జాతీయ ఉత్తమ నటుడు ‘ప్రకాష్ రాజ్’

prakashraj ee

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

వెండితెరపై నవరసాలను పండించడంలో ఆయనకు ఆయనే సాటి. దక్షిణ భారత సినీ ప్రపంచంలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని విభిన్న పార్శ్వాలతో అభిమానులను అలరిస్తున్నారు ప్రకాశ్‌రాజ్‌. ఆయన ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటకం, సినిమాల్లో ఆయన సాగించిన ప్రయాణం గురించి ఆలీతో పంచుకున్న విశేషాలు మీకోసం.. 

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

 

ప్రకాశ్‌రాయ్‌ నుంచి ప్రకాశ్‌రాజ్‌గా మార్చిన వ్యక్తి ఎవరు?

ప్రకాశ్‌రాజ్‌: కె. బాలచందర్‌ గారు.

ఆయన్ని ఎలా కలిశారు?

ప్రకాశ్‌రాజ్‌: బెంగళూరులో ఉన్నప్పుడు నాటకాల్లో చిన్నచిన్న వేషాలు వేస్తుండేవాడిని. సౌతిండియాలో గొప్ప నటుడవుతారని సీనియర్‌ నటి లక్ష్మి అనేవారు. ఆర్టిస్ట్‌ గీత నా ఫోటోను బాలచందర్‌కి పంపించారు. ఒకసారి చెన్నైకి వెళ్లి బాలచందర్‌ గారిని కలిశాను. 9 నెలల తర్వాత ఉదయాన్నే ఫోన్‌ చేసి సినిమాలో ఒక రోల్‌ చేయాలి, వెంటనే వచ్చేయమన్నారు. అలా వెళ్లి చేసిందే ‘డ్యూయెట్‌’. బాలచందర్‌గారే నా పేరు మార్చారు. ఆ సినిమా పెద్దగా ఆడకున్నా, నా కెరీర్‌కి బాగా ఉపయోగపడింది.

మీ సొంతూరు?

ప్రకాశ్‌రాజ్‌: పుట్టి పెరిగిందంతా బెంగుళూరులోనే. నాన్నది మంగళూరు. అమ్మది హుబ్లీ దార్వాడ్‌.ఒక అనాథాశ్రమంలో పెరిగి బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. మా నాన్న జబ్బుచేసి అదే ఆసుపత్రిలో చేరారు. అక్కడే అమ్మతో ప్రేమలో పడ్డారు.

కుటుంబంలో మొత్తం ఎంత మంది?

ప్రకాశ్‌రాజ్‌: మేం ముగ్గురం. చెల్లెలు ఆస్ట్రేలియాలో స్థిరపడింది. తమ్ముడు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

ఏ భాషలోనైనా మీ డబ్బింగ్‌ మీరే చెప్పుకుంటారు? ఎందుకు?

ప్రకాశ్‌రాజ్‌:  భాష మాట్లాడకపోతే  పెర్ఫార్మెన్స్‌ కనిపించదు.  మొదటి తెలుగు సినిమా సాయికుమార్‌ తమ్ముడు రవి డబ్బింగ్‌ చెప్పారు. బాలసుబ్రహ్మణ్యం స్టూడియోలో డబ్బింగ్‌ పనులు జరుగుతున్నప్పుడు.. ఎంతసేపు అలా కాదు, ఇలా కాదు అని చెబుతుంటే, గెటౌట్‌ అనేశారు. స్టూడియో బయటకొచ్చి ఏడ్చేశాను. నాకు భాష నేర్చుకోవడం, సాహిత్యం చదవడం ఇష్టం. భాష నేర్చుకోవడమంటే వారి సంస్కృతిని గౌరవించినట్లు అనిపిస్తుంది.

ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు?

ప్రకాశ్‌రాజ్‌: ఏడు భాషలు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తుళు భాషనూ మాట్లాడగలను.

హాలీవుడ్‌కి వెళ్తున్నారని తెలిసింది? 

ప్రకాశ్‌రాజ్‌: రెండు ప్రాజెక్ట్స్‌ చేయాల్సి ఉంది. ఒక వెబ్‌సిరీస్‌ కూడా ఉంది.

జాతీయ అవార్డులు ఎన్నొచ్చాయి?

ప్రకాశ్‌రాజ్‌: మొత్తం ఐదు. నాలుగు నటనకు, ఒకటి నిర్మాతగా అందుకున్నాను.

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

మొదటి అవార్డు ఏ సినిమాకొచ్చింది?

ప్రకాశ్‌రాజ్‌: ఇరువరు(ఇద్దరు) సినిమాకి వచ్చింది. ఆ తర్వాత అంతఃపురం, కాంజీవరం సినిమాలకు వచ్చాయి. నాలుగు భాషల్లో చేస్తున్నందుకు ఒకసారి స్పెషల్‌ జ్యూరీ వచ్చింది.

తెలుగులో మొదటి సినిమా?

ప్రకాశ్‌రాజ్‌: జగపతిబాబు హీరోగా ‘సంకల్పం’ అనే సినిమా చేశాను.

బాలచందర్‌ మీద అభిమానంతోనే మీ బ్యానర్‌కి పేరు పెట్టుకున్నారా? 

ప్రకాశ్‌రాజ్‌: నా జీవితం మొదలైంది ‘డ్యూయెట్‌’ సినిమాతోనే. అందుకే నిర్మాణ సంస్థకి డ్యూయెట్‌ ఫిల్మ్స్‌ అని పేరు పెట్టుకున్నాను. నా కారు వెనక కూడా అదే పేరుంటుంది.

తెలుగులో సంపాదించి…తమిళంలో పోగొట్టుకుంటారని మీ గురించి మాట్లాడుకుంటారు?  ఎంత వరకు నిజం?

ప్రకాశ్‌రాజ్‌: నాకు ‘ఆకాశమంత’ లాంటి మంచి సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ మార్కెట్‌ తెలియదు. అందుకే కొంత నష్టపోయాను. కానీ, ఇల్లు అమ్మి తీసిన సందర్భాలేమీ లేవు. ఏదైనా పరిమిత బడ్జెట్‌లోనే చేశాను. మొత్తం 26 చిత్రాలు నిర్మించాను. అందులో సగం విజయాలు, సగం పరాజయాలు.

మీపై నిషేధం ఎందుకు విధించారు?

ప్రకాశ్‌రాజ్‌: మహేశ్‌బాబుతో ఒక సినిమా చేయాల్సింది. షూటింగ్‌ వాయిదా వేస్తూ వెళ్తుండటం వల్ల సమయానికి డేట్లు కుదరలేదు. దీంతో వేరే నటుడిని తీసుకున్నారు. పేపర్లలో మాత్రం నన్ను తీసేసి వేరే నటుడిని పెట్టుకున్నారని రాశారు. అదెలా రాస్తారని గట్టిగా అడిగాను. దాంతో బ్యాన్‌ చేశారు. శ్రీనువైట్లతో ‘ఆగడు’ చేస్తున్ననప్పుడు ఆయనకు కావాల్సిన వేగం రావట్లేదు. ఆయన ఏ మూడ్‌లో ఉన్నారో తెలియదు. నేను వెళ్లిపోయాను. సీనియర్‌ నటుడిగా ఆయన్ను ‘శీను రేపొకసారి కలిసి మాట్లాడమ’ని అన్నాను. మరుసటి రోజు నా స్థానంలో సోనూసూద్‌ వచ్చారు. ఆ తర్వాత నేను బూతులు తిట్టానని నిషేధం విధించారు.

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

ప్రకాశ్‌రాజ్‌కి ఆటిట్యూడ్‌ లేకుంటే పరిశ్రమ నెత్తిన పెట్టుకునేదేమో అని నా అభిప్రాయం.

ప్రకాశ్‌రాజ్‌: ఒకవేళ ఈ ఆటిట్యూడ్‌ లేకుండా ఉండుంటే.. నేను ఇంత బలమైన వ్యక్తిగా మారేవాడిని కాదేమో. ప్రతిఒక్కరూ ఒకేలా ఉండలేరు కదా. దీనివల్ల ఎంత పొందానో, అంత పొగొట్టుకున్నాను.

ప్రకాశ్‌రాజ్‌ లక్ష్యమేంటి?

ప్రకాశ్‌రాజ్‌: తీవ్రంగా బతకడం. కేవలం రూ. 120తో చెన్నైకి వచ్చాను. జీవితం మొదట్లో లక్ష్యాలుంటాయి. అక్కడికి చేరుకున్నాక ఇంకేదో చేయాలనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రయాణమే ముఖ్యమనిపిస్తుంది. ప్రత్యేక లక్ష్యాలేమీ లేవు.

‘ఇరువరు’ సినిమా తర్వాత ప్రశంసలొచ్చాయా? వార్నింగులొచ్చాయా?

ప్రకాశ్‌రాజ్‌:  మణిరత్నం ముందుగా ‘ఆనందన్‌’ అనే పేరు పెట్టాలని అనుకున్నారు. అందులో కరుణానిధి పాత్ర పోషించాను. ఆ చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ‘కల్కి’ అనే సినిమాకు తమిళనాడు స్టేట్‌ అవార్డు వచ్చింది. కరుణానిధి చేతుల మీదుగానే అవార్డు తీసుకున్నాను. అప్పుడాయన మాట్లాడుతూ..‘ప్రకాశ్‌రాజ్‌కి అవార్డు ఇవ్వడం సభలో ఒక ఆనందం. దానికి కారణం ఆయనకు తెలుసు. నాకు తెలుసు. మా ఇద్దరికీ తెలుసు’ అని అన్నారు. ఇరువరు ఒక అందమైన ప్రయాణం.

కృష్ణవంశీకి అవార్డు ఇవ్వలేదని అలిగారంట?

ప్రకాశ్‌రాజ్‌:  ‘అంతఃపురం’లో పాత్రకు నాకు అప్పటికే ఆరు అవార్డులొచ్చాయి. కృష్ణవంశీకి రాకపోవడం బాధేసింది. ఆయనకే రావాల్సింది అనిపించింది. అందుకే నేను అవార్డు తీసుకోనని అలిగాను. అది స్టేట్‌ అవార్డు. దాసరి గారే ఫోన్‌ చేసి సర్దిచెప్పడంతో చివరకు వెళ్లాను.

ఎంతమంది పిల్లలు?

ప్రకాశ్‌రాజ్‌: ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి 25 ఏళ్లు. నా వ్యవసాయ క్షేత్రాలను ఆమే చూసుకుంటుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. రెండో అమ్మాయి మేఘన. ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర సంగీతం నేర్చకుంటోంది. ఒక అబ్బాయి ఉన్నాడు. సిద్దార్థ్‌ అని మొదటి కుమారుడు. ఓ ప్రమాదంలో చనిపోయాడు.

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

పోనీవర్మతో పరిచయం ఎలా అయింది?

ప్రకాశ్‌రాజ్‌: మొదటి భార్య లతతో కొన్ని కారణాల వల్ల విడిపోయాను. ఆ తర్వాత ఒంటరితనం ఏర్పడింది. అదే సమయంలో రాధామోహన్‌ సినిమా చేస్తున్నప్పుడు పోనివర్మను మొదటిసారి చూశా. ఆమె ముంబయికి చెందిన కొరియోగ్రాఫర్‌. కొన్నాళ్లకు బాలచందర్‌ సినిమా చేస్తున్నప్పుడు అర్జెంట్‌గా మాకో కొరియగ్రాఫర్‌ కావాలి. పక్కనే విజయ్‌ సినిమా సెట్‌కి వెళ్లినప్పుడు పోనీ కనిపించింది. ‘మీరు చేస్తారా?’ అనడిగాను. అలా పరిచయం. తర్వాత  ఆ పరిచయమే పెళ్లిదాక దారితీసింది. నాకప్పటికే ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పూజా మా పెళ్లికి అంగీకరించింది.  వాళ్లింట్లో వాళ్లను కలిశాను. మొదట వద్దన్నారు. తర్వాత పోనీవర్మ బలవంతం చేయడంతో ఒప్పుకొన్నారు.  ప్రస్తుతం లత, పోనీ  ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

ఇన్నేళ్ల ప్రయాణంలో పరిశ్రమ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడేదెవరు?

ప్రకాశ్‌రాజ్‌: నాకు సన్నిహితులు ఎక్కువ. కవులు, రచయితల్లో స్నేహితులు మరింత ఎక్కువ. సినిమాలో తక్కువ మంది స్నేహితులు. హాయ్‌, బాయ్‌ అని చెప్పుకొనే పరిచయాలే.  బయట మాత్రం చాలా మంది స్నేహితులున్నారు.

ఏం చదివారు?

ప్రకాశ్‌రాజ్‌: బీకామ్‌ సెకండియర్‌తోనే చదువు ఆపేశాను.  అకౌంటెంట్‌ అవ్వడం అస్సలు నచ్చట్లేదు. ఒకసారి మా ఇంగ్లీష్‌ లెక్చరర్‌ ‘ప్రకాశ్‌. నువ్వు నా సమయం, నీ సమయం వృథా చేస్తున్నావు’ అని అన్నారు. ‘నిజమే సర్‌’ అని క్లాస్‌లోంచి బయటకొచ్చేశాను.  నా జీవితంలో ఏమవ్వాలో తెలియదు. కానీ ఏం వద్దో అనేది మాత్రం తెలుసు. ఆ తర్వాత నాటకాల్లో చేరాను.

నాటకాల్లో చేరమని ఎవరు చెప్పారు?

ప్రకాశ్‌రాజ్‌: అమ్మానాన్నలది ఈ నేపథ్యం కాదు.  గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచన నాలో మెదిలేది. కాలేజీలో కూడా ఇంత సీరియస్‌నెస్ లేదు.  అక్కడ జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకోవాలి. జీకే గోవిందరావు అని ఇంగ్లీష్‌ లెక్చరర్ ఉండేవారు‌. నాటకాలు వేయించేవారు. అప్పటికే నేను బాగా నటిస్తాననే పేరు. రిహార్సల్స్‌కి పిలిస్తే వెళ్లలేదు. నేను తప్ప ఇంకెవరు చేస్తారనే పొగరు. తర్వాత రోజు వేరే కుర్రాడితో నాటకం వేశారు. నాటకం చెత్తగా ఉంది. మేమంతా నవ్వుకున్నాం. గురువుగారు పిలిపించుకుని ‘నాటకం బాగా రాలేదని నాకు తెలుసు ప్రకాశ్‌. నువ్వు గొప్ప నటుడు అవుతావు. కానీ నువ్వు లేకుంటే నాటకరంగం లేదనే అహంకారం నీకు ఉండకూడదు. అది నేర్పడానికి ఇలా చేశాను’అని చెప్పారు. అప్పుడు కూడా నవ్వుకున్నాను. పదేళ్ల తర్వాత కాలేజీకి వెళ్లాను. అప్పటికీ పొగరుతోనే వెళ్లాను. అక్కడ నాటకం జరుగుతుంటే పక్కనుంచి ఆయన డైలాగ్స్‌ అందిస్తున్నారు.  పఢాలున కొట్టినట్లు అనిపించింది.  వెళ్లి కాళ్లమీద పడి సారీ చెప్పాను. నాటకాలు చేస్తున్నప్పుడు పరిచయమైన సాహితీవేత్తల ద్వారా నటనంటే ఇదీ అని తెలిసింది.

prakash raj: స్టూడియో బయటకెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌రాజ్‌

‘నేను మోనార్క్‌ని’ అనే డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులకు ఎక్కువ తెలిశారు. అదెలా వచ్చింది? 

ప్రకాశ్‌రాజ్‌: పవన్‌ కల్యాణ్‌ ‘సుస్వాగతం’ సినిమాలోని డైలాగ్‌ ఇది. నిజానికి ఆ డైలాగ్‌ అస్సలు నచ్చలేదు. భీమినేని శ్రీనివాసరావుకి అదే చెప్పాను. చిత్రంగా అదే బాగా హిట్టైంది. కొన్నిసార్లు మన జడ్జిమెంట్‌ తప్పు అవుతుంది. ఆయనకు సారీ చెప్పాను.

మోనార్క్‌ నుంచి కట్‌ చేస్తే ఆలీభాయ్‌..?

ప్రకాశ్‌రాజ్‌: ‘పోకిరి’లో అశిష్‌ విద్యార్థి పాత్ర చేయమని పూరి అడిగారు. ఆ తర్వాత షాయాజీ షిండే పోషించిన రోల్‌ని చేయమన్నారు. కానీ ఎందుకో నచ్చట్లేదు. అప్పుడే అలీభాయ్‌ పాత్రను చేస్తానన్నాను. ‘ఏడు రోజులుండే పాత్రది. అంత చిన్నపాత్రేందుకురా’ అన్నాడు. మహేశ్‌ క్లైమాక్స్‌లో ఫైట్‌ చేసేది ఆలీభాయ్‌తోనే కదా అని అన్నాను. అంతే, అక్కడిక్కడే ఆలీభాయ్‌ని సృష్టించాడు. పూరి జగన్నాథ్‌ బాగా ఇష్టమైన వ్యక్తి. ఆయనలా ఉండటం చాలా కష్టం.

పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ..ఇద్దరిలో ఎవరిష్టం?

ప్రకాశ్‌రాజ్‌: చాలా కష్టమైన ప్రశ్న. కృష్ణవంశీ నన్ను ఎక్కువగా ప్రేమించడం కన్నా, నేను ఆయన్ను ఎక్కువగా ప్రేమిస్తాను.  పూరిని నేను ఇష్టపడిన దానికంటే, ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడు. అంతలా నేను ప్రేమించలేను. ‘అంతఃపురం’, ‘ఖడ్గం’, ‘సముద్రం’ సినిమాల్లో నాకే తెలియని నటుడిని బయటకు తీసుకొచ్చింది కృష్ణవంశీ. తీవ్రంగా బతకడం మాత్రం పూరీ నేర్పించాడు.