అమ్మే మా WIFI

Mothers day: అమ్మే మా WIFI

కొణిదెల కుటుంబానికి ఉన్న ఆస్తి అనురాగం… హోదా మమకారం. ఈ రెండింటి వెనక ఉన్న శక్తి అంజనాదేవి. 10 మంది హీరోలున్న కుటుంబానికి పెద్ద. ‘మదర్స్‌ డే’ సందర్భంగా– మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తమ్ముడు నాగబాబు, చెల్లెళ్లు మాధవి, విజయ… అమ్మతో తమకున్న అనుబంధాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

Mothers day: అమ్మే మా WIFI

కొణిదెల కుటుంబానికి ఉన్న ఆస్తి అనురాగం… హోదా మమకారం. ఈ రెండింటి వెనక ఉన్న శక్తి అంజనాదేవి. 10 మంది హీరోలున్న కుటుంబానికి పెద్ద. ‘మదర్స్‌ డే’ సందర్భంగా– మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తమ్ముడు నాగబాబు, చెల్లెళ్లు మాధవి, విజయ… అమ్మతో తమకున్న అనుబంధాన్ని ‘నవ్య’తో పంచుకున్నారు.

అవే ఆస్తిపాస్తులు మనకు బంధాలు, బాంధవ్యాలు ఎనలేని ఆస్తిపాస్తులు. ‘భౌతికంగా ఎన్ని వచ్చాయి?’ అనే వాటికన్నా.. భౌతికంగా కొలవలేని ఇవే ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు ఆసరా ఇచ్చే భుజం కన్నా గొప్పదేమీ ఉండదు. అలా ఎంతో మందికి ఆసరా ఇవ్వగలిగినట్లు చేసింది అమ్మే! మేము ఆ చెట్టు కొమ్మలమే! ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మే కారణం.

అన్నయ్య పెద్ద ఆర్టిస్టు కాకముందు అమ్మ ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంటుంది. తన మాటతీరు కానీ, పనితీరు కానీ ఏమి మారలేదు. ఎవరైనా వచ్చి ‘మీరు అదృష్టవంతులు’ అంటే’– ‘వాళ్లు కష్టపడుతున్నారు.. కష్టం వాళ్లదే, ఫలితం వాళ్లదే’ అంటుంది. అంతేతప్ప ఇప్పుడున్నదంతా తన వారసత్వమేనని అనుకోదు.

– మాధవి.. విజయ

‘‘కళ్యాణ్‌బాబును చూస్తే కొంత బాధగా ఉంటుంది. ఎండనక.. వాననక తిరుగుతూ ఉంటాడు. ఆరోగ్యాన్ని పట్టించుకోడు. చిన్నప్పుడు వాడికి ఆస్తమా ఉండేది. అందువల్ల జాగ్రత్తగా చూసేదాన్ని. ఇప్పుడు కొన్ని కోట్ల మందికి సాయం చేయమని భగవంతుడు వాడికి పనిపెట్టాడు. వాడు విజయం సాధిస్తాడనే నమ్మకం నాకుంది’’

‘‘చిరంజీవి భోళా శంకరుడు. తన మనసులో ఏదీ ఉండదు. అందరి కష్టం తనదే అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులందరికీ సాయం చేస్తూనే వచ్చాడు. అప్పుడూ, ఇప్పుడూ తేడా ఏమీ లేదు’’.

‘‘సురేఖ నాకు కోడలు కాదు.. కూతురు. నాకు చిన్న జలుబు వచ్చినా వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్దామంటుంది. ఎప్పుడూ నన్ను కనిపెట్టుకొని ఉంటుంది.

– అంజనాదేవి

చిన్నప్పుడు ఈ పిల్లలందరూ ఎలా ఉండేవారు? బాగా అల్లరి చేసేవారా?

అంజనాదేవి: అంత అల్లరి ఎవరూ చేసేవారు కాదు. కానీ వీడే (చిరంజీవి వైపు చూపించి) అల్లరి ఎక్కువ చేసేవాడు.

చిరంజీవి (నవ్వుతూ): అమ్మా! చలాకీగా ఉండటానికి, చురుకుగా ఉండటానికి, అల్లరిగా ఉండటానికి తేడా ఉందమ్మా! నువ్వు ‘అల్లరి’ అంటే అందరూ తప్పు అర్ధం చేసుకుంటారు…

అంజనాదేవి: చాలా హుషారుగా ఉండేవాడు. నాకు తోడుగా ఉండేవాడు. వీళ్ల నాన్నగారు ఎప్పుడూ క్యాంపులకు వెళ్తూ ఉండేవారు. దాంతో ఇంటి పనితో పాటుగా పిల్లలందరి ఆలనాపాలనా చూసుకోవాల్సి వచ్చేది. ఆ సమయంలో నాకు తోడుగా ఉండేవాడు.

SUREKHA.gif

మీ చిన్నప్పుడు మరచిపోలేని సంఘటన ఏది?

చిరంజీవి: నాకు అప్పుడప్పుడే నడక వచ్చింది. నిడదవోలులో ఉండేవాళ్లం. మా ఇంటి పక్కన ఒక కుమ్మరి కొలువు ఉండేది. ఒక రోజు అమ్మ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు.. నేను పాక్కుంటూ రోడ్డు మీదకు వెళ్లిపోయాను. కుమ్మరి కొలువు దాకా వెళ్లానట. వాళ్లు చూసి నన్ను లోపల కూర్చోపెట్టారట. అమ్మ ఇంట్లో వెతికితే నేను లేను. దాంతో కంగారుపడి ఇరుగుపొరుగు ఇళ్లకు వెళ్లి అడగటం మొదలుపెట్టింది. కుమ్మరి కొలువుకు కూడా వచ్చి – ‘‘ఎవరైనా చిన్నబాబును చూశారా?’’ అని అడిగిందిట. వాళ్లు నన్ను చూపించి – ‘‘ఈ బిడ్డేనా?’’ అని అడిగారట. అప్పటికే కుమ్మరి కొలువులో బొగ్గుతో మసికొట్టుకుపోయి ఉన్నాను. అమ్మ ముందు నన్ను గుర్తుపట్టలేదు. ‘‘మావాడు కాదు..’’ అందిట. మళ్లీ జాగ్రత్తగా చూసి– ‘‘మా వాడే..’’ అని ఇంటికి తీసుకువెళ్లిందట. ఆ తర్వాత నేను బయటకు వెళ్లకుండా తాడుతో కట్టేసేది.

అంజనాదేవి: వీడు సందుదొరికితే బయటకు వెళ్లిపోయేవాడు. ఒకసారి గాంధీబొమ్మ సెంటర్‌ దగ్గరకు వెళ్లిపోయాడు. ఒక వైపు లారీలు, బస్సులు. నాకేమో పిల్లాడు కనిపించలేదనే కంగారు. మా వీధిలో ఒకాయన చూసి వీణ్ణి తీసుకువచ్చారు. ‘భాగవతం’లో కృష్ణుడు ఎక్కడికి వెళ్లకుండా కట్టేసినట్లు– వీణ్ణి తాడేసి కట్టాల్సి వచ్చేది. అయితే నేను ఇంటి పనిలో ఉంటే చెల్లెళ్లను, తమ్ముళ్లను వీడే చూసుకొనేవాడు. వాళ్లను స్కూలుకు, ట్యూషన్లకు వీడే దింపేవాడు.

విజయ: నాకు ఐదేళ్లు అనుకుంటా. అన్నయ్య రోజూ నన్ను డ్యాన్స్‌ క్లాస్‌కు తీసుకువెళ్లేవాడు. క్లాసు పూర్తయ్యే దాకా ఎదురుగా ఉన్న గోడ మీద కూర్చుని చూస్తూ ఉండేవాడు. ఆ దృశ్యం నాకు బాగా గుర్తుండిపోయింది.

చిరంజీవి: బాపట్లలో తనని డ్యాన్స్‌ క్లాస్‌లో చేర్చారు. ‘చందన చర్చిత..’ ‘నమోనమో నటరాజ నమో..’ లాంటి పాటలకు స్టెప్స్‌ నేర్పేవారు. నేను వాళ్లు డ్యాన్స్‌ చేస్తుంటే చూసి మానసికంగా నేర్చేసుకునేవాణ్ణి. నేను ఒక డ్యాన్స్‌ స్టార్‌గా ఎదిగానంటే మా పెద్ద చెల్లే కారణం. తనకు ఆ స్టెప్స్‌ గుర్తున్నాయో లేదో తెలియదు కానీ.. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు ఆ స్టెప్స్‌ వేయమన్నా వేస్తా!

PAVAN-KALYAN-F.gif

పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్పారా?

అంజనాదేవి: ఎక్కువ శంకర్‌బాబే చేసేవాడు.

నాగబాబు: అన్నయ్య పనులన్నీ చేసేవాడు. అన్నయ్య కాలేజీకి చదువుకోవటానికి వెళ్లిన తర్వాత పెద్దచెల్లి విజయ చేసేది. అస్సలు పనిచేయకుండా ఎగ్గొట్టింది నేనే. నాకు అమ్మ ఏదైనా పని చెబితే– అన్నయ్య దగ్గరకు వెళ్లి– ‘నువ్వు చేయ్‌’ అనేవాణ్ణి. అన్నయ్యకు కోపం వచ్చి ఒకటి పీకేవాడు. దాంతో నాకు కోపం వచ్చి– అస్సలు పనిచేసేవాణ్ణి కాదు..

చిరంజీవి: వీడు ఏ పనిచేయకపోయినా – అమ్మకు వీడంటేనే ఎక్కువ ఇష్టం. అమ్మకూచిలా వెనక వెనక తిరుగుతూ ఉండేవాడు..

మాధవి: మా అమ్మ మాకు ఎక్కువ పనులు చెప్పేది కాదు. అన్ని పనులు తనే చేసుకొనేది. ఇతరులపై ఆధారపడకూడదనేది తన ఉద్దేశం. అంతేకాకుండా నేను అందరి కన్నా చిన్న. అందువల్ల నన్ను ముద్దుగా చూసేవారు.

నాగబాబు: అమ్మ ఎక్కువగా కళ్యాణ్‌బాబు గురించి వర్రీ అవుతూ ఉండేది. ఎందుకంటే కళ్యాణ్‌ నచ్చని పదార్థం ఏదైనా ఉంటే తినేవాడు కాదు. ‘తర్వాత తింటాను’ అని వెళ్లిపోయేవాడు. చిన్నప్పుడు వాడికి ఆస్తమా ఉండేది. దాంతో వాణ్ణి ఎక్కువ జాగ్రత్తగా చూసేది. వాడే మా అందరిలో స్పెషల్‌ కిడ్‌.

అంజనాదేవి: చిన్నప్పుడు కళ్యాణ్‌బాబు బలహీనంగా ఉండేవాడు. ఎవరితోను కలిసేవాడు కాదు. ఎవరైనా ఇంటికి వస్తే– నా వెనక దాక్కొనేవాడు.

చిరంజీవి (నవ్వుతూ): కళ్యాణ్‌ చిన్నప్పటి నుంచి నిశ్శబ్ద నిరసనకారుడు..

CHIRU-FAM.gif

మీది దిగువ మధ్యతరగతి కుటుంబం. మీ పిల్లలు ఉద్యోగాలు చేయకుండా.. సంబంధం లేని సినీ పరిశ్రమకు వెళ్లినప్పుడు ఎలా ఫీలయ్యారు?

అంజనాదేవి: నేను కానీ.. మా వారు కానీ ఎప్పుడూ భయపడలేదు. భగవంతుడు రాసిన తలరాతనుబట్టి జరుగుతుందనుకున్నాం.

చిరంజీవి: ఇక్కడ నేనో విషయం చెప్పాలి. నాకు సినిమా జీన్స్‌ ఎలా వచ్చాయో నాకు తెలుసు.. మా అమ్మ అక్కినేని నాగేశ్వరరావుగారి ఫ్యాన్‌. తనకు సినిమాలు చూడటం అంటే ఇష్టం. నాన్న ఎస్వీఆర్‌ ఫ్యాన్‌. తనకు నటనంటే ఇష్టం. నేను కడుపులో ఉన్నప్పుడు అమ్మ, నాన్న– ‘జీవితం’ అనే సినిమా చూడటానికి వెళ్తున్నప్పుడు రిక్షా బోల్తా పడిపోయిందిట. నిండు గర్భిణికి దెబ్బలు తగిలాయని రోడ్డు మీద ఉన్న వారందరూ కంగారుపడ్డారట. అప్పుడే ఆ వైపు వెళ్తున్న బస్సు డ్రైవర్‌ కూడా– వీళ్లిద్దరిని ఊర్లో దిగబెడతానన్నాడట. కానీ అమ్మ, నాన్న తేరుకొని సినిమాకు వెళ్లిపోయారట. ఈ సంఘటన జరిగిన కొద్దికాలానికే నేను పుట్టాను. సినిమా అంటే విపరీతమైన అభిమానం, నటనంటే పిచ్చి ప్రేమ వీళ్లిద్దరి నుంచే నాకు వచ్చాయి..

నాగబాబు: అమ్మ, నాన్న నామీద ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. మేము బయటకు వెళ్తే – మళ్లీ ఎప్పుడు వస్తామా అని చూసేవారు కాదు. బయటకు చెప్పని ఒక స్వేచ్ఛ వారు మాకు ఇచ్చారు. ఆ స్వేచ్ఛలో ఒక భాగమే– అన్నయ్య ఇండస్ట్రీకి వెళ్లటం.

అంజనాదేవి: ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడు నాకు ఎంతో అదృష్టాన్ని ఇచ్చాడు. తనవల్లే కదా.. ఈ కుటుంబం ఎంతో పైకి వచ్చింది. కుటుంబంలో వారందరూ హీరోలు అయ్యారు. ఇప్పటికీ అందరినీ తండ్రి మాదిరిగా చూసుకుంటాడు.

చిరంజీవి: అమ్మ పడిన కష్టం తలచుకుంటే– ఇప్పటికీ గుండెలు అవిసిపోతాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనేదాకా బండి చక్రంలా తిరుగుతూ ఉండేది. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే! పనిమనిషిని కూడా పెట్టుకొనేందుకు వెసులుబాటు లేదు. దీంతో పాటు నాన్న ఏ చిన్న తేడా వచ్చినా ఊరుకొనేవారు కాదు. ఒక వైపు శారీరక శ్రమ, మరో వైపు మానసిక సంఘర్షణ… ఇదంతా నా కళ్లారా చూశాను. తన కష్టాలన్నీ నాతో చెప్పుకొనేది.. బహుశా తరువాత కాలంలో మహిళల సమస్యల పట్ల చాలాసార్లు స్పందించడానికి కారణం ఇదే కావచ్చు.

మీ అమ్మగారు మీకు ఇచ్చిన మరచిపోలేని సలహా ఏమిటి?

విజయ: ఒకప్పుడు నా జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చాయి. అప్పుడు అమ్మ నాతో– ‘‘నీ కష్టాలతో నువ్వే పోరాడాలి. నువ్వు ఎవరి దగ్గరకూ వెళ్లొద్దు. పుట్టింటి వాళ్లు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు.. ఎవరి దగ్గరకూ వెళ్లి ఉండదు. వెళ్తే నీ గౌరవం తగ్గిపోతుంది.. అందరూ నీకు సాయం చేస్తారు.. కానీ పోరాడాల్సింది నువ్వే’’ అని చెప్పింది. నా ఉద్దేశంలో అంతకన్నా గొప్ప సలహా ఎవ్వరూ ఇవ్వరు.

మాధవి: ఒక దశలో.. నానుంచి అందరూ నుంచి వేరుపడిపోయిన ఫీలింగ్‌ వచ్చి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అప్పుడు అమ్మ– ‘‘ప్రపంచంలో నీకు ఎవరు ఉన్నా, లేకపోయినా.. నేను ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు. ఎవరూ నీ తరపున లేకపోయినా నేను ఉంటాను. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు’’ అని చెప్పింది. నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. నేను ఏదైనా చేయగలననే ఫీలింగ్‌ వచ్చింది.

విజయ: మా అమ్మ స్ట్రాంగ్‌ లేడీ మాత్రమే కాదు. చాలా ప్రాక్టికల్‌ కూడా.

చిరంజీవి: అమ్మ చాలా పాజిటివ్‌. ఈ మధ్య నాతో శ్రీజ ఒక విషయాన్ని షేర్‌ చేసుకుంది. ఈ మధ్యకాలంలో శ్రీజ జీవితంలో కొన్ని ఒడుదొడుకులు వచ్చాయి. ఒక రోజు బాధగా ఉండి నాన్నమ్మ దగ్గరకు వెళ్లిందట. అప్పుడు అమ్మ– ‘‘లైఫ్‌ అంటే ఒక్కళ్లతోనే అయిపోదు. నిన్ను నియంత్రించి బాధపెట్టే వాళ్లకు దూరంగా ఉండాలి. నీ మనసుకు ఏది మంచిగా అనిపిస్తే అది చెయ్యి’’ అని చెప్పిందట. శ్రీజ వచ్చి– ‘‘డాడీ.. నాన్నమ్మ మాటలు వింటే చాలా పాజిటివ్‌గా అనిపించింది’’ అంది.

మాధవి: ఆ జనరేషన్‌లో అమ్మలాంటివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అమ్మ వల్లే మా అందరికీ స్వతంత్రంగా ఉండే వ్యక్తిత్వాలు వచ్చాయి.

నాగబాబు: అమ్మ నాకు ఎప్పుడూ సలహాలు ఇవ్వదు. కానీ అన్నీ నాతో షేర్‌ చేసుకుంటుంది. నాకు తను ఇచ్చే బెస్ట్‌ గిఫ్ట్‌.. కలిసినప్పుడు ఇచ్చే హగ్‌. తను చదువుకోలేదు. బయట ప్రపంచాన్ని చూడలేదు. కానీ అందరం కలిసి ఉన్నామంటే మాత్రం అమ్మే కారణం. మాకు అప్పుడప్పుడు గొడవలు వస్తాయి. అమ్మ దగ్గరకు వెళ్తే అన్నీ పోతాయి. టెక్నాలజీ భాషలో చెప్పాలంటే మా అందరినీ పాజిటివ్‌గా కలిపే మమతల వైఫై అమ్మే!

మనుమలతో ఎలా ఉంటారు..?

ఒక సమయంలో అందరం బిజీగా ఉండేవాళ్లం. అప్పుడప్పుడు కలిసేవాళ్లం. ఆ సమయంలో కూడా తనేమి ఫీలయ్యేది కాదు. పట్టించుకోవటం లేదనే నిరసన మాటలు ఉండేది కాదు. ఏం చేసి పెట్టమంటారని అడుగుతుంది. ఇప్పటికీ అమ్మకు మా ఇంట్లో వేరే కిచెన్‌ ఉంటుంది. ఎందుకంటే – తనకు స్ట్రెస్‌ బస్టర్‌ వంట. మాకు, మనవలు, మనవరాళ్లకు వండి పెడుతూ ఉంటుంది

చరణ్‌బాబు సరదాగా ఉంటాడు. ఎప్పుడూ బిజీగా ఉంటాడు కదా.. ఆడపిల్లలు దగ్గరకు వస్తారు. పెద్ద మనమరాలు సుస్మిత బాగా దబాయిస్తుంది. వాళ్ల తాత పోలిక. చిన్నది బాగా నెమ్మదస్తురాలు. ‘ఏమైనా కావాలా? అని అడుగుతూ ఉంటుంది. వరుణ్‌కు చాలా ఎఫెక్షన్‌. తేజ్‌బాబు, వైష్ణు ఇంతకు ముందు దగ్గరగా ఉండేవారు. చొరవ ఎక్కువ. మాధవి కూతుళ్లు కూడా నా దగ్గరే ఉండేవారు. మేము బిజీగా ఉన్న సమయంలో అమ్మ క్వాలిటీ టైం గడిపింది. వైష్ణు బాబు అడుగుతూ ఉంటాడు.

• సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌