నూరేళ్ళ భారతీయ చలన చిత్రం విశేషాలు

హైదరాబాదులో మూకీ చిత్రాలు

ఏప్రిల్ 29 నాటి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘వందేళ్ల సినిమా మొదలైందిలా …’ అన్న శీర్షికన వచ్చిన వ్యాసానికి స్పందన ఇది.

మూకీల కాలంలో తెలుగువారంతా ఒక్కటిగా లేరు. నిజాం రాష్ట్రంలో, మద్రాసులో పరిస్థితులు ఒకేలాగ లేవు గనుక ఎక్కడికక్కడ విడి విడిగా ఈ విషయాలను చూడాలి. నిజానికి రఘుపతివెంకయ్య నాయుడు మద్రాసులో మూకీలు తీయకమునుపు 1908 ప్రాంతంలో విదేశీ మూకీల ప్రదర్శన చేసినట్లు చెప్పుకుంటారు. అందుకు ఆయన తెలుగు సినిమా పితామహుడైపోయాడు కాని … సరిగ్గా అదే కాలంలో కరీంనగర్ వాసి బాబూ పి.ఎస్. (పి.బాబూ సింగ్) ‘ఇంపీరియల్ బయస్కోప్ కంపెనీ’ పేరున తెలంగాణ అంతటా మూకీ సినిమాలు ప్రదర్శించి చూపించిన విషయం సినీ చరిత్రకారులు చరిత్ర కెక్కించనే లేదు. మరి ఈ బాబూ పి.ఎస్. ను తెలంగాణ చలనచిత్ర పితామహుడిగా ప్రస్తావించుకోవలసిన అవసరాన్ని ఈ తరం వారైనా అంగీకరించాలి. ఇంతకూ ఈ బాబూ పి.ఎస్. ఎవరో తెలుసా? 1935లో వచ్చిన ‘శ్రీకృష్ణతులాభారం’లో కృష్ణుడుగా నటించిన పి.జైసింగ్ తండ్రి.

మరోవైపు 1908లో హైదరాబాదులో మూసీనదికి భారీ వరదలు వచ్చి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఆ దృశ్యాలను చిత్రీకరించడానికి ఓ కెమెరాతో కలకత్తా నుండి వచ్చినవాడు జె.ఎఫ్. మదన్. ఈ రకంగా చూస్తే మద్రాసు కన్నా ముందే హైదరాబాదులో మూవీ కెమెరాతో చిత్రీకరణ జరిగిందనే విషయం రుజువవుతున్నది. ఈ పరిచయంతోనే జె.ఎఫ్. మదన్ నిజాం కోరిక మేరకు చిత్రకారుడు, రచయిత, నటుడూ అయిన ధీరేన్ గంగూలీని 1918లో కలకత్తా నుండి హైదరాబాదులోని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎంపిక చేసి పంపాడు. విద్యా బోధనకన్నా కళలపట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్న ధీరేన్‌ను తిరిగి కలకత్తా రప్పించుకుని కొంతకాలం తనవద్ద సహాయకునిగా నియమించుకుని కెమెరా నిర్వహణలో శిక్షణ నిచ్చాడు. అప్పటికే భారతదేశం అంతటా మూకీల నిర్మాణం పుంజుకుంటున్నది. ఇది గమనించిన నిజాం నవాబు హైదరాబాదులో సినిమాలు తీసిపెట్టడానికి ఎవరైనా మంచి సాంకేతిక నిపుణుడ్ని పంపమని మళ్లీ జె.ఎఫ్.మదన్‌కే కబురు చేశాడు. అప్పటికే తన వద్ద ఉన్న ధీరేన్ గంగూలీనే హైదరాబాదులో మూకీలు తీయడానికి పంపాడాయన. ఇది జరిగింది 1921లో.

1922లో లోటస్ ఫిలిం కంపెనీ (దక్కన్) సంస్థను నెలకొల్పి మూకీ సినిమా నిర్మాణం ప్రారంభించారు ధీరేన్. ఈ బ్యానర్‌పై ఆయన నిర్మించిన చిత్రాలు ఆరు. వాటి వివరాలు ఇవి – ‘చింతామణి’ (21.7.1922), ‘ఇంద్రజిత్’ (1922 – నటీనటులు ధీరేన్ గంగూలీ, సీతాదేవి), ‘మేరేజ్ టానిక్’ (1922 – ధీరేన్ గంగూలీ, సీతాదేవి – కామెడి), ‘సాధూకీ సైతాన్’ (1922 – ధీరేన్, లీలా వాలైంటేన్, సుశీలాదేవి – కామెడి), ‘ది లేడీ టీచర్’ (21. 7. 1922 – ధీరేన్, సీతాదేవి – కామెడి), ‘స్టెప్ మదర్’ (1923 – ధీరేన్, సీతాదేవి, జోయ్ బెల్లే), ‘యాయాతీ’ (4.4.1923 – ధీరేన్, సీతాదేవి), ‘హరగౌరి’ (5.1.1923 – పౌరాణికం). ఈ మూకీలన్నీ హైదరాబాదులో ఆయనే నిర్మించిన రెండు థియేటర్లలో ప్రదర్శితమైనవి. కాగా 1924లో తీసిన ‘రజియాబేగం’లో స్థానిక ముస్లింల మనోభావాలు దెబ్బతినే దృశ్యాలున్నాయని నిజాం ప్రభువు ఆగ్రహానికి గురై ఇరవైనాలుగు గంటల్లో హైదరాబాదు విడిచివెళ్లాలని ధీరేన్‌ను ఆదేశించడంతో చేసేదేమీ లేక ఆయన కలకత్తాకు వెనుదిరిగాడు. అదెలాగున్నా తెలంగాణ సినిమాకు బాబు పి.ఎస్. ఆద్యుడైతే, మూకీ యుగంలోనే దాని వికాసానికి దోహదపడిన వాడు ధీరేన్ గంగూలి. మూకీ యుగంలో సినిమాల అభివృద్ధికి పాటుపడినందుకే ధీరేన్‌కు 1975లో దాదాఫాల్కే అవార్డు వచ్చింది.

మళ్లీ 1929లో సికిందరాబాదులో ‘మహావీర్ ఫోటోప్లేస్’ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పడి అదే సంవత్సరం ‘ఫాదర్స్ లవ్ ‘ (పితృప్రేమ) తీసింది. హరిలాల్‌భట్ దర్శకత్వం వహించిన ఈ మూకీలో మిస్.మణి, మిస్ గాబీహిల్, వై.ఎల్. చిచేన్కర్, ఎస్.పి.నిషాడ్కర్, మాస్టర్ మదన్‌లాల్ నటించారు. 1930లో మణి, మాస్టర్ శంకర్ నటించిన ‘ఎ ప్రిన్స్ ఆఫ్ పీపుల్’ (రాజధర్మ), ‘యాన్ ఐడియల్ ఉమెన్’, హరిలాల్ భట్ దర్శకత్వంలో ‘అవరైస్’ మూకీలు తీశారు. 1931లో వీరే హరిలాల్‌భట్ డైరెక్షన్‌లో కేకే అద్జానియా, మణి, పారోనాగ్ నటించిన యాక్షన్ చిత్రం ‘బ్లాక్ ఈగిల్’, వి.కె. పాట్ని దర్శకత్వంలో ఎం. శంకర్, మణి నటించిన సాంఘిక చిత్రం ‘కిడ్నాప్‌డ్ బ్రైడ్’, చున్నిలాల్ పారేఖ్ దర్శకత్వంలో ప్రభాదేవి, శంకర్, శాంతారామ్ నటించిన ‘నిర్దర్‌నిరు’ చిత్రాలు నిర్మించారు. కాగా 1931లో వీరే మహావీర్ ఫోటో ప్లేస్ అండ్ థియేటర్స్ సంస్థ తరపున హరిలాల్ భట్ దర్శకత్వంలో శంకర్, మణి నటించిన ‘సరోజ్ కుమారి’ తీశారు.

ఇవిలా ఉండగా 1931లోనే నేషనల్ ఫిలిం కంపెనీ (దక్కన్) అనే మరో చిత్ర నిర్మాణసంస్థ హైదరాబాదులో ఏర్పడి మూకీల నిర్మాణం ప్రారంభించింది. ఈ సంస్థ రెండేళ్లలో నాలుగు మూకీలు తీసింది. అవి చున్నిలాల్ పారేఖ్ దర్శకత్వంలో ‘పీకో ఆఫ్ ది వైల్డ్స్’ (1931) కె.టి. భావే దర్శకత్వంలో ‘పీస్ ఆఫ్ ఈరాక్’ (1931), ఇంకా ‘దేశబంధు’ (1932 – ఈ చిత్ర దర్శకుడు ఎవరో తెలియదు గానీ మంజు అనే పేరుతో హెరాల్డ్ లివీస్ అనే విదేశీ వనిత నటించింది). తరువాత కె.టి. భావే దర్శకత్వంలో ‘మేరీమా’ (1932) చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో వసంత, విలిమా గార్బో నటించారు.

ఇలా మూకీయుగంలో హైదరాబాదులో 20 చిత్రాలు తయారైతే మద్రాసులో 42 మూకీలు తయారైనవి. ఈ కాలంలో మద్రాసునుండి ఇక్కడికి వచ్చి మూకీలు తీసినట్లుగాని, ఇక్కడ వారు అక్కడికి వెళ్లినట్టుగాని ఎలాంటి దాఖలాలు లేవు. పైగా ఇక్కడ ఏర్పడిన నిర్మాణ సంస్థలన్నీ హైదరాబాదు ప్రాంతానికి చెందినట్లు విడిగా ‘దక్కన్’ అని రాసుకున్నవి. కనుక మూకీల చరిత్రలో హైదరాబాదులో జరిగిన చిత్ర నిర్మాణం గురించి తెలంగాణ సినీ చరిత్రలో భాగంగా చూడాలి తప్ప మద్రాసులో జరిగిన అంశాలతో ముడిపెట్టకూడదు. ఎందుకంటే మద్రాసుతో సమాంతరంగా హైదరాబాదులో మూకీల చిత్ర నిర్మాణం జరిగింది కనుక.