మానవుడు – దానవుడు

                                       

అంతవరకూ సాఫ్ట్ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న శోభన్‌బాబు నటజీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పి, కొత్త ఇమేజ్ ఏర్పరచి మాస్ ఆడియన్స్‌కి కూడా ఆయన్ని దగ్గర చేసిన చిత్రం ‘మానవుడు-దానవుడు’. ఈ సినిమాలో ఆయన పోషించిన జగన్ పాత్ర ప్రభావం పుష్కర కాలం ఉందంటే అతిశయోక్తి కాదు. బస్ కండెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో తను ఈ సినిమాని 14 సార్లు చూశానని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పడం విశేషం. శోభన్‌బాబు శ్రీరామునిగా నటించిన ‘సంపూర్ణ రామాయణం’ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకున్న రోజునే ‘మానవుడు-దానవుడు’ చిత్రం విడుదల కావడం ఓ విశేషం. ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 40 ఏళ్లు అయిన సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి ‘చిత్రజ్యోతి’కి చెప్పిన సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే…
ఉషశ్రీ సంస్థ శోభన్‌బాబు హీరోగా నిర్మించిన ‘విచిత్ర దాంపత్యం’ సినిమాకు నేనే దర్శకుణ్ణి. ఈ సినిమాకి నిర్మాత పి.చిన్నప్పరెడ్డి. ఆయన అన్నయ్య మారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తుండేవారు. ఆయన సాహిత్యాభిమాని. సినిమాలంటే ఇష్టం. ఉద్యోగ వ్యవహారాలు చూసుకుంటూనే వారాంతపు రోజుల్లో సినిమా నిర్మాణంలో పాల్గొనేవారు. ఓ రోజున తన భార్యగా నటిస్తున్న విజయనిర్మలని శోభన్‌బాబు బెల్టుతో కొట్టే సన్నివేశాన్ని చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఓ చిన్న విషయంలో ఘర్షణ మొదలై శోభన్‌బాబు ఆమెని కోప్పడటం, విజయనిర్మల ఆయనకి లాజికల్‌గా సమాధానం చెప్పడం.. దాంతో అహం దెబ్బతిని ‘ఆడదానివైయుండి మొగుణ్ణే ఎదిరిస్తావా’ అని శోభన్‌బాబు కొట్టే సన్నివేశం అది.
ఆ సీన్‌ని శోభన్‌బాబుకి వివరించగానే ‘ఏమండీ… నాకు ఇప్పుడిప్పుడే మహిళా ప్రేక్షకుల్లో ఆదరణ ఏర్పడుతోంది. ఇలాంటి తరుణంలో ఈ సీన్‌లో నటిస్తే నాకు ఇబ్బంది కలుగుతుందేమో కాస్త ఆలోచించండి’ అని అడిగారాయన. ‘నీ భార్యని ఇంతగా కొట్టినందుకు తరువాతి సన్నివేశంలో నువ్వే పశ్చాత్తాపపడతావు. ఆ సీన్‌తో లింక్ ఉంది కనుక నువ్వేమీ ఆలోచించకుండా ఓ విలన్ కొట్టినట్లే ఆమెని కొట్టు’ అన్నాను. ఈ సీన్ తీస్తున్నప్పుడే మారెడ్డిగారు సెట్‌లోకి వచ్చారు. ‘ఏమిటండీ.. శోభన్‌బాబు సాఫ్ట్ హీరో అనుకున్నాను.. విలన్‌గా కూడా బాగా చేస్తున్నాడే’ అన్నారాయన ఆ షాట్ చూసి.
ఆ తరువాత లంచ్ బ్రేక్‌లో శోభన్‌బాబు, విజయనిర్మల, నేను, నిర్మాతలు.. అంతా కలిసి ఒకేచోట కూర్చుని భోజనాలు చేస్తున్నప్పుడు మారెడ్డిగారు మళ్లీ ఇందాకటి ప్రస్తావన తెచ్చి ‘నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర శోభన్‌బాబుతో చేయించి, నెక్స్ట్ పిక్చర్ తీద్దాం’ అన్నారు. ‘సినిమా మొత్తం నెగిటివ్స్ షేడ్స్ ఉంటే కష్టమండి. మంచి, చెడు స్వభావాలు ఒకే వ్యక్తిలో ఉంటే అతనెలా ప్రవర్తిస్తాడన్నది కథగా తయారు చేద్దాం’ అన్నాను. ‘ఒకే వ్యక్తిలో రెండు స్వభావాలా.. అదెట్లా’ అని ఆలోచనలో పడ్డారు మారెడ్డిగారు. మా సంభాషణ అంతటితో ఆగిపోయింది.
ఆంగ్ల నవల ప్రేరణతో
ఆ తరువాత కొన్ని రోజులకు ‘విచిత్ర దాంపత్యం’ చిత్రం పూర్తి కావడంతో తదుపరి సినిమా కోసం సన్నాహాలు ప్రారంభించారు చిన్నపరెడ్డి సోదరులు. ఒక రోజు మారెడ్డిగారు కలిసి ‘మీరు చెప్పిన పాయింట్ మీద ఆలోచించి ఒక లైన్ తయారు చేశాను.. వినండి’ అని నాకు వినిపించారు. ‘అఖల్ అండ్ జేన్’ అనే ఆంగ్ల నవల స్పూర్తితో ఆయన తయారు చేసిన స్టోరీ లైన్ అది. మా అందరికీ నచ్చడంతో పది రోజుల పాటు మారెడ్డిగారు పనిచేసే పాల్వంచలో నేను, చిన్నపరెడ్డి, మోదుకూరి జాన్సన్, ఛాయాగ్రాహకుడు సుఖదేవ్, ఎడిటర్ అంకిరెడ్డి కూర్చుని కథ తయారు చేశాం. ఇందులో మా ఛాయాగ్రాహకుడు సుఖదేవ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ. ఈ సినిమాకి అద్భుతమైన డైలాగులు రాశారు మోదుకూరి జాన్సన్.
జగన్ సన్నివేశాలు ముందు చిత్రీకరించాం
ఈ సినిమాలో డాక్టర్ వేణుగా, రౌడీ జగన్‌గా రెండు విభిన్నమైన పాత్రలను శోభన్‌బాబు పోషించారు. 14వ రీలుకి వచ్చేవరకూ శోభన్‌బాబు ద్విపాత్రాభినయం చేశారనే అనిపిస్తుంది. అయితే ఒకే వ్యక్తి సందర్భానుసారంగా ఇలా రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తాడన్నది పతాక సన్నివేశాల్లో మాత్రమే బయట పెట్టడం ఆ రోజుల్లో చాలా వెరయిటీగా ఫీలయ్యారు ఆడియన్స్. అదే సినిమాకు పేయింగ్ ఎలిమెంట్ అయింది. ఈ సినిమాలో జగన్‌కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొదట ప్రారంభించాం.
‘నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్నారు సరే కానీ ఈ పాత్ర మరీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందేమిటండీ.. అందంగా ఉన్న నా ముఖాన్ని ఇలా మార్చేశారు. ఆ క్రాఫ్ ఏమిటి, మీసం ఏమిటి’ అని సరదాగా సెట్‌లో అంటుండేవారు శోభన్‌బాబు. ఆయనలో ఉన్న సుగుణం ఏమిటంటే.. తీయబోయే సన్నివేశం గురించి అడిగి తెలుసుకునే వారు తప్ప దాని ముందు సీను ఏమిటి, తరువాత సీన్ ఎలా ఉంటుంది అని అడిగేవారు కాదు. పారితోషికం తీసుకున్న తరువాత దర్శకుడు చెప్పినట్లు చేయడం తన ధర్మంగా భావించేవారు.
అలా ముందు జగన్ సీన్లు, తరువాత డాక్టర్ వేణు సన్నివేశాలు చిత్రీకరించాం. తన అక్కకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవాలి. కానీ చేస్తున్నది డాక్టర్ వృత్తి. దెబ్బ తగిలితే ఆ గాయాన్ని కడిగి కట్టుకట్టాలి కానీ తనే ఇతరుల్ని గాయపరచకూడదు. కానీ పగ తీర్చు కోవాలి.. ఎలా? అందుకే దానవుడి అవతారం ఎత్తి జగన్ పేరుతో దుష్టశిక్షణ చేస్తుంటాడు. ఇటువంటి స్ప్లిట్ పర్సనాలిటీ గురించి తరువాతి కాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి కానీ 40 ఏళ్ల క్రితమే మేం తీసి చూపించాం.
35 రోజుల్లో పూర్తి
ఆ రోజుల్లో సింగిల్ షెడ్యూల్ షూటింగ్స్ ఉండేవి కావు. శోభన్‌బాబు, హీరోయిన్‌గా నటించిన శారద.. ఇద్దరూ బిజీ ఆర్టిస్టులు. శోభన్‌బాబు నెల్లో ఓ నాలుగు రోజులు మాకు డేట్స్ ఇస్తే, మరో రెండు రోజులు కలుపుకుని మిగిలిన ఆర్టిస్టులతో వర్క్ చేశాం. 1971 అక్టోబర్ 2న షూటింగ్ ప్రారంభించి 5 నెలల్లో పూర్తి చేశాం.
20 రోజుల పాటు పాట తీశాం
ఈ సినిమాలో నారాయణరెడ్డిగారు ‘ఎవరు వీరు.. ఎవరు వీరు’ అంటూ వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న మహిళల గురించి ఓ అద్భుతమైన పాట రాశారు. ఈ పాటను రోజుకి రెండు మూడు షాట్స్ చొప్పున 20 రోజుల పాటు తీశాం. ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే చెన్నయ్‌లోని ప్రసాద్ రికార్డింగ్ థియేటర్‌లో తొలిసారిగా రికార్డ్ చేసిన పాట ఇదే. అశ్వద్ధామ స్వరపరిచిన ఈ పాటను బాలు అద్భుతంగా పాడారు. మరో విషయం ఏమిటంటే నేపథ్యంలో వచ్చే పాట ఇది. ‘అదేమిటి సార్.. ఇంత మంచి పాటను నేను పాడకుండా నేపథ్యగీతంలా చిత్రీకరిస్తారా’ అని శోభన్‌బాబు అడిగారు. ‘ఒక కొత్త స్కీమ్‌లో ఈ పాటను తీస్తున్నాం.
పాట పాడుతూ ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తావో, లిప్ మూమెంట్ లేకుండా అటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వాలి’ అని చెప్పాను. చాలా అద్భుతంగా నటించాడాయన. పాట చిత్రీకరణ పూర్తయ్యాక రష్ చూసి ఆయన చాలా సంతృప్తి చెంది, ‘మీరు చెప్పింది నిజమే రెడ్డిగారు.. లిప్ మూమెంట్ లేకుండానే పాట బాగా వచ్చింది’ అన్నారు. తమిళంలో ఈ సినిమాని నిర్మించినప్పుడు ఈ పాటలో శివాజీగణేశన్‌గారికి లిప్ మూమెంట్ పెట్టారు. అది అక్కడి ప్రేక్షకులకు రుచించలేదు. ఈ సినిమాలో శోభన్‌బాబుపై చిత్రీకరించిన ‘అణువుఅణువున వెలసిన దేవా … కను వెలుగై మము నడిపించరావా’ పాటను కూడా నారాయణరెడ్డిగారు రాశారు. చాలా గొప్ప పాట ఇది.
ఇతర నటీనటులు
ఈ సినిమాలో హీరోయిన్‌గా శారద నటించారు. చిత్రం విజయం సాధించగానే ఆమె హక్కులు కొనుక్కుని మలయాళంలో నిర్మించారు. మధు, శారద జంటగా నటించారు. శోభన్‌బాబు అక్క పాత్రను కృష్ణకుమారి, ఆమెని మోసం చేసిన వ్యక్తిగా సత్యనారాయణ, తల్లిగా మాలతి, జగన్ అసిస్టెంట్‌గా రాజబాబు, పోలీస్ అధికారిగా అతిధి పాత్రలో కృష్ణంరాజు నటించారు. మరో విషయమేమిటంటే ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన మోహనగాంధీ ‘కొప్పు చూడు కొప్పందం చూడు’ అనే పాటలో జ్యోతిలక్ష్మితో కలిసి నటించారు. అలాగే ఈ నాటి ప్రముఖ దర్శకుడు సాయిప్రకాష్ ఈ సినిమాకి అప్రెంటిస్‌గా పనిచేశాడు. నిర్మాత చిన్నపరెడ్డి, ఏడిద నాగేశ్వరరావు మిత్రులు కావడంతో ఆయన ఈ చిత్రనిర్మాణంలో చురుకుగా పాల్గొడమే కాదు ఓ వేషం కూడా వేశారు.
ఇతర భాషల్లో..
మలయాళంలో శారద ఈ చిత్రాన్ని నిర్మిస్తే, తమిళంలో శివాజీగణేశన్‌గారితో వి.బి.రాజేంద్రప్రసాద్‌గారు తీశారు. హిందీలో డూండీగారి దర్శకత్వంలో వినోద్‌ఖన్నా హీరోగా ఈ సినిమా తయారైంది. అయితే సాఫ్ట్ హీరో శోభన్‌బాబు జగన్ పాత్ర చేయడం తెలుగులో మాకు ప్లస్ అయినట్లుగా ఇతర భాషల్లో ఆ యా హీరోలకున్న ఇమేజ్ వల్ల కాలేదు. శోభన్‌బాబు నటజీవితాన్ని ఓ మలుపు తిప్పడమే కాకుండా, ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించామన్న తృప్తి నాకు, నిర్మాతలకు మిగిల్చింది ‘మానవుడు-దానవుడు’.