CHARACTER ARTISTS

Artist Vijay Setupathi

జూనియర్‌ ఆర్టిస్టుగానూ ఛాన్స్‌ ఇవ్వలేదు!

 
సందేహమే అక్కర్లేదు… దక్షిణాదికి దక్కిన మరో సూపర్‌స్టార్‌ అతను! మన ఐదు రాష్ట్రాలవాళ్లూ తమ భాషలకతీతంగా ప్రేమిస్తున్న నటుడు. స్టార్‌ అంటే తమ ఇమేజ్‌ని ఆకాశమంత పెంచే ‘సూపర్‌హీరో’గానే కనిపించాల్సిన అవసరం లేదంటూ తనదైన పాత్రలతో కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. విలన్‌, సహాయ నటుడు, హిజ్రా… ఏది చేసినా విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవల జాతీయ అవార్డు కూడా అందుకున్న విజయ్‌ సేతుపతి జీవిత గమనం ఏ సినిమా స్క్రిప్టుకీ తీసిపోదు…
రోజు దర్శకుడు బాలుమహేంద్రని చూడాలనుకున్నాను. కొన్ని నెలల ప్రయత్నం తర్వాత ఆవాళే అపాయింట్‌మెంట్‌ దొరికింది. వెళుతున్నప్పుడే ‘వసంతకోకిల’, ‘నిరీక్షణ’ వంటి ఎన్నో సినిమాలు కళ్లముందు కదలాడి ఉద్విగ్నానికి లోనయ్యాను. ఆయన ముందుకెళ్లగానే ‘బాబూ! నేను ఇప్పటికిప్పుడు చేసే సినిమాలంటూ ఏమీ లేవు. నువ్వు ఛాన్స్‌ కోసం వస్తే మళ్లీరా!’ అన్నారు. ‘మీ దగ్గరకి నేను అందుకోసం రాలేదండీ!’ అన్నాను. ‘మరి..?’ అన్నట్టు చూశారు తన నళ్లకళ్లద్దాలని కాస్త పైకెత్తి. ‘నటుడిగా ఛాన్స్‌ అడగడానికి నాకంటూ మంచి పోర్ట్‌ఫోలియో ఫొటోలు లేవు. నా దృష్టిలో మీరు గొప్ప ఫొటోగ్రాఫర్‌ కూడా. నా ఫొటోలు తీసిపెడతారా!’ అని అడిగాను. మన సినీరంగానికి ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన అంతపెద్ద దర్శకుణ్ణి అలా ఫొటోలు తీయమనడం తప్పే అయినా… అప్పట్లో అదో పెద్ద కల నాకు. నా కోరిక వినగానే ‘నన్నెవరూ ఇలా అడగలేదయ్యా!’ అంటూ పెద్దగా నవ్వేశారు. అప్పటికప్పుడు తన కెమెరా సిద్ధం చేసి రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీశారు. వాటి ప్రింట్లని నాకు ఇస్తూ ‘నేను చూసిన చక్కటి ఫొటోజెనిక్‌ ఫేస్‌లలో నీదీ ఒకటి. మంచి నటుడివి అవుతావ్‌!’ అని ఆశీర్వదించారు. నటుడిగా నాపైన నాకు నమ్మకం వచ్చిన తొలి సందర్భం అది. నాకు నమ్మకం వస్తే చాలా… ప్రపంచం నమ్మొద్దూ… కనీసం నా భార్యయినా నమ్మొద్దూ! నా సమస్య అదే అప్పట్లో. నా భార్య జెస్సీకి నా సినిమా ప్రయత్నాలు అస్సలు నచ్చేవి కావు. అందుకే బాలుమహేంద్రగారు తీసిన ఫొటోలని తనకి కనిపించకుండా మా ఇంట్లో అద్దం వెనక భద్రంగా దాచాను. అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వెళుతుండేవాణ్ణి. ఓ రోజు అవి జెస్సీ కంటపడ్డాయి. ఆరోజు మా అమ్మానాన్నా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ల ఎదుట గొడవపడటం బావుండదనేమో… ‘నీతో మాట్లాడాలి. బయటకొస్తావా!’ అంది. అప్పటికి మావాడు సూర్య కడుపులో ఉన్నాడు… నాలుగో నెల. నేను తన వెనకే వెళ్లాను. ఇద్దరం ఇంటి నుంచి కాస్త దూరంగా వెళ్లగానే చటుక్కున నా కుడిచేతిని తీసుకుని తన పొట్టపైన పెట్టి ‘పుట్టబోయే మన బిడ్డపైన ఒట్టేసి చెప్పు విజీ… మరోసారి సినిమాలకి ప్రయత్నించనూ అని!’ అంది. తన కళ్లలోకి చూశాను. కోపం, భయం, ఆవేదనా… అన్నీ కలగలిసి కన్నీళ్లుగా ఉబుకుతున్నాయి. నాకళ్లలోనూ నీళ్లు తిరిగాయి. నా చేతిని తన పొట్టపైన అలాగే ఉంచి ‘ఒట్టు… ప్రయత్నించను!’ అన్నాను. అనడమే కాదు తన చేతిలో ఉన్న ఫొటోలని తీసుకుని ముక్కలుగా చించేసి ‘పద ఇంటికి పోదాం!’ అన్నాను. తనని మెల్లగా ఇంటివైపు నడిపిస్తూ… నా చేతిలో ఉన్న ఫొటో ముక్కల్ని చెత్త బుట్టలో పడేశాను…

ఎందుకు పనికొస్తానబ్బా…
మా ఆవిడ జెస్సీకి సినిమాలపైనున్న ఆ భయం… ఓ రకంగా మనందరిదీ కూడా. కాలికింద ఉన్న ఆధారాన్ని కాదనుకుని ఆకాశానికి ఎగరాలన్న ప్రయత్నంగానే దాన్ని ఓ మధ్యతరగతి మనస్తత్వం భావిస్తుంది. జెస్సీ భయం అర్థంలేనిదేమీ కాదు. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బావుండేది కాదు. మా నాన్న కాళిముత్తు… సివిల్‌ ఇంజినీరు. చిన్న చిన్న బిల్డింగ్‌ కాంట్రాక్టులకి పనిచేస్తుండేవాడు. సంఘసంస్కర్త పెరియార్‌ ఈవి రామస్వామిగారి ‘ద్రవిడ’ సిద్ధాంతాలని వంటపట్టించుకున్నవాడు. సంఘసంస్కరణల్లో పోరాడినవాడు… పరమ నాస్తికుడు. ఇంట్లో నలుగురం పిల్లలం… మా అన్నయ్యా, తర్వాత నేనూ, నా తర్వాత ఓ తమ్ముడూ, ఓ చెల్లెలూ. మాకంటూ ఆయన ఏ ఆస్తీ సంపాదించినవాడు కాదు. ‘సివిల్‌ ఇంజినీర్‌వై ఉండి ఒక్క ఇల్లైనా సంపాదించలేకపోయావ్‌!’ అని మేం ఎగతాళిగా మాట్లాడితే చిరునవ్వుతో చూస్తుండిపోయేవాడు. ఆయన ఏదీ సీరియస్‌గా తీసుకోడు. అదేమిటో సంపాదనంటే ఆయనకి చాలా చిన్నచూపు. జీవితంలో మేమెంత ధైర్యంగా, గౌరవంగా బతకాలో పదేపదే చెప్పినా… పొదుపు మాట మాత్రం ఎత్తేవాడు కాదు. సహజంగానే అమ్మకి నాన్న తీరు నచ్చేది కాదు. పాపం… డబ్బులేక ఎన్ని కష్టాలు పడిందో ఏమో, ‘డబ్బే అన్నింటికీ మూలం’ అని చెబుతుండేది. మా స్వస్థలం తమిళనాడులోని రాజపాళయం అయినా… నా పదకొండో ఏట చెన్నై వచ్చేశాం. చదువులో బిలో యావరేజీ విద్యార్థిని… స్పోర్ట్స్‌, కల్చరల్స్‌ వంటివాటిలోనూ పెద్దగా ఆసక్తిలేదు. ‘అటు చదువూలేదు… ఇటు ఇతర వ్యాపకాలూ లేవు. నేను ఎందుకు పనికొస్తానబ్బా!’ అన్న ప్రశ్నతోనే టీనేజీ గడిచిపోయింది. నేను డిగ్రీ ముగించేనాటికి అన్నయ్య పీజీ చేస్తున్నాడు. తమ్ముడూ, చెల్లెళ్లిద్దరూ చదువుతున్నారు. నాన్న ఒక్కడి జీతంతోనే ఇంతమంది కడుపునిండటం కష్టమయ్యేది. అందువల్ల డిగ్రీ పూర్తయిన వారం రోజులకి ఓ సిమెంటు కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా చేరాను. అప్పట్లో సీఏ, ఐసీడబ్ల్యూఏల్లో చేరానుకానీ… వాటిల్లో ఫౌండేషన్‌ కోర్సు కూడా దాటలేకపోయాను! ఓ ఏడాదిపాటు సిమెంటు కంపెనీలో పనిచేశాక… అక్కడివాళ్లు ఎవరో చెప్పారు దుబాయ్‌కి వెళితే ఇప్పుడు వస్తున్న దానికంటే నాలుగురెట్లు ఎక్కువ జీతం వస్తుందని. దాంతో నా ఫ్రెండ్స్‌ దగ్గర తలాకొంత అప్పుతీసుకుని దుబాయ్‌ వెళ్లాను. రాత్రీపగలూ అని లేకుండా పనీ… అంతంతమాత్రం భోజనం… విపరీతమైన వేడి… ఇన్ని సమస్యలు ఉంటేనేం, అక్కడ నేను ఊహించినదానికన్నా ఎక్కువ జీతమే వచ్చింది. మూడేళ్లలో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేశాను. అన్నయ్యా, తమ్ముడూ సెటిలైపోయారు. ఆ ఆనందంలో ఉండగానే నాకు ఆన్‌లైన్‌లో జెస్సీ పరిచయమైంది.
ఆన్‌లైన్‌ ప్రేమ పండింది…
కాలేజీలో చదువుకునేటప్పుడు ఓసారీ, ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మరోసారీ నేను ప్రేమలో పడ్డా… అవన్నీ వన్‌సైడ్‌ లవ్వులే. ఆ అమ్మాయిలకి నా ప్రేమని చెప్పేంత ధైర్యం చాలలేదు. కానీ జెస్సీ ‘యాహూ మెసెంజర్‌’లº పరిచయమైన వారానికే ప్రపోజ్‌ చేసేశాను. ఆ రోజే తను ఓకే చెప్పింది కూడా! మరో ఐదు నెలలకి కేరళకి చెందిన జెస్సీ మా ఇంటి కోడలైంది. పెళ్ళిలోనే తనని మొదటిసారి నేను నేరుగా చూడటం! పెళ్ళయ్యాక  నాన్న నన్ను దుబాయ్‌ వెళ్లొద్దనడంతో ఇక్కడే ఉండిపోయాను. మా ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటీరియర్‌ డెకరేషన్‌ బిజినెస్‌ చేశాను కానీ… అది సరిగ్గా సాగక ఆపేశాను. ఆ తర్వాత రెడీమేడ్‌ కిచెన్‌లు తయారుచేసే ఓ కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో చేరాను. ఆ సంస్థ కోసం ఓసారి వ్యాన్‌లో వెళ్తుండగానే… ఆ వెనక ఓ పోస్టర్‌ కనిపించింది. అదో రంగస్థల నాటకం ప్రదర్శనకి సంబంధించిన ప్రకటన. చెన్నైకి చెందిన ‘కూత్తుపట్టరై’ అనే సంస్థది. ఆరోజు నా డ్యూటీ కాగానే ప్రదర్శనకెళ్లాను. రంగస్థలంపైన సహజంగా మనకుండే చిన్నచూపునంతా ముక్కలుముక్కలు చేసిందా నాటకం. నటనంటే ఇంత సహజంగా గొప్పగా ఉంటుందా అనిపించింది. అప్పుడే నేనూ వాళ్లలా నటుణ్ని కావాలనుకున్నాను. ఆ సంస్థ నిర్వాహకుడి దగ్గరకెళ్లి నా కోరిక చెబితే ‘మాకు నటులు అక్కర్లేదు కానీ… అకౌంటెంట్‌ కావాలి. వస్తారా!’ అన్నారు. ‘సరే’ అన్నాను. అలా వాళ్లు నాటకాలేస్తుంటే నేను అకౌంట్స్‌ రాస్తుండేవాణ్ణి. ఏడాది తర్వాత నా ఉత్సాహం చూసి నన్నూ నటించమన్నారు. ‘నాకు ఎవ్వర్నీ అనుకరించడం రాదు… మిమిక్రీ అయినా చేయలేను. నాకు నటన వస్తుందా!’ అని అడిగితే ‘అదీ మంచిదే. నీపైన ఎవరి ప్రభావమూ ఉండదు… నీలోని నువ్వే బయటకొస్తావు’ అని చెప్పారు. అదీ ప్రారంభం. మరో ఆరునెలల తర్వాతే బాలుమహేంద్రగారి దగ్గరకెళ్లి ఫొటోలు తీయించుకున్నాను. జెస్సీ మొదట్లో నటనపట్ల నా ఆసక్తిని పెద్దగా పట్టించుకోకున్నా… రాన్రానూ తనలో ఆందోళన పెరిగింది. గర్భిణి అయ్యాక అది ఇంకా ఎక్కువైంది. ఫలితమే ఆ రోజు నా చేత అలా ఒట్టేయించుకోవడం!
ఓ సంఘర్షణ…
మా ఆవిడా, అమ్మా నా నటనని వ్యతిరేకించినా… నాన్న ప్రోత్సహించాడు. ‘డబ్బులు రావేమోనని భయపడితే… నీకు జీవితంలో నటించే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి ధైర్యంగా వెళ్లు!’ అనేవాడు. నాకూ జెస్సీకీ మధ్య ఘర్షణని అర్థం చేసుకుని తనే కోడలికి అతికష్టంపైన నచ్చజెప్పాడు. అలా నాన్న ఇచ్చిన ధైర్యంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. ధనుష్‌ హీరోగా పుదుప్పేట్టై(తెలుగులో ధూల్‌పేట) అనే సినిమాకి ఆడిషన్‌కి వెళ్లి సెలెక్టయ్యాను. ఆ తర్వాత, ఎం.కుమరేశన్‌ సన్నాఫ్‌ మహలక్ష్మి(తెలుగు ఇడియట్‌) సినిమాలో, వర్ణం అని మరో సినిమాలోనూ నటించాను. రోజుకి రూ.250 ఇచ్చేవారు కానీ ఆ మూడు సినిమాల్లోనూ టైటిల్స్‌లో నా పేరు కనిపించదు. విలన్‌ గ్రూపులో ఒకడిగా, హీరో ఫ్రెండ్స్‌ మధ్య వెనక నిల్చున్న వ్యక్తిగా… ఇలా నేను చేసినవి చాలా చిన్న పాత్రలు మరి! అప్పట్లో ప్రతిరోజూ అవమానాలతోనే ఇంటికి వచ్చేవాణ్ణి. జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా పనికిరావు పొమ్మని తిట్టేవారు. అప్పుడే ఓ టీవీ సీరియల్‌లో హీరో పాత్ర వచ్చింది. ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో కొత్త దర్శకులకి పోటీపెడుతుంటే ఆ కొత్తవాళ్ల కోసం కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించాను. కార్తిక్‌ సుబ్బరాజ్‌, శీనూ రామస్వామి, నలన్‌ కుమారస్వామి వంటి యువదర్శకులు అలా పరిచయమయ్యారు. వాళ్లలో శీను రామస్వామి 2010లో నాకో స్క్రిప్టు ఇచ్చి చదవమన్నాడు. మూడు రోజుల తర్వాత ఫోన్‌ చేసి ఆ కథలో హీరోని నేనేనని చెప్పాడు. ఏదో ఒకటి ఓ మంచి అవకాశం వస్తే చాలనుకుని చేశాను. ‘తెన్‌ మేర్కు పరువకాట్రు’ అన్న ఆ సినిమా కమర్షియల్‌గా హిట్టు సాధించడమే కాదు… మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత నా దశ తిరిగిపోయింది… అనే అనుకున్నాను కానీ, అలా జరగలేదు…
‘కథ చెప్పాలా తమరికి!’
నా సినిమా హిట్టయ్యాక కొంతమంది నిర్మాతలొచ్చారు. నేను ఎంత తక్కువ రెమ్యూనరేషన్‌ అడిగినా ‘నీకు అంత మార్కెట్‌లేదు!’ అనేవారు. ‘సరే సార్‌! కథ నచ్చితే ఫ్రీగా చేస్తాను’ అనేవాణ్ణి. ‘నీ మొహానికి కథ కూడా చెప్పాలా. కావాలనుకుంటే చెయ్‌…!’ అనేవారు కానీ నేను మాత్రం కథ చెప్పాలనే పట్టుబట్టేవాణ్ణి. ఆ నేపథ్యంలోనే ‘పిజ్జా’ కథతో వచ్చాడు నాకు టీవీల్లో పరిచయమైన కార్తిక్‌ సుబ్బరాజ్‌. తెలుగులో కూడా డబ్‌ అయి మంచి హిట్‌ అందుకున్న ఆ సినిమానే… నన్ను స్టార్‌ని చేసింది. దానితో మొదలుపెట్టి ఈ ఏడేళ్లలో 45 సినిమాలు చేసేశాను. ప్రతి పాత్రా జీవితంలో నుంచి వచ్చిందై ఉండేలా చూసుకున్నాను. ప్రతిదాన్నీ ఓ పరీక్షలాగే అనుకుని నటిస్తున్నాను. మరో వందేళ్ల తర్వాత నా పేరుకన్నా నా పాత్రలే నిలవాలనీ… అవి వీలున్నంత ఎక్కువగా ఉండాలనే నేను ఆశపడుతున్నాను. చిన్నదైనా సరే ‘సైరా’లోనూ, విలన్‌గానైనా ‘ఉప్పెన’లోనూ ఆ కోరికతోనే చేశాను. ఇక, ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలోని శిల్ప అన్న హిజ్రా పాత్ర కూడా నేను కోరుకుని… ప్రాథేయపడి మరీ చేసిందే. దానికోసం నాలుగు నెలలపాటు మనసావాచా ఓ మహిళగానే మారిపోయాను. స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పాత్రే నాకు దక్కిన పెద్ద అవార్డు… దానికి జాతీయ అవార్డూ వస్తే అంతకన్నా ఏం కావాలి.

 

 

Artist Samudra Khani

ఇంట్లోవాళ్లు నేను చనిపోయానను కున్నారు…!

 

కొందరు సాధించే విజయాలు అందించే స్ఫూర్తి… కేవలం వాళ్ల రంగానికే పరిమితం కాదు. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవాళ్లైనా వాటితో ప్రేరణ పొందొచ్చు! దర్శక-నటుడు సముద్రఖని అందుకున్న విజయాలు అలాంటివే. తెలుగు పరిశ్రమకి మొదట్లో దర్శకుడిగానే పరిచయమైన ఆయన… గత ఏడాది ‘అలవైకుంఠపురం’లోనూ, ఇప్పుడు ‘క్రాక్‌’లోనూ విలన్‌గా అలరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోనూ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈ జాతీయ ఉత్తమనటుడు ఏ స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చారో… చూడండి…

నాతెలుగు కాస్త తేడాగా ఉన్నా నేను తెలుగువాణ్ణే. కొన్ని శతాబ్దాలకి ముందు తెలుగుగడ్డ నుంచి వెళ్లి దక్షిణ తమిళనాడులో స్థిరపడ్డవాళ్లం మేము. అక్కడి చవిటి నేలల్ని సస్యశ్యామలంగా మార్చిన రైతు కుటుంబాలవాళ్లం. మదురైకి ఆవల రాజపాళెం పట్టణానికి దగ్గర్లో సేత్తూరు అన్న గ్రామం మాది. ఎందుకో తెలియదుకానీ సాగంటే ప్రాణంపెట్టే నాన్న… సినిమాలంటే మండిపడేవాడు. అందువల్లనేమో ఎనిమిదో తరగతిదాకా నేను సినిమా థియేటర్‌లే కాదు… టీవీ కూడా చూసిందిలేదు. ఓ రోజు నా స్నేహితుడొకడు… నేను వద్దంటున్నా సినిమా థియేటర్‌కి తీసుకెళ్లాడు. శివాజీ గణేశన్‌ నటించిన ముదల్‌ మరియాదై(తెలుగులో ‘ఆత్మబంధువు’) చిత్రం అది. నేను తొలిసారిగా చూసిన ఆ రంగుల ప్రపంచం కళ్లనే కాదు… బుర్రనీ నింపేసింది. అప్పటి నుంచీ సమయం చిక్కినప్పుడల్లా థియేటర్‌లకి చెక్కేసేవాణ్ణి. ఓ రోజు ఈ విషయాన్ని కనిపెట్టి నాన్న చితకబాదాడు. నాకెవ్వరూ పైసా ఇవ్వకూడదని హుకుం జారీచేశాడు. డబ్బుల్లేకుంటేనేం… రాత్రుళ్లు నిద్రపోవడానికని డాబామీదికెళ్లేవాణ్ణి. అట్నుంచటు కిందికి దూకి, థియేటర్‌కి వెళ్లి అక్కడ గోడపక్కనే పడుకుని సినిమా చూడకున్నా డైలాగులు విని సంతోషించేవాణ్ణి. అలా వింటూనే నేను రజినీకాంత్‌కి పెద్ద ఫ్యాన్‌ అయిపోయాను. ఓసారి ఆయన సినిమా ఒకటి కొత్తగా రిలీజైతే ఎలాగైనా చూడాలనుకున్నాను. నాన్న నా చేతికి చిల్లిగవ్వ రానివ్వకపోవడంతో… ఆ థియేటర్‌లోనే జంతికలమ్మడం మొదలుపెట్టాను. అలా అమ్ముతూనే ఆ సినిమా ప్రదర్శించిన 16 రోజులూ నాలుగు ఆటలూ కలిపి మొత్తం 64 షోలు చూశాను! అక్కడితో ఆగలేదు. అప్పట్లో కొన్ని సినిమా పత్రికల వెనకాల సినీప్రముఖుల అడ్రెస్సులు ఇస్తుండేవారు. వాటన్నింటినీ సేకరించి పెట్టుకున్నాను. పదో తరగతి పరీక్షలు రాసిందే తడవుగా నాన్న జేబులోని 138 రూపాయలు దొంగిలించి చెన్నై బస్సెక్కేశాను! అక్కడ ఏ అడ్రెస్సులూ కనుక్కోలేక గోడక్కొట్టిన బంతిలా వెనక్కివచ్చాను. రాగానే నాన్న చితకబాదుతాడని అనుకున్నా కానీ… ఆయన మొహంలో అదివరకెన్నడూ చూడని దిగులు కనిపించింది. నన్ను దగ్గరకి తీసుకుని ‘నువ్వు సినిమాల్లోకి వెళ్లు కానీ ఇప్పుడు కాదు. ముందు బాగా చదువుకో..!’ అని చెప్పాడు. అనుకోకుండా మరో నెలకి గుండెపోటుతో చనిపోయాడు!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా…
నాన్న చనిపోయాక అమ్మ రైతయింది. ఎంతో ప్రయాసతో నన్ను బీఎస్సీదాకా చదివించింది. పరీక్షలు అవుతూనే, ‘డిగ్రీ పూర్తయింది కదా, ఇక నేను సినిమాల్లోకి వెళ్తానమ్మా..!’ అన్నాను. ఎంతైనా నాన్న ఇచ్చిన మాటకదా, అమ్మ రెండువేల రూపాయలు అప్పుతెచ్చి చేతిలో పెట్టి వెళ్లిరమ్మంది! నాలాగే సినిమా కలలతో చెన్నైకొచ్చిన మరో ముగ్గురితో కలిసి తలదాచుకున్నాను. నేను పరిశ్రమలోకి వచ్చింది నటుణ్ణి కావాలనే. అందుకని రకరకాల భంగిమల్లో ఫొటోలు తీయించుకున్నాను. వాటిని తీసుకుని ఓ దర్శకుడి ఆఫీసుకెళితే ‘తుమ్మ మొద్దులా ఉన్నావ్‌! అసలు నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా’ అన్నారు. ఆ మాటలకి గుండె పగిలినా ‘గొప్పోళ్లందరికీ మొదట ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయట!’ అనుకుని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. ఓ చోట ఆడిషన్‌దాకా వెళ్లాను. చిట్టచివర్లో అక్కడే ఉన్న సహాయ దర్శకుడొకడు ‘మీకు బుద్ధుందా! ఈ మొహానికెందుకు ఆడిషన్‌, టైం వేస్ట్‌ కాకపోతే!’ అని మెడపట్టి గెంటేశాడు. ఇలాంటి అవమానాలతోనే ఏడాది గడిచింది. అమ్మ ఇచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది. మరో ఆరునెలల తర్వాత నా స్థితి మరింతగా దిగజారింది. చెబితే నమ్మరు… నా చెప్పులు తెగిపోయి కొత్తవి కొనుక్కోవడానికీ డబ్బుల్లేవు. ఒట్టికాళ్లతో నడిచి అరికాళ్లూ పుండ్లయ్యాయి. పాతబట్టలు చించి కాళ్లకి చుట్టుకుని నడిచేవాణ్ణి. అవి గాయాలకి అతుక్కుపోయి సలపడం మొదలుపెడితే… ఓ రోజు మా పక్క రూమతను బాత్రూమ్‌కి వెళ్లడానికి వాడే స్లిప్పర్స్‌ వేసుకుని బజారుకెళ్లాను. అతను పరుగెత్తుకుంటూ నా వెనకే వచ్చి ‘చెప్పులిస్తావా… ఇవ్వవా!’ అని గొడవపడ్డాడు. నలుగురికి అన్నం పెట్టే రైతు కుటుంబంలో పుట్టినవాణ్ణి… డిగ్రీ ఫస్ట్‌క్లాసులో పాసైనవాణ్ణి… నన్ను వాడలా చెప్పుల కోసం నలుగురిలో తిట్టడం తట్టుకోలేకపోయాను. ఆ క్షణమే ఆత్మహత్య చేసుకుందామని రైల్వే పట్టాల వైపు వెళ్తున్నాను. అప్పుడో వ్యక్తి బైకుమీద వెళుతూ… చెప్పుల్లేని నన్ను చూసి ‘ఎక్కడికెళ్లాలి… నేను డ్రాప్‌ చేస్తాను… రండి!’ అన్నాడు. వెనక కూర్చున్న నాకు కన్నీళ్లు ఆగడంలేదు. అది గమనించాడేమో ‘మీరు ఎందుకోసం ఏడుస్తున్నారో నాకు తెలియదు. కానీ ఏడ్చేకొద్దీ ప్రపంచం మనల్ని మరింతగా ఏడిపిస్తుంది… నిబ్బరంగా ఉండండి. ధైర్యంగా ముందుకెళ్లండి!’ అని చెప్పి వెళ్లిపోయాడు. అనామకుడే కావొచ్చుకానీ అతని మాటలు నాపైన మంత్రంలా పని చేశాయి. రూమ్‌కి వచ్చి… ‘ఇంకెవరిలాగో నటించడం కాదు. మనమే కొన్ని సీన్‌లు క్రియేట్‌ చేసి వాటి ప్రకారం నటించి చూపుదాం!’ అనుకున్నాను. అలా కొన్ని సీన్‌లు రాసుకుని సుందర్‌ కె.విజయన్‌ అనే టీవీ సీరియళ్ల డైరెక్టర్‌ దగ్గరకు వెళ్లాను. ఆయన చేతికి స్క్రిప్టు ఇచ్చి నటించి చూపిస్తుంటే మధ్యలోనే ఆపి… ‘నీ రాత బావుంది. నటుడిగాకాకన్నా నువ్వు మంచి రచయితవీ… కాస్త శ్రమిస్తే దర్శకుడివీ అవుతావు. నాకు అసిస్టెంట్‌గా చేరిపోరాదూ…!’ అన్నాడు. అన్ని సంవత్సరాలు నేను చేసిన తప్పేమిటో అప్పుడు అర్థమైంది. నాలోని అసలు శక్తిని గుర్తించలేక నటుణ్ణి కావాలని ఎటో కొట్టుకు పోతున్నానన్నమాట! ఆ విషయం

అర్థంకాగానే…
నటించాలనే ఆలోచన కూడా మరెప్పుడూ రాకూడదని నేను తీయించుకున్న ఫొటోలన్నీ చించిపడేశాను. ఆ తర్వాతి రోజు సహాయ దర్శకుడిగా చేరాను. నెలకి వందరూపాయలు జీతం. తొలి వంద రూపాయలతో మూడు జతల చెప్పులు కొన్నాను. అప్పటి నుంచీ చేతిలో డబ్బులున్నప్పుడల్లా చెప్పులూ, బూట్లూ కొనడం మొదలు పెట్టాను. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు!

నేను లేకుండానే… చెల్లి పెళ్లి!
చెన్నైలో నా బాధలు ఇలా ఉంటే… మా ఊళ్ళో నేను చనిపోయానని నిర్ణయానికొచ్చారట! తప్పు నాదే. ఏదో గొప్పగా సాధించేదాకా ఊరి ముఖం చూడకూడదని భీష్మించుకుని అటువైపు వెళ్లలేదు. రోజూ పడే అవమానాలు దాచి అబద్ధాలేం రాస్తామని అమ్మకి ఉత్తరాలూ రాయలేదు. చెన్నై దాకా వచ్చి నాకోసం వెతికేపాటి లోకజ్ఞానం బంధువులెవరికీ లేకపోవడంతో నేనేమయ్యానో కూడా ఎవరికీ తెలియదు. ఈలోపు మా చెల్లెలికి మంచి సంబంధం వచ్చిందట. అమ్మ ఊళ్లోవాళ్లని నా ఆచూకీ కనుక్కోమని చెబితే ‘రెండేళ్లుగా ఏ సమాచారమూ లేదంటే… చచ్చే ఉంటాడు!’ అన్నారట. అమ్మ ఏమనుకుందో తెలియదుకానీ… ఒంటిచేత్తో మా చెల్లెలికి పెళ్ళి చేసేసింది. ఆ తర్వాత ఏడాదికికానీ నేను ఊరెళ్లలేదు. అప్పటికి టీవీ రంగంలో సహాయకుడిగా దాదాపు కుదురుకున్నాను. చేతిలో ఎంతోకొంత డబ్బుంది. ఆ ఉత్సాహంతో ఊళ్లోకి అడుగుపెడితే… మా చెల్లి చంటిపాపతో ఎదురైంది! నన్ను చూడగానే కాళ్లపైన పడిపోయి బావురుమంది. అమ్మయితే పిచ్చిదానిలా నన్ను పట్టుకుని ‘నాకొడుకు చావలేదు… చూడండి!’ అంటూ ఇంటింటికీ తీసుకెళ్లి చూపింది. అక్కడే నెలరోజులుండి అమ్మ చూపిన అమ్మాయిని పెళ్ళి చేసుకుని చెన్నైకి వచ్చాను. అప్పటిదాకా సహాయ దర్శకుడిగా ఉన్నవాణ్ణి ఆ తర్వాతే అసోసియేట్‌గా ఎదిగాను.

విలువలున్నవారు…
ప్రసిద్ధ దర్శకుడు కె.బాలచందర్‌ 90లలో కొన్ని టీవీ సీరియళ్లు తీశారు. అప్పుడు నేను ఆయన దృష్టిలో పడ్డాను. ఆయన దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్నప్పుడు దర్శకుడిగా తన పక్కన నా పేరూ వేయించేవారు! అంతపెద్ద దర్శకుడి సరసన నా పేరు రావడమేంటని నేనే ఆశ్చర్యపోయేవాణ్ణి. అప్పట్లో ఓ సీరియల్‌ ద్వారా ఎస్పీబీగారబ్బాయి చరణ్‌ని పరిచయం చేశాం. ఆ షూటింగ్‌ స్పాట్‌లో అతనితో మాట్లాడుతున్నప్పుడే ఓ పెద్ద హీరో కోసం రాసుకున్న కథ చెప్పాను. ఆ సినిమాని తానే నిర్మిస్తానన్నాడు చరణ్‌. ఎస్పీబీగారికీ కథ నచ్చింది. ఆ హీరోకీ కథ నచ్చిందికానీ… దర్శకుడిగా మాత్రం నన్ను వద్దన్నాడు. నాకు అందులో పెద్ద సమస్య లేకున్నా… ఎస్పీబీ, చరణ్‌లు ఇద్దరూ ‘నువ్వు దర్శకుడివి కాకుంటే… మాకు ఆ హీరో కాల్షీట్లు కూడా వద్దు!’ అనేశారు. అంత ఉన్నత విలువలున్నవాళ్లు ఆ తండ్రీ కొడుకులు! ఆ తర్వాత ఎస్పీచరణ్‌నే హీరోగా పెట్టి ఓ సినిమా తీశాను. గొప్ప సినిమాగా పేరొచ్చిందికానీ… వాణిజ్యరీత్యా యావరేజ్‌గా మిగిలిపోయింది. ఆ తర్వాత విజయ్‌కాంత్‌ హీరోగా ఓ చిత్రం, పృథ్వీరాజ్‌ హీరోగా తెలుగులో ‘నాలో’ అనే సినిమాలు చేశాను. రెండూ దెబ్బకొట్టాయి. దాంతో నా కెరీర్‌ అయిపోయిందనుకున్నాను. దర్శకుడు అమీర్‌, కార్తి హీరోగా చేసిన తొలి సినిమా ‘పరుత్తివీరన్‌’(మల్లిగాడు)కి సహాయకుడిగా వెళ్లాను. అప్పటికే మూడు సినిమాలకి పనిచేసినవాణ్ని సహాయకుడిగా చూస్తే బావుండదని నన్ను అసోసియేట్‌గా చేర్చుకున్నాడు అమీర్‌. ఆ సినిమా జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. అమీర్‌ దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ వచ్చిన శశికుమార్‌ ‘సుబ్రహ్మణ్యపురం’(అనంతపురం) సినిమా తీస్తూ ఓ కీలక పాత్ర కోసం నన్ను పూర్తిస్థాయి నటుణ్ణి చేశాడు. దాంతో నటుడిగా నాకు మరిన్ని అవకాశాలొచ్చాయి. ఆ దన్నుతోనే ‘నాడోడిగల్‌’ అనే సినిమా తీశాను. తమిళంలో పెద్ద హిట్టది! దాన్నే తెలుగులో రవితేజ హీరోగా ‘శంభో శివశంభో’ పేరుతో తీశాం. తర్వాత నానీతో ‘జెండాపై కపిరాజు’ చిత్రం చేశాను. ఈ సినిమాలతోపాటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించే అవకాశాలు వచ్చాయి. అలా ‘విచారణై’ అనే తమిళ సినిమాకి 2016లో జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నాను! ధనుష్‌ నటించిన ‘రఘువరన్‌ బీటెక్‌’ కారణంగా తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలయ్యాయి కానీ… మంచి ఆరంభం కోసం ఎదురుచూస్తూ వచ్చాను. ఆ ఎదురుచూపులు ఫలించే ‘అల వైకుంఠపురం’లో అప్పల్నాయుడు పాత్ర దక్కింది. ఆ చిత్రం తర్వాత గోపీచంద్‌ మలినేని క్రాక్‌ సినిమాలోని ‘కటారి కృష్ణ’ పాత్రకోసం అడిగారు. అది నిజజీవిత పాత్రకాబట్టి వాస్తవానికి దగ్గరగా నటించాను. ఈ రెండు చిత్రాలు ఏడాది గ్యాప్‌లో సంక్రాంతి రోజునే రిలీజయ్యాయి. ఆ రెండు సంక్రాంతులూ… నా కెరీర్‌లో కొత్త వెలుగుల్ని నింపాయి.

నాలాంటివాళ్ల కోసం…
వాడి పేరు గురు… చెన్నైకి వచ్చిన కొత్తల్లో నాకు ఆశ్రయమిచ్చిన మిత్రుడు. సినిమాల్లో ఎదగాలని ఎన్నో కలలు కనేవాడు. ఓసారి రోడ్డుపైన మాతో మాట్లాడుతున్న వాడల్లా వస్తూ ఉన్న ఓ బస్సు ముందుకెళ్లి ఓ దర్శకుడిలా షాట్‌ చూస్తున్నట్టు చేతులు పైకెత్తి నిల్చున్నాడు! బస్సు డ్రైవర్‌ సడన్‌బ్రేక్‌ వేయడంతో సరిపోయిందికానీ లేకపోతే ప్రాణాలు పోయేవే. మతిభ్రమించినట్లు శూన్యంలోకి చూస్తూ ఏవేవో మాట్లాడు తున్నాడు. వాణ్ణి అతికష్టంపైన రూముకి తెచ్చాం. అర్ధగంట తర్వాత ‘నాకేమైంది!’ అనడం మొదలుపెట్టాడు. మిత్రులందరం తలాకొంత వేసుకుని వాణ్ణి  వాళ్ళూరెళ్లే బస్సెక్కించాం. ‘ఇంటికెళ్లాడు కదా, బాగానే ఉంటాడులే!’ అనుకున్నాం తప్ప క్షేమసమాచారాలు కనుక్కునే ప్రయత్నం చేయలేదు. సినిమాల్లో నాకంటూ గుర్తింపు వచ్చాక వాణ్ణి కలవాలనిపించింది. వాడు ఎప్పుడో చెప్పిన గుర్తుల్ని పట్టుకుని ఊరెళ్లాను. వెళ్లాకే తెలిసింది… పిచ్చిముదిరి చానాళ్ల క్రితమే చనిపోయాడని! అప్పటి నుంచీ ఆ తల్లిదండ్రులకి నేనే కొడుకుగా అన్నీ చూస్తున్నాను. వాళ్లన్నయ్య పాపని డిగ్రీ చదివించి పెళ్ళిచేశాను. బాబుని చెన్నైకి తీసుకొచ్చి సివిల్స్‌ కోచింగ్‌లో చేర్పించాను. అంతేకాదు… ఒకప్పుడు సహాయదర్శకులుగా ఉండి ఇప్పుడు ఉపాధి కోల్పోయిన వాళ్ల పిల్లల చదువుల బాధ్యతా తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా పాతికమంది ఉన్నత చదువులు ముగించి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు!
 

Artist V. Jayaprakash

ఫోన్‌ వచ్చినా వణికిపోయేవాణ్ణి!

టాలీవుడ్‌ తండ్రి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచి… తెలుగు ప్రేక్షకుల మనసులో చెదిరిపోని స్థానం సంపాదించుకున్న నటుడు వి.జయప్రకాశ్‌. ‘నా పేరు శివ’తో తెలుగు తెరకు పరిచయం అయి వరుస సినిమాలతో దూసుకెళుతున్న ఈ నటుడి జీవితం ఆద్యంతం ఆసక్తికరం. పెట్రోల్‌ బంకులో పనివాడిగా జీవితం మొదలుపెట్టి వ్యాపారవేత్తగా, నిర్మాతగా, సినీ నటుడిగా ఎదిగారు. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలూ ఎదురు దెబ్బలూ ఎందరికో పాఠాలు అంటారు జయప్రకాశ్‌. ఆ ఒడుదొడుకులన్నీ ఆయన మాటల్లోనే…
చాలామంది ‘డెస్టినీ’ అని మాట్లాడుకుంటుంటే నేను కొట్టి పారేసే వాడిని. మన కష్టమే మనల్ని ఒక తీరానికి చేర్చుతుంది, అనుకున్న చోట నిలబెడుతుంది అనుకునేవాడిని. ఎందుకంటే- నా జీవితంలో నేను చాలా అనుకున్నా… చేసేశా. కానీ, చివరికి నేను ఎన్నడూ ఊహించనీ, కోరుకోని నటనవైపు వచ్చి నటుడిగా స్థిరపడ్డా. బహుశా అదేనేమో డెస్టినీ అంటే… నా జీవితంలోకి తొంగి చూసుకుంటే అదే అనిపిస్తుంది.
మాది తమిళనాడుకు చెందిన మరాఠీ కుటుంబం. మా పూర్వీకులు నాగపట్టణం జిల్లాలోని శీర్గాళిలో స్థిరపడ్డారు. నాకు ముగ్గురు అక్కలు. నాన్నది ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాపారం. నా చిన్నతనంలో మాది సంపన్న కుటుంబమే. నేను పీయూసీకి వచ్చేసరికి నాన్న వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. దాంతో వ్యాపారం తీసేసి ఓ చిన్న కంపెనీలో ఉద్యోగానికి చేరారు. చాలీచాలని ఆ జీతంతో కుటుంబాన్ని పోషించడానికీ, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికీ నాన్న ఎంతో కష్టపడేవారు. అవన్నీ దగ్గరగా చూసిన నాకు చదువు మీద ఆసక్తిపోయింది. దాంతో పీయూసీ తరవాత చదువు మానేశా. ఏదైనా పని చేసి మా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. అలా చిన్న వయసులోనే చెన్నైకి వచ్చేశా. అక్కడ మా కజిన్‌ పెట్రోలు బంకు పెట్టాడని తెలిసి వెళ్లా. వాహనాల్లో పెట్రోల్‌ నింపే పని ఇచ్చాడు. కొంతకాలం అటెండర్‌గానూ చేశా. ఆ తరవాత క్యాషియర్‌గా నియమించారు. క్రమంగా మా కజిన్‌ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించాడు. ఆ చుట్టుపక్కల ఉన్న మరో నాలుగు బంకుల్ని చూసుకునే స్థాయికి వచ్చా. ఈ లోపులో బంకునిర్వహణకు కావల్సిన నైపుణ్యాలన్నీ వచ్చేశాయి. ఇంతలో నష్టాల్లో ఉన్న ఓ బంకును అమ్ముతున్నారని తెలిసింది. కొందామని వెళితే నేను దాచుకున్న డబ్బుకి ఇంకాస్త అవసరమవుతుందని అర్థమైంది. ఎలాగైనా దాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. దాంతో మా ఊరు వెళ్లి నాన్నకి విషయం చెప్పి ఇల్లు అమ్ముదామని అడిగా. అప్పటికే నాన్న నష్టపోయి రాజీపడి బతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు అమ్ముదామని అడగడం చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ, నామీదున్న నమ్మకంతో నాన్న మారుమాట్లాడకుండా సరే అన్నారు. అలా బంకు కొన్న నేను చాలా కాలం బాయ్‌ నుంచి మేనేజర్‌గా రకరకాల పనులు చూసుకునేవాడిని. దాన్ని అభివృద్ధి చేసి లాభాల బాట పట్టించడానికి నాకు పదేళ్లు పట్టింది. ఆ లాభాలతో డెయిరీ వ్యాపారం మొదలుపెట్టా. కానీ కొంత కాలానికి నష్టం వచ్చింది. అలాగని దాన్ని తలచుకుని బాధపడుతూ కూర్చోవడం నాకిష్టం లేదు. అంత కంటే మంచి వ్యాపారం ఏదైనా ఉంటుందా అని ఆలోచించినప్పుడు బిలియర్డ్స్‌ క్లబ్‌ గురించి తెలిసింది. అప్పటికి చెన్నైలో చాలా తక్కువ క్లబ్‌లు ఉన్నాయి. దాంతో ఓ ఖరీదైన ఏరియాలో బిలియర్డ్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశా. ఏడాది తిరిగే సరికి పెట్టుబడితోపాటు ఊహించని లాభాలు వచ్చాయి.

అదే మలుపు…
బిలియర్డ్స్‌ క్లబ్‌ నా జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పాలి. దాని వల్ల నాకు సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పరిచయాలు అయ్యాయి. అప్పటి వరకూ సినిమాల ఆలోచనే లేదు. అప్పుడప్పుడూ చూసేవాడిని అంతే. అయితే ఓ ఇద్దరు స్నేహితులు సినిమాలు చేద్దామని అడిగారు. దాంతో వారితో కలిసి ‘రోజా కంబైన్స్‌’ పేరిట నిర్మాణ సంస్థను మొదలుపెట్టి సినిమాలు తీశా. మొదట్లో వచ్చిన హిట్లు మాలో ఊపును పెంచాయి. అయితే చిన్న నిర్మాతగా రాణించడం మాత్రం చాలా కష్టమని అర్థమైంది. థియేటర్లు లభించక చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. కోట్లు పెట్టి ఉత్సాహంగా సినిమా తీసేవాళ్లం. తీరా విడుదల సమయానికి థియేటర్లు దొరక్క ఎంతో బాధపడేవాళ్లం. దాంతో కొన్నాళ్లకి సినీ రంగం నుంచి బయటకొచ్చి వ్యాపారాల మీద దృష్టి పెట్టా. కొంత కాలానికి నటుడు విజయ్‌కాంత్‌ ‘నేను కాల్షీట్లు ఇస్తా. ఓ సినిమా చేయండి’ అని అడిగారు. ఆయన మాట కాదనలేకపోయా. దాంతో 2001లో ఓ స్నేహితుడితో కలిసి ‘జీజే సినిమాస్‌’ సంస్థను ఆరంభించి ‘తవసి’ అనే సినిమా తీశా. దానికి మంచి పేరూ లాభాలూ వచ్చాయి. ఆ తరవాత పెద్ద నటులతో సినిమా తీసే అవకాశం వచ్చింది. అలానే మా బ్యానర్‌లోనే 2004లో హీరో విశాల్‌ను నటుడిగా పరిచయం చేశా. తెలుగులో ‘ప్రేమ చదరంగం’ పేరిట వచ్చిన ఆ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. నిర్మాతగా మంచి పేరు ఎంత తొందరగా వచ్చిందో… అంతే వేగంగా ఆర్థికంగా నష్టాలు రావడమూ మొదలైంది. సరైన నిర్ణయాలు తీసుకోలేకనో మంచి కథలు ఎంచుకోకపోవడం వల్లనో సినిమాలు వరుసగా ఫ్ల్లాప్‌ అయ్యాయి. దాంతో ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. పొద్దుపొద్దునే ఫైనాన్సర్లూ, అప్పులు ఇచ్చిన వాళ్లూ ఇంటికొచ్చి డబ్బులు అడిగేవారు. బంకు దగ్గరకు వెళితే అక్కడ కొందరు నాకోసం కాచుకుని ఉండేవారు. వచ్చిన వాళ్లకి డబ్బులేదూ, నేను నష్టపోయా అని చెప్పడానికి నామోషీగా ఫీలయ్యేవాడిని. దాంతో వ్యాపారంలో వచ్చిన డబ్బులు వచ్చినట్టు అప్పులు తీర్చడానికి వాడేవాడిని. అయితే అప్పుడే ఓ పెద్ద బడ్జెట్‌ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఆ సినిమా విడుదల అయితే అప్పులన్నీ తీరిపోయి గట్టెక్కుతాననిపించింది. దాంతో వ్యాపారాలు అమ్మేసి ఆ సినిమాకి పెట్టా. దురదృష్ట వశాత్తూ ఆ సినిమా విడుదల కాలేదు. దాంతో ఉన్న ఇల్లు తప్ప చేతిలో, బ్యాంకులో రూపాయి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఆ బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఫోన్‌ వచ్చినా వణికిపోయేవాడిని. అలాంటి పరిస్థితుల్లో ‘నా ఆటోగ్రాఫ్‌’ సినిమా తీసిన నా స్నేహితుడు చేరన్‌ తాను దర్శకత్వం చేస్తున్న ఓ సినిమాలో నటించమని అడిగాడు. నటించలేననీ, వేరే వాళ్లని తీసుకోమనీ చెప్పా. ‘లేదు నా సినిమాలో నువ్వే ముఖ్య పాత్ర పోషిస్తున్నావు’ అని బలవంతం చేశాడు. మొదటి రోజు సెట్‌కి వెళ్లా. కెమెరా ముందుకు వెళ్లగానే కాళ్లూ, చేతులూ వణకడం మొదలైంది. దాంతో షూటింగ్‌ మధ్యలోనే వదిలేసి ఇంటికొచ్చా. అయినా సరే మర్నాడు ఆ సీన్‌ నాతోనే చేయించాడు చేరన్‌. విడుదలయ్యాక సినిమాతోపాటు నా పాత్రకీ మంచి పేరు వచ్చింది. ఆ తరవాత మరికొందరు దర్శకులు అవకాశాలు ఇచ్చారుగానీ ఎవరూ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. ఓ నాలుగైదు సినిమాల తరవాత నా నటనను చూసి అప్పుడు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. రెండుమూడేళ్ల తరవాత నేను నటించిన ఓ సినిమాకి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ఊహించని స్థాయిలో అందులోని పాత్ర నాకు పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. వ్యాపారవేత్త, నిర్మాత అనే విషయాలను దాటి నాలో ఓ నటుడు ఉన్నాడనే నమ్మకాన్ని నాకు కలిగించింది.
అప్పటి వరకూ తెలియదు
2014లో నేను టాలీవుడ్‌లో అడుగుపెట్టా. ‘రన్‌ రాజా రన్‌’లో శర్వానంద్‌ తండ్రిగా కూరగాయలు అమ్మే పాత్రలో నటించా. ఆ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒకరోజు జీవీకే మాల్‌లో షాపింగ్‌కి వెళ్లా. వెళ్లిన దగ్గర్నుంచీ కనిపించిన వాళ్లు నన్ను చూసి నవ్వడం, దగ్గరికొచ్చి మాట్లాడటం, సెల్ఫీలు అడగడం చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంకా తెలుగులో సినిమా విడుదల కూడా కాలేదు… నన్ను చూసి ఎవరు అనుకుంటున్నారో అని మనసులో భయపడ్డా. కాసేపటికి నా దగ్గరకు వచ్చిన కొందరు కాలేజీ పిల్లలతో అదే చెప్పా. ‘లేదు సర్‌… ‘నాపేరు శివ’లో మీరు కాజల్‌ తండ్రిగా నటించారు. మీ నటన చాలాబాగుంది’ అని చెప్పడంతో ఆశ్చర్యమేసింది.
తమిళంలో తీసిన ఆ సినిమాని తెలుగులోనూ విడుదల చేశారని అప్పటి వరకూ నాకు తెలియదు. రూమ్‌కి వెళ్లి గూగుల్‌లో వెతికితే అందులో నా పాత్రకి ఎన్నో మంచి రివ్యూలు వచ్చాయి. తెలుగులో నటించొచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా కలిగింది. ఆ తరవాత వచ్చిన ‘సరైనోడు’లో అల్లు అర్జున్‌కి తండ్రిగా నటించమని బోయపాటి శ్రీను అడిగారు. అంతేకాదు, తెలుగులో నన్నే డబ్బింగ్‌ చెప్పమన్నారు. దాంతో నేను సెట్‌లో రోజూ అసిస్టెంట్‌ డైరెక్టర్ల దగ్గర ట్యూషన్‌ చెప్పించుకుని తెలుగు స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్నా. అలా ఆ సినిమాకి డబ్బింగ్‌ చెప్పుకున్నా. అప్పట్నుంచీ మిగతా సినిమాలకీ చెప్పుకోవడం మొదలుపెట్టా. అఆ, అజ్ఞాతవాసి, జవాన్‌, వినయ విధేయరామ, చిత్రలహరి, జెర్సీ, అశ్వథ్థామ, వరల్డ్‌ఫేమస్‌ లవర్‌, తాజాగా వచ్చిన ‘వి’ సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలానే మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, సీటీమార్‌, కపటధారి చిత్రాలు విడుదల కావల్సి ఉన్నాయి. నటనలోకి వచ్చాక నటుడిగా దొరికిన సంతృప్తి నాకు ఏ రంగంలోనూ దొరకలేదు. అందుకే మరో వ్యాపారంలోకి వెళ్లలేదూ, వెళ్లను కూడా.ఆ కోరిక తీరింది…

చాలామంది దర్శకులు ‘మా సినిమాలో మిమ్మల్ని తప్ప మరెవర్నీ తండ్రి పాత్రలో ఊహించుకోలేం’ అంటుంటారు. నటుడిగా నా జీవితంలో అంతకంటే పెద్ద ప్రశంస ఇంకేదీ ఉండదు. బీ నేను రజనీకాంత్‌కి వీరాభిమానిని. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని కలలు కనేవాడిని. ‘లింగ’లో ఆయనతో కలిసి నటించడంతో ఆ కోరిక తీరింది.
* దర్శకుడు శంకర్‌ ‘2.0’లో పక్షిరాజు పాత్రకు డబ్బింగ్‌ చెప్పమన్నప్పుడు భయమేసింది. నా వాయిస్‌లో బేస్‌ సరిపోదని కంగారుపడ్డా. కానీ శంకర్‌ దగ్గరుండి డబ్బింగ్‌ చెప్పించారు.


తను లేక నేను లేను…

మాది ప్రేమ వివాహం. నా భార్య బాగా చదువుకుంది. తొలినాళ్లలో నాకు పెట్రోలు బంకులో ఉద్యోగం ఇచ్చిన కజిన్‌కు సూపర్‌ మార్కెట్‌ ఉండేది. అప్పట్లో తను ఆ మార్కెట్‌ బాధ్యతలు చూసుకునేది. అక్కడ తనని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయా. మా ఇంట్లో మొదట కులాంతర వివాహానికి ఒప్పుకోలేదు. అమ్మానాన్నల్ని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నా. తను చాలా స్ట్రాంగ్‌ పర్సన్‌. వ్యాపారాల్లో నష్టపోయి బాధలో ఉన్నప్పుడు తనే బయటకు తీసుకొచ్చింది. అందుకే తను లేకపోతే నేను లేను అని గర్వంగా చెబుతా. పిల్లల విషయానికి వస్తే మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి నిరంజన్‌ ఆటోమొబైల్‌రంగం వైపు వెళ్లాడు. చిన్నోడు దుష్యంత్‌కి సినిమాలంటే చాలా ఇష్టం. ఓ సినిమాలో నటించాడు.

Artist Satyadev

4dac1f30-f346-415e-948b-f568bf3ebb04

 

అప్పుడు… రోజుకి రెండు గంటలే నిద్ర!

కొవిడ్‌ కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. ఇదే సమయంలో ఓటీటీలో కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. అవ్వడమే కాదు, మంచి ఆదరణనీ పొందుతున్నాయి. సత్యదేవ్‌ కంచరాన నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య…’ కూడా ఆ కోవలోకి వస్తుంది. చిన్న పాత్రలతో మొదలైన సత్య సినీ ప్రయాణం… స్వల్ప వ్యవధిలోనే కథానాయకుడి స్థాయికి చేరింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోవడం సత్యా ప్రత్యేకత. ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తన సినిమా ప్రయాణం గురించి చెబుతున్నాడిలా…
సినిమా ఆలోచన…
ఎప్పుడెలా వచ్చిందో స్పష్టంగా తెలియదు. చిన్నప్పుడు చిరంజీవిగారి పాటలు పెడితే కానీ తినేవాణ్ని కాదట. ఊహ తెలిసినప్పట్నుంచీ సినిమానే కెరీర్‌ అనుకునేవాణ్ని. బ్యాక్‌ బెంచ్‌లో కూర్చునేవాణ్ని కానీ…80 శాతం మార్కులు వచ్చేవి. అది చాలు కదా, ఇంట్లో స్వేచ్ఛ ఇవ్వడానికి! నేను ఏ రంగంలో ఉన్నా రాణిస్తాననే నమ్మకం అమ్మానాన్నలకు ఉండేది. పుట్టి పెరిగింది వైజాగ్‌లోనే. కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశాక అక్కడే కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌లో నటించా. నా లక్ష్యం సినిమా. ఐశ్వర్యారాయ్‌ని ప్రేమించాలంటే ముంబయి వెళ్లాలి, అమలాపురంలో ఉంటే అవ్వదు కదా! అందుకే హైదరాబాద్‌ వచ్చా.

రాత్రి ఉద్యోగం పగలు సినిమా!
హైదరాబాద్‌లో ధైర్యంగా అడుగు పెట్టాలంటే ఒకటే మార్గం… ఉద్యోగం. అందుకోసమే ఐబీఎమ్‌లో జాబ్‌ సంపాదించా. రాత్రి ఉద్యోగం, పగలు సినిమా ప్రయత్నాలు. మధ్యలో బెంగళూరుకి బదిలీ అయింది. అప్పుడు వీకెండ్స్‌ ఆడిషన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చేవాణ్ని. అలా ‘బ్లఫ్‌ మాస్టర్‌’ వరకూ దాదాపు ఆరేళ్లు ఉద్యోగం చేస్తూనే సినిమాల్లోనూ నటించాను. 2017లో ఇంట్లోవాళ్లకి చెప్పి ఉద్యోగం మానేశా. నిజానికి వాళ్లెప్పుడూ ఉద్యోగం చేయాల్సిందేనని చెప్పలేదు. సినిమా రంగంలో పరిస్థితులు మనం ఊహించినట్టుగా ఉండవు. అందుకే ఉద్యోగం చేస్తూనే సినిమా ప్రయత్నాలు చేశా. నిద్ర మానుకుని నా పేషన్‌ కోసం ప్రయత్నించేవాణ్ని. సినిమా కష్టాలని ప్రత్యేకంగా అంటుంటారు కానీ… కష్టాలు ఎందులో ఉండవు. చదువులోనూ, ఉద్యోగంలోనూ ఉంటాయి. నేను మాత్రం దేన్నీ కష్టంగా చూడలేదు. సినిమాలకీ, రాజకీయాలకీ విద్యార్హతలు ఏమీ ఉండవు. లక్షల మంది ప్రయత్నాలు చేస్తుంటారు.
అవకాశాలు దొరక్క వెనుదిరిగేవాళ్లూ అదే స్థాయిలోనే ఉంటారు. సినిమాల్లోకి వెళ్తున్నామంటే… ‘నువ్వేమైనా చిరంజీవి అవుతావా, వర్కవుట్‌ అవ్వదు’ అని ఉచిత సలహాలిస్తారు. చాలామంది ప్రయత్నం చేసి వచ్చేశారని చెబుతారు. వాళ్లు ఐదు కిలోమీటర్లు మట్టి దారిలో ప్రయాణం చేసొచ్చిన అనుభవం గురించే చెబుతారు. కానీ మరో ఐదు కిలోమీటర్లు వెళితే ‘హై వే’ వస్తుందేమో, ఆ దారీ చూడాలి కదా. చిన్నప్పట్నుంచీ నేను నమ్మింది ఇదే. అప్పుడు అలా ఎందుకు అనిపించేదో ఈ ప్రయాణం తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ‘ఇందుకే కదా నేను
ఎవరిమాటా వినంది’ అనుకుంటుంటా.
మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌తో మొదలు…
సినిమా రంగంలో ఎవరితోనూ పెద్దగా పరిచయాలు లేకపోవడంతో ఆఫీసుల చుట్టూ ఫొటోలు పట్టుకుని తిరిగేవాణ్ని. పిలుపొస్తే ఆడిషన్లు ఇచ్చేవాణ్ని. ఆ టైమ్‌లోనే రిషీ ప్రసాద్‌ పరిచయమయ్యాడు. తను డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేవాడు. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ఆడిషన్స్‌ జరుగుతున్నాయని అతడి ద్వారా తెలుసుకుని వెళ్లాను. అందులో ప్రభాస్‌కి స్నేహితుడిగా చేసే ఛాన్స్‌ వచ్చింది. పద్దెనిమిది రోజులు సిడ్నీలో ఉన్నాం. తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్న చిత్రమది. తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో మహేష్‌బాబుకి స్నేహితుడిగా కనిపించా. ‘అత్తారింటికి దారేది’లో ఓ ఫైట్‌లో కొన్ని సెకన్లు కనిపిస్తా. ‘ముకుంద’, ‘అసుర’ సినిమాల్లో నెగెటివ్‌ పాత్రలు చేశా. నటుడిగా రాణించాలనుకునేవాణ్ని తప్ప హీరో అవ్వాలనుకోలేదు.
నసీరుద్దీన్‌ షా, ప్రకాష్‌రాజ్‌… తమ పాత్రల్ని ఎలా పండించగలుగుతున్నారో అనుకునేవాణ్ని. ‘అసుర’ సమయంలో నటుడు రవివర్మ నా జీవితాన్ని మలుపుతిప్పే ఓ సూచన ఇచ్చారు. ‘నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావ్‌’ అని అడిగారు. ‘నసీరుద్దీన్‌షా, ప్రకాష్‌రాజ్‌లాగా’ అని చెప్పినప్పుడు… ‘అలా కావాలంటే ఇంకో పదేళ్లు టైమ్‌ పడుతుంది. అప్పుడు పరిణతి వస్తుంది. ఈలోపు భిన్నమైన పాత్రలు చేయాలి. హీరో పాత్రలు ఎందుకు ప్రయత్నించకూడదు?’ అన్నారు. ‘లీడ్‌ రోల్స్‌ చేస్తే నిన్ను ప్రేక్షకులు చూసే విధానం కూడా మారుతుంద’ని చెప్పారు. ఆయన సలహాతోనే లీడ్‌ యాక్టర్‌ అవ్వాలనుకున్నాను.

జ్యోతిలక్ష్మి టర్నింగ్‌ పాయింట్‌
నా కెరీర్‌ని ‘జ్యోతిలక్ష్మి’కి ముందు-తర్వాత అని విభజించుకోవాలి. ఆ సినిమాతో నా ప్రయాణం మరో మలుపు తీసుకుంది. రవివర్మ గారూ నేనూ మాట్లాడుకున్న తర్వాత పది రోజుల్లోనే దర్శకుడు పూరీ జగన్నాథ్‌ గారి ఆఫీస్‌ నుంచి ఆడిషన్‌ కాల్‌ వచ్చింది. 500 మందిని పరీక్షించి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఏ పాత్రకి అన్నది తెలీదు. అప్పటికి నా బరువు 90 కేజీలు. బరువు తగ్గాలన్నారు. రెండు నెలల్లో 16 కేజీలు తగ్గాను. అప్పుడు ఆఫీసుకి వెళితే ‘నా సినిమాలో హీరో నువ్వే’ అని చెప్పారు పూరీ సర్‌. ఏదైనా మనం బలంగా అనుకుంటే ఈ విశ్వం కూడా మనకు సహకరిస్తుందంటారు కదా… అదే జరిగింది. పూరీ సర్‌తో కలిసి చేసిన ‘జ్యోతిలక్ష్మి’ ప్రయాణమే కాదు, ఆయనతో పరిచయమే ఒక అద్భుతం. నేను ఉద్యోగం చేస్తున్నట్టు పూరీ సర్‌కి అస్సలు తెలియదు. 37 రోజులు నాన్‌స్టాప్‌గా చిత్రీకరణ జరిగింది. రాత్రంతా ఉద్యోగం, పగలంతా షూటింగ్‌. శని, ఆదివారాలు మినహా రోజుకి రెండు గంటలు మాత్రమే పడుకునేవాణ్ని. ఇప్పుడు తలచుకుంటే అలా ఎలా చేశానా అనిపిస్తోంది. ఆ సినిమా తర్వాత పరిశ్రమ నన్ను చూసే విధానమే మారిపోయింది. ఆ సినిమా చూసి ప్రకాష్‌ రాజ్‌గారు ‘మన వూరి రామాయణం’లో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆర్‌.ఆర్‌. జరుగుతుండగా ప్రకాష్‌రాజ్‌ ఓ రోజు ఫోన్‌ చేసి నా నటనని ఇళయరాజా మెచ్చుకున్నారని చెప్పారు. ‘వామ్మో’ అనుకున్నా. పూరీగారు నాకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఎలాంటి సందేహం ఉన్నా ఆయన్ని అడుగుతాను. నా సినిమా రిలీజ్‌ అవుతుందంటే ‘ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ మెసేజ్‌లు పెడతారు. రివ్యూలు బాగా వస్తే వాటిని నాకు పంపిస్తారు.  ఆయన చేతిమీద ఒక టాటూ ఉంటుంది. ‘నాట్‌ పర్మినెంట్‌’ అని. ఏదీ శాశ్వతం కాదు అని దానర్థం. అలాంటివి ఆయన్నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటాయి. ఆయనోసారి మాటల్లో… ‘మా అమ్మగారికి నీ నటనంటే ఇష్టం. సత్యతో సినిమా చెయ్యి అంటుంటారు. నిర్మాత సిద్ధంగా ఉంటే నేనెప్పుడూ రెడీ సత్యా’ అన్నారు. అలా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో నాకు అవకాశం ఇచ్చారు.
అప్పుడు అనుకున్నాం కానీ…
జ్యోతిలక్ష్మి తర్వాత… క్షణం, అంతరిక్షం, ఘాజీ, బ్లఫ్‌మాస్టర్‌, బ్రోచేవారెవరురా, రాగల 24 గంటల్లో, సరిలేరు నీకెవ్వరు… ఇలా చాలా సినిమాలు చేశాను. వాటిలో కొన్ని లీడ్‌ రోల్సూ ఉన్నాయి. నేను నటించిన 47 డేస్‌, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఓటీటీలో విడుదలయ్యాయి. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర…’ నాకెంతో గుర్తింపు తెచ్చింది. ఇందులో నాది ఫొటోగ్రాఫర్‌ పాత్ర. నన్ను కొత్త ప్రేక్షకులకు పరిచయం చేసింది. 2016లో మలయాళంలో వచ్చిన ‘మహేషింతే ప్రతీకారమ్‌’కి రీమేక్‌ ఇది. హీరో తనకు ఎదురైన అవమానానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడన్నది కథ. మలయాళంలో విడుదలైనపుడే దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఈ సినిమా చూడమంటే చూశా. అద్భుత మనిపించింది. ఆ కథని తెలుగులో తీద్దామని నిర్మాతకోసం తిరిగాం. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రయత్నాన్ని విరమించుకున్నాం. ఆ సమయంలో వెంకటేష్‌ మహా నాకో కథ వినిపించాడు. ఆ ప్రాజెక్టూ పట్టాలెక్కలేదు. తర్వాత తను ‘కేరాఫ్‌ కంచరపాలెం’ తీశాడు. దాంతో మహాకి మంచి పేరొచ్చింది. తర్వాత ఒకరోజు ‘మహేషింతే ప్రతీకారమ్‌’ని రీమేక్‌ చేద్దామని మెసేజ్‌ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా
అనిపించింది. కథని మహా తెలుగు వాతావరణంలోకి మార్చి అరకు నేపథ్యంలో తీసిన తీరు అద్భుతం.
పాత్రల్ని ఎంపిక చేసుకునేటప్పుడు- స్క్రిప్టు విన్నాక ఆ పాత్రలో ఇమడగలనో లేదో చూస్తాను. ఫిట్‌ అవుతాననిపిస్తే ఓకే చెబుతాను. ఇదివరకెప్పుడూ అలాంటి పాత్ర చేయకపోతే నాలోని నటుడిని సంతృప్తి పర్చడానికి చేస్తాను. కొత్తగా ఉంటే తక్కువ నిడివి పాత్ర చేయడానికీ రెడీ. ఏ పాత్రనైనా అంగీకరించాక అందుకు అవసరమైన స్కెలెటిన్‌ను మానసికంగా సిద్ధం చేస్తాను. దానికి దర్శకుడు జీవం పోస్తారు. వ్యతిరేక ఛాయలున్న పాత్రలూ, ముఖ్యమైన క్యారెక్టర్లూ, లీడ్‌ పాత్రలూ… ఇలా భిన్న రకాలుగా ప్రయాణం చేస్తున్నాను.
బీచ్‌ గాలి పట్టాల్సిందే!
నా వ్యక్తిగత జీవితంపైన వైజాగ్‌ ప్రభావం బలంగా ఉంటుంది. ఆ సముద్రం, బీచ్‌… అక్కడ కాసేపు ఒంటరిగా సేదతీరేటపుడు ఓ నిశ్శబ్దమైన గాలి మనసుని తాకుతుంది. అందుకే వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తా. అక్కడ పుట్టి పెరిగినోళ్లలో కొంచెం వెటకారం ఉంటుంది. తెలిసినవాళ్లతో మాట్లాడే టపుడు నాలోనూ అది కనిపిస్తుంటుంది. మా ఉమామహేశ్వరుడిలాగా అప్పుడప్పుడూ ఉగ్రరూపం బయటికొస్తుంటుంది. కామన్‌ సెన్స్‌ లేకుండా ప్రవర్తించేవాళ్లని చూస్తే కోపం వస్తుంది. ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తుంటారు కొంతమంది. కారు పార్కింగ్‌ చేసే చోట, నీళ్లు వాడేచోట… ఇలా ప్రతిచోటా కనిపిస్తుంటారు. అలాంటివాళ్లకి గట్టిగా చెప్పాలనిపిస్తుంటుంది.
ఐబీఎమ్‌లో ఉద్యోగం మానేసేనాటికి నా నెల జీతం రూ.1.75 లక్షలు. అమెరికా పంపించడానికి వీసా కూడా సిద్ధం చేశారు. వర్చువల్‌ డిజైన్‌ ఆర్కిటెక్ట్‌ విభాగంలో టీమ్‌లీడర్‌గా ఉన్నాను. ఆ ఉద్యోగంలోనే కొనసాగుంటే అమెరికాలో స్థిరపడేవాణ్నేమో. కానీ నా జీవితాశయం అది కాదు. ఆర్థికంగా ఏ ఇబ్బందీ రాకూడదనే ఉద్యోగం చేశా తప్ప నా మనసంతా సినిమాపైనే. ఏ పనిచేసినా వంద శాతం న్యాయం చేయాలి… అనుకుంటా. ఉద్యోగం విషయంలో అదే చేశాను. నచ్చింది చేసినపుడు ఇంకాస్త ఎక్కువ కష్టపడాలన్నది నా పాలసీ. సినిమా విషయంలో ఇదే చేస్తున్నా!

- నర్సిమ్‌ ఎర్రకోటఇంకొంత…

నాన్న కేవీఎన్‌ ప్రసాదరావు.ఈనాడులో అడ్వర్టైజింగ్‌ విభాగంలో మేనేజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్‌లో పనిచేస్తున్నారు. అమ్మ లక్ష్మి గృహిణి. నా భార్య దీపిక. మేమిద్దరమూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. తను సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసేది. ప్రస్తుతం ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో ఉంది.
* పాటలు పాడటం ఇష్టం. ఒక మాదిరిగా పాడగలను.
* ఎంత పెద్ద హోటల్‌లో తిన్నా కూడా, కృష్ణానగర్‌లోని నారాయణ టిఫిన్‌ సెంటర్‌లో తినడం ఇష్టం.
* ఖాళీ దొరికినపుడు సినిమా కథలు రాసి పెట్టుకుంటా.
* చాలామంది నా వాయిస్‌ను మెచ్చుకుంటారు. ప్రభాస్‌మీద అభిమానంతో ‘సాహో’లో నీల్‌ నితిన్‌ ముకేష్‌కి డబ్బింగ్‌ చెప్పా. పూరీగారు నా కళ్లలోని నిజాయతీని చూసి ‘జ్యోతిలక్ష్మి’కి ఎంపికచేశారట.
* గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి, లాక్డ్‌… వెబ్‌సిరీస్‌లలోనూ నటించాను. ప్రస్తుతం నాలుగు సినిమాలకు సంతకం చేశా!

 

Charecter Artist Srikanth ayyangar

Artist srikant ayyangar

Artist Nanditadas

Nanditadas 1 nanditadas

Artist Manjula Ghattamaneni

Manjula ghattamaneni 1 Manjula ghattamaneni

Artist jeeva

Artist jeeva

Actor/Anchor Anasuya

anasuya 1 anasuya 2 Anasuya Anchor anasuya

Artist Dubbing janaki

artist dabbing janaki 1 artist dabbing janaki 2