Heroine రుక్సార్‌ థిల్లాన్‌..

పాకెట్‌ మనీ సంపాదించుకునేదాన్ని

లండన్‌లో పుట్టి.. బెంగళూరులో స్థిరపడ్డ పంజాబీ అమ్మాయి రుక్సార్‌ థిల్లాన్‌… చెఫ్‌ కావాలనుకొని.. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసి అనుకోకుండా తెరంగేట్రం చేసేసింది… ఆకతాయిగా పరిచయమై.. కృష్ణార్జున యుద్ధంతో మెప్పించి.. ఏబీసీడీతో మరోసారి మనముందుకొచ్చింది రుక్సార్‌ థిల్లాన్‌… అవకాశం ఈజీగా వచ్చినా.. దాన్ని నిలబెట్టుకోవాలంటే హార్డ్‌వర్క్‌ తప్పదంటున్న రుక్సార్‌ తన నేపథ్యం, కాలేజీ కబుర్లు, సినిమాలపై మమకారం గురించి ఇలా చెబుతోంది.

అనుకోకుండా అడుగులు: పెద్దయ్యాక హీరోయిన్‌ అయిపోవాలని నేనెప్పుడూ కలలు కనలేదు. అనుకోకుండానే సినిమా అవకాశం పలకరించింది. ఆ తర్వాత మాత్రం వందశాతం మనసుపెట్టి పని చేస్తున్నా. ఏదైనా క్రియేటివ్‌ ఫీల్డ్‌ ఎంచుకోవాలనీ, నేనేంటో నిరూపించుకోవాలని చిన్నప్పట్నుంచీ చాలా ఆసక్తిగా ఉండేది. మంచి చెఫ్‌ కావాలనీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసి స్టార్‌ హోటళ్లలో పని చేయాలనీ అనుకునేదాన్ని. కానీ దానికి భిన్నంగా, నా ప్రమేయం లేకుండానే సినిమాల్లోకి వచ్చా.

మొదటి అవకాశం: కాలేజీలో ఉన్నపుడు ‘మిస్‌ బెంగళూరు’ పోటీలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్‌ ప్రోత్సాహంతో సరదాగా ప్రయత్నించా. సెకండ్‌ రన్నరప్‌గా నిలిచా. ‘కళ్యాణ సిల్క్స్‌’ యాడ్‌ అవకాశమొచ్చింది. అది చెప్పలేనంత పేరు తీసుకొచ్చింది. తర్వాత ఇతర మోడలింగ్‌ అవకాశాలు వచ్చినా గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేదాకా ఏవీ చేయకూడదని వదులుకున్నా. అనుకున్నట్టే చదువు పూర్తి చేశా. తర్వాత కొందరు కన్నడ దర్శకుల నుంచి పిలుపొచ్చింది. ‘ఎంతో కష్టపడితేగానీ ఇలాంటి అవకాశం రాదు. నిన్ను పిలిచి హీరోయిన్‌ చేస్తానంటున్నారు. అస్సలు వదులుకోవద్దు’ అన్నారు సన్నిహితులు. ఇంకేం.. నేను హీరోయిన్‌ అయిపోయినట్టేనని సంతోషంగా వెళ్లా. కానీ అక్కడికెళ్లాక ఆడిషన్‌ చేశారు. నటించి చూపించమన్నారు. ఫొటోషూట్‌ తీసుకున్నారు. ఎమోషన్స్‌లో సరిగా పలుకుతున్నాయో, లేదో పరిశీలించారు.. ఇవన్నీ నచ్చాకే మొదటి అవకాశం ఇచ్చారు. అలా ‘రన్‌ ఆంటోనీ’తో తొలిసారి తెరపై కనిపించా. ఆపై ఆకతాయి, కృష్ణార్జునయుద్ధం సినిమాలతో తెలుగువాళ్లకి దగ్గరయ్యా.

లండన్‌లో పుట్టా: అమ్మానాన్నలు లండన్‌లో ఉన్నపుడు నేను అక్కడే పుట్టా. తర్వాత వాళ్లు వ్యాపారం కోసం గోవాకి వచ్చారు. తొమ్మిదో తరగతి వరకు మనోవికాస్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లో చదువుకున్నా. తర్వాత నా చదువుకోసం బెంగళూరుకి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాం. నేనేం చేసినా బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటానని అమ్మానాన్నలకు నాపై నమ్మకం. ఇది చేయాలి.. అది చేయొద్దని ఎప్పుడూ ఆంక్షలు విధించలేదు. చదువు, కెరీర్‌ విషయాల్లో నీకు నచ్చిందే చెయ్‌మన్నారు. సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. మా కుటుంబానికెలాంటి సినిమా నేపథ్యం లేకపోయినా బాగా ప్రోత్సహించారు.

కాలేజీ రోజులు: అందిరిలాగే కాలేజీ రోజులు నా జీవితంలో గోల్డెన్‌ డేస్‌గా చెప్పుకోవచ్చు. కాలేజీలో ఉన్నపుడే అందాల పోటీల్లో గెలవడం జీవితంలో మర్చిపోలేని రోజు. చదువుల్లో ముందుండేదాన్ని. తరగతిలో టీచర్లకి నేను ‘గుడ్‌ గాళ్‌’ని. సినిమాలు, పార్టీల కోసం క్లాస్‌లు బంక్‌ కొట్టిన సందర్భాల్లేవు. ఇద్దరు అబ్బాయిలు వెంటపడ్డారు. లవ్యూ అన్నారు. అదంతా సరదాసరదాగా ఉండేదే తప్ప నన్నెవరూ సీరియస్‌గా లవ్‌ చేయలేదు. నేనూ ప్రేమలో పడలేదు.

మర్చిపోలేను: ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం మాది. పెద్దగా కష్టపడకుండా అవకాశమొచ్చింది. మొదటి అవకాశం, మొదటిసారి కెమెరా ముందు నిల్చున్నపుడు, మొదటి సాంగ్‌ చిత్రీకరణ, వందల మందితో కలిసి పనిచేయడం, పరాయి రాష్ట్రమైనా తెలుగు జనం నన్ను ఆదరించడం.. ఇవన్నీ మర్చిపోలేని క్షణాలే. ఒక్కోసారి అదృష్టంకొద్దీ తేలిగ్గానే మనకు మంచి అవకాశాలొస్తుంటాయి. వాటిని నిలబెట్టుకోవాలంటే మాత్రం బాగా కష్టపడాలి. నేను మిడిల్‌క్లాస్‌ అమ్మాయినైనా నాలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చదువుకుంటున్నపుడే చిన్నచిన్న పనులు చేస్తూ పాకెట్‌మనీ సంపాదించుకునేదాన్ని. నిజాయతీగా, కష్టపడి పని చేస్తే ఏ అమ్మాయైనా అనుకున్నది సాధించగలదు.
* బెంగళూరు యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశా.
* రుక్సార్‌ అనే పేరుకి గులాబీ రంగు చెక్కిళ్లు అని అర్ధం.
* ఖాళీగా ఉన్నప్పుడు వంట చేస్తా. అది ఒత్తిడి ఉపశమనంలా పని చేస్తుంది.
* టాలీవుడ్‌లో నేను కలిసి పనిచేయాలనుకునే హీరోలు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌.
* యాక్టింగ్‌ కాకుండా బొమ్మలు బాగా వేస్తాను.

– శ్రీనివాస్‌ బాలె