను! ఇంటర్‌ దాకా బాగా చదివాను కానీ హాస్టల్‌లో ఉంటున్నప్పుడు మా పెదనాన్న పిల్లలు నన్ను సినిమాకి తీసుకెళ్లారు. వాళ్లు ఊరికే సినిమా చూడటం కాదు, ‘ఆ టేక్‌ చూశావా… ఎలా తీశాడో! అబ్బబ్బా ఏం యాంగిల్‌రా అది!’ అంటూ విశ్లేషిస్తుండేవారు. నాకు అవేవీ అర్థం కాక తెల్లమొహం వేస్తే… వివరించి చెప్పేవారు. వాళ్లు ఈ సంగతులన్నీ చెబుతున్నకొద్దీ ‘ఇందులో ఇంతుందా!’ అని ఆశ్చర్యపోతుండే వాణ్ణి. అప్పటి నుంచి సినిమాలు చూడటమే కాదు… పుస్తకాలుగా వస్తే వాటి స్క్రీన్‌ ప్లేలూ చదివేవాణ్ణి. ఇంటర్‌ ముగిసేనాటికి ఈ సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. నాన్నతో నేను సినిమాల్లోకి వెళతానని చెబితే విస్తుపోయాడు. ‘నిన్ను ఇంజినీర్‌ని చేయాలన్నది నా కల. అది నెరవేర్చకున్నా ఫర్వాలేదు కానీ కనీసం ఏదో ఒక డిగ్రీ అయినా చెయ్యి. ఆ తర్వాత నీ ఇష్టం!’ అన్నాడు. సినిమాలు బాగా చూడొచ్చని డిగ్రీలో ఆర్ట్స్‌ గ్రూపు తీసుకున్నాను. డిగ్రీ చదువుతూ పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకని ఎంట్రన్స్‌కి సిద్ధమయ్యాను. మరో వారంలో పరీక్షలనగా కామెర్లు రావడంతో ఆగిపోయాను. ఆ తర్వాత ఎవరో చెప్పారు ‘కమర్షియల్‌ సినిమాలు తీయడానికి ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరక్కర్లేదు. ఎవరిదగ్గరైనా అసిస్టెంట్‌గా చేరడం మంచిది!’ అని. నేను ఎవరిదగ్గర చేరాలో అర్థం కాలేదు. ఏదో ఒక మార్గం దొరుకుతుందిలే అని చూస్తున్నప్పుడే… లిండా పరిచయమైంది. తన షరతులతో సినిమా ఆశలన్నింటినీ అటకెక్కించాను. మా పొలంలో రబ్బరు చెట్లు పెంచడం మొదలుపెట్టాను. ఈలోపు నాన్న చనిపోవడంతో మాకు టౌన్‌లో ఉన్న స్థలంలో ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టించి ఆ బాధ్యతా చూస్తుండేవాణ్ణి. మొదట్లో ఇదంతా కష్టమనిపించినా ఆ తర్వాత ఇవన్నీ అలవాటైపోయాయి. జీవితానికి ఓ ఛాలెంజ్‌ అన్నది లేకుండా పోయింది. ఉదయం ఆలస్యంగా లేవడం, కాసేపు రబ్బరు తోటని చూసుకోవడం, టౌనుకి వెళ్లడం రావడం… అంతా రొటీన్‌గా మారింది! వీటికి తోడు ఉండనే ఉంది… సినిమాలు తీయలేకపోతున్నాననే బాధ. ఆ బాధని మరచిపోవడానికి మరింతగా రబ్బరు తోటల్లో పనిచేసేవాణ్ణి. ఎంతగా కప్పెట్టాలనుకున్నా ఏదైనా ఓ మంచి సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆవేదన నా కళ్లలో దాగేదికాదు. నేను పడుతున్న ఈ బాధని ఎవరూ పట్టించుకోవడం లేదని అనుకుంటూ ఉండేవాణ్ణి కానీ… నా భార్య నా మనస్సునంతా ఓ పుస్తకంలా చదివేస్తోందని గ్రహించలేదు!

మళ్లీ తనవల్లే…
2000లో అనుకుంటా నా మోకాలికి కీ-హోల్‌ సర్జరీ చేయాల్సి వచ్చింది. అందుకోసం కేరళ రాజధాని తిరువనంతపురం ఆసుపత్రిలో చేరాను. సర్జరీ అయ్యాక అక్కడ ఉంటున్న మా కజిన్‌ గీత ఇంటికి నేనూ, నా భార్యా వెళ్లాము. వాళ్ల డైనింగ్‌ టేబుల్‌ మీద జైరాజ్‌ అనే మలయాళ దర్శకుడు తీసిన ‘కరుణం’ సినిమా బ్రోచర్‌ ఉంది. ‘ఇదెక్కడిది గీతా…!’ అని అడిగితే ‘మాకు తిరుచ్చూరులో ఓ ఇల్లుందిరా… ఆ ఇంటిని ఈ సినిమా డైరెక్టర్‌ అద్దెకు తీసుకున్నాడు!’ అంది. కాసేపక్కడ కబుర్లాడి నేనూ, లిండా వచ్చేశాం. వచ్చిన నాలుగు రోజులకి గీత ఫోన్‌ చేసి ‘అన్నయ్యా! దర్శకుడు జయరాజ్‌ నిన్ను కలవాలంటున్నాడు… ఓ సారి వెళ్లొస్తావా’ అంది. ‘అదేమిటీ… నా సినిమా ఇంట్రెస్ట్స్‌ గురించి నీకెవ్వరు చెప్పారు!’ అన్నాను. ‘వదిన చెప్పింది. తనవల్ల నువ్వు సినిమాలకి దూరమయ్యావని చాలా బాధపడుతోంది. ఆ రోజు జయరాజ్‌ గురించి చెప్పడం విని… తనే నీ కోసం ఛాన్స్‌ అడగమని రిక్వెస్ట్‌ చేసింది!’ అంది. నాకు కన్నీళ్లు ఆగలేదు… నా మనసులోని బాధని లిండా ఇంతగా పట్టించుకుందా..! తన పరిధిలో తాను ప్రయత్నించి ఇంత గుంభనంగా ఉండిపోయిందా!’ అన్న ఆలోచన నన్ను కదిలించింది. తన దగ్గరకెళితే ‘వ్యవసాయం, వ్యాపారంలాంటి రొటీన్‌ పనులు నీకు సెట్‌ కావు. ఇలాగే కొనసాగితే జీవితాంతం స్తబ్దంగా ఉండిపోతావు అనిపించింది. నావల్ల నువ్వు అలా కాకూడదు అనిపించింది. అందుకే ఈ చిన్న ప్రయత్నం…!’ అని చెప్పింది. అలా నా భార్య ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాను. జయరాజ్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ‘బీభత్సం’ అనే హిందీ సినిమా, ‘తిలకం’ అనే మలయాళ సినిమాలకి పనిచేశాను. మూడేళ్ల తర్వాత నేనూ ఒక కథ సిద్ధం చేసుకున్నాను.

ఈసారి అమ్మ వంతు!
నా మొదటి కథ వినగానే ఓ ప్రొడ్యూసర్‌ దిలీప్‌ అనే హీరోతో చేద్దామని చెప్పాడు. ‘నేనూ డైరెక్టర్‌నైపోతున్నానోచ్‌!’ అని గాల్లో తేలిపోయాను కానీ… వారం తిరక్కుండానే గాలి తీసిన బెలూన్‌లా మారిపోయాను. కారణాలేవీ చెప్పకుండానే ఆ ప్రొడ్యూసర్‌ సినిమా చేయడం కుదరదని చెప్పేశాడు. వేరే కథ కావాలన్నాడు. నెలరోజుల్లో ‘డిటెక్టివ్‌’ అనే కథ రాసి తీసుకెళ్తే… ‘కొత్త డైరెక్టర్‌లని నమ్మి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదు. సారీ…!’ అని చెప్పేశాడు. ఏడుపొక్కటే తక్కువగా అతని ఆఫీసు నుంచి బయటకొచ్చాను. అయినా నా ప్రయత్నం మానుకోకూడదని ప్రఖ్యాత హీరో సురేశ్‌గోపికి కథ వినిపించాను. ‘చాలా బావుందండీ. ప్రొడ్యూసర్స్‌ ఉంటే చెప్పండి చేద్దాం!’ అన్నాడు. సురేశ్‌గోపికి కథ నచ్చిందని చెప్పినా నిర్మాతలెవరూ ఒప్పుకోలేదు. ఓ రోజు- ఇలా అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతున్నాయని నేనూ, నా భార్యా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మా అమ్మ చూసింది. ‘ఎందుకేడుస్తున్నార్రా! మనకున్న ఆస్తి మొత్తం అమ్మేద్దాం… నువ్వు కోరుకున్న సినిమా తీద్దాం. కానివ్వండి!’ అంది. అనడమే కాదు… ఆరోజే స్థలాలు తనఖాపెట్టి డబ్బు తెచ్చిచ్చింది. అలా మా అమ్మ లీలమ్మని సహనిర్మాతగా చేసుకుని డిటెక్టివ్‌ సినిమా మొదలుపెట్టాం. సగం సినిమా పూర్తిచేశాక… మళ్లీ డబ్బు సమస్య. కానీ అప్పటికే కథ వైవిధ్యంగా ఉందనే టాక్‌ వ్యాపించడంతో మహిత్‌ అనే ప్రొడ్యూసర్‌ ఆ సినిమా కొని షూటింగ్‌ పూర్తి చేయించాడు. అలా ‘డిటెక్టివ్‌’ పూర్తయింది. సినిమా పెద్ద హిట్టయింది… అమ్మ తనఖా పెట్టిన స్థలాలన్నీ మళ్లీ మా చేతుల్లోకి వచ్చేశాయి. ఆ తర్వాత నేను తిరిగి చూసుకోలేదు. గత 13 ఏళ్లలో పది సినిమాలు తీస్తే వాటిలో తొమ్మిది పెద్ద హిట్టు. వాటిల్లో ‘దృశ్యం’ భాషలకి అతీతంగా మీ అందరికీ నన్ను చేరువ చేసింది. మరి దీనికి స్ఫూర్తేమిటంటారా…

ఆయన మా నాన్నే!
కేరళలో జరిగిన ఓ హత్య కేసు దృశ్యం సినిమాకి ప్రేరణ. కాకపోతే ఆ నిజం కేసులో- ఆ వ్యక్తి పోలీసులకి దొరికిపోయాడు. అలా దొరక్కుండా తన కుటుంబం కోసం అతను చివరికంటా పోరాడితే ఎలా ఉంటుందన్నదే దృశ్యం కథ! ఇందులోని మోహన్‌లాల్‌ (తెలుగులో వెంకటేశ్‌) పాత్రలో మా నాన్న ఛాయలున్నాయి. నాన్న ఎమ్మెల్యే అయినా సరే బస్సుల్లోనే ప్రయాణించేవాడు. ఏడాదికో రెండేళ్లకో తప్ప కొత్త బట్టలూ తీసుకోడు. కరెంటూ, నీళ్లూ క్షణం వృథా అయినా సహించేవాడు కాదు. ఇదంతా నేను ‘దృశ్యం’ కథలో భాగం చేశాను. దానికి మధ్యతరగతి కుటుంబాల్లోని భయాలనీ, తమవాళ్ల కోసం ఎంతకైనా పోరాడే తెగువనీ కలిపాను. ఈ అంశాలే దృశ్యం సినిమాలని మామూలు థ్రిల్లర్‌ల కంటే భిన్నంగా నిలిపాయనుకుంటున్నాను. తెలుగు, తమిళం, హిందీలోనే కాదు చైనీస్‌లో, సింహళంలో తీసినా పెద్ద హిట్టయ్యేలా చేసిందని భావిస్తున్నాను. నిజానికి, ‘దృశ్యం’ అనే కాదు… నేను తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒకరకంగా ఈ సెంటిమెంట్స్‌ని తడుముతూనే ఉన్నాను. ఎన్ని సినిమాలు తీసినా… తరిగిపోనంత ‘ఫ్యామిలీ సెంటిమెంట్‌’ని నా కుటుంబమే అందిస్తూ ఉంది.

తెలుగులో తొలిసారి…
ఏడేళ్లకిందట ‘దృశ్యం’ రీమేక్‌, రెండేళ్ల క్రితం జ్యోతిక- కార్తీ అక్కాతమ్ముళ్లుగా చేసిన ‘దొంగ’ డబ్బింగ్‌ సినిమాలతో మీకు పరిచయమైన నేను ‘దృశ్యం-2’తో తొలిసారి నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాను. విక్టరీ వెంకటేశ్‌కి యాక్షన్‌ చెప్పబోతున్నాను. భాష వేరైనా సరే సాధారణంగా నా సినిమాలనే మళ్లీ మళ్లీ తీయడం ఇష్టం ఉండదు. కానీ ఈ సినిమా ద్వారా ఓ సారి తెలుగు కుటుంబాల్నీ ఇక్కడి సంస్కృతినీ దగ్గరగా చూడొచ్చనిపించింది. అందుకే సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ ఆఫర్‌ ఇస్తే వద్దనలేకపోయాను!
 

Director Prabhu Salman

అర్ధరాత్రి దొంగల్లా పారిపోయాం!

 

మనిషికీ మనిషికీ మధ్యే కాదు… ప్రకృతికీ మనిషికీ మధ్య ఉండాల్సిన మైత్రిని చెబుతాయి దర్శకుడు ప్రభు సాల్మన్‌ చిత్రాలు. హీరో ఇమేజ్‌ని పెంచడం కోసం పర్యావరణ అంశాలని తోడుతెచ్చుకోవడం కాకుండా… ప్రకృతి పరిరక్షణే ప్రధానాంశంగా హీరోహీరోయిన్లని ఎంచుకోవడం ఆయనకున్న అలవాటు. రానా హీరోగా వచ్చిన ‘అరణ్య’ అలాంటిదే! ఇదివరకు ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’ వంటి డబ్బింగ్‌ సినిమాలతో మనకి పరిచయమైన సాల్మన్‌ సినిమాలే కాదు… జీవితం కూడా స్ఫూర్తి నింపేదే. విధి విసిరే సవాళ్లని ఎదుర్కోవడమెలాగో వివరించేదే. ఆ ప్రయాణం…

దయం ఏడుగంటలు… అప్పుడే నిద్రలేచాను. రెప్పలు విప్పబోతే వెలుగు సూదిలా గుచ్చి ఇబ్బందిపెడుతోంది. అప్పుడు కాలింగ్‌ బెల్‌ మోగింది. ‘ఎవరూ… ఇంటి ఓనరా? నిన్ననే కదా కోపంగా మాట్లాడి వెళ్లాడు… ఇల్లూ ఖాళీచేయ మన్నాడు… మళ్లీ పొద్దున్నే వచ్చాడా…!’ అనిపించింది. నేను లేద్దామా వద్దా అనుకుంటుండగానే మావాడు పరుగెత్తు కుంటూ వెళ్లి గడియ తీశాడు. ‘పాలు… బాబూ!’ అన్న గొంతు వినిపించింది.పాలప్యాకెట్‌ తీసుకుని ‘ఉండు డబ్బులు తెస్తా!’ అంటూ లోపలికి వచ్చాడు వాడు. వాళ్లమ్మని డబ్బడిగితే తను ‘నాన్నని అడుగు!’ అంటోంది. వాడొచ్చి నన్ను లేపాడు. నేను ఏమీ ఎరగనట్టు ‘ఏమిట్రా!’ అని కళ్లు నులుముకుంటూ లేస్తే విషయం చెప్పాడు. బయటకొచ్చి ‘చిల్లర లేదు, రేపిస్తా!’ అన్నాను. ‘నిన్నా… మొన్నా కూడా ఇవ్వలేదు సార్‌!’ అన్నాడు. బాగా గిల్టీగా అనిపించింది. ‘కాస్త ఆగు!’ అని చెప్పి నా బ్యాగులో ఎప్పుడో దాచిన 20 రూపాయల నోటు తెచ్చిచ్చాను. మా ఇంట్లో మిగిలిన ఆఖరి నోటు అది. ఆ రోజంతా- ఎంతో ఇష్టంగా అద్దెకు తీసుకున్న ఆ మిద్దె ఇంటిని కళ్లారా చూసుకున్నాను. నా తొలి సినిమా హిట్టయ్యాక తీసుకున్న డబుల్‌ బెడ్రూమ్‌ ఇల్లది. ఆ హిట్టుతో నిర్మాతకి బాగా లాభాలొచ్చినా నా చేతుల్లో పెద్దగా ఏమీ మిగల్లేదు. నేననుకున్న ప్రాజెక్టులేవీ పట్టాలకెక్కలేదు. అనుకోకుండా చేసినవి కాసులు రాల్చలేదు. చూస్తుండగానే ఊరంతా అప్పులైపోయాయి. ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాను. మేమిచ్చిన ఆరు నెలల అడ్వాన్స్‌ కూడా తీరిపోయి ‘బాబూ! ఇల్లు ఖాళీచేస్తారా… లేదా!’ అనడం మొదలుపెట్టాడు ఓనరు. ప్రతిసారీ తలతీసేసినట్టయ్యేది. అందుకే వేరే దారేదీ లేని పరిస్థితిలో ఆ రోజు రాత్రి పెట్టేబేడా సర్దుకుని గుట్టుచప్పుడు కాకుండా ఆ ఇంటి నుంచి బయటకొచ్చేశాం. ఓ రకంగా అప్పులవాళ్లనీ, అద్దె అడిగే ఓనర్‌నీ తప్పించుకుని దొంగల్లా పారిపోయాం. నా సంగతి సరే… ఏ పాపమూ ఎరగని నా భార్యాపిల్లల్నీ నలుగురి దృష్టిలో దగాకోర్లుగా నిలబెడుతున్నానన్న బాధ నా గుండెని మెలిపెట్టింది. ఆ అర్ధరాత్రివేళ ఆటోలో వెళుతూ అమాయకంగా నిద్రపోతున్న నా పిల్లల్ని చూసి ‘మీకు అద్భుతమైన భవిష్యత్తు ఇవ్వాలనుకున్నవాణ్ణి… ఇలా చేస్తున్నాను. సారీ అమ్మా!’ అంటూ వెక్కివెక్కి ఏడ్చాను.

మరో జన్మే ఎత్తాను…
ఆ రోజు రాత్రి ఎక్కడికి పోవాలో తోచక మా ఆవిడ బలవంతం మీద చెన్నై శివార్లలో ఉన్న మా అత్తగారి ఇంటికి వెళ్లాం. నా మనసు అవమానంతో గింజుకుంటున్నా వాళ్లు మాత్రం నన్ను సొంత బిడ్డలాగే ఆదరించారు. అక్కడికెళ్లాక నెలలోనే బాగా చిక్కి పుల్లలా అయిపోయాను. మొదట్లో అప్పుల బాధవల్ల అనుకున్నాను కానీ… నెలన్నరలో ఆరు కేజీలు తగ్గడంతో ఏదో సమస్య ఉందనిపించింది. ఆసుపత్రికి వెళితే… నా కడుపులో టీబీ వచ్చిందన్న బాంబు పేల్చారు వైద్యులు. మూలిగే నక్కపైన తాడిపండన్న చందంగా మారింది పరిస్థితి. విధి నాపైన అన్నివైపుల నుంచీ దాడిచేస్తోందేమో అనిపించింది. ఓ గదిలో పెట్టి ఎటూ వెళ్లే అవకాశం లేకుండా దాడికి దిగితే పిల్లి కూడా తిరగబడుతుందంటారు! మరి నేను మనిషిని… ఆ మాత్రం విధిపైన తిరగబడలేనా అనిపించింది! శక్తినంతా కూడగట్టుకుని పోరాడటం మొదలుపెట్టాను. ప్రభుత్వాసుపత్రిలోనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాను. నాపైన నేను నమ్మకం పెంచుకోవాలని అప్పటిదాకా నేను అందుకున్న విజయాల్నీ ఎదుర్కొన్న సవాళ్లనీ ఓచోట రాసుకున్నాను. వాటిని క్లుప్తంగా చెబుతాను…

తమిళనాడులోని నైవేలి అనే ప్రాంతం మాది. లిగ్నైట్‌ గనులకీ, కరెంటు ఉత్పత్తికీ ప్రసిద్ధిగాంచిన టౌన్‌షిప్‌ అది. 14 చదరపు కిలోమీటర్లున్న టౌన్‌షిప్‌లో ‘అమరావతి’ అని ఒక్క థియేటరే ఉండేది… అందులోనూ 1960లనాటి సినిమాలు మాత్రమే వేసేవారు. తిరుచ్చిరాపల్లిలో డిగ్రీలో చేరాకే అసలు సినిమాలంటే ఏమిటో తెలిసింది. అప్పట్లో కాలేజీల్లో వేసే నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవాణ్ణి. నా రచనాతీరూ, నటుల నుంచి నాక్కావాల్సింది రాబట్టడం వంటివి చూసి నా స్నేహితులంతా ‘నీ డైరెక్షన్‌ బావుందిరా!’ అనేవారు. ఆ ప్రోత్సాహంతో సహజంగానే నాలో సినిమాపిచ్చి మొదలైంది. పీజీ ముగించేనాటికి అది కాస్తా ముదిరిపోయింది. ఇంట్లోవాళ్లు వద్దంటున్నా వినకుండా ‘ఒక్కసారి కెమెరాని తాకితే చాలు…’ అన్న లక్ష్యంతో చెన్నై బస్సెక్కాను. అక్కడ ఆ కోరిక నెరవేరడానికి మూడేళ్లు పట్టింది. స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న నన్ను ఓ సినిమా కోసం శరత్‌కుమార్‌కి ‘డూప్‌’గా తీసుకున్నారు. అక్కడ పరిచయమైన దర్శకుడు అగత్తియన్‌ సాయంతో ‘ప్రేమలేఖ’ సినిమాకి సహాయదర్శకుణ్ణయ్యాను. అప్పట్లో ఖుష్బూ భర్త సుందర్‌ ఓ సినిమా తీస్తూ ఏదో పొరపొచ్చాలు వచ్చి మానేస్తే మిగిలిన భాగాన్ని నన్ను పూర్తిచేయమని కోరారు ఆ సినిమా నిర్మాతలు. అలా నా పేరు రాకున్నా ఆ పని చేసిపెట్టడంతో… ఆ నిర్మాణ సంస్థ తమ తర్వాత సినిమాకి నాకే దర్శకత్వ బాధ్యతలు అప్పగించింది. అలా అర్జున్‌ హీరోగా కన్నోడు కాన్బదెల్లాం (తెలుగులో ప్రేమ ఘర్షణ) అన్న సినిమా చేశాను. ఆ సినిమా మంచి హిట్టయింది. పరిశ్రమలో చక్కటి గుర్తింపొచ్చింది కానీ… చేతిలో డబ్బులు మిగల్లేదు. అయినా-దర్శకుడిగా ఓ స్థాయి మెయిన్‌టెయిన్‌ చేయాలంటూ పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఆడంబరాలకి పోయాను. అప్పులు చేశాను. వాటికి తాగుడు అలవాటూ ఆజ్యం పోసింది. వీటన్నింటి ఫలితమే నాటి నా ఆర్థిక పరిస్థితి. నా విజయాలూ, బలాలూ, బలహీనతలపైన ఓ స్పష్టత వచ్చాక ముందు నా ఆరోగ్యంపైన దృష్టిపెట్టాను. దురలవాట్లతో పోరాడాను… దానికి క్రైస్తవ భక్తితోపాటూ మా ఆవిడ ప్రేమా ఎంతో బలాన్నిచ్చింది. అలా మరోజన్మ ఎత్తినట్టే అనిపించింది. ఆరునెలల్లోనే తేరుకుని… ఓ సినిమా స్క్రిప్టు సిద్ధంచేశాను.

‘రోజుకి ఐదువేలు చాలు’
అప్పట్లో కరణ్‌ అనే సహాయ నటుడు హీరోగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే నా స్క్రిప్ట్‌ వినిపించాను. ‘నాకు ఒక్క కెమెరా ఇచ్చి… రోజుకి ఐదువేలు డబ్బులివ్వండి చాలు, సినిమా తీసిస్తాను!’ అని చెప్పాను. టీవీ సీరియళ్లకే రోజుకి లక్షరూపాయలు ఖర్చవుతున్న రోజులవి! కరణ్‌ నేను ఆశించిన దానికంటే ఎక్కువే డబ్బులిచ్చి సినిమా తీయమన్నాడు. 2006లో వచ్చిన ‘కొక్కి’ అన్న ఆ సినిమా పెద్ద హిట్టయింది. అప్పుడు వచ్చిన డబ్బుతో నేను చేసిన మొదటి పని పాత అద్దె ఇంటి బకాయిలన్నీ తీర్చేయడం…

ఆ ఓనర్‌కి క్షమాపణ చెప్పడం. అప్పటి నుంచి నా భార్య పునీతకే ఆర్థిక బాధ్యతలు అప్పగించడంతో… ఇంకెప్పుడూ మాకు సమస్యలు రాలేదు. బయటివాళ్లు నిర్మాతగా ఉంటే నేననుకున్న సినిమాలు తీయలేననే ఆలోచనతో నేనే నిర్మాతగా మారాలనుకున్నాను. ఓ ఫైనాన్షియర్‌ దగ్గర్నుంచి ఐదు లక్షలూ, నా సొంత డబ్బు ఒకటిన్నర లక్షని పెట్టుబడిగా పెట్టి సినిమా మొదలుపెట్టాను. దక్షిణాది సినిమా అప్పటిదాకా చూడని అడవి నేపథ్యాన్ని చూపాలనుకున్నాను. అలాంటి ఓ ప్రాంతం కోసం దట్టమైన కేరళ అడవుల్లో పదివేల కిలోమీటర్లు కాలినడకన తిరిగాను. చివరికి ప్రముఖ పర్యటక ప్రాంతం మున్నార్‌ సమీపంలో ఉండే కురాంగణి అనే గ్రామాన్ని ఎంచుకున్నాను. నా పాత సినిమాల్లో సైడ్‌ క్యారెక్టర్‌ చేసిన విధార్థ్‌ని హీరోగా తీసుకున్నాను. ఎన్నో వడపోతల తర్వాత హీరోయిన్‌గా అమలాపాల్‌ని ఎంపిక చేసుకున్నాను. 2011 నాటి దీపావళినాడు విడుదలైన ‘మైనా’(తెలుగులో ప్రేమఖైదీ) ఆ రోజే వచ్చిన ఓ టాప్‌హీరో సినిమాని సైతం తోసిరాజని పెద్ద హిట్టయింది. జాతీయ అవార్డుల్నీ సంపాదించిపెట్టింది. కమల్‌హాసన్‌ ఈ సినిమా చూసి ప్రతి పాత్రనీ విశ్లేషిస్తూ గంటపాటు ప్రసంగించారు. రజినీకాంత్‌ ‘ఈ సినిమాలో ఓ చిన్న పాత్ర ఇచ్చినా నేను గర్వపడేవాణ్ణయ్యా!’ అంటూ నన్ను ఆలింగనం చేసుకున్నారు. నాకు పర్యావరణ స్పృహ ఏర్పడింది ఈ సినిమాతోనే! అలా అడవిలోకి చొచ్చుకెళుతున్న మనిషికీ- అక్కడే తరతరాలుగా ఉన్న ఏనుగులకీ మధ్య జరుగుతున్న ఘర్షణపైన ఓ కథ సిద్ధం చేసుకున్నాను. అదే ‘గుమ్కీ’…!

 

గజరాజుకి దండంపెట్టా…
శివాజీగణేశన్‌ మనవడు విక్రమ్‌ ప్రభుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేశాను. ఇందులో నటించిన కుట్టి అనే ఏనుగు ద్వారానే గజరాజుల్ని ఏ రకంగా ముద్దు చేయాలి… వాటికి ఎప్పుడు యాక్షన్‌ చెప్పాలి… అవి సృష్టించే ఒక్కో శబ్దానికీ అర్థమేమిటీ… వంటివన్నీ నేర్చుకున్నాను. ఇంత చేసినా షూటింగ్‌ చివర్లో ఓ పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చింది. మా ఏనుగుని షూటింగ్‌ కోసం కేరళ నుంచి తమిళనాడు సరిహద్దుకు తెప్పించాల్సి వచ్చేది. మధ్యలో 14 చెక్‌పోస్టులుండేవి. అక్కడి వాళ్లందరికీ నచ్చజెప్పి తెచ్చాక… ఏనుగు చెవులకీ కళ్లకీ మధ్య ఓ చిన్న బుడిపెలాంటిదొచ్చింది. అదేమిటని అడిగితే ‘ఏనుగుకి మదం పడుతోంది సార్‌!’ అన్నాడు మావటి. మరో ఏనుగుని షూటింగ్‌కి తెచ్చేంత డబ్బు కానీ వీలుకానీ మాకు లేదు. మేం చేయాల్సింది కూడా 10 గంటల షూటింగ్‌ మాత్రమే. దాంతో నేను షూటింగ్‌ చేస్తాననే చెప్పాను. ‘నాకు తెలియదుసార్‌… జనాలని చూస్తే అది రెచ్చిపోవచ్చు. మీ ప్రాణానికి నేను హామీ ఇవ్వలేను!’ అంటూ మావటి దూరంగా వెళ్లిపోయాడు. ఏం చేయను… ఆ ఏనుగే నా దేవుడనుకుని దండం పెట్టి చివరి షెడ్యూల్‌ మొదలు పెట్టాను. అదృష్టమో దైవనిర్ణయమో తెలియదు కానీ షూటింగ్‌ జరిగినంత సేపూ ఆ ఏనుగు కామ్‌గానే ఉండిపోయింది! గుమ్కీ సినిమా తమిళంలో సూపర్‌డూపర్‌ హిట్టయింది… తెలుగులోనూ మంచి ప్రశంసలొచ్చాయి.

రానా అడవి బిడ్డే అయ్యాడు…
అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారిని అడ్డుకుని ప్రభుత్వం గోడకట్టిన సంఘటనే నా ‘అరణ్య’ కథకి మూలం. అలాంటిచోట ఓ సిసలైన పర్యావరణ పోరాటయోధుడు ఉంటే ఎలా ఉంటుంది అన్న ప్రశ్న వస్తే నాకు అసోంలో సొంతంగా అడవిని పెంచిన జాదవ్‌ పాయెంగ్‌ కనిపించారు. ఆయన స్ఫూర్తితోనే హీరో పాత్రని రాసుకున్నాను. ఆ పాత్రకి ఎవరెవర్నో అనుకున్నాం కానీ… ఎవరూ నాకు నచ్చలేదు. రానా పేరు చెప్పగానే ‘అరె… ఇంతకాలం ఆయనెందుకు తట్టలేదు!’ అనిపించింది. విషయం చెబితే హైదరాబాద్‌ వచ్చి కథ చెప్పమన్నారు. కథల విషయంలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఎంత ఖరారుగా ఉంటుందో దక్షిణాది సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసు. నాకా కథ ‘చెప్పడం’ సరిగ్గా రాదు… ‘చూపడమే’ వచ్చు. అందువల్ల సురేశ్‌ బాబుగారు ఒప్పుకోరేమోనన్న అనుమానంతోనే వెళ్లాను. కానీ 20 నిమిషాలపాటు నా ఆలోచనలు టూకీగా చెప్పగానే ఆయనా, రానా కథలో లీనమైపోయారు. ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మరే సినిమాలోనూ పనిచేయకుండా శ్రమించారు రానా. కేవలం శాకాహారమే తింటూ 15 కేజీల బరువు తగ్గారు! గుమ్కీలో నేను ఒక్క ఏనుగుతో షూటింగ్‌ జరిపితే ఇందులో 18 ఏనుగులతో చేయాల్సి వచ్చింది. ఏనుగులు పరుగెత్తేటప్పుడు కెమెరాలు పట్టుకుని వాటి ముందూ వెనకా పరుగెత్తడం- మామూలు కష్టం కాదు. నేను నా సినిమా స్క్రిప్టులో ఏనుగుల సంచారాన్ని అడ్డుకుంటూ కట్టిన గోడని కూల్చేసినట్టే క్లైమాక్స్‌ రాశాను… అది కేవలం నా అభిలాష మాత్రమే. అప్పటికి నిజంగా అలా జరగలేదు. కానీ, నా సినిమా విడుదల కావడానికి వారం ముందే ఆ గోడని కూల్చేసి… ఏనుగుల రాచబాటని పునరుద్ధరించారట! ఆ విషయాన్ని చెబుతూ అక్కడి అధికారులు ‘మీ స్క్రిప్టు ఆ ఏనుగుల పాలిట ఓ ప్రార్థనలా పనిచేసిందండీ!’ అంటుంటే నాకు ఆనందంతో కన్నీళ్లాగలేదు!

Director Venu udugula

Direc venu udugula

Director Venu Sreeram

కంగారులోనూ ‘గారు’ అనడం మరిచిపోరు

కంగారులోనూ ‘గారు’ అనడం మరిచిపోరు<br /><br />

‘‘ప్రతి దర్శకుడు తన ప్రత్యేకతని ప్రదర్శించే ప్రయత్నంలో ఉంటాడు. చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జీవితంలో జరిగిన సంఘటనలే వాళ్ల శైలిపై ప్రభావం చూపిస్తుంటాయి’’ అంటారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. ఆయన మూడో ప్రయత్నంలోనే పవన్‌కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో ‘వకీల్‌సాబ్‌’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రయాణం గురించి శ్రీరామ్‌ వేణు ‘ఈనాడు సినిమా’ ప్రత్యేకంగా మాట్లాడారు.
పవన్‌ కల్యాణ్‌ నుంచి ప్రతి రోజూ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఆయన అంకితభావంతో పనిచేస్తుంటారు. చుట్టూ ఉన్న మనుషులందరినీ ఒకేలా చూడటం, గౌరవించడం ఆయనలో గమనించిన మరో గొప్ప లక్షణం. కంగారులోనైనా ‘గారు’ అని సంబోధించడం మరిచిపోరు. సెట్‌లో సమయం దొరికిందంటే అందరితో సరదాగా మాట్లాడతారు. మన గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. మొదట ‘పుస్తకాలు చదువుతారా? ఏం చదివారు?’ అని అడుగుతారు. ఆయన అభిమానిగా నేను ఫీల్‌ అయినవి చెప్పుకోవడానికే సమయం సరిపోయింది (నవ్వుతూ).
పవన్‌ కల్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక మొదట్నుంచీ ఉండేదా?
ఇష్టమైన కథానాయకుడితో సినిమా చేయాలని ప్రతి దర్శకుడికీ ఉంటుంది. పవన్‌ అభిమానిని నేను. ‘ఖుషి’ 22 సార్లు, ‘గబ్బర్‌సింగ్‌’ 23 సార్లు చూశా. ఇష్టమైన స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ     అనుభూతిని మాటల్లో వర్ణించలేం.
రీమేక్‌ కాకుండా… సొంత కథతో చేసే అవకాశం వచ్చుంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?
మన హీరోని ఇలాంటి కథలో చూసుకోవాలనే ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి. అలాగని రీమేక్‌ తక్కువ కాదు. ‘పింక్‌’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘వకీల్‌సాబ్‌’… పవన్‌ స్థాయికి తగ్గ చిత్రం. సమాజానికి చెప్పాల్సిన కథ ఇందులో ఉంది.
‘వకీల్‌సాబ్‌’ అవకాశం ఎలా వచ్చింది?
‘వకీల్‌సాబ్‌’కి ముందు వేరే సినిమా ప్రయత్నాల్లో ఉన్నా. అప్పుడు అనుకోకుండా దిల్‌రాజుతో కలిసి త్రివిక్రమ్‌ దగ్గరికి వెళ్లా. ‘పింక్‌’ రీమేక్‌ గురించి వాళ్లిద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ అవకాశం నాకే వస్తుందని అప్పుడు ఊహించలేదు.
విరామం తర్వాత పవన్‌ చేస్తున్న సినిమా. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఎలాంటి కసరత్తులు చేశారు?
ఒక మంచి మాట చెప్పడానికి… చెప్పేవాళ్లకి ఓ స్థాయి ఉండాలి. అప్పుడే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అలా ఇందులో ఒక గొప్ప విషయం ఉంది. దాన్ని పవన్‌ నోటి నుంచి చెప్పించడం కంటే గొప్ప కమర్షియాలిటీ మరొకటి లేదు.  ఈ కథకి కొన్ని పరిమితులున్నాయి. కానీ వాటిలోనే అభిమానులకి కావాల్సిన వాణిజ్యాంశాల్ని సృష్టించాం.
పవన్‌తో తొలి రోజు సెట్లో అనుభవమేంటి?
పవన్‌ భావాలకి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఆయన ఫీల్‌ అయిన విషయాలన్నీ చెప్పారు. కొంచెం సమయం తీసుకుని ‘నేనిలా అనుకుంటున్నాను సర్‌’ అని చెప్పి ఒప్పించా. తొలి రోజే ఆయన మీద సన్నివేశాల్ని తెరకెక్కించా. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో సన్నివేశం అదే.
మీ ప్రయాణం మీకు ఏం నేర్పింది?
తొలి చిత్రం ‘ఓ మై ఫ్రెండ్‌’ తర్వాత ఒక సినిమా ప్రారంభమై ఆగిపోయింది. మరో సినిమా కోసం ఏడాది కష్టపడ్డాక మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘ఎమ్‌.సి.ఎ’ చేశాను. ఈ అనుభవాలతో వర్తమానంలో బతకడమే అలవాటైంది.
ఈ సినిమా స్క్రిప్టులో త్రివిక్రమ్‌ భాగస్వామ్యం ఉందా?
మొదట త్రివిక్రమ్‌ రాస్తారని చెప్పారు. కానీ కుదరలేదు. ఆ సమయంలో ఆయన ‘అల వైకుంఠపురములో’ హడావిడిలో ఉన్నారు. అది విడుదలైన నాలుగైదు రోజులకే ‘వకీల్‌సాబ్‌’ చిత్రీకరణ మొదలుపెట్టాం.

 

ఆ సినిమా  తర్వాతి రోజు… నాన్న పోయారు!

‘నాగ్గాని ఒక్క ఛాన్స్‌ దొరికితేనా…’ అంటుంటారు సినిమాల్లో అవకాశం కోసం కసిగా తిరిగేవాళ్లు. ఆ ‘ఒక్క ఛాన్స్‌’ శ్రీరామ్‌ వేణుకి పెద్దగా కష్టం లేకుండానే దొరికింది! కానీ ఆ సినిమా విడుదల తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. పరిస్థితులు అతణ్ణి కొలిమిలో కాల్చినట్టే కాల్చాయి. అలా ఏడేళ్లు… తనని తాను పుటం పెట్టుకున్న వేణు బంగారంలాగే బయటకొచ్చాడు. నానితో ‘ఎంసీఏ’ తీసి మంచి హిట్టిచ్చాడు. తన మూడో సినిమాతోనే పవన్‌ కల్యాణ్‌కి ‘యాక్షన్‌’ చెబుతున్నాడు! ఆ అనుభవాలని ఇలా పంచుకుంటున్నాడు…

మా ఊర్లోవాళ్లు తమకున్న  దుస్తుల్లో కొన్నింటిని భద్రంగా దాచుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా శుభకార్యాలప్పుడు వాటిని వేసుకుని దర్జాగా వెళ్తుంటారు. ‘డ్రెస్సు భలే ఉంది…’ అని ఎవరైనా అనడం ఆలస్యం ‘ఎవరు కుట్టారో తెలుసా… శ్రీరామ్‌ కిషన్‌ సాబ్‌!’ అని గొప్పగా చెప్పుకునేవారు. ఆ కిషన్‌ మా నాన్న. అప్పట్లోనే బొంబాయిలోని ఓ పేరున్న టైలరింగ్‌ సంస్థలో పనిచేసినవాడాయన. జితేంద్ర, ధర్మేంద్రలాంటి బాలీవుడ్‌ హీరోలకి కాస్ట్యూమ్‌లు కుట్టాడు. అంతటివాడు తమకి దుస్తులు కుట్టిచ్చాడంటే అదెంత గర్వకారణం..! మొదట్లో ముంబయిలో పనిచేసిన నాన్న ఆ తర్వాత దుబాయ్‌కి వెళ్లాడు. దుబాయి నుంచి సెలవులకి వచ్చినప్పుడు ఊరిలో ఎవరు కష్టంలో ఉన్నా లెక్కలేవీ వేసుకోకుండా సాయం చేసేవాడు. దర్జీ పనుల కోసం ఎవరు అడ్వాన్స్‌ ఇచ్చినా… ఆ బట్టలు కుట్టేదాకా ఆ డబ్బుని వాడేవాడు కాదు. మనం పని పూర్తిచేసేదాకా అది మనడబ్బుకాదు… మనదికాని ఒక్క రూపాయైనా వాడకూడదు అనేవాడు. ఆ విలువలన్నీ ప్రత్యేకించి నేర్చుకోకుండానే నాకూ వచ్చాయి. ఓ రకంగా అవే నన్ను సినిమా రంగంలో నిలదొక్కుకునేలా చేశాయి.

జిల్లా టాపర్‌ని..!
జగిత్యాల జిల్లాలో మూడుబొమ్మల మేడిపల్లి అనే గ్రామం మాది. ఇంట్లో నాతోపాటూ తమ్ముడూ, చెల్లీ ఉన్నారు. నాన్న ముంబయి, దుబాయంటూ పనులకి వెళ్లిపోవడంతో అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచారు. ఐదో తరగతి వరకూ గ్రామంలోని ప్రభుత్వ బడిలోనే చదువుకున్నా. సుద్దాల అశోక్‌తేజగారు అప్పట్లో మాకు తెలుగు టీచర్‌! నేను బాగా చదువుతున్నానని ఆయనే నన్ను కిసాన్‌ నగర్‌లో ఉండే సెయింట్‌ ఇ.ఎ.ఎస్‌ స్కూల్‌లో చేర్పించారు. టెన్త్‌లో నాటి ఆంధ్రప్రదేశ్‌ స్థాయిలో పదకొండో ర్యాంకు, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మొదటి ర్యాంకు సాధించాను. దాంతో నన్ను ఇంజినీరింగ్‌ చేయించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోనైతే ఇంటర్‌తోపాటూ ఎంసెట్‌ కోచింగ్‌ కూడా ఉంటుందని పంపించారు. నేను వస్తున్నప్పుడు నాన్న ‘నువ్వు గొప్పోడివి కాకపోయినా చెడ్డోడివి మాత్రం కావొద్దు!’ అని మాత్రమే చెప్పారు. నేను చెడ్డవాడిగా అయితే పేరు తెచ్చుకోలేదుకానీ… నాన్న కోరుకున్నట్టు డాక్టర్‌ని కూడా కాలేకపోయాను. పదో తరగతిలో నాకు పరిచయమైన డ్రామాలూ, డ్యాన్సులూ నా దారి మళ్ళించాయి.

కాలేజీల నుంచి పంపేశారు!
హైదరాబాద్‌లో అప్పుడప్పుడే సిటీ కేబుల్‌ ఛానెల్‌ మొదలైంది. దాని కోసం తీస్తున్న ఓ సీరియల్‌కి 17 ఏళ్ల కుర్రాడి అవసరముందని చెబితే వెళ్లాను. ఇదివరకే డ్రామాల అనుభవం ఉంది కాబట్టి నటన నాకు ఈజీగానే వచ్చేసింది. కానీ… నా దృష్టి అప్పుడే డైరెక్టర్‌ ఛెయిర్‌ మీద పడింది. మెగాఫోన్‌ పట్టినవాళ్లకి మిగతా అందరిమీద ఉన్న కమాండ్‌ చూసి ఏదో ఒకరోజు నేనూ అందులో కూర్చోవాలనుకున్నాను. మెల్లగా సినిమా నా మనసునీ, జీవితాన్నీ ఆక్రమించడం మొదలుపెట్టింది. ఓ గొప్ప సినిమా చూస్తూ ఆత్మని ఎన్‌రిచ్‌ చేసుకుని చచ్చిపోయినా చాలనుకునేవాణ్ణి… ఇప్పుడూ అంతే! అప్పట్లో ఈ వ్యాపకాలతో ర్యాంకు కాదుకదా ఇంటర్‌ పాస్‌కావడానికే ఆపసోపాలు పడ్డాను. ఎలాగోలా గట్టెక్కాక నాన్న నన్ను ఎంసెట్‌ కోచింగ్‌లో చేరమన్నారు. తొలిసారి ఆయన మాటని కాదన్నాను.

సినిమాలతో ఎక్కువ సమయం గడపొచ్చని మామూలు డిగ్రీలో చేరాను. సినిమా వ్యాపకంతో కాలేజీకి హాజరు కాక, రెండు కాలేజీల నుంచి నన్ను పంపేశారు. మూడో కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశాను.

కల నెరవేరింది కానీ…
ఓ సారి ప్రముఖ దర్శకుడు రాజీవ్‌ మేనన్‌ ఓ ప్రకటనని చిత్రీకరించేందుకు హైదరాబాద్‌ వచ్చారు. ఆయనకి తెలుగు, ఇంగ్లిష్‌ మాట్లాడ గలిగిన సహాయ దర్శకుడు అవసరమని తెలిసినవాళ్లు చెప్పడంతో వెళ్లాను. ముంబై నుంచి మరో బృందం పవన్‌ కల్యాణ్‌తో ప్రకటన తీసేందుకు వస్తే… దానికీ సహాయ దర్శకుడిగా పనిచేశాను. అప్పుడే సుకుమార్‌ పరిచయమయ్యారు. ఆయనతో ‘ఆర్య’కి సహాయ దర్శకుడిగా పనిచేశాను. అప్పటి నుంచి నిర్మాత దిల్‌రాజు సంస్థలో ఉండిపోయాను. ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’, ‘కొత్త బంగారులోకం’, ‘మున్నా’… ఇలా ఒక్కో సినిమాకీ ఒక్కో రకం బాధ్యతని తీసుకుని పనిచేశాను. ఆ తర్వాతే దిల్‌ రాజు దర్శకత్వం చేయమన్నారు. అప్పటికే నేను సిద్ధం చేసుకున్న ఓ కథని తెరకెక్కించాను. అదే ‘ఓ మై ఫ్రెండ్‌’. అప్పటికి పదిహేనేళ్లపాటు నన్ను వెంటాడిన సినిమా కల అలా సాకారమైందనుకుని గాలిలో తేలిపోయాను. అంతేకాదు… మరో నెలలో మా తమ్ముడి పెళ్లి పెట్టుకున్నాము. నాన్న మా ఇంటిపైన మరో అంతస్తు కట్టిస్తున్నాడు. ఇన్ని మంచి విషయాలు జరుగుతున్న ఆనందంలోనే నా సినిమాని ఇంటిల్లిపాదీ కలిసి చూశాం. ఆ తర్వాత అందరం తిరుపతి వెళదామనుకున్నాం. కానీ నాన్న ఇంటి నిర్మాణ పనులు మిగిలిపోయాయని ఊరెళ్లారు. ఆ తర్వాతి రోజు మధ్యాహ్నం మేం తిరుపతిలో ఉండగా ఫోన్‌ వచ్చింది… నాన్న కొత్తగా కడుతున్న అంతస్తు పై నుంచి కింద పడిపోయారని. మరి కాసేపటి తర్వాత అసలు నిజం తెలిసింది… నాన్న ఇక లేరని! అప్పటిదాకా పెద్దగా ఒడుదొడుకుల్లేకుండా సాగిన జీవితంలో నాకు ఎదురైన మొదటి దెబ్బ అది… చాలా పెద్ద దెబ్బ కూడా!

ఏడేళ్ల అజ్ఞాతవాసం!
నాన్న చనిపోయారనే వార్త విన్నాక… నా సినిమా ఏమైందో కూడా పట్టించుకోలేదు. అంత్యక్రియలప్పుడు కూడా నేను ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోయాను. మెల్లగా… చాలా మెల్లగా నాన్న చనిపోయిన నెలరోజులకి మనిషినయ్యాను. అలా ఆ షాక్‌ నుంచి తేరు కున్నాక నాకొచ్చిన మొదటి ఆలోచన ‘ఫర్వాలేదు. నాన్న నేను దర్శకుణ్ణయ్యానని తెలిసిన తర్వాతే చనిపోయారు!’ అన్నది. ఆ తర్వాతే హైదరాబాద్‌ వచ్చాను. నా సినిమా ఏమైందని కనుక్కుంటే నిర్మాతకి డబ్బు మిగిలింది కానీ సినిమా ఆడలేదనే విషయం తెలిసింది. ఓ దర్శకుడి మొదటి సినిమా ఫ్లాపయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో అప్పటికి నేను అంచనా వేయలేకపోయాను. ‘ఓ మై ఫ్రెండ్‌’ తర్వాత నేను పవన్‌ కల్యాణ్‌కే కథ రాశాను. ఆయన్ని కలవడానికి షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లినా కుదర్లేదు. ఆ తర్వాత మరో ఇద్దరు పెద్ద హీరోలకి కథ చెప్పాను…
తిరస్కరించారు. ముగ్గురు చిన్న హీరోలూ కుదర్దన్నారు. అలా మొదటి సినిమా రిలీజైన ఐదేళ్లకి నాలుగు కథలు పట్టుకుని దాదాపు అందరు హీరోల చుట్టూ తిరిగాను. మధ్యలో ‘బెంగళూరు డేస్‌’ మలయాళ సినిమా రీమేక్‌ కోసం దిల్‌రాజు దగ్గర పనిచేస్తే అదీ
పట్టాలెక్కలేదు. ఓ కథ సిద్ధం చేసుకుని పెద్ద హీరోతో మొదలుపెట్టాం. అదీ చివరి నిమిషంలో ఆగిపోయింది. ‘ఎప్పుడూ గెలుపే జీవితం అనుకోవద్దు. మనం వెళ్లే దారుల్లో ముళ్లూ, రాళ్లూ అన్నీ ఉంటాయ’ని చెబుతుండేది మా అమ్మ అమృత. మెల్లగా ‘నా కథ నచ్చలేదంటే వాళ్లకి నచ్చేలా చెప్పలేకపోయాననే కదా!’ అన్న నిజాన్ని స్వీకరించాను. నరేషన్‌లో  కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘రెండో ఛాన్స్‌’ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాను.

‘ఎమ్‌సీఏ’ ఐడియా అలా వచ్చింది…
ఇంజినీరింగ్‌ కోసం మా తమ్ముడు హైదరాబాద్‌కి వచ్చిన కొత్తల్లో మేమిద్దరం కలిసి ఓ గదిలో ఉండేవాళ్లం. మాట్లాడుకున్నా, తిన్నా, పడుకున్నా మేమిద్దరమే. కానీ పెళ్ళయ్యాక మా మధ్యకి మూడో వ్యక్తిగా నా భార్య వచ్చింది. తన రాకతో నా తమ్ముడిలో అభద్రతాభావం కనిపించేది. ఇంతకాలం నాతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉన్న అన్నయ్య జీవితంలోకి ఇంకెవరో వచ్చారనే ఉడుకుమోత్తనం ఉండేది. ప్రేమ ఉంటేనే కదా అలా అభద్రతాభావానికి గురవుతారు అనిపించింది. ఆ అనుభవానికే కమర్షియల్‌ హంగులు జోడించి ‘ఎమ్‌.సి.ఎ.’ స్క్రిప్టు సిద్ధం చేశాను. ఆ సినిమా ఘన విజయం సాధించింది. ‘నా కెరీర్‌లో అతిపెద్ద హిట్టు నువ్వే ఇచ్చావ్‌!’ అన్నాడు హీరో నాని. ఆ తర్వాత రెండేళ్లపాటు నాకు నేనే లాక్‌డౌన్‌ విధించుకుని అల్లు అర్జున్‌ కోసం ‘ఐకాన్‌’ కథ రాశాను. కాకపోతే అది పట్టాలెక్కడానికి కాస్త ఆలస్యమైంది. ఈలోపే అనుకోకుండా ఓ మంచి అవకాశం తలుపుతట్టింది.

ఎవరు తీస్తారో…
‘ఎమ్‌.సి.ఎ’ తర్వాత ‘పవన్‌కల్యాణ్‌తో సినిమా చేస్తున్నట్టు కల కనవయ్యా!’ అన్నా కూడా సందేహించేవాణ్నేమో! కానీ అదే జరిగింది. ఓసారి దిల్‌రాజు నన్ను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దగ్గరకి తీసుకెళ్లారు. వాళ్లిద్దరూ హిందీ ‘పింక్‌’ సినిమాని పవన్‌కల్యాణ్‌తో చేయించాలనే విషయంపైన మాట్లాడుకున్నారు. వరసగా ఇద్దరు ముగ్గురు యువ దర్శకుల పేర్లొచ్చాయి… అప్పుడు త్రివిక్రమ్‌ ‘వేణు అయితే తీయగలడేమో!’ అన్నారు. అలా అనుకోకుండా నా పేరు ఖరారైంది. మా నాన్న అడ్వాన్స్‌ తీసుకుంటే ఖర్చుపెట్టరని చెప్పాను కదా! ‘ఎమ్‌.సి.ఎ’ తర్వాత ముగ్గురు
నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ‘నేను చెక్‌ తీసుకుంటాను కానీ,  సినిమా చేసేదాకా దాన్ని బ్యాంకులో వేయన’ని చెప్పాను. నేను అలా చేయబట్టే ఏ కమిట్‌మెంట్సూ లేకుండా పవన్‌ కల్యాణ్‌ సినిమాని తీసుకోగలిగాను. ఓ రకంగా నాన్నలోని ఆ గుణమే నాకు
పవన్‌తో ‘వకీల్‌సాబ్‌’ చేసే అవకాశాన్నీ… అదృష్టాన్నీ ఇచ్చింది!

- నర్సిమ్‌ ఎర్రకోట

 

Directer Phanindra Narsetti

manu

Director Koratalasiva

Director koratalasiva

Director Devisri

director devisri

Director Anil ravipudu

director anil ravipudi

Director Vikramkumar

direc vikram kumar 1 direc vikram kumar 2