నటుడు, నిర్మాత,దర్శకుడు, ఆర్.నారాయణమూర్తి

hero r narayanamurty sa 1 hero r narayanamurty sa 2direc r narayanamurty 1 direc r narayanamurty 2

ఆ పార్టీలు టికెట్‌ ఇస్తామన్నాయి

వెండి తెర ఎగరేసిన ఎర్రజెండా… ఆర్‌.నారాయణమూర్తి! సామాన్యుడి వెతలే ఆయన కథలు. పాటలు, మాటలు… అన్నింట్లోనూ అవే కనిపిస్తాయి. అభ్యుదయ చిత్రాలు తీయడం ముళ్లబాట అనుకుంటే – దాన్నే నమ్ముకుని, ఆ ముళ్లన్నీ ఏరేసి, హైవేగా మార్చేసి, ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ఘనత ఆయనదే.  ఇప్పుడాయన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ అంటూ మరో సినిమా తీశారు. దేశంలో ఓటు, సీటు ఎలా అమ్ముడుపోతున్నాయో ఈసినిమాలో చూపించబోతున్నారు. ఈ సందర్భంగా ఆర్‌.నారాయణమూర్తితో ‘హాయ్‌’ సంభాషించింది. అమ్మ నింపిన స్ఫూర్తి, సినిమా ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు… ఇలా అనేక విషయాలు పంచుకున్నారు.

* చిత్రసీమలో ఆస్తులు అమ్ముకునైనా సినిమాలు తీస్తుంటారు. లేదంటే ఆస్తుల్ని సంపాదించడానికి సినిమాలు తీస్తుంటారు. మీకు అమ్ముకోవడానికి ఆస్తులూ లేవు. సంపాదించాలన్న కోరికా లేదు. అయినా సినిమాలు తీస్తూనే ఉంటారెందుకు?
సినిమా అనేది ఓ అభిరుచి. పిచ్చి. నాకెప్పుడూ ఈ విషయంలో డబ్బు ప్రధానం కాదు. బీఏ పాసయ్యాక మద్రాసులో అడుగుపెట్టా. నా గురువుగారు దాసరి నన్ను చేరదీశారు. ‘నేరము శిక్ష’ సినిమాలో 170మంది జూనియర్‌ ఆర్టిస్టులుంటే ఆ గుంపులో నేనొకడ్ని. ‘నీడ’లో చాలా మంచి పాత్ర దక్కింది. ‘సంగీత’లో గురువుగారు నన్ను హీరోని చేశారు. సినిమా హిట్టయ్యింది. తర్వాత నేనేం బిజీ కాలేదు. నేనా రైతుబిడ్డని. చేతిలో డబ్బులు లేవు. పూట పూటకీ  అన్నం మెతుకులు వెదుక్కోవాల్సిన పరిస్థితి. ఏదో ఒకటి సాధిస్తే తప్ప ఇంటికెళ్లకూడదని సతమతమవుతున్న సమయంలో ‘శ్రీశ్రీ’గారి పాట నన్ను నడిపించింది. ‘అగాధమవు జలనిధిన ఆణిముత్యామున్నట్టే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే.. శోధించి సాధించాలి. అదే ధీరగుణం’ అనే మాటలు కనువిప్పు కలిగించాయి. నా బతుకు నేనే నిలబెట్టుకోవాలి, నేనెక్కాల్సిన మెట్టు నేనే కట్టుకోవాలనిపించింది. నేను హీరో అవ్వాలంటే నేనే డైరెక్టర్‌ అవ్వాలి. నేను డైరెక్టర్‌ అవ్వాలంటే నేనే నిర్మాత అవ్వాలి. అందుకే కాలేజీ రోజుల్లో నా స్నేహితుల్ని ఆశ్రయించి, వాళ్లిచ్చిన పెట్టుబడితో ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ సినిమా తీశాను. అలా దర్శకుడిగా, కథానాయకుడిగా ప్రయాణం మొదలైంది.

* తొలి సినిమా ఖర్చెంత? రాబడి ఎంత?
రూ. 16.5 లక్షలు పెట్టి తీశా. ఆ సినిమాకి సెన్సార్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. నా సినిమా విడుదల అవుతుందా? అనే కంగారు పట్టుకుంది. ఏదోలా కష్టపడి సెన్సార్‌ పూర్తి చేశా. ఒక్క షోకే వ్యాపారం అయిపోయింది. సినిమా చూసిన ఒకావిడ ‘ఎంతకిస్తారు?’ అని అడిగారు. ‘నాకు ఇంత అయ్యింది. దానికి మూడు రూపాయల వడ్డీ వేసి ఇవ్వండి చాలు’ అన్నాను. దాంతో అప్పులు తీర్చేయొచ్చని నా ఆశ. అడిగినంతా ఇచ్చేశారు. 1986లో విడుదలై సంవత్సరం ఆడేసింది. సొంత సినిమాలు తీసుకున్నా కాబట్టి ఇలా ఉన్నా. లేదంటే జూనియర్‌ ఆర్టిస్టు దగ్గరే ఉండిపోయేవాడ్ని కదా? ఎంతోమంది విప్లవ చిత్రాలు తీసినా ఎవ్వరూ నాలా ట్రెండ్‌ సృష్టించలేదు. నా విజయాలు చూసి పరిశ్రమ మొత్తం ఇలాంటి కథలవైపు చూసింది. కృష్ణ, మోహన్‌బాబు, దాసరి గారు… ఇలా అందరూ విప్లవ చిత్రాలు తీయడం మొదలెట్టారు. ‘విప్లవ చిత్రాలు తీయడం ముళ్లబాట. దాని రాస్తాగా మార్చాడు నా బిడ్డ. ఆ రాస్తాలో మేమంతా పయనిస్తున్నాం. ఒసేయ్‌ రాములమ్మా తీయడానికి స్ఫూర్తి ఆర్‌.నారాయణమూర్తే’ అని గురువుగారు దాసరి అన్నారు. అంతకంటే క్రెడిట్‌ ఏం కావాలి? కాకపోతే అందరూ ఇలాంటి కథలు తీయడం మొదలెట్టేసరికి జనాలకు మొహం మొత్తేసింది.

* డబ్బులున్నప్పుడే జాగ్రత్త పడాలని ఎవ్వరూ చెప్పలేదా?
అన్నా.. నా దృష్టి ఎప్పుడూ అటు పోలేదే. నా బతుకెప్పుడూ జనంతోనే. ఉద్యమాలతోనే విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు, జై ఆంధ్రా, తెలంగాణ ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం.. ఇలా చిన్నప్పటి నుంచీ పోరు బాటలోనే ఉన్నా. డబ్బులున్నా, లేకున్నా చాప, దిండు, రెండు జతల దుస్తులే నా ఆస్తి. ఉంటే నా డబ్బులతో సినిమాలు తీస్తా. లేదంటే అప్పులు చేసి తీస్తా. ఇప్పుడైతే డబ్బు విలువ తెలిసింది. ప్రభుత్వం వాళ్లు అనేకసార్లు ఇళ్లు ఇస్తామన్నారు. వద్దన్నాను. చిత్రపురిలో ఇల్లు ఇస్తామన్నారు. తీసుకోలేదు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో విశాఖలో 10 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. దండం పెట్టి వచ్చేశా. కేసీఆర్‌ డబుల్‌ బెడ్రూం మంజూరు చేస్తామన్నారు ‘వద్దన్నా’ అని నమస్కరించా.

* చిన్నప్పటి నుంచీ మీ జీవన విధానం ఇంతేనా?
ఇంతే. ఇలానే ఉండేవాడ్ని. మాది వ్యవసాయ కుటుంబం. నా చదువు విషయంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. మా ఊర్లో బీఏ చదివిన మొట్టమొదటివాడ్ని నేనే. సినిమాల్లోకి వచ్చినా నా విధానం మారలేదు. చెట్టు కింద హ్యాపీగా ఉంటా. ఆసుపత్రులు, కాలేజీలకు, బోరింగులు, కమ్యూనిటీ హాళ్లు.. ఇలా చాలావాటికి విరాళాలు ఇచ్చా. ఎక్కడా నా పేరుండదు. కోట్లు సంపాదించా. పంచేసా. తిన్నా. అనుభవించా. తెలుగుదేశం పార్టీ కాకినాడ సీటు ఇప్పటికి మూడుసార్లు ఆఫర్‌ చేసింది. వైఎస్‌ఆర్‌ పార్టీ తుని సీటు ఇస్తామన్నారు. 2009లో పీఆర్పీ ఆహ్వానించింది. వెళ్లలేదు. ప్రజలతో ఉంటున్నా. ఉద్యమ సినిమాలు తీస్తున్నా. అంతకంటే ఏం కావాలి?

* రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ప్రత్యక్షంగానే సేవ చేయొచ్చు కదా?
బ్రదర్‌.. సేవ అనే పదం పక్కన పెట్టండి. వాళ్ల జీవితాలతో ఆడుకోకుండా ఉంటే చాలు. అదే పెద్ద సేవ. ఏ రాజకీయ పార్టీలో అయినా చేరానే అనుకోండి. వాళ్లు చెప్పింది నేను చేయాలి. నాకు నచ్చకపోతే ఘర్షణ పడాలి. అది నాకు అవసరమా? నా రాజ్యంలో నేను రాజులా ఉంటున్నా. అక్కడకి వెళ్లి ఎందుకు తలొంచాలి?

* మీ సినిమాలన్నీ విమర్శనా బాణాలే. ఈ ప్రయాణంలో మీకెలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మిమ్మల్ని ఎవరూ బెదిరించలేదా?
దేశం మొత్తమ్మీద ఈ స్థాయిలో, ఇన్నిసార్లు సెన్సార్‌ ఇబ్బందులు పడిన ఏకైక దర్శకుడ్ని నేనేనేమో. ‘అర్ధరాత్రి స్వాతంత్య్రం’ నుంచి మొన్నటి ‘అన్నదాతా సుఖీభవ’ వరకూ ప్రతీ సినిమాకీ ఇబ్బందే. ‘లాల్‌ సలామ్‌’ అయితే బీభత్సం. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి గారు ఓ సభలో ‘ఇలాంటి సినిమాలు తీస్తావేంటి నారాయణమూర్తి’ అని నన్ను తిట్టారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ ‘ఇలాంటి సినిమాలు తీస్తే మిమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేయాల్సి వస్తుంది’ అని బెదిరించారు. ‘చీకటి సూర్యులు’ సినిమాకి అసలు షూటింగ్‌ అనుమతే దొరకలేదు. చంద్రబాబు నాయుడుగారు ఇప్పించారు. ఓ సినిమా సెన్సార్‌ అవ్వక ఆగిపోతే.. అనుపమ్‌ ఖేర్‌ వచ్చి క్లియరెన్స్‌ ఇప్పించారు. నా సినిమా విడుదలైతే థియేటర్‌ చుట్టూ పోలీస్‌ వ్యాన్లు చక్కర్లు కొట్టేవి. ఎవరైనా చంకలో సంచి వేసుకుని సినిమాకొస్తే, వాళ్లని పక్కకు తీసుకెళ్లి విచారించేవారు.

* మీలో కమ్యూనిజం భావజాలం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సిద్ధాంతాల్ని బలంగా నమ్ముతారా?
నేను కమ్యూనిస్టుని కాదు. అంత గొప్పవాడ్ని కాదు. ‘ఎవరి శ్రమ ఫలితం వాళ్లకు దక్కాలి’ అనేది దాస్‌ కాపిటల్‌లో కారల్‌మార్క్స్‌ చెప్పిన సిద్ధాంతాం. అదే జరిగితే.. ఈ భూమండలం అంతా స్వర్గధామం అవుతుంది. ‘అత్యుత్తమ మానవవాదే.. అత్యుత్తమ కమ్యూనిస్ట్‌’ అన్నాడు మార్క్స్‌. ఉన్నవాడు, లేనివాడు ఇద్దరూ సుఖంగా బతకాలి. అది నా సిద్ధాంతం. కమ్యూనిజం అంటే మరేదో కాదు.. అసలు సిసలైన ప్రజాస్వామ్యమే కమ్యూనిజం.

– మహమ్మద్‌ అన్వర్‌, ఫొటోలు: మధు

 


* అమ్మ చెప్పింది
పదోతరగతి పరీక్షలో ఫెయిల్‌ అయ్యాను. మా నాన్నకు కనిపిస్తే కొట్టేస్తాడేమో అని ఇంటి వెనుక దాక్కున్నాను. నాకోసం మా అమ్మ ఊరంతా వెదుకుతూ వచ్చింది. ‘పరీక్ష తప్పానమ్మా’ అని అమ్మని పట్టుకుని ఏడ్చేశా. అప్పుడు మా అమ్మ ఓ మాట అంది. ‘అరేయ్‌ పిచ్చోడా.. భూమినే నమ్ముకుని యేటా పంట వేస్తున్నాం. ఓ సంవత్సరం పండుతుంది. ఓ సంవత్సరం పండదు. పండనంత మాత్రాన ఆపేస్తామా.. మళ్లీ భూమినే నమ్ముకుంటాం. ఈసారి బాగా రాయి. పాసవుతావు’ అంది. ఆ మాట ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా. ఈనాటి తల్లిదండ్రులు తమ బిడ్డల్లో ఇలానే స్ఫూర్తి నింపితే… విద్యార్థుల ఆత్మహత్యలు ఆగిపోతాయి కదా!


* పెళ్లి చేసుకోనందకు బాధ పడుతుంటా
పెళ్లి అవ్వాల్సిన సమయంలో ఇంట్లోవాళ్లతో గొడవ పెట్టుకుని వచ్చేశా. ఆ తరవాత.. పెళ్లి ఊసెత్తలేదు. కానీ జంట పక్షుల్ని చూసినా, దంపతుల్ని చూసినా ‘నేనెందుకు పెళ్లి చేసుకోలేదు’ అని బాధ వేస్తుంది. యువతరానికి నా సలహా ఒక్కటే. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. ‘స్థిరపడిన తరవాతే పెళ్లి’ అంటూ వాయిదా వేసుకోవద్దు.
*టెంపర్‌లో నటించమని పూరి అడిగారు. అలా చాలా ఆఫర్లు వచ్చాయి. హరీష్‌ శంకర్‌, దిల్‌రాజు, శేఖర్‌ కమ్ముల మంచి పాత్రలు ఇస్తామన్నారు.  చేయలేదు. ఆర్‌.నారాయణమూర్తి సినిమా అంటే ఓ బ్రాండ్‌. దాన్ని పాతికేళ్ల నుంచీ కాపాడుకుంటూ వస్తున్నా. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలు చేసి దాన్ని పాడు చేసుకోవాలా?


* స్కూటర్‌ నడపడం రాదు
తిండి విషయంలో నాకు మొహమాటం లేదు. ఏదైనా తింటా. రోడ్డు పక్కన బడ్డీ కొట్టు కనిపిస్తే, అక్కడ నిలబడి తినేస్తా. కడుపునిండా తినడం, కష్టపడి పనిచేయడం ఇదే తెలుసు. వంట చేతనవ్వదు. ఇన్నేళ్లుగా హోటల్‌ భోజనమే. స్కూటర్‌ నడపడం రాదు. సెల్‌ఫోన్‌లో పచ్చ బటను, ఎర్ర బటనూ తప్ప ఇంకేం తెలీవు. నాకిప్పుడు 65 ఏళ్లు. నా వయసుకి నప్పిన పాత్రలు చేస్తా. అలాంటి కథలే ఎంచుకుంటా. నటనకు ఎప్పుడు ఎక్కడ పుల్‌ స్టాప్‌ పెట్టాలోనాకు తెలుసు. సినిమాలు మానేశాక.. ప్రజలతో కలసి బతుకుతా. నా జీవన ప్రయాణాన్ని ఓ పుస్తకంలా రాయాలనివుంది.