సంగీతదర్శకుడు ‘ ఎస్.పి.కోదండపాణి.

ఎస్.పి.కోదండపాణి (1932 – 1974) సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. వీరి పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి.

అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణాముర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.

ఎస్. పి. కోదండపాణి గారు పరిచయం చేసిన బాలసుబ్రహ్మణ్యం ఇంతింతై వటుడింతై బాలుగా తెలుగువారందరికీ సంగీతాత్మీయుడై తెలుగు చరిత్రలో తనకొక సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

బాలు స్థానం పటిష్టం కావడానికి ఆయన అవిరళ కృషితో బాటు ఎస్. పి. కోదండపాణి గారి కృషి కూడా చాలా ఎక్కువగా పనిచేసింది. ఆయన బాలు స్వరాన్ని తన సంగీతంలో పరిచయం చేయడంతో బాటు చిత్ర రంగానికి పరిచయం చేయడానికి ఎంత శ్రద్ధ తీసుకున్నారో ఆ గళంలో పాట నిలబడడానికి అంతే శ్రద్ధ తీసుకున్నారు. ఆయన తొలి పాటను సంగీత దర్శకులందరికీ వినిపించి, అతనికి అవకాశాలిమ్మని కోదండపాణి గారే అడిగేవారట. బాలు గారికి ఆర్థికంగా సహాయపడడానికి తన దగ్గర సహాయకుడిగా పనిచేయించుకునేవారట. ఇతర సంగీతదర్శకుల దగ్గర బాలు గారు పాడిన పాటల్ని ప్రత్యేకంగా వెళ్ళి వినేవారట. పాటలో పొరబాట్లను క్షమించేవారు కాదట. చిన్న తప్పు చేసినా ఎత్తి చూపేవారట.

బాలు గారి భవిష్యత్తుకు ఎంత ఆరాట పడ్డారో ఆయన ఆరోగ్యం కోసం కూడా అంతే ఆరాటపడ్డారు కోదండపాణి గారు. ఒకసారి బాలు గారు కష్టబడి సైకిల్ తొక్కుకుంటూ కోడంబాక్కం వంతెన మీద వెడుతుంటే అప్పుడే కారు మీద వెడుతున్న కోదండపాణి గారు చూసారు. బాలు గారిని ఆపి ” ఏమిటయ్యా పంతులూ ! ఈ ఎండలో సైకిల్ మీద విహారం ఏమిటీ ? బుద్ధిలేదూ ? ఆరోగ్యం బాగుంటేనే పాట బాగుంటుంది. బస్సులో వెళ్ళు. ఇకెప్పుడైనా సైకిల్ మీద కనిపించావో ఊరుకోను ” అని మందలించారట. ఆయన శ్రద్ధ, కోరిక ఫలించి తెలుగు వారికి మరో అద్భుతమైన గాయకుడు లభించాడు.

శ్రీ కోదండ పాణి గారి గురించి బాలసుబ్రహ్మణ్యం “శ్రీ కోదండ పాణితో నా తొలి అనుభవాలను మీకు వివరంగా ముందే తెలియజెప్పాను. ఆయన సంగీత దర్శకత్వంలో పాడటం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను చక్కగా పాడాలన్న కోరిక..ఆయనకు చాలా ఎక్కువ. ఎప్పుడైనా నేను పాడే పధ్దతి నచ్చకపోతే మెత్తగా గట్టిగా చీవాట్లు పెడతారు ఆయన. నేను ఎప్పుడైనా కారులో వేగంగా వెళ్లడం చూసారంటే ఏమిటా జోరు నిదానంగా పోరాదా అని ప్రశ్నించి మందలిస్తూంటారు. చాలా మంది నేనూ ఆయనా బంధువులు(నేను ఎస్.పి.బాలసుబ్రమణ్యం-ఆయన ఎస్.పి.కోదండపాణి కనుక) అనుకుంటారు. మా ఇనిషియల్స్ చూసి నాకు ఆయన బంధువులు కారు..అంతకన్నా అధికులు..దైవ సమానులు.

ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడిన ఎన్నో పాటలలో నాకు నచ్చిన పాట ఆస్తులు-అంతస్తులు చిత్రంలో సుశీలతో నేను పాడిన ఒకటైపోదామా అన్న పాట. మానసికంగా ఒకటై పోయిన శ్రీ కోదండపాణిగారు నాకు సంగీతపరంగా మానసికంగా గురువు ” అని అన్నారు.

చిరకాలం గుర్తుండే పాటలు

* బొమ్మను చేసి ప్రాణం పోసి – దేవత
* ఇది మల్లెల వేళయనీ – సుఖదుఃఖాలు
* జగమే రామమయం – శ్రీరామకథ
* చుక్కలన్ని చూస్తున్నాయీ – జ్వాలాద్వీప రహస్యం