Heroine Siva sakti sachdev

SUN3105202002da00ba_mr

Hero vamsi (Happydays fame)

3e419bd1_162965_2

villain sonu sood

55577910_08-crop--6ded15

 

 

అందుకే ముంబయి  వచ్చానేమో!

 
గతేడాది కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ పెట్టినపుడు… చాలామంది ఇళ్లలో ఉంటూ తమ హాబీలకు సమయం కేటాయించారు. ఇంకొందరు కొత్త హాబీలను నేర్చుకున్నారు. కానీ సినీ నటుడు సోనూసూద్‌ మాత్రం ఉపాధిలేక, తిరిగి సొంతూళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్న లక్షల మంది వలస కూలీల్ని క్షేమంగా గూటికి చేర్చాడు. కొవిడ్‌ మరోసారి విజృంభించినపుడు ఆక్సిజన్‌ బ్యాంకుల్ని ఏర్పాటుచేశాడు. సినిమాల్లో ఉత్తమ విలన్‌గా పేరొందిన సోనూ… బయట సిసలైన హీరో అనిపించుకున్నాడు. తన సేవా కార్యక్రమాలూ, కుటుంబం, భవిష్యత్తు కార్యక్రమాల గురించి సోనూ ఏం చెబుతున్నాడంటే…

పంజాబ్‌లోని మోగా… మా సొంతూరు. అమ్మ ప్రొఫెసర్‌. నాన్న బట్టల దుకాణాన్ని నడిపేవారు. వారానికోసారి మా దుకాణం ఎదుట అన్నదాన కార్యక్రమం చేపట్టేవారు. దాదాపు 100 మంది ఆరోజు అక్కడ ఆకలి తీర్చుకునేవారు. వాటిలో నేనూ పాల్గొనేవాణ్ని. నలుగురికీ సాయపడటంలో కలిగే ఆనందం అలా నాకు చిన్నపుడే అనుభవమైంది. ‘జీవితంలో నువ్వు ఎంత పైస్థాయికి వెళ్లినా, ఎంత డబ్బు సంపాదించినా కూడా… అవసరంలో ఉన్నవారికి సాయపడినపుడే- అది కూడా వాళ్లు నీనుంచి సాయం అడగకుండానే అందించినపుడే- నువ్వు జీవితంలో విజయవంతమైనట్టు’ అని చెబుతుండేది అమ్మ. స్కూల్‌, కాలేజీ రోజుల్లోనూ అక్కా, చెల్లీ, నేనూ అవసరమైనవారికి చేతనైన సాయం చేసేవాళ్లం. అలా ఇప్పుడు చేస్తున్న పనులన్నింటికీ బీజం నా చిన్నపుడే పడిందని చెప్పాలి. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో స్నేహితులతో కలిసి ముందు ఉచిత భోజనం అందించడం మొదలుపెట్టాను. వేల మంది సుదూరాల్లోని తమ ఊళ్లకు నడిచి వెళ్తుంటే వాళ్లనలా చూస్తూ ఊరకే ఉండలేకపోయాను. మొదట కొద్దిమందినైనా బస్సుల్లో పంపాలనుకున్నా. క్రమంగా అది లక్షల మందిని తమ ఇళ్లకు చేర్చే కార్యక్రమం అయింది. ఇదంతా నా కుటుంబం వల్లనే సాధ్యమైంది. కుటుంబం అంటే నా భార్యా పిల్లలే కాదు, స్నేహితులూ, కారు డ్రైవర్‌, పాలు పోసే అబ్బాయి… వీళ్లందరూ. క్రమంగా ఆ కుటుంబంలో వేలమంది సభ్యులయ్యారు. దాదాపు ఎనిమిది లక్షల మందిని తమ సొంతూళ్లకు బస్సులూ, రైళ్లూ, విమానాల్లో పంపించాం. వీరిలో విదేశాల్లో చిక్కుకున్న విద్యార్థులూ ఉన్నారు. ఆ తర్వాత కూడా వివిధ సందర్భాల్లో కొందరు సాయం కోసం నన్ను సంప్రదించినపుడు కాదనలేకపోయాను. చదువులు, ఉపాధి, వైద్యం… ఇలాంటి విషయాల్లో అడిగినవాళ్లందరికీ సాయం చేస్తూ వచ్చా. ఏడున్నర వేలమందికి వివిధ రకాల సర్జరీలు చేయించాం. కొవిడ్‌ రెండో దశలో ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులూ కావాల్సినపుడు వాటిని అందించాం. అంబులెన్స్‌లూ, ఎయిర్‌ అంబులెన్స్‌లూ ఏర్పాటుచేశాం. ఈసారి నా బృందంలో మా నుంచి సాయం పొందినవాళ్లూ, మా సాయం గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందినవాళ్లూ.. ఇలా ఎందరో భాగమైపోయారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతిచోటా మా బృందాలు ఉన్నాయి. మంచివైపు మనం ఒక అడుగు వేస్తే చాలు మనతో ఎంత దూరమైనా నడిచే వ్యక్తులు ఉంటారనడానికి ఇదే నిదర్శనం. ఇదే సమయంలో నన్ను విమర్శించినవాళ్లూ ఉన్నారు. అయితే వాళ్లకి సంజాయిషీ ఇస్తూ కూర్చునే బదులు ఆ టైమ్‌లో మరికొందరికి సాయపడవచ్చనే ఉద్దేశంతో వాళ్లని పట్టించుకోవడం మానేశాను. తర్వాత వాళ్లలో కొందరు తమ మనసు మార్చుకుని మాతో కలిసి పనిచేసినవాళ్లూ ఉన్నారు.

కోట్ల మందికి ఉపాధి

సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి మొదటిసారి వచ్చినపుడు రైల్లో అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌తో వచ్చా. ఈరోజు నేను ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నా. రెండు దశాబ్దాల కెరీర్‌లో నటుడిగా వివిధ భాషా చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించాను. కానీ, నిజ జీవితంలో, నిజమైన సమస్యకు స్పందించడమే నాకు అత్యంత సంతృప్తినిచ్చిన పాత్ర. దీనికోసమే ముంబయి వచ్చానేమో అనిపిస్తుంటుంది. కొవిడ్‌కు ముందు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశా కానీ ఈ అనుభవం నన్ను పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే మనం చేసిన సాయం ఒక వ్యక్తికే కాదు, వారి కుటుంబానికీ, ఓ తరానికీ మంచి భవిష్యత్తుని ఇస్తుంది. అందుకే ఫౌండేషన్‌ పనులు మరింత చురుగ్గా చేపడుతున్నా. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పన… ఈ విభాగాల్లో వివిధ కార్యక్రమాల్ని ప్రారంభించాం. ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్లకీ, యువతకూ ఉపాధి కల్పించే ఉద్దేశంతో గతేడాది ‘ప్రవాసి రోజ్‌గార్‌’ ఆప్‌ తెచ్చాం. దీనిద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. వచ్చే నాలుగైదేళ్లలో 10 కోట్ల మందికి ఉపాధి చూపాలన్నదే మా లక్ష్యం. వైద్య చికిత్సలకు ఇబ్బంది పడేవాళ్లకి ఆర్థికంగా సాయపడేందుకు ‘ఇలాజ్‌ ఇండియా’ కార్యక్రమాన్ని ఈ ఫిబ్రవరిలో మొదలుపెట్టాం. దీనిద్వారా ఇప్పటికే వందల మందికి వైద్యం అందించాం. యువత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటే సమాజంలో మార్పు తేవచ్చనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యేవాళ్లకు ‘సంభవం’ పేరుతో శిక్షణా స్కాలర్‌షిప్‌లు మొదలుపెడుతున్నాం. ఇప్పటికే వీటికోసం లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ శిక్షణ ద్వారా ఏటా 100 మంది అధికారులుగా వచ్చినా ఎంతో మార్పు తేవచ్చు. ముఖ్యంగా అవినీతిని అంతమొందించేందుకు ఇది సాయపడుతుంది. ఎందుకంటే ఇలాంటివారు నీతినిజాయతీలతో పనిచేస్తారనేది నా నమ్మకం. ఇంతమందికి సాయం చేయడానికి నా దగ్గర వనరులు లేవు. నాకు అలాంటి అనుభవమూ లేదు. కానీ సాయం పొందినవారి ముఖాల్లో నవ్వూ, వారి మాటల్లో ఆనందం చూస్తే- ఇంతకు పదింతల సాయం చేయాలన్నంత ఉత్సాహం కలుగుతుంది. సూద్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాల్ని నా తర్వాత కూడా మా కుటుంబం కొనసాగించేలా చూస్తా.

తెలుగింటి ఆడపడుచు…

నా ప్రయాణంలో నా భార్య సొనాలీది కీలక పాత్ర. గత 15-16 నెలలుగా రోజూ దాదాపు 24 గంటలూ ఫౌండేషన్‌ తరఫునే పనిచేస్తున్నా. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో రోజుకు రెండుమూడు గంటలే నిద్రపోయేవాణ్ని. అయినా సొనాలీ నుంచి నాకు పూర్తి మద్దతు దొరికింది. సొనాలీ మహారాష్ట్రలో పెరిగిన తెలుగమ్మాయి. వీరి పూర్వికులు పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందినవాళ్లు. ఇంటిపేరు పసుపులేటి. వీళ్ల తాతయ్య మొదట హైదరాబాద్‌కీ, అక్కణ్నుంచి ముంబయికి వలస వచ్చారు. సోనాలీ తండ్రి ఆర్బీఐ ఉద్యోగి. వీరి కుటుంబం నాగ్‌పుర్‌లో స్థిరపడింది. నేను నాగ్‌పుర్‌లో ఇంజినీరింగ్‌ చేశాను. తను అక్కడ మీడియా కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేసేది. ఒక ఫ్యాషన్‌ షోలో మాకు పరిచయమైంది. స్నేహితులుగా అందరికీ తెలుసు. అప్పటికి ఇద్దరం టీనేజర్లం. రోజూ తనకో గ్రీటింగ్‌ కార్డు కొనిచ్చేవాణ్ని. చివరికోరోజు ప్రపోజ్‌ చేశా. ‘నువ్వు మంచి అబ్బాయివని తెలుసు. కానీ నాకు కొంత సమయం కావాలి’ అని చెప్పింది. తర్వాత తను ఎంబీఏ చేసి ముంబయిలో ఉద్యోగం చేసేది. మేం 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాం. నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు తనకు అభ్యంతరం లేదు కానీ, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తుచేస్తుంటుంది. ఇద్దరం షిర్డీసాయి భక్తులం. ఆధ్యాత్మిక విషయాల్నీ మేం మాట్లాడుకుంటాం. షూటింగ్‌ల పనిమీద నేను బయటకు వెళ్లినపుడు ఇంటి పనులు తనే చూసుకుంటుంది. ఇంట్లో అందరూ ఫోన్‌ తక్కువగా వాడాలనే నియమం పెట్టుకున్నాం. తను అందరినీ గమనించి హెచ్చరిస్తుంటుంది. పిల్లలతో కలిసి ఏడాదికోసారైనా టూర్‌కి వెళ్తాం. ఇది కాకుండా తరచూ మా సొంతూరు మోగాకి వెళ్లి వస్తుంటాం. ఇవన్నీ తనే ప్లాన్‌ చేస్తుంది. అంతేకాదు, అందరం కలిసి గార్డెనింగ్‌ చేయడం, సరదాగా బయటకు వెళ్లి పానీపూరి తినడంలాంటి పనులకూ సమయం కేటాయించేలా చూస్తుంది.

వాళ్లే నాకు నేర్పుతారు!

మా పెద్దబ్బాయి ఇషాన్‌… ప్లస్‌టూ పూర్తిచేశాడు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరనున్నాడు. విదేశాల్లో బిజినెస్‌ స్టడీస్‌ చేయాలనేది వాడి ఆలోచన. దాంతోపాటు థియేటర్‌ ఆర్ట్స్‌లోనూ చేరతాడు. చదువు పూర్తయ్యాక వాడికి ఇష్టమైన రంగంలోకి వెళ్తాడు. చిన్నబ్బాయి అయాన్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. వాడికి క్రికెట్‌ అంటే ఇష్టం. మా పిల్లలకి టైమ్‌ ప్రాధాన్యత చెబుతాను. నా అనుభవాలూ, కెరీర్‌ కోసం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరిస్తాను. అవే పాఠాలు వాళ్లు నేర్చుకోవడానికి మళ్లీ అంత సమయం తీసుకోకుండా జాగ్రత్త పడతారని ఇవన్నీ చెబుతా. కొవిడ్‌ సమయంలో సాయం కోసం ఎవరైనా మెసేజ్‌లు పంపితే, పిల్లలు వాటిని నాకు పంపేవారు. సానుభూతి, మంచితనం, కష్టపడి పనిచేయడం లాంటి విషయాల్ని వారు ఈ ఏడాదిలో చాలా దగ్గరగా నేర్చుకున్నారు. కోట్లు ఖర్చుపెట్టినా వాళ్లు బయట ఇలాంటి పాఠాలు నేర్చుకోలేరేమో. షూటింగ్‌ పనిమీద హైదరాబాద్‌, లేదంటే మరోచోటికి వెళ్లినపుడు ఇంటికి ఎవరైనా సాయం కోరి వస్తే వాళ్లే అప్పటికప్పుడు స్పందిస్తారు. నేనెప్పుడూ పిల్లలను కోప్పడను. ఓ మంచి మాటతో వారిని ఆలోచనల్లో పడేస్తాను. నేను నేర్పడమే కాదు, వాళ్లూ నాకు ఎన్నో విషయాలు నేర్పుతారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వినియోగం గురించి వాళ్ల దగ్గరే టిప్స్‌ తీసుకుంటా. ఫొటోలు ఎడిట్‌ చేయడం, క్యాప్షన్లు పెట్టడం లాంటివి చెబుతారు. పిల్లలు సోషల్‌ మీడియాలో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో 24 గంటలూ పరిశీలించడం కష్టం కాబట్టి మంచీచెడూ అన్న స్పృహ వాళ్లలో కలిగేలా చూడాలి.

రెండు గంటలు వ్యాయామానికే…

సాధారణ రోజుల్లో రోజుకు 22 గంటలే అనుకుంటా. మిగతా రెండు గంటలూ వ్యాయామానికే కేటాయిస్తా. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఏదైనా చేయగలం. ఇంట్లో అందరికీ వ్యాయామంపైన శ్రద్ధ ఎక్కువే. ఒక్కోసారి నలుగురం ఒకేసారి జిమ్‌లో ఉంటాం. నేను బరువులెత్తుతుంటే సొనాలీ ట్రెడ్‌మిల్‌ చేస్తుంటుంది, ఇషాన్‌ పుషప్స్‌ తీస్తుంటే, అయాన్‌ ఏదో ఒక వర్కవుట్‌ చేస్తుంటాడు. ఇషాన్‌ నాతోపాటు కష్టమైన వర్కవుట్‌లు చేస్తుంటాడు. నాతోపాటు కిక్‌ బాక్సింగ్‌ క్లాసులకి వస్తుంటాడు. వాణ్ని చూస్తుంటే ‘నిన్నమొన్న పుట్టాడే అప్పుడే ఇవన్నీ చేస్తున్నాడు’ అనిపిస్తుంది. చిన్నబ్బాయితో క్రికెట్‌ ఆడతాను. వాడు వాళ్ల స్కూల్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కూడా.

అదొక్కటే కోరుకుంటున్నా…

చాలామంది తమ పిల్లలకు నా పేరు పెట్టుకుంటున్నారు, కొందరు తమ సంస్థలకూ, దుకాణాలకీ పెడుతున్నారు. గుళ్లు కట్టినవాళ్లూ ఉన్నారు. ఓ విమానంపైనా నా ఫొటో పెట్టారు. ఇవన్నీ చూసినపుడు నేను మరింత అణుకువగా ఉండాలనీ, నా బాధ్యత మరింత పెరిగిందనీ అనిపిస్తుంది. ఇంకొందరికి సాయపడే శక్తినివ్వమని దేవుణ్ని ప్రార్థిస్తాను. ఒక్కోసారి అమ్మానాన్న గుర్తొస్తారు. వాళ్ల చలవే ఇదంతా అనుకుంటా. అమ్మ పదిహేనేళ్ల కింద సినిమాల్లో నా సక్సెస్‌ చూడకముందే చనిపోయింది. నాన్న చనిపోయి రెండేళ్లవుతోంది. వాళ్లది పెద్ద వయసు కాకపోయినా, మమ్మల్ని ముందే విడిచి వెళ్లిపోయారు. వాళ్లుంటే ఇంకా సంతోషించేవారు. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకున్నది ఒకటే… కరోనా సమయంలో చాలామంది తమ ప్రాంతాల్లో సేవాపథంలో తొలి అడుగులు వేశారు. వాళ్లని ఎందరో అనుసరించారు. వీరంతా తమ సేవా కార్యక్రమాల్ని ఇకముందూ కొనసాగించాలి. కొవిడ్‌ కాకపోతే మరొకటి.. ఏదో ఒక సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నించాలి. దీని ప్రభావం ఎంతో ఉంటుంది. ఆ ఫలాలు ఈతరానికే కాదు, భవిష్యత్తు తరాలకూ అందుతాయి.*

378b604f-cbfb-4a88-abc7-5cd2ffb7c91b

Hero Saratkumar (Tamil)

 

కాంచన… నాకు కన్నీళ్లు తెప్పించింది!

లాక్‌డౌన్‌ కాలం ఇది. ఒక్క ఆరోగ్యం విషయంలోనే కాదు ఆర్థికంగానూ, అనుబంధాల పరంగానూ కరోనా ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని అభద్రత గూడుకట్టుకున్న కాలం. ఇలాంటి వేళ మనపైన మనకి నమ్మకాన్ని పెంచే, మన చుట్టూ ఉన్న  సమాజాన్ని కాసింత సానుకూలంగా చూపగలిగే ఓ జీవితం గురించి తెలుసుకోవడం ఎంతో స్ఫూర్తినిస్తుంది! శరత్‌కుమార్‌ జీవితం అలాంటిదే. బెంగళూరు వీధుల్లో పేపర్లు వేసిన శరత్‌ పేరున్న నటుడిగా ఎదగడం వెనక ఎంతో పోరాటం ఉంది. అది ఆయన మాటల్లోనే…

అది 1977… అప్పట్లో బెంగళూరు ఇప్పటికన్నా ఎక్కువ చల్లగా ఉండేది. ఆ చలిలో ఉదయం ఐదుగంటలకి రైల్వేస్టేషన్‌కి వెళ్లి ‘మద్రాసు మెయిల్‌’ కోసం ఎదురుచూస్తూ నిల్చునేవాణ్ణి. ఆ రైలులోనే నేను పనిచేసే తమిళ పత్రికకి సంబంధించిన 150 కాపీలొస్తాయి. వాటిని తీసుకుని సైకిల్‌ మీద బెంగళూరులోని ప్రధాన కూడళ్లలోని షాపులకి చేరవేసేవాణ్ణి. అదే నా కెరీర్‌లో తొలి ఉద్యోగం. నిజానికి మాది అప్పర్‌ మిడిల్‌క్లాస్‌ కుటుంబం.  నాన్న రామనాథం దిల్లీ ఆకాశవాణిలో న్యూస్‌రీడర్‌గా పనిచేసేవారు. ఆయన బదిలీపైన చెన్నై వచ్చాక నేను అక్కడే బీఎస్సీ దాకా చదువుకున్నాను. చదువు పూర్తికాగానే నా కాళ్లపైన నేను నిలబడాలనుకున్నాను. అప్పట్లో ‘దినకరన్‌’ అనే తమిళ పత్రిక ప్రారంభిస్తుంటే అక్కడ ఉద్యోగం కోసం వెళ్లాను. కాలేజీలో ఉన్నప్పటి నుంచే నాకు కాస్త రచనావ్యాసంగంపైన ఇష్టం ఉండటంతో రిపోర్టర్‌గా చేరాలనే అనుకున్నాను. కానీ వాళ్లు నన్ను బెంగళూరులో సేల్స్‌ బాధ్యతలు తీసుకోమనడంతో ఆ నగరానికి వెళ్లాను. మాది కొత్త పత్రిక కాబట్టి పేపర్‌ ఏజెంట్లుకానీ, బాయ్స్‌కానీ ఎవరూ ఉండేవారు కాదు. దాంతో పత్రిక కాపీలు షాపులకి సరైన సమయానికి వెళ్లక చాలావరకూ మిగిలిపోయేవి. అందుకనే నేనే స్వయంగా ‘పేపర్‌ బాయ్‌’ అవతారమెత్తి… ఉదయం ఐదుకంతా షాపులకి చేరవేయడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ దాదాపు ఇరవై కిలోమీటర్లదాకా సైకిల్‌పైన తిరుగుతూ బెంగళూర్‌లోని ప్రధాన కూడళ్లన్నీ కవర్‌ చేసేవాణ్ణి. అలా ఏడాది కష్టపడ్డాక పత్రిక సేల్స్‌ పెరిగాయి. అది చూసి నాకు బెంగళూరు సర్క్యులేషన్‌ అండ్‌ యాడ్‌ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించారు. నేను అక్కడితో ఊరుకోకుండా, ఈ పనులన్నీ మధ్యాహ్నంలోపే ముగించి, ఆ తర్వాత రిపోర్టర్‌గానూ పని చేయడం మొదలుపెట్టాను. ఇన్ని బాధ్యతలు చూస్తూ… బెంగళూరులో మా పత్రిక సర్క్యులేషన్‌ని గణనీయంగా పెంచగలిగాను. ఇదంతా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఓ సంస్థని నడపగలననే విశ్వాసాన్ని నాకిచ్చింది. ఆ విశ్వాసంతోనే ఓ ట్రావెల్‌ ఏజెన్సీని ప్రారంభించాను. అదే నన్ను సినిమాలకి దగ్గరచేసింది.

తెలుగుతోనే మొదలు…
నాకు చిన్నప్పటి నుంచే తమిళ సూపర్‌స్టార్‌ ఎంజీఆర్‌లా నటుడిగా మారి రాజకీయనాయకుణ్ణి అవ్వాలనే కల ఉండేది. నా ‘ఫిజిక్‌’ కూడా ఇందుకో కారణం. మానాన్న చిన్నప్పటి నుంచీ వ్యాయామాలూ, క్రీడల్ని మా జీవితంలో భాగం చేశారు. దాంతో పదో తరగతి నాటికే ఫుట్‌బాల్‌ స్టేట్‌ ఛాంపియన్‌గా మారాను. ఎన్‌సీసీలో చేరి ప్రతిష్ఠాత్మక ‘రిపబ్లిక్‌ పరేడ్‌’లోనూ పాల్గొన్నాను. కాలేజీలో చదివేటప్పుడే బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొని ‘మిస్టర్‌ మద్రాస్‌’ టైటిల్‌ సాధించాను! ‘నేనెలాగూ అందగాణ్ణి కాబట్టి ప్రయత్నించడం ఆలస్యం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయిలే’ అనే భ్రమలో ఉండేవాణ్ణి. కానీ ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. అప్పుడే బెంగళూరులో నేను ట్రావెల్‌ ఏజెన్సీ నడుపుతుండగా పరిచయమైన మిత్రుడొకడు నిర్మాతగా ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమా తీస్తూ నన్ను లెక్కలూ, రాతకోతలన్నీ చూసుకోవాలన్నాడు. షూటింగ్‌ మొదలుపెట్టిన తొలివారంలోనే అందులో విలన్‌ పాత్ర చేస్తున్న వ్యక్తి డుమ్మా కొట్టేశాడు. దాంతో నిర్మాత ఆ పాత్రని నన్నే చేయమన్నాడు. నా తొలి షాట్‌ హీరోయిన్‌ విజయశాంతితో. అప్పటికే తన ఫ్లైట్‌కి టైమవుతోందనే హడావుడిలో ఉన్నారామె. నాకేమో తెలుగు డైలాగులు చెప్పడం చేతకావడం లేదు. అందువల్ల, టేకులపైన టేకులు తీసుకుంటున్నాను. దాంతో విజయశాంతి కోపంతో మండిపడ్డారు. ‘కాస్త డబ్బులుపెట్టి మంచి ఆర్టిస్టుని పెట్టుకోలేరా! ఇలాంటివాళ్లతో నా సమయాన్ని వేస్ట్‌ చేస్తారెందుకు?’ అంటూ నిర్మాతని చెడామడా తిట్టేశారు. ఆమె మాటలకి నేను బిక్కచచ్చిపోయి నిల్చుండి…పోయాను. అప్పుడు ఓ కెమెరా అసిస్టెంట్‌ నా దగ్గరకొచ్చి ‘ఆమెని చూసి భయపడకండి సార్‌. ఓ మామూలు వ్యక్తితో ఎలా మాట్లాడతారో… అలాగే డైలాగులు చెప్పండి చాలు!’ అన్నారు. అతనిచ్చిన ధైర్యంతోనే ఆ తెలుగు డైలాగులు చెప్పి షాట్‌ ‘ఓకే’ చేయించుకున్నాను.

విజయ్‌కాంత్‌కి విలన్‌గా…
నా తొలి సినిమా పాత్ర చిన్నదే అయినా దానితో నా సినిమా కలలు పెద్దవయ్యాయి. నిర్మాతగా మారి కార్తిక్‌ హీరోగా ఓ సినిమా తీస్తే అది హిట్టయింది. అప్పుడే నన్ను విజయ్‌కాంత్‌ మేకప్‌మ్యాన్‌ రాజు చూసి ‘పోలీసు అధికారి’ సినిమాలో విలన్‌గా నా పేరుని సిఫార్సు చేశాడు. ఆ సినిమా విడుదలైన రోజు నుంచే నాకు తమిళం, తెలుగుల్లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. నెల తిరక్కుండానే ముప్ఫై సినిమాల్లో బుక్‌ అయ్యాను. ఓ తెలుగు సినిమా కోసం గోల్కొండలో ఫైట్‌ సీన్‌ తీస్తుండగా… చాలా ఎత్తు నుంచి కిందపడిపోయాను. మెడ ఎముక విరిగింది. ఇక బతకననే అందరూ అనుకున్నారట. వారం తర్వాత ఎలాగో కళ్లు తెరిచాను. మెడ వెనక భాగాన రెండు రాడ్లు పెట్టారు డాక్టర్లు. సినిమాలు పోతేపోనీ కనీసం జీవితంలో గొంతెత్తి మాట్లాడే అవకాశం కూడా పోయింది. నన్ను నటుడిగా బుక్‌ చేసుకున్న ముప్ఫై మంది నిర్మాతల్లో 29 మంది నాకిచ్చిన అడ్వాన్స్‌ వెనక్కి తీసుకున్నారు. ఆ ఒక్క నిర్మాత ఎప్పుడు వస్తాడా అని చూస్తుండగా ఆయన తరపున డైరెక్టర్‌ వచ్చాడు. వచ్చినవాడు అడ్వాన్స్‌ అడగకపోగా ‘యాక్సిడెంట్‌ అయినంత మాత్రాన మిమ్మల్ని నా సినిమా నుంచి తీసేయలేను. ఏడాదైనా నా సినిమా షూటింగ్‌ ఆపుతాను!’ అన్నాడు. అది అతని తొలి సినిమా. అప్పటిదాకా సినిమా వాళ్లలో కనీస మానవత్వం ఉండదేమిటా అనుకుంటూ ఉన్న నన్ను అతని మాటలు కదిలించాయి..! అతనికోసమైనా నేను పైకి లేవాలనుకున్నాను. వైద్యుల పర్యవేక్షణలో పట్టుబట్టి మరీ చిన్నపాటి వ్యాయామాలూ చేయడం ప్రారంభించాను. అవి నా విల్‌పవర్‌ని పెంచి… ఆరునెలల్లోనే నడిచేలా చేశాయి. అలా ఆ కొత్త డైరెక్టర్‌ తీసిన సినిమాలో పాల్గొన్నాను. ‘పురియాద పుదిర్‌’ అనే ఆ తమిళ సినిమా నాకూ, ఆ డైరెక్టర్‌కీ కొత్త జీవితాన్నిచ్చింది. ఆ డైరెక్టర్‌… కేఎస్‌ రవికుమార్‌. అతనితో అలా మొదలైన నా ప్రయాణం ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ సినిమాల మైలురాళ్లతో  సాగింది.

నేనూ చిరూ…
‘స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’ సినిమాతోనే చిరంజీవితో పరిచయం. ఆ సినిమాలో విలన్‌గా చేశాక ‘గ్యాంగ్‌లీడర్‌’లో సాఫ్ట్‌ నేచర్‌ ఉన్న పాత్ర ఇచ్చారు. అక్కడ కనిపించిన విజయశాంతి ‘మీ సినిమాలు చూస్తున్నానండీ… బాగా చేస్తున్నారు!’ అని కితాబిచ్చారు. నేను ‘నా తొలి సినిమా మీతోనే చేశానండీ!’ అని చెబితే నమ్మలేక పోయారు. ఆ రోజు ఆమె చిర్రుబుర్రులాడిన విధానం గుర్తుచేస్తే ‘అయ్యో… సారీ సారీ’ అంటూ నవ్వేశారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా పూర్తవుతుండగా చిరంజీవితో ‘అన్నా! తర్వాత సినిమాకి కూడా నాకు అవకాశం ఇవ్వవా!’ అని అడిగాను. ‘రేయ్‌… నీకు ఆ అవసరం రాదు. ఇంతలో నువ్వు హీరోవైపోతావు చూస్తూ ఉండు!’ అన్నాడు. ఆయన నోటి చలవేమో నాకు హీరో అవకాశం వచ్చింది. తమిళంలో ‘సూరియన్‌’(తెలుగులో ‘మండే సూర్యుడు’) అనే సినిమా నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసింది! ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలు వచ్చాయి. నా వందో సినిమాని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీగా ఖర్చుపెట్టి తీస్తే… అది ఆడలేదు సరికదా నన్ను పీకల్లోతు అప్పుల్లో ముంచేసింది. నాకు ఊపిరాడక ఓ నిర్మాతని సాయం అడిగాను. ఆయన చాలా కూల్‌గా ‘నీకు చిరంజీవి మంచి స్నేహితుడు కదా! ఆయన కాల్షీట్లు ఇప్పించు. ఆ సినిమాకి వచ్చిన లాభాల్లో నీకు కొంత ఇస్తాను!’ అన్నాడు. అది సరికాదు అనిపించినా నాకు వేరే దార్లేదు. వెంటనే హైదరాబాద్‌ బయల్దేరాను. ఇక్కడికొస్తే ఆయనేదో షూటింగ్‌లో ఉన్నాడు. ‘నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అన్నా!’ అంటే షూటింగ్‌ క్యాన్సిల్‌ చేసి మరీ నన్ను ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్లమ్మగారితో భోజనం పెట్టించి నేను కాస్త కుదుటపడ్డాక విషయం ఏమిటన్నాడు. అంతా విని… ‘సరే! ఆ నిర్మాతకి నేను ఓకే చెప్పానని చెప్పు’ అన్నాడు. ఆ తర్వాత నేను తడబడుతూనే ‘నీకు నేను ఎంత రెమ్యునరేషన్‌ ఇవ్వాలో చెబితే…’ అంటూ నసిగాను. ‘నాకు ఇచ్చేంత స్థితిలో ఉన్నావా నువ్వు. ఒక్క పైసా వద్దు… నువ్వు కోలుకుంటే అంతే చాలు!’ అన్నాడు. ఆ సందర్భంలోనే కాదు… ఆ సంఘటనని ఎప్పుడు గుర్తుచేసుకున్నా కన్నీళ్లు ఆగవు నాకు. నా కెరీర్‌కి ఓ రకంగా పునర్జన్మని ఇచ్చారాయన!

మళ్లీ తెలుగులో…
ఓ వైపు సినిమాలూ, మరోవైపు రాజకీయాలు… వీటితో తెలుగులో ఎక్కువ నటించలేదు. సుదీర్ఘవిరామం తర్వాత ‘బన్నీ’లో కనిపించాను. ఆ తర్వాత చాలా సినిమాలే చేసినా వాటన్నింటికన్నా రాఘవ లారెన్స్‌ ‘కాంచన’ పాత్ర నన్ను కొత్తతరానికి ఎక్కువ చేరువచేసింది. కండలవీరుడిగా పేరున్న నా ద్వారా హిజ్రాల కష్టం చెప్పడమనే ఆలోచన నాకు చాలా నచ్చింది. నటన పరంగా ఏ కాస్త ఏమరుపాటుగా ఉన్నా నవ్వులపాలవుతామని తెలిసినా ధైర్యంగానే ఆ పాత్రని చేశాను. అందులో కాంచనగా నేను స్టేజీపైకెక్కి మాట్లాడే సీనుంటుంది గుర్తుందా! అదే మేం తీసిన తొలి షాట్‌. అది చేస్తున్నప్పుడు గ్లిజరిన్‌ లేకుండానే ఉద్వేగానికి గురై ఏడ్చేశాను. చుట్టూ చూస్తే ఆ షూటింగ్‌ కోసమని వచ్చిన ఏడొందలమందీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అప్పుడే అనిపించింది ‘ఈ పాత్ర కలకాలం ప్రజల గుండెల్లో నిలిచిపోతుందీ’ అని!


తెరిచిన పుస్తకమే…

సినిమాల్లోకి రావడానికి ముందే ఛాయని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాను. కాకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. మా మనస్పర్థల మధ్య మా పిల్లలు వరలక్ష్మి, పూజా ఎదగడం మంచిదికాదని విడాకులు తీసుకున్నాం. నాలాగే వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న రాధిక స్నేహితురాలిగా పరిచయమై జీవిత భాగస్వామి అయింది. సహజంగానే మొదట్లో మేం ఎన్నో ఒడుదొడుకులూ, ఒత్తిళ్లూ, విమర్శలూ, విసుర్లూ ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నింటినీ అధిగమించాక ఇప్పుడింత సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు రాధికా, నేనూ, మా పిల్లలు వరలక్ష్మి, పూజ, రేయాన్‌, రాహుల్‌లతో కూడిన పెద్ద కుటుంబం మాది! విదేశాల్లో చదువుకున్న మా అమ్మాయి వరలక్ష్మి సినిమాల్లోకి రావడం నాకు బొత్తిగా ఇష్టంలేదు. అందుకే తన మొదటి సినిమా ప్రచారానికీ వెళ్లలేదు. నా సహకారం లేకుండానే తను సొంతంగా ఎదగడం చూశాక మొదట్లో వద్దన్నందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నాను. త్వరలో నేనూ, రాధికా, వరూ కలిసి ఓ సినిమా కూడా చేయబోతున్నాం!

 

Hero Naveen Polisetti (Agent sai sreenivasa atreya)

 

 

Hero naveen polisetti

 

 

ఆ రోజంతా… ఏడుస్తూనే ఉన్నాను!

నవీన్‌ పొలిశెట్టి… తెలుగబ్బాయే కానీ ఉత్తరాదివాళ్లు అతణ్ణి తమ వాడే అనుకుంటారు. పొలిశెట్టిని కాస్తా ‘పాలీ షెట్టీ’ అని పలుకుతారు! అతను చేసిన ‘ఏఐబీ’ యూట్యూబ్‌ వీడియోలు అక్కడంత ఫేమస్‌. నిజానికి, ఆ సిరీస్‌ కారణంగానే ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’గా మనముందుకు రాగలిగాడు. కత్తిమీద సాములాంటి కామెడీ డిటెక్టివ్‌ హీరోగా కడుపుబ్బా నవ్వించగలిగాడు. ప్రేక్షకుల్ని ఇంతగా నవ్వించినా ఆ సినిమా విడుదలైన రోజు తను మాత్రం ఏడుస్తూ ఉండిపోయాడట. అది ఎందుకో తెలుసుకోవడానికి మనమూ ‘ఏజెంట్‌’ కానక్కర్లేదు… తన కథ చదివితే చాలు…!

చిరంజీవి ఠాగూర్‌ సినిమాలో ‘తెలుగులో నాకు నచ్చని ఒకే పదం… క్షమాపణ’ అని డైలాగ్‌ ఉంటుంది కదా! నాకూ ఇంగ్లిషులో అలాంటి పదం ఒకటుంది… గత పదేళ్లలో నన్ను బాగా వేదించిన ఆ పదం ‘సెటిల్‌’. కనిపించిన ప్రతి ఒక్కరూ ‘వాడు చూడు నీకంటే జూనియర్‌. భార్యాపిల్లలతో అమెరికాలో ‘సెటిల్‌’ అయిపోయాడు. నీ పరిస్థితేమిటో మేం చెప్పక్కర్లేదు…’ అంటుండేవారు. ‘అసలు నా ప్రయత్నమంతా ఆ రకంగా సెటిల్‌ అయిపోకూడదనే కదా!’ అనేవాణ్ణి నేను. నిజానికి, ఈ విజయాలన్నింటినీ నేనెప్పుడో సాధించేశాను. ఎన్‌ఐటీలో బీటెక్‌ పూర్తి చేసి లండన్‌లో పనిచేశాను. కారూ, సొంత ఫ్లాటూ… ఇలా అన్ని లగ్జరీలూ అనుభవించాను. అలా ‘సెటిల్‌’ అయిన నేను అవన్నీ వదులుకుని, ఫ్రస్ట్రేషన్‌ అంచులకి వెళ్లడానికి కారణం… నటనపట్ల నాకున్న ఆసక్తి! ఆ వైరస్‌ నాకు చాలా చిన్నప్పుడే సోకింది. నా పంచప్రాణాలనీ తన సొంతం చేసేసుకుంది. చెబితే నమ్మరుకానీ ఇదంతా నా నాలుగో తరగతి నుంచే మొదలైంది!

నేను తల్లిపాత్రలో..!
ప్రహ్లాదుడి కథ తెలుసు కదా మీకు! వాళ్ల నాన్నకేమో విష్ణువంటే పడదు… కొడుకేమో పరమ హరిభక్తుడు. నాకూ అంతే. నాన్నకి సినిమాలంటే నచ్చదు. పిల్లలు సినిమాలు చూడటమన్న ఆలోచనే అసలు పడదు. చిన్నప్పటి నుంచీ టెన్త్‌దాకా మా ఇంట్లోని టీవీలో మేం చూసిన సినిమాలు రెండే. ఒకటి… జగదేకవీరుడు అతిలోక సుందరి రెండోది హిందీ సినిమా ‘మిస్టర్‌ ఇండియా’. నాన్న మా దగ్గరున్న ఆ రెండు వీసీడీలనే మళ్లీ మళ్లీ చూడమనేవాడు తప్ప కొత్త సినిమాలకి అవకాశమిచ్చేవాడు కాదు. కానీ నటన మీద మోహం ఏర్పడటానికి అవి రెండే సరిపోయాయి. ఆ రెండు కథల్లోని మాయ, ఆ దృశ్యాల్లోని అందాలూ నా మనసంతా ఆక్రమించుకునేశాయి. దానికి తోడు నేను చదివే స్కూల్లోని టీచర్లు ప్రతి యానివర్సరీకీ నాచేత నాటకాలు వేయించేవారు. ‘వీడి నవ్వు చాలా బావుంటుంది… అమ్మ వేషాలు వేయిద్దాం’ అని ఆ పాత్రలే ఇచ్చేవారు. ఆ వేషంతో బెరుకులేకుండా స్టేజీ మధ్యలోకెళ్లి నటించడం నవ్వించడం నాకేదో కిక్కిచ్చేది. పదో తరగతికి వచ్చాక ఆ పిచ్చి బాగా ముదిరింది. ఇక ఇంటర్‌ చదివేటప్పుడు దిల్లీలోని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’లో చేరడమే నా లక్ష్యమైంది. నాన్నతో ఆ విషయమే చెబితే… బెల్టుకి పనిచెప్పాడు. రెండేళ్లపాటు నేను ఎన్నోసార్లు ఆ బెల్టు దెబ్బ రుచి చూడాల్సి వచ్చింది. ఆయన తరం పెంపకం తీరు అది.  నాన్న ఫార్మాస్యూటికల్స్‌ వ్యాపారం చేస్తుండేవాడు. అమ్మ బ్యాంకు ఉద్యోగిని. పిల్లలందరూ క్రమశిక్షణతో పెద్ద చదువులు చదివి గొప్పవాళ్లు కావాలని కోరుకునే సగటు మధ్యతరగతి ఇంటి పెద్ద ఆయన! కాకపోతే ఆ విషయాన్ని కటువుగానే చెప్పేవాడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే- ఎప్పుడూ ఊహాలోకంలో విహరించే నేను, ఆపాటి క్రమశిక్షణ లేకపోయుంటే పక్కదారిపట్టేవాణ్ణేమో అనిపిస్తోంది. ఏదేమైనా నాన్న బెల్టు భయంతోనే ఎన్‌ఐటీ-భోపాల్‌లో సీటు సాధించాను.

అదయ్యాక ఓ టెలికమ్యూనికేషన్‌ సంస్థలో లండన్‌ శాఖలో ఉద్యోగం వస్తే చేరాను. ఏడాది గడిచిందో లేదో… ‘నటనా వైరస్‌’ తీవ్రస్థాయిలో తన ప్రభావం చూపడం మొదలుపెట్టింది. ఆ రంగంలోకి ఈ వయసులో వెళితే తప్ప నటుణ్ణి కాలేనని అనుకున్నాను. ఎవరికీ చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ వచ్చాను. అమ్మానాన్నా మొదట నేను బ్రేక్‌ తీసుకునే వచ్చానని అనుకున్నారు. ఆ తర్వాత మెల్లగా విషయం చెప్పాను. ఒకప్పుడైతే నాన్న బెల్టు తీసేవాడేకానీ… చెట్టంత ఎదిగినవాణ్ణి ఏం కొడతాడు! ‘నటన గొప్ప కళేకానీ మన స్థాయికి ఆ కల చాలా పెద్దదిరా! నిన్ను కోట్లు పెట్టి సినిమా యాక్టర్‌ని చేసే స్థోమత నాకు లేదు. ఆ రంగంలో మనకు తెలిసినవాళ్లూ ఎవరూ లేరు. అనవసరంగా అటువైపు వెళ్తే నీ జీవితం ఏమవుతుందన్నదే నా బాధ, అర్థం చేసుకో!’ అన్నాడు. ‘నటన తప్ప ఇంకేది చేసినా నేను జీవించినట్టు కాదు నాన్నా!’ అని తేల్చి చెప్పేశాను. బెంగళూరులో ఓ ఫ్రెండ్‌ ద్వారా అక్కడి నాటక సమాజాల్లో చేరాను. ఆ తర్వాత చెన్నైలోని కొన్ని నాటక సంస్థల్లోనూ పనిచేశాను. నాటకరంగంలో వాళ్లు రిహార్సల్స్‌ చేసే తీరూ, నటన రాబట్టే విధానాలూ నటుడిగా నన్ను తీర్చిదిద్దాయి కానీ… కడుపు నిండాలి కదా! నెలంతా కష్టపడి చేసినా ఓ ప్రదర్శనకి 750 రూపాయలే ఇచ్చేవారు. దాంతో సినిమాల వైపే వెళ్లాలనుకున్నాను. తెలుగులో ఆ అవకాశాలుండవనే అపనమ్మకంతో ముంబయిలో అడుగుపెట్టాను! అక్కడికెళ్లిన రెండు నెలల్లోనే నా సేవింగ్స్‌ మొత్తం కరిగిపోయాయి!

చిన్నాచితక పనులెన్నో…
ముంబయిలో ఊపిరిపీల్చి వదలాలన్నా కూడా డబ్బు కక్కాల్సిందే! సేవింగ్స్‌ అన్నీ అయిపోయాక నా ఖర్చులన్నీ తగ్గించుకోవడం మొదలుపెట్టాను. ఒకే గది ఉన్న పోర్షన్‌ తీసుకున్నాను. ఉదయం లేస్తే ఆకలేస్తుందనీ… బ్రేక్‌ ఫాస్ట్‌ తినాల్సొస్తుందనీ… అలారం పెట్టుకుని మరీ మధ్యాహ్నం రెండుగంటలకి లేచేవాణ్ణి. ఏదో ఒకటి వండుకుతిని బయటపడేవాణ్ణి. రోజువారీ ఖర్చుల కోసం పెద్ద పెద్ద మాల్స్‌కి వెళ్లి అక్కడి షాపులవాళ్లు కొత్తగా లాంచ్‌ చేసే పరికరాలకు ఆడుతూపాడుతూ ప్రచారం చేసేవాణ్ణి. అప్పట్లో మొబైల్‌ ఫోన్‌లలో క్రికెట్‌ గేమ్స్‌ ఉండేవి. వినియోగదారులు వాటిని ఆడుతున్నప్పుడు క్రికెట్‌ కామెంటేటర్స్‌లాగా ‘వావ్‌ ఇటీజ్‌ ఫోర్‌’ అంటూ రికార్డెడ్‌ వాయిస్‌ వినిపిస్తుంటుంది. ఆ వాయిస్‌ ఓవరింగ్‌ కూడా చేశాను. వీటి మధ్యే ఆడిషన్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. బాలీవుడ్‌లో ప్రతి ఆడిషన్‌కీ దాదాపు ఐదు వందల మంది హాజరవుతుంటారు. ఇరుకు గల్లీల్లో అగ్గిపెట్టెల్లా ఉండే ఆఫీసుల్లో కిక్కిరిసిపోయి నిల్చుంటారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్‌ చేశాకకానీ మనకి పిలుపురాదు. ఎన్ని వందలమంది పాల్గొన్నా తుది జాబితాలో నేనుండేవాణ్ణి… అది కూడా ‘ఫైనల్‌ 3’లో. అంతదూరం వెళ్లాక ‘బాసూ… నువ్వు అన్నిరకాలా సెట్‌ అయ్యావుకానీ మిగతావాళ్ల లుక్స్‌ ఇంకా కరెక్ట్‌గా సెట్‌ అయ్యాయి’ అనేవాళ్లు. మొదట్లోనో, మధ్యలోనో వెళ్లిపోతే ఇంత బాధ ఉండదుకానీ… ఇన్ని ఆశలు పెంచుకున్నాక బయటకు వెళ్లడం చాలా నిస్పృహని కలిగించేది. వీటి మధ్యనే అనుకోకుండా తెలుగు సినిమాల అవకాశాలొచ్చాయి.

చిన్న చిన్న పాత్రలు…
ఓసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఆడిషన్స్‌కి వెళ్లాను. వెళ్లాను కాదు… వెళ్లాము. నాతోపాటూ ‘రౌడీ’ విజయ్‌ దేవరకొండ కూడా వచ్చాడు. నాకు నాటకాల్లో నటిస్తున్నప్పటి నుంచీ విజయ్‌ పరిచయం. ఇద్దరమూ ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’కి సెలెక్ట్‌ అయ్యాం. మమ్మల్ని మొదట ప్రధాన పాత్రలకే తీసుకున్నారు కానీ… ‘మీ ఫేస్‌లో ఓ రిచ్‌ లుక్‌ ఉందండీ!’ అంటూ హీరోని వ్యతిరేకించే గ్యాంగ్‌లో పడేశారు. అలా ఆ సినిమాతోనే నేనూ, విజయ్‌ తెరపైకొచ్చాం. తర్వాత ‘నేనొక్కడినే’ సినిమాలోనూ అవకాశం వచ్చింది. ఆ రెండింటి తర్వాత మళ్లీ ముంబయికే వెళ్లాల్సి వచ్చింది. 2012లో ఓసారి అక్కడ స్టాండప్‌ కామెడీ పోటీలు నిర్వహిస్తే అందులో నాకు ఫస్ట్‌ ప్రైజు వచ్చింది. ఆ పోటీలకి జడ్జిలుగా ‘ఏఐబీ’(ఆలిండియా బక్చోద్‌)యూట్యూబ్‌ ఛానెల్‌ వాళ్లు వచ్చారు. వాళ్లు నా టైమింగ్‌ నచ్చి తమతో పనిచేయమన్నారు. వాళ్లే నా చేత కలం పట్టించి రైటర్ని చేశారు. అలా వాళ్లతో కలిసి చేసిన ‘హ్యాష్‌ట్యాగ్‌ వెడ్డింగ్‌’, ‘ఆనెస్ట్‌ ఇంజినీరింగ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌’ వంటి వెబ్‌సిరీస్‌లు బాగా వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా ‘ది ట్రూత్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌’ వీడియో ప్రపంచవ్యాప్తంగా పాపులరైంది. దానిపైన దేశవిదేశాల్లో మా చేత కార్యక్రమాలు ఇప్పించారు. ఇలా వైరల్‌ అయిన ఆ వీడియోని ఎవరో వాట్సాప్‌ ద్వారా మా అమ్మానాన్నలకీ పంపించారట. వాటిని చూశాకే నాన్న ‘నువ్వు ఈ రంగంలో పైకొస్తావనే నమ్మకం మాకు ఇప్పుడొచ్చిందిరా!’ అని ఫోన్‌ చేశాడు. ఆ యూట్యూబ్‌ వీడియోలని చూసే స్వరూప్‌ రెడ్డి ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ కథని చెప్పాడు. అది చూశాక ‘ఇంతకాలం నేను ఎదురుచూస్తున్నది ఇటువంటి స్క్రిప్టు కోసమే…’ అనిపించింది. నేనే స్క్రీన్‌ ప్లే రాయడం మొదలుపెట్టాను.

‘రెండు షో’లకే అవకాశం…
ఏజెంట్‌ గుక్క తిప్పుకోకుండా నెల్లూరు యాస మాట్లాడాలి, రకరకాల వేషాలూ వేయాలి కాబట్టి ఏడాది పాటు అన్నింటి మీదా దృష్టి పెట్టాను. ఇంతచేసీ ఈ సినిమాని నిర్మించడానికి ఎవరూ ముందుకు రాలేదు! ‘సినిమాలో రొమాన్స్‌ లేదు… హీరోకి కండల్లేవు ఎవరు చూస్తారు’ అనేశారు. దాదాపు ఏడాది ప్రయత్నించాక నక్కా రాహుల్‌ నిర్మాతగా వచ్చాడు. సినిమా పూర్తయ్యాక మాకెవ్వరూ థియేటర్‌లు ఇవ్వలేదు. ఎంతో బతిమిలాడితే రోజుకి రెండు షోలు ఇస్తామన్నారు. ఎవరో దయతలచి అమెరికాలోనూ విడుదలచేస్తామన్నారు. సినిమా రిలీజుకి వారం ముందు నుంచీ స్వరూప్‌కీ, నాకూ టెన్షన్‌ మొదలైంది. రిలీజు ముందు రోజు అర్ధరాత్రి రెండుగంటలకి నాకు ఫోన్‌ వచ్చింది. అప్పటికే అమెరికాలో రెండు షోలు వేయడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ నాకు ఫోన్‌ చేశాడు. భయం భయంగానే రిసీవర్‌ తీసుకున్నాను ‘మీ సినిమాకి రెస్పాన్స్‌ అదిరిపోయింది. ఆ నవ్వులూ, చప్పట్లూ చూడండి’!’ అంటూ వీడియో కాల్‌లో చూపించాడు. ఆ తర్వాత నిద్రపట్టలేదు నాకు. ఉదయం ఎనిమిదిగంటలకి హైదరాబాద్‌లో ప్రివ్యూ వేశారు. సినిమా పూర్తై నేనూ స్వరూప్‌ మెట్లు దిగేసరికి కింద దాదాపు రెండొందల మంది మా చుట్టూ చేరి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ స్పందన చూశాక… ఎన్నాళ్లు నాలో గూడుకట్టుకున్నాయో… ఏయే అవమానాలప్పుడు నేను దాచుకున్నవో… ఎప్పుడెప్పుడు బయటకు రావాలని చూస్తున్నాయో… ఆ కన్నీళ్లు… ఒక్కసారిగా ఎగజిమ్ముకొచ్చాయి! అంతమంది ముందు స్వరూప్‌ని పట్టుకుని భోరుమని ఏడ్చేశాను. నిజానికి ఆ రోజంతా ఏడుస్తూనే ఉండిపోయాను!

నవ్వుల ఉత్సవం!
‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రిలీజైన కొన్ని రోజులకే నేను ప్రధాన పాత్రలో నటించిన ‘చిచోరే’ హిందీ సినిమా వచ్చింది. అది కూడా సూపర్‌హిట్టయింది. అటు టాలీవుడ్‌, ఇటు బాలీవుడ్‌లోనూ నటుడిగా పరిచయమైన చిత్రాలు రెండూ హిట్టు కొట్టడం… ఏ నటుడికైనా గొప్ప అనుభవం! ఆ రెండు చిత్రాల తర్వాత పెద్ద సంస్థలే ఆఫర్లు ఇచ్చాయికానీ… ప్రేక్షకుల ముందుకు మరింత వైవిధ్యమైన కథతో రావాలనుకున్నాను. అలా ‘జాతిరత్నాలు’ చేశాను. ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన చిత్రం అది. ఆయన ద్వారా దర్శకుడు అనుదీప్‌ కథ చెబుతున్నప్పుడే కడుపు చెక్కలయ్యేలా… కళ్లలో నీళ్లు తిరిగేలా నవ్వుకున్నాను. షూటింగ్‌ పూర్తయి లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదలుపెట్టాం. లాక్‌డౌన్‌ ముగిశాక… కరోనా మహమ్మారిని ఏదోరకంగా జయించామనే ఆనందంలో మనందరం కలిసిఆనందాన్ని పంచుకునే రోజు ఒకటొస్తుంది. ఆ వేడుకల వేళ జీవితాంతం మరచిపోలేని నవ్వుల జ్ఞాపకాలని మిగిల్చేలా ఉంటుంది మా సినిమా… మీరే చూస్తారుగా…!

 

 

 

Heroine Jhanvi kapoor

heroine jhanvi kapoor

Heroine poorna

heroine poorna

Heroine Anannya Pandey – Fighter fame

13dd7cac-a777-4364-8e7d-846fd8be659dheroine ananya - fighter

Cinema Kashataalu articles

477db4ec-e1bd-4395-8e92-8f7ae4a30521ad51313a-e18b-4630-8d27-c6307543e75fcinema kashtaalu 10cinema kashtalu 9 cinema kashtalu 6 cinema kashtalu 7 cinema kashtalu 8 cinema kashtalu 3 cinema kashtalu 1 cinema kashtalu 2 cinema kashtalu 4 cinema kashtalu 5

Directer Phanindra Narsetti

manu