దర్శకులకు మార్గ దర్శకుడు ‘కె.వి.రెడ్డి’

                             తెలుగు సినిమా దార్శనికుడు కె.వి.రెడ్డి శతజయంతి

తెలుగువారు గర్వంగా తలెత్తుకునే రీతిలో చిత్రాలను రూపొందించిన దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి. తక్కువ సినిమాలే చేసినా ఒక్కో సినిమా ఒక పాఠ్యగ్రంధంలా మిగిలింది. ఆయన పౌరాణికాలు తీశారు, జానపదాలు రూపొందించారు. భక్తి రస చిత్రాలు, సాంఘికాలు తీశారు. ఏ సినిమా తీసినా అందులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపించేది. ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన కె.వి.రెడ్డి శత జయంతి (జూలై 1) సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.
తను దర్శకుడు కావడానికి ముందు వాహినీ పిక్చర్స్ నిర్మించిన చిత్రాలకు క్యాషియర్‌గా పని చేసి ఉండటంతో చిత్రం బడ్జెట్ గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉండేదాయనకు. తాను అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీయడమే కాకుండా పక్కాగా షాట్ డివిజన్ చేసుకుని, నిడివిని ముందే నోట్ చేసుకుని, దానికి ఏ మాత్రం పెరగకుండా తీయగలగడం కె.వి. రెడ్డి ప్రత్యేకత. ఏ సినిమాకైనా స్క్రీన్‌ప్లే ప్రాణం.
కెవి రెడ్డి తయారు చేసుకున్న స్క్రీన్‌ప్లే ఎంత పకడ్బందీగా ఉండేదంటే మొత్తం స్క్రిప్ట్, షాట్స్‌తో సహా రాసి సిద్ధం చేస్తే చిత్ర నిర్మాణం పట్ల ఎటువంటి అవగాహన లేని వ్యక్తయినా దాన్ని ఫాలో అవుతూ అద్భుతంగా సినిమా తీయగలడని చెప్పేవారు. ‘మాయాబజార్’ చిత్రం విషయమే తీసుకుంటే అంత పెద్ద కథని, అన్ని కేరెక్టర్లతో ఎటువంటి గందరగోళం లేకుండా మనసుకి హత్తుకొనే విధంగా కె.వి. చిత్రీకరించగలిగారంటే దానికి కారణం ఆయన తయారు చేసుకున్న స్క్రీన్‌ప్లే. అందుకే తర్వాత కాలంలో ఎడిటింగ్ రూమ్‌లలో అనేకమంది కె.వి.రెడ్డి ఫొటోలు పెట్టుకున్నారు.
దర్శకత్వంలో కెవిది ఒక ప్రత్యేకమైన స్కూల్. దర్శకునికి స్క్రిప్టే ప్రధానం అని ఆయన నమ్మేవారు. ఒక కథను ఎన్నుకున్న తరువాత స్క్రిప్ట్ సంతృప్తికరంగా తయారయ్యేవరకూ ఎంతకాలమైనా నిరీక్షించాలని అనేవారు. ఒక సారి బౌండ్ స్క్రిప్ట్ తయారైన తరువాత సెట్‌లో స్పాంటేనియస్‌గా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి ఆయన అంగీకరించేవారు కాదు. కెవి రెడ్డి స్కూల్‌లో శిక్షణ పొంది అగ్రకథానాయకునిగా ఎదిగిన ఎన్టీఆర్ దర్శకునిగా మారినప్పుడు తన గురువు స్కూల్‌నే ఫాలో అయ్యారు.
షూటింగ్ సమయంలో కెవి అనుసరించిన విధానమే వేరు. ఆర్టిస్టులకు నటించి చూపడం, ఇలా చెయ్యండి అని చెప్పడం ఆయనకు అలవాటు లేదు. ఆర్టిస్టుల్నే నటించమనే వారు. అది తనకి కావాల్సిన రీతిలో లేకపోతే ఇంకోలా చెయ్యమని చెప్పి, తనకి నచ్చిన షాట్‌ని ఫైనలైజ్ చేసేవారు. మరో విషయం ఏమిటంటే షాట్‌లో ఆరుగురు ఆర్టిస్టులుంటే , డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ ఒకరే అయినా ఆరు ఫైనల్ రిహార్సల్స్ చేయించేవారు. ప్రతి రిహార్సల్‌లో ఆర్టిస్టుల రియాక్షన్ గమనించేవారు.
ఎక్కువతక్కువలుంటే సరిదిద్దేవారు. మేకప్ టచప్, లైటింగ్, కెమేరా పొజిషన్.. అన్నీ చూసుకున్న తరువాత టేక్ తీసేవారు. ఆయన ఏనాడు షాట్ అయ్యాక ‘ఓ.కె.’ అనేవారు కాదని, ‘పాస్’ అని మాత్రమే అనేవారని ఆయన దర్శకత్వంలో నటించిన వారు చెప్పేమాట. కె.వి. దర్శకత్వంలో ఎన్నో మంచి పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న హాస్య నటుడు రేలంగి ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘రెడ్డిగారు పాస్ మార్కులే మాకు ఇచ్చేవారు కానీ నూటికి నూరు మార్కులు ఇవ్వడం మేమెరుగం’ అని చెప్పారు. కె,వి.రెడ్డి సెట్‌లో ఉంటే ఆర్టిస్టులకు ఫ్రీడమ్ ఉండేది. అలాగే వాళ్ల మీద ఆయనకు కంట్రోల్ ఉండేది.
ఆయన సెట్‌లో ఉంటే చాలు వాతావరణం చాలా సైలెంట్‌గా ఉండేది. ఎవరు మాట్లాడినా.. ఆఖరికి నిర్మాతయినా ఆయన సహించేవారు కాదు. సెట్ బయటకు వెళ్లి మాట్లాడుకోమని చెప్పడానికి సందేహించేవారు కాదు. అలాగే తన షూటింగ్స్‌కి విజిటర్స్‌ని అనుమతించేవారు కాదు. అయితే మరీ కావాల్సిన వాళ్లు వచ్చినప్పుడు మాత్రం ముగ్గురికో, నలుగురికో అనుమతి ఇచ్చేవారు. అది కూడా వాళ్లు పది, పదిహేను నిముషాల్లో పని ముగించుకుని వెళ్లి పోవాలి.
షాట్ డివిజన్, డైలాగ్ వెర్షన్ పూర్తయిన తరువాత షాట్ ఎంత నిడివి ఉండాలన్నది స్టాప్ వ్యాచ్ దగ్గర పెట్టుకుని నిర్ణయించేవారు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో ఆ డైలాగ్ చదివించి పుటేజ్ నోట్ చేసుకోవడం ఆయనకు అలవాటు. ‘గుణసుందరి కథ’ చిత్రనిర్మాణ సమయంలో ఒకసారి ఇలి పుటేజ్ నోట్ చేసుకుంటూ ‘ఆ షాట్ ఎంత వచ్చింది’ అని అడిగారు కె.వి. ‘రెండు నిముషాలు’ అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పగానే ‘కాదు.. మరో అరనిముషం పెరుగుతుంది. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పేది గోవిందరాజుల సుబ్బారావు. ఆయన డైలాగులు తాపీగా చెబుతారు కనుక ఆయన ఉన్న ప్రతి దృశ్యానికి మనం కొంత టైమ్ అదనంగా కలుపుకోవాలి’ అన్నారట కె.వి. అంత దూరాలోచన చేసేవారాయన.
అలాగే ‘జగదేకవీరుని కథ’ చిత్రనిర్మాణ సమయంలోనూ ఇటువంటి సంఘటనే జరిగింది. షాట్ డివిజన్ చేస్తూ ఈత కొలనులో తీయాల్సిన షాట్స్ నోట్ చేస్తూ , ఆ సన్నివేశాలను డిసెంబర్ నెలలో చిత్రీకరిస్తారు కనుక వేడి నీళ్లు సిద్ధంగా ఉంచాలని ఆరు నెలలకు ముందే సీన్ పేపర్‌లో పేర్కొనడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని కె.వి.రెడ్డి చిత్రాలు రూపొందించినా అవి అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నాయి. తెలుగు సినిమాకు కమర్షియల్ బాట ఏర్పరచిన ఈ దిగ్ధర్శకుడు తెరస్మరణీయుడు, చిరస్మరణీయుడు.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాలు
1. భక్తపోతన -7:1:1943 వాహిని వారి నాగయ్య, మాలతి, గౌరినాధశాస్త్రి 177 రోజులు 2. యోగివేమన -10:4:1947 వాహిని వారి నాగయ్య, రాజమ్మ- 50రోజులు 3. గుణసుందరి కథ -29:12:1949- వాహిని వారి శ్రీరంజని, శివరావు 162 రోజులు 4. పాతాళభైరవి – 15: 3:1951- – విజయావారి ఎన్టీఆర్, మాలతి, ఎస్వీఆర్ 365 రోజులు 5. పెద్దమనుషులు – 11:3: 1954 – వాహినీ వారి గౌరీనాథశాస్త్రి, రేలంగి 100 రోజులు 6. దొంగరాముడు -1:10:1955… అన్నపూర్ణా వారి… అక్కినేని, సావిత్రి…. 100 రోజులు 7.మాయాబజార్ -27: 3: 1957.. విజయా వారి.. ఎన్టీఆర్, అక్కినేని, సావిత్రి, ఎస్వీఆర్.. 175 రోజులు 8. పెళ్లినాటి ప్రమాణాలు -17:12: 1958 .. జయంతి వారి.. అక్కినేని, జమున.. 50 రోజులు 9. జగదేకవీరుని కథ – 9:8: 1961… విజయా వారి. ఎన్టీఆర్, బి.సరోజాదేవి… 175 రోజులు 10. శ్రీకృష్ణార్జున యుద్ధం -9:1: 1963… జయంతీ వారి.. ఎన్టీఆర్, అక్కినేని, బి.సరోజాదేవి.. 147 రోజులు 11. సత్య హరిశ్చంద్ర – 22: 4: 1965.. విజయావారి.. ఎన్టీఆర్, ఎస్. వరలక్ష్మి… 63 రోజుల 12. ఉమాచండీగౌరీశంకరుల కథ – 11:1: 1968.. విజయావారి.. ఎన్టీఆర్, బి.సరోజాదేవి… 50 రోజులు 13. భాగ్యచక్రం – 13:9: 1968… జయంతి వారి.. ఎన్టీఆర్, బి.సరోజాదేవి.. 42 రోజులు. 14. శ్రీకృష్ణసత్య -24: 12: 1971.. ఆర్.కె.బ్రదర్స్.. ఎన్టీఆర్, జయలలిత… 100 రోజులు తమిళం 15. -పాతాళభైరవి – 17: 5:1951- – విజయావారి- ఎన్టీఆర్, మాలతి, ఎస్వీఆర్ 175 రోజులు 16 మాయాబజార్ .. -14: 4: 1957.. విజయా వారి.. ఎన్టీఆర్, జెమినీ గణేశన్, సావిత్రి, ఎస్వీఆర్.. 150 రోజులు 17. వాళ్ కై ఒప్పందం .. -4:9: 1959.. జయంతి వారి.. అక్కినేని, జమున.. 50 రోజులు హిందీ 18. పాతాళభైరవి.. -ఏప్రిల్ 1952 .. జెమినీ వారి.. ఎన్టీఆర్, మాలతి.. 175 రోజులు