సంగీత దర్శకుడు ‘దేవిశ్రీ ప్రసాద్’

Music devisriprasadee 13 jan 13 devisriprasad
అందరి కంటే మాస్‌ నేనే
పాట వింటున్నప్పుడు.. మనకు తెలియకుండానే కాళ్లు నాట్యం చేస్తుంటే…
అది దేవీశ్రీప్రసాద్‌ మహిమ.
సంగీతం చెవులను తాకుతున్నప్పుడు..
దానికి అనుగుణంగా మన శరీరం ఊగిపోతుంటే
అది దేవీశ్రీప్రసాద్‌ మాయ.
సూపర్‌ మచ్చీ… అంటూ మాస్‌ పాడినా… ఎంత సక్కగున్నావే… అంటూ క్లాస్‌ వినిపించినా… ప్రేక్షకులు ఆయన సంగీతానికి పరవశించాల్సిందే. బీట్‌తో హార్ట్‌బీట్‌ని టచ్‌ చేసి… రాతతో హృదయాంతరాలను మీటే రాక్‌స్టార్‌ దేవీశ్రీ… సంగీతానికి ఓ బ్రాండ్‌ అంటారు అభిమానులు. దర్శకులు, కథానాయకులూ అతని అభిమానులే. ఎప్పుడూ సంగీతంతో బిజీగా ఉండే ఆయన ప్రయాణం, వ్యక్తిత్వం, ఇష్టాయిష్టాల్ని ‘హాయ్‌’తో పంచుకొన్నారు.

సచిన్‌కీ సంగీతమే వ్యాపకంసంగీతం నాకొక జాబ్‌ అని ఎప్పుడూ అనిపించలేదు. అది నాకు ప్లస్సో, మైనస్సో తెలియదు. సంగీతం చేసేటప్పుడు పని చేస్తున్నాననే ఫీలింగ్‌ రాకూడదు. నా స్టూడియో పైన ఒక పెంట్‌ హౌస్‌ ఉంటుంది. మంచి బెడ్‌రూమ్‌, బాత్‌రూమ్‌, టెర్రస్‌, పార్టీ ప్లేస్‌ అన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్లను. స్టూడియోలోని అదే సోఫాలోనే పడుకొని, అక్కడే గడుపుతుంటా. ఎంత ఒత్తిడి ఉన్నా… దాన్ని దూరం చేసుకోవడానికి సంగీతమే మార్గం. సచిన్‌కూ సంగీతమే వ్యాపకం. ఇక నాకూ అంతే. నా టీమ్‌ చాలా బాగుంటుంది. వాళ్లు నా కుటుంబంలో భాగం. స్నేహితులైనా, సర్కిల్‌ అయినా వాళ్లే నాకు.
సినిమా ప్రేమికుడిని‘‘వృత్తిపరంగానే నేను దేవిశ్రీప్రసాద్‌ని, ఒక సంగీత దర్శకుడిని. వ్యక్తిగతంగా నాలో అయితే ఆ ఫీలింగ్‌ అస్సలు ఉండదు. నేనొక సినిమా ప్రేమికుడిని అంతే. సినిమాని, సినిమావాళ్లని ఎవ్వరు తక్కువ చేసి మాట్లాడినా నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. అలాంటి భావం ఏర్పడానికి కారణం మా నాన్న. నా చిన్నప్పుడే సత్యజిత్‌ రే సినిమాలు, ‘స్వాతిముత్యం’, ‘సాగరసంగమం’లాంటి సినిమాలు చూపించేవారు. ‘రంగస్థలం’లాంటి సినిమాని అర్థం చేసుకొని చేయగలిగే సామర్థ్యం నాలో ఉందంటే, చిన్నప్పుడు ‘పథేర్‌ పాంచాలీ’లాంటి సినిమా చూడటమే. ఆయన అప్పట్లో ఆ సినిమాలు ఎందుకు చూపించారో ఇప్పుడు అర్థమవుతోంది. ‘ఇదిగో ఇక్కడ గమనించావా… వాళ్లు మాట్లాడుతున్నప్పుడు ఆ సైలెన్స్‌ ఉంది కదా. అదే ఈ సన్నివేశానికి అందం’ అని వివరించేవారు. ఇప్పటికీ తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సినిమాలు తప్పకుండా చూస్తుంటా.
పొలాల్లో తిరుగుతుంటామాది వ్యవసాయ కుటుంబం. మా సొంతూరు వెదురుపాక. ఇప్పటికీ ఊరెళితే పొలాల్లోనే తిరుగుతుంటాం. నాకూ వ్యవసాయం చేయాలని ఎప్పట్నుంచో ఉంది. రైతుల నేపథ్యంతో కూడిన సినిమా చేసిన ప్రతిసారీ మావాళ్లంతా చాలా గర్వపడుతుంటారు. ‘ఖైదీ నంబర్‌ 150’లోనూ రైతుల గురించి చెప్పడం చూసి మా మావయ్య నాకు ఫోన్‌ చేశారు. ‘మనమంతా రైతుబిడ్డలం కదరా’ అని చాలాసేపు ఆ కథ గురించి మాట్లాడారు.
దేన్నీ ద్వేషించను‘‘ఎప్పుడూ అంత సంతోషంగా, బబ్లీగా ఉండటం నీకెలా సాధ్యమవుతోందని ఒకసారి పవన్‌కల్యాణ్‌ అడిగారు. నేను దేన్నీ, ఎవరినీ ద్వేషించను సార్‌ అని చెప్పా. 20 మంది స్నేహితులు కలిస్తే వెళ్లి పార్టీ చేసుకుంటాం. ఎవరూ రాలేదంటే నేనొక్కడినే బీచ్‌కి కార్‌ వేసుకొని వెళ్లి తిరిగొస్తాను. వాళ్లు రాలేదు, వీళ్లు రాలేదు అనుకోను. ఎవరైనా విమర్శించినా… నిజంగానే చెప్పాడేమో, దీన్నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచిస్తా. ఎవరైనా ఒక మాట అన్నా, మళ్లీ కలిసినప్పుడు నాకు ఆ విషయం గుర్తుండదు. అదే ఒకరు మంచి చేస్తే బాగా గుర్తుంటుంది.

* దేవిశ్రీప్రసాద్‌ లేకుండా సినిమాలు చేయడం కష్టమని మహేష్‌బాబు అన్నారు. ఆ మాట విన్నాక మీ ఫీలింగ్‌?
‘భరత్‌ అనే నేను’ సమయంలోనూ ఆయన నా గురించి ఇంతే గొప్పగా మాట్లాడారు. ఆయన సినిమాకి పనిచేయాలని ప్రతి సాంకేతిక నిపుణుడూ తపిస్తాడు. అలాంటి స్టార్‌ ‘నేను దేవితో పనిచేస్తానని చెప్పడం’ మామూలు విషయం కాదు. ఆయనకి ఎలా థ్యాంక్స్‌ చెప్పాలో అర్థం కాలేదు. ఆయన గొప్ప మనసుకి అదొక ఉదాహరణ తప్ప, నా గొప్పతనం అని అనుకోను. ‘మహర్షి’ని ఒక సినిమాలాగా కాకుండా, ఒక బాధ్యతగా భావించి చేశామంతా. అందుకే ఈ సినిమా విజయంపై చాలా గర్వంగా ఉన్నా.

* కథానాయకులతో ఉన్న అనుబంధం మీ పనితీరుపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుంటుంది?
ఎప్పుడైనా కథని బట్టే సంగీతం అందించాలి. సబ్జెక్టే అందరినీ నడిపిస్తుంది. కాకపోతే కథానాయకుడిని బట్టి కొన్నిసార్లు ట్రీట్‌మెంట్‌ మారుతుంటుంది. కథని బట్టి సంగీతం చేశాక, స్టార్‌ ఎవరనేది ఆలోచించి మళ్లీ మెరుగులు దిద్దుతుంటాం. మన హీరోలతో వ్యక్తిగతంగా అనుబంధం ఉండటంతో వాళ్ల ఆలోచనలు, వాళ్ల స్టైల్‌పై మరింత అవగాహన ఏర్పడుతుంది. ఆ ప్రభావం సంగీతంలోనూ కనిపిస్తుంటుందంతే.

* మీరు సంగీతం అందిస్తున్నారనగానే ఒక ప్రత్యేక గీతం ఉంటుందని ఊహిస్తుంటారు ప్రేక్షకులు. ఈ అంచనాలు ఇబ్బంది పెడుతుంటాయా?
వాస్తవానికి మాస్‌ అంటే నాకే ఇష్టం. అందరి కంటే మాస్‌ నేనే (నవ్వుతూ). లేదంటే రింగ రింగ, కెవ్వు కేకలాంటి పాటలు చేయలేను కదా. మాస్‌ పాటైనా… ప్రత్యేక గీతమైనా… కథ డిమాండ్‌ చేయాల్సిందే. ‘శ్రీమంతుడు’నే తీసుకుంటే… అందులో ‘దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే… ’ పాటలో కావాలని, మాస్‌ కోసమే ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అయిపోతుందో, వాడే నా మొగుడు’ అని సాకీ పెట్టాం. ఆ సినిమాలో అంత మేర పెట్టడానికి ఛాన్స్‌ వచ్చింది. ‘భరత్‌ అనే నేను’కి వస్తే అదొక ముఖ్యమంత్రి కథ. బాధ్యతగల స్థాయిలో ఉన్న వ్యక్తి పాడుకొంటున్నప్పుడు అందుకు తగ్గట్టుగానే ఉండాలని… ‘ఓ వసుమతీ…’ అంటూ పాట సమకూర్చాను తప్ప మాస్‌లోకి వెళ్లలేదు.  అయితే అభిమానుల్ని మెప్పించాల్సిందే. అందుకోసం సందర్భాన్ని బట్టి ఏం చేయాలో అంతా చేస్తుంటా.

* సంగీత దర్శకుడిగా మీరు వందో సినిమాకి చేరువలో ఉన్నారని తెలుసా?
ఎన్ని సినిమాలు చేశాననేది నాకు గుర్తు లేదు. నా తర్వాత వచ్చినవాళ్లూ వందలకొద్దీ సినిమాలు చేశారు. నేనింకా వంద దాటలేదు. అవార్డులు వచ్చాయా? డబ్బు సంపాదించామా? అనే విషయం కంటే, గుర్తుండిపోయే పాటలు ఇచ్చామా లేదా?  అనేదే కీలకంగా భావిస్తుంటా. ‘ఖైదీ నంబర్‌ 150’ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి ‘సర్‌ ఇదిగో ఇలాంటి పాటలు ఇస్తున్నా’ అంటే.. ‘హే మై బాయ్‌… నువ్వు ఏదో ఒకటి చేస్తావుగా, చివరి పాట కుమ్మేస్తావు.. నాకు తెలుసుగా’ అంటూ వెళ్లిపోయారు. అప్పుడు ‘అమ్మడు కుమ్ముడు…’ పాట చేశా. ‘గబ్బర్‌సింగ్‌’ చేస్తున్నప్పుడు తొలి మీటింగ్‌లోనే.. ‘దేవి నువ్వు చేస్తున్నావుగా, లిరిక్స్‌ అన్నీ నువ్వు చూసుకుంటావుగా. నేను ఇక రిలాక్స్‌గా ఉండొచ్చు’ అన్నారు పవన్‌కల్యాణ్‌. నేను ఇప్పటిదాకా సాధించింది ఏమైనా ఉందంటే ఇలాంటి నమ్మకమే. ‘నిన్నూ, నువ్వు చేసే పనిని అందరూ నమ్మాలి. అదే నీ సక్సెస్‌’ అని నాన్న చెప్పేవారు. అదే నేను అనుసరిస్తుంటా.

నా ఫొటోలతో అవకాశాలు వచ్చాయిఫొటోగ్రఫీ నాకు చిన్నప్పట్నుంచే అలవాటైంది. మా నాన్న నాకు ఇచ్చిన తొలి బహుమతి యాషికా ఎమ్‌.ఎఫ్‌2 కెమెరా అది. ఫిల్మ్‌ కెమెరా నుంచి, డిజిటల్‌ వరకు అన్ని కెమెరాలు నా దగ్గర ఉన్నాయి. చదువుకొనేటప్పుడు నా స్నేహితుల చిత్రాలు తీసేవాణ్ని. నా ఫొటోలతో చాలా మందికి మోడల్స్‌గా అవకాశాలు వచ్చాయి. బన్నీతో అమెరికాలో ఫొటో షూట్‌ చేశా.
ఎలా రాశావు స్వామీ…సూపర్‌ మచ్చీ.. పాట చేసేటప్పుడు ట్యూన్‌ సిద్ధం చేసి పల్లవి వరకు నేను రాసుకొని పాడి త్రివిక్రమ్‌కి పంపించా. ఆయన వెంటనే ‘ఎలా రాశావు స్వామీ, ఇంత బాగా… ’ అన్నారు. ఆ తర్వాత పట్టుపడితే మిగతా చరణాలు రాశాను. ఆ పాట విని సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు గొప్ప కాంప్లిమెంట్‌ ఇచ్చారు. ‘నాన్నా… మాస్‌ పాటలు, ప్రత్యేక గీతాలు రాయకూడదని చాలా రోజుల కిందటే అనుకొన్నా. నీ పాట మళ్లీ మాస్‌ పాటలు రాయాలనే కోరిక కలిగించింది’ అన్నారు. సండే సంత కాడ, మండే ఎండలోన… అనే ఒక ప్రాస ఉంటుంది ఆ పాటలో. దీనిపై నేనొక వ్యాసం రాసిస్తా, అది భావి రచయితలకి గైడెన్స్‌లా ఉంటుందని శాస్త్రిగారు చెప్పినప్పుడు నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

* సంగీతంలో హుషారు మీలోకి వస్తుందా లేక, మీలో హుషారు మీ బాణీల్లోకి వెళుతుంటుందా?
ఇలాగే చాలామంది నీ ఎనర్జీ వెనుక రహస్యం ఏంటని అడుగుతుంటారు. నిజంగా సంగీతంలోని హుషారే నాలోకి ప్రవహిస్తుంటుంది. మ్యూజిక్‌ ఒక మ్యాజిక్‌ అని నమ్ముతాను. ఇక్కడొక విషయం చెప్పాలి. ఒకసారి బెంగళూరులో గణపతి ఉత్సవాల్లో భాగంగా ఓ పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేశారు. పది రోజులపాటు సాగే ప్రదర్శన అది. సోనూత నిగమ్‌, ఇళయరాజా… ఇలా పెద్ద పెద్దవాళ్లంతా ఒక్కొక్కరు ఒక్కో రోజు ప్రదర్శన ఇవ్వాలి. అలా నా వంతు వచ్చింది. నాకు జ్వరం మొదలైంది. ఎంతగా అంటే కుదురుగా కూర్చోలేనంత. డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇచ్చి వెళ్లారు. బెడ్‌పై నుంచి లేవలేకపోతున్నా. నా పరిస్థితి చూసి ప్రదర్శన రద్దు చేయాలని అనుకుంటున్నారంతా. నాకేమో స్టేజీ మీద ఉండటం అంటే పిచ్చి. నేను చేస్తానని చెప్పి… నీరసంగానే వేదికపైకి ఎక్కా. అంతే… ఆ జ్వరం ఎలా మాయమైందో తెలియదు. మూడున్నర గంటలు నిర్విరామంగా ఉర్రూతలూగించా. ఆ క్రెడిట్‌ అంతా సంగీతానిదే అంటాను. సంగీతంలో సప్తస్వరాలు ఉంటాయనేది అందరికీ తెలుసు. కానీ అష్టమ స్వరమూ ఉంటుంది. అదే ప్రేక్షకుల కేరింత.

* మీ నాన్నగారు రచయిత. అటువైపు కాకుండా, మీ అడుగులు సంగీతం వైపు ఎలా పడ్డాయి?
చాలామందికి తెలియదు కానీ… నాన్న గొప్ప మ్యూజిషియన్‌. చాలా పాటలు పాడారు, రాశారు, కంపోజ్‌ చేశారు. అప్పట్లో నాన్న ఒక సినిమాలోనూ పాట పాడారు. నా దురదృష్టం ఏంటంటే… నేను సంగీత దర్శకుడిగా కొంచెం స్థిరపడేటప్పటికి నాన్న పాడలేని స్థితికొచ్చారు. లేదంటే ఆయనతో మంచి పాటలు పాడించేవాణ్ని. నాన్న ఎంతో బాగా పాడేవారని ఇప్పటికీ ఎస్పీ బాలుగారు చెబుతుంటారు. సంగీతం, సాహిత్యం విషయంలో ఆయనకున్న పరిజ్ఞానం అద్భుతం. మాకు అన్నీ ఆయన నుంచే అబ్బాయి. నాకంటే తమ్ముడికి ఎక్కువొచ్చాయి. నాన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, మాటల రచయితగా పరిచయమవుతున్నాడు మా తమ్ముడు సాగర్‌.

* సంగీతంపై చిన్నప్పట్నుంచే మక్కువ ఉండేదా? మధ్యలో ఇటువైపు దృష్టిమళ్లిందా?
మా ఇంట్లో సంగీతం అంటే అందరికీ ఇష్టమే. నాకు చిన్నప్పట్నుంచే సంగీతం పిచ్చి. మా అమ్మే మాండోలిన్‌ శ్రీనివాస్‌ దగ్గర చేర్పించారు. నేను ఆయన్ని అన్నయ్య అనే పిలుస్తాను. చిన్నప్పటి నుంచి ఇళయరాజా, మైకేల్‌ జాక్సన్‌ సంగీతాన్ని ఎక్కువగా వినేవాణ్ని. ఇక అన్నయ్య  తోడయ్యాక సంగీతమే ప్రపంచం అయిపోయింది. నాన్న సాయంత్రం కాగానే మాండోలిన్‌ వాయించరా అనేవారు. సంగీతం, కళలంటే ఆయనకు ఎంతో ఇష్టం. మా ఇంట్లో ప్రతి ఒక్కరూ సంగీతమో, డ్యాన్సో ఏదో ఒకటి చేస్తుంటారు. మా సోదరి భరతనాట్యం, వీణ నేర్చుకుంది. తను ఇప్పుడు ఆర్కిటెక్ట్‌. మా బావ పాటలు పాడతాడు. ఆయన మిమిక్రీ, ఫ్లూట్‌ల్లో దిట్ట. ఆయన ఆర్కిటెక్టే. మంచి కళాకారుడు. ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాలో ‘నీరు నీరు… ’ పాటలో వచ్చే చిత్రాలన్నీ మా బావ గీసినవే. అలా మాది ఆర్టిస్టుల కుటుంబం అని చెప్పొచ్చు.

* పాటలు బాగా రాస్తుంటారు. ఆ నైపుణ్యం ఎలా వచ్చింది?
మా ఇంట్లో పుస్తకాలు చదవనిది నేనొక్కడినే. ఒక పేజీ తిరగేసేసరికి నిద్రొస్తుంది. అయినా బాణీ కడుతున్నప్పుడే పదాలు వచ్చేస్తుంటాయి. ఆ విషయంలో సుకుమార్‌, త్రివిక్రమ్‌ మెచ్చుకుంటుంటారు. నేను తెలుగు ఇంట్లో మాట్లాడటమే తప్ప చదవలేదు. అయితే రాస్తాను, చదువుతాను. తెలుగుతో పాటు… తమిళం, ఇంగ్లిష్‌, హిందీ… ఈ నాలుగు భాషలు ఒకే రకమైన వేగంతో రాస్తా, చదువుతా. అదంతా అమ్మ గొప్పతనమే. స్కూల్‌లో చేరాక ఇంగ్లిష్‌ వస్తుంది. చెన్నైలో పెరిగాను కాబట్టి తమిళం వచ్చేస్తుంది. అందుకని సెకండ్‌ లాంగ్వేజ్‌గా హిందీ తీసుకోమన్నారు. అలా నాలుగు భాషలు వచ్చేశాయి. హిందీకి వెళితే పాటల్లో నేనే కరెక్షన్‌ చేసుకుంటుంటా. నీది చెన్నై కదా, ఇంత బాగా హిందీ ఎలా వస్తుందని వాళ్లు ఆశ్చర్యపోతుంటారు. నేను పాటలు రాయడం చూసి… నాన్న ‘బ్లడ్డు రా బ్లడ్డూ’ అనేవారు. సుకుమార్‌ ‘డార్లింగ్‌… ఈ క్రెడిట్‌ అంతా నీకు ఇవ్వను. అంతా మీ నాన్నకే. ఆయనది నీకు వచ్చేసింది తప్ప, నీదేం లేదు’ అంటుంటారు.

* ఎప్పుడు కెమెరా ముందుకొస్తున్నారు?
చాలామంది కథలు చెబుతుంటారు. కథానాయకుడిని కావాలనేది నా ప్రధాన లక్ష్యం కాదు. బాగా డ్యాన్స్‌ చేస్తారు కదా, సరదాగా చేయొచ్చు కదా అంటుంటారు. అలాంటప్పుడే దాని గురించి ఆలోచిస్తుంటా. స్వతహాగా నాకు ఇంగ్లిష్‌ మ్యూజికల్స్‌ అంటే ఇష్టం. సినిమా చేసినా… అలాంటి సంగీతంతో ముడిపడిన కథలు వస్తేనే చేస్తా.

* పెళ్లి కబురు ఎప్పుడు వినిపిస్తారు?
ఈ జీవితం బాగుంది కదా. ఇలా ఆస్వాదిస్తున్నాను కాబట్టి పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నా జీవితానికి టైమింగ్స్‌ అంటూ ఉండవు. అలాగని ఎవరూ నాకు పెట్టిన షరతులు లేవు. ఇంకా మా దర్శకులు, నిర్మాతలు ‘మీరు కాసేపు పడుకోండి, రేపు చూసుకుందాం’ అంటుంటారు. లేదు ఇప్పుడు ఐడియా వచ్చింది, చేద్దాం రండి అంటూ కూర్చోబెడుతుంటా. ఇళయరాజా అంత ప్రతిభావంతుడిని కాదు నేను. నా ప్రతిభ కంటే, నా హార్డ్‌వర్కే నన్ను కాపాడుతోంది.