Art Director ‘Brahma Kaali’

కుంచె ఇస్తారనుకుంటే… చీపురిచ్చారు!

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!

 

సినిమా… కథకుడి ఊహ అయితే, కళా దర్శకుడి సృష్టి. కొన్ని సినిమాలు చూసినపుడు శ్రీకారం నుంచి శుభం వరకూ వేరే ప్రపంచంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. తెలుగు సినిమాల్లో అలాంటి ఎన్నో ఊహా ప్రపంచాలకు వాస్తవ రూపం ఇచ్చారు ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ కడలి. పేరులోనే సృష్టికర్తని పెట్టుకున్న ఈయన తన ప్రయాణం గురించి ఏం చెబుతారంటే…

రతన్‌పుర్‌… జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఊరు. ఇది నేను పుట్టిపెరిగిన ఊరు కాదు, సృష్టించిన ఊరు. ‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ కోసం హైదరాబాద్‌లో రతన్‌పుర్‌ సెట్‌ వేశాం. సినిమాలో కథ ఎక్కువ భాగం ఈ ఊళ్లోనే జరుగుతుంది. అందుకే ఊరిని సృష్టించాలనుకున్నాం. మధ్య భారతదేశంలోని ఓ టౌన్‌షిప్‌ని పోలి ఉంటుందా ఊరు. ఇళ్లు, దుకాణాలు, సెలూన్‌, పోలీస్‌స్టేషన్‌, బ్యాంకు, పెట్రోల్‌ బంకు, వాటర్‌ ట్యాంకు, రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌తోపాటు ముఖద్వారాన్నీ సృష్టించాం. సాధారణంగా సెట్‌ వేయడానికి ముందు స్కెచ్‌ వేస్తాం. దీన్ని మాత్రం ముందు మినియేచర్‌గా తయారుచేశాం. చిన్న చిన్న మార్పులతో ఫైనల్‌ చేసుకున్నాక సెట్‌ వేశాం. రూ.5కోట్లు ఖర్చయింది. హీరో పవన్‌ కల్యాణ్‌ గారికి బాగా నచ్చింది. ఆ సినిమా కథ ఆయన రాసిందే. ఆ సెట్‌ శాశ్వతంగా ఉండిపోయేలా వేయించాలనుకున్నారు కానీ కుదరలేదు. ఒకరోజు నా భుజంమీద చేయివేసి సెట్‌ మొత్తం కలియదిరిగి… ‘ఇది నా ఇరవై ఏళ్ల కల. నీవల్ల నిజమైంది. థ్యాంక్యూ’ అన్నారు. నా కెరీర్‌లో అతిపెద్ద, అత్యంత సంతృప్తినిచ్చిన సెట్‌ అది. కల్యాణ్‌ గారితో గబ్బర్‌సింగ్‌, గోపాల గోపాల, కాటమరాయుడు సినిమాలకీ పనిచేశా. ‘గబ్బర్‌సింగ్‌’ నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌. ఆ అవకాశం ఎలా వచ్చిందో చెప్పేముందు అక్కడివరకూ చేరడానికి చేసిన ప్రయాణం గురించీ మీకు చెప్పాలి.

బొమ్మలు గీయడం అనుకున్నా…

మా సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట. నాన్న మోహనరావు, అమ్మ నాగవేణి. మాది వ్యవసాయ కుటుంబం. నాకో తమ్ముడు సురేష్‌, చెల్లి కనకదుర్గ. పదో తరగతి వరకూ ఊళ్లోనే చదువుకున్నా. కాలేజీకి దగ్గర్లోని పెనుగొండ వెళ్లాను. చదువుకునే రోజుల్లో బొమ్మలు బాగా వేసేవాణ్ని. ఇంట్లో వాళ్లకి ఇది నచ్చేది కాదు. మా మావయ్యలు సముద్రుడు, ప్రసాదరావు… మాత్రం నన్ను ఫైన్‌ఆర్ట్స్‌ చదివిస్తే బావుంటుందనుకున్నారు. పెద్ద మావయ్య హైదరాబాద్‌లో ఉండేవారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసి… 1994లో హైదరాబాద్‌ రమ్మన్నారు. మొదట తన స్నేహితుడికి చెందిన కంపెనీలో ప్రింటింగ్‌ విభాగంలో ఇంఛార్జిగా పెట్టారు. ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో చేరేంతవరకూ అక్కడ పనిచేద్దామనుకున్నా. దాదాపు ఏడాది పాటు పనిచేశాక నేను వచ్చిన పని అది కాదనిపించి మానేశా. తర్వాత ఒక యాడ్‌ ఏజెన్సీలో డిజైనర్‌గా చేరా. నేను చేరిన కొన్ని నెలలకు ఆ సంస్థ మూత పడింది. ఆ సమయంలో నా ఫ్రెండ్‌ నాగూర్‌బాబు కూడా హైదరాబాద్‌లో ఉండేవాడు. వాళ్ల అన్నయ్య హీరో శ్రీకాంత్‌ గారి మేకప్‌మేన్‌. నాకు

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!

ఆర్ట్‌లో ప్రవేశం ఉంది కాబట్టి…

ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరితే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆర్ట్‌ డైరెక్టర్‌ పేకేటి రంగా గారి దగ్గర ‘మావిచిగురు’ సినిమాకి అబ్జర్వర్‌గా చేర్పించారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అంటే పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్‌ అనుకున్నా. స్కూల్‌ రోజుల్లో సినిమా టైటిల్స్‌ని వాటి డిజైన్లలోనే గీసేవాణ్ని. ఆ ధైర్యంతో సెట్‌కు వెళ్లా. తీరా వెళ్లాక ‘బాబూ, ఇక్కడే సెట్‌ వేసేది. ఇది మొత్తం ఊడ్చేసెయ్‌’ అంటూ చేతిలో చీపురు పెట్టాడో సీనియర్‌. కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ మధ్యలో వెళ్లడం పద్ధతి కాదని ఆ పనిచేశా. ఆ విభాగంలోని సృజనాత్మకత నచ్చి తర్వాతా కొనసాగా. ఆపైన మరో ఆర్ట్‌ డైరెక్టర్‌ మనీషా రాజుగారి దగ్గర అప్రెంటిస్‌గా చేరి ‘వినోదం’కి పనిచేశా. రాజుగారు చాలా బిజీ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఆయన అసిస్టెంట్‌లకూ బాగా పని ఉండేది. దాంతో చాన్నాళ్లు ఆయన దగ్గరే కొనసాగాను. మూడేళ్లు రూపాయి కూడా రెమ్యునరేషన్‌ రాలేదు. ‘పని నేర్చుకుంటున్నాం అదే పదివేలు’ అనుకునేవాళ్లం. రాజు గారు మాత్రం ఎప్పుడైనా ‘ఖర్చులకు డబ్బులున్నాయా’ అని అడిగి ఎంతోకొంత చేతిలో పెట్టేవారు. తర్వాత ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా దగ్గర శివమణి, సూపర్‌ లాంటి 15 సినిమాలకు పనిచేశా. ఎ.ఎస్‌.ప్రకాశ్‌, తోట తరణిలాంటి వారి దగ్గరా ఒకట్రెండు సినిమాలకు పనిచేశా. ఆ తర్వాత ఆనంద్‌సాయి గారి శిష్యరికం చేసే అవకాశం వచ్చింది. బొమ్మరిల్లు, మున్నా, పరుగు, జల్సా… ఇలా దాదాపు ఓ డజను సినిమాలకు ఆయన దగ్గర పనిచేశా.

అనుకోకుండా ఆర్ట్‌ డైరెక్టర్‌నయ్యా…

సినీ ప్రయాణంలో వివిధ క్రాఫ్ట్‌లలో పనిచేస్తున్న జూనియర్‌ టెక్నీషియన్ల మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని వాసువర్మతో నాకూ అలా స్నేహం కుదిరింది. నాగచైతన్య తొలి చిత్రం ‘జోష్‌’తో ఆయన డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. నన్ను ఆ సినిమాకి ఆర్ట్‌ డైరెక్టర్‌గా చెయ్యమన్నాడు వాసు. మరికొన్నాళ్లు అనుభవం సంపాదించాలని నాకుండేది. తను పట్టుపట్టడంతో అంగీకరించా. ఆ సినిమాకి నిర్మాత దిల్‌ రాజు గారు. మంచి బ్యానర్‌. కానీ సినిమా అనుకున్నంతగా ఆడకపోవడంతో తర్వాత ఎవరి నుంచీ పిలుపురాలేదు. నేనుగా వెళ్లి అడిగేంత ధైర్యం లేదు. ఆ సమయంలో ఆనంద్‌ సాయి ఫోన్‌చేసి ‘ఎక్కడ ఉన్నావ్‌, ఏం చేస్తున్నావ్‌’ అని అడిగారు. ‘ఇంట్లోనే ఉన్నా, ఒకట్రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి మొదలవ్వడానికి టైమ్‌ పడుతుంది’ అని చెప్పా. ఆయనకు ఏం అర్థమైందోగాని ఆఫీసుకి రమ్మని చెబ్తే వెళ్లాను. ‘ఖాళీగా ఉంటే ఇండస్ట్రీ మర్చిపోతుంది. ఏదో పనిచేస్తూనే ఉండాలి. ‘ఆరెంజ్‌’ లొకేషన్‌ రెక్కీ కోసం ఆస్ట్రేలియా వెళ్తున్నా. ‘కొమరం పులి’ క్లైమాక్స్‌ మిగిలి ఉంది. సెట్‌లో ఉండి ఆ పనులు చూస్కో. అసిస్టెంట్‌ అనుకోకు, కలిసే చేస్తున్నాం అని చెబుతా’ అన్నారు. ‘మీకు అసిస్టెంట్‌గా చేస్తున్నానంటే నాకేమీ నామోషీ కాదు’ అని చెప్పి ఆ మరుసటిరోజు నుంచే సెట్‌కు వెళ్లా. తర్వాత ‘ఆరెంజ్‌’ షూటింగ్‌ కోసం రెండు నెలలు
ఆస్ట్రేలియా వెళ్లమన్నారు.

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!

హరీష్‌ మాటిచ్చారు…

ఆస్ట్రేలియా వెళ్లబోయే ముందు ‘మిరపకాయ్‌’కి ఆర్ట్‌ డైరెక్టర్‌గా అవకాశం వచ్చింది. ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ బ్రహ్మానందం గారు హరీష్‌శంకర్‌కి నాపేరు సూచించారట. ‘ఆస్ట్రేలియా వెళ్తున్నా, చేయలేన’ని చెప్పా. షూటింగ్‌ ప్రారంభం కావడానికి టైమ్‌ పడుతుంది కాబట్టి ఫర్లేదన్నారు. నేను తిరిగి వచ్చేంతవరకూ ఓ అసిస్టెంట్‌ని పంపించమంటే, సరేనన్నా. ఆర్ట్‌ డైరెక్టర్‌ లొకేషన్స్‌ చూపించే పనుల్నీ చూస్తుంటారు. ‘మిరపకాయ్‌’ కాలేజీ నేపథ్యంలో ఉంటుంది. కాలేజీ లొకేషన్‌ కోసం ఎంత వెతికినా దొరకలేదట. డైరెక్టర్‌కి సహనం రోజురోజుకీ తగ్గుతోందని తెలిసింది. చివరకు ఆస్ట్రేలియా నుంచి వచ్చీరావడంతోనే ‘మూడు లొకేషన్లు చూపిస్తా, ఏదో ఒకటి కచ్చితంగా నచ్చుతుంద’ని చెప్పా. చూపించిన మొదటి లొకేషనే తనకి బాగా నచ్చేసింది. ‘ఇకమీదట నా ప్రతి సినిమాకీ ఆర్ట్‌ డైరెక్టర్‌ నువ్వే’ అని ఆరోజు చెప్పాడు హరీష్‌. ఆ సినిమా హిట్‌ అయింది. హరీష్‌కి తర్వాత ‘గబ్బర్‌సింగ్‌’ డైరెక్షన్‌ అవకాశం వచ్చింది. కానీ కల్యాణ్‌గారు తన ఫ్రెండ్‌ ఆనంద్‌సాయిని దాటి నాకా అవకాశం ఇస్తారనుకోలేదు. హరీష్‌ నా పేరుని కల్యాణ్‌గారి దృష్టికి తీసుకువెళ్లినపుడు… ‘మీకు ఎవరు కంఫర్ట్‌గా ఉంటే వాళ్లని పెట్టుకోండి’ అన్నారట. హరీష్‌ ఆ మాట చెప్పేసరికి ఎంతో సంతోషించా. నేనేంటో నిరూపించుకోవడానికి మంచి అవకాశం అనుకున్నా. కల్యాణ్‌ గారిని కలిసినపుడు ‘ఏం చేయబోతున్నారు’ అని అడిగితే అప్పటికే సిద్ధం చేేసుకున్న లొకేషన్లూ, సెట్‌లూ, హీరో హీరోయిన్ల కలర్‌ ప్యాలెట్ల స్కెచ్‌లను చూపించా. అవన్నీ చూసి ‘గో ఎహెడ్‌’ అన్నారు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత హరీష్‌ తోనే ‘రామయ్యా వస్తావయ్యా’ చేశా. డైరెక్టర్‌ బాబీ మంచి స్నేహితుడు. తన మొదటి చిత్రం ‘పవర్‌’, తాజా చిత్రం ‘వెంకీ మామ’ సినిమాలకూ పనిచేశా. ‘వెంకీ మామ’ సినిమాని నెల రోజులపాటు కశ్మీర్‌లో షూటింగ్‌ చేశాం. అందులో కనిపించే ఆర్మీ సెటప్‌లన్నీ సెట్‌లు వేసినవే. నన్ను బాగా ప్రోత్సహించిన దర్శకుల్లో పూరీ జగన్నాథ్‌ ఒకరు. ఆయనతో ఇద్దరు అమ్మాయిలతో, హార్ట్‌ ఎటాక్‌, టెంపర్‌ సినిమాలకు పనిచేశా. టెంపర్‌ కోసం వెదురు కర్రలతో ఒక హౌస్‌ సెట్‌ వేశా. దానికి మంచి గుర్తింపు వచ్చింది.

నిద్రాహారాలు ఉండవు…

ఆర్ట్‌ డైరెక్టర్‌గా దాదాపు 25 సినిమాలు చేశా. భారీ బడ్జెట్‌వే కాదు, చిన్న, మధ్యస్థాయి బడ్జెట్‌ సినిమాలకూ పనిచేశా. ఈ ఏడాది మొదట్లో విడుదలైన ‘నాంది’ కూడా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ మధ్యనే ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేర్‌’ వెబ్‌ సిరీస్‌కూ పనిచేశాను. సినిమాకి ఏమాత్రం తక్కువ కాని అనుభవం అది. నటీనటులు వేసుకునే డ్రెస్‌లు తప్పించి పాటలూ, ఫైట్లూ, సీన్లలో కనిపించే ప్రతి వస్తువూ ఆర్ట్‌ డైరెక్టర్‌ సృష్టి. ఇది సృజనాత్మక విభాగం. దాంతోపాటు తక్కువ బడ్జెట్‌లో, సకాలంలో పని చేస్తేనే ఇక్కడ విజయం సాధ్యమవుతుంది. లొకేషన్‌లో కొన్నిసార్లు డైరెక్టర్‌కి కొత్త ఆలోచన రావొచ్చు. అప్పటికప్పుడు అందుకు తగ్గట్టు సెట్‌ని సిద్ధం చేయాలి. అలాంటపుడు నిద్రాహారాలూ ఉండవు. ఇది టీమ్‌ వర్క్‌. నాకు ఏదైనా సందేహం వస్తే డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లోని మిత్రులు విజయ్‌ కనకమేడల, రమేష్‌రెడ్డి, బాబీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. ఈ వృత్తిలో ఉండటంవల్ల శ్రీహరికోటలోని ఇస్రోకు, హైదరాబాద్‌లోని ఆక్టోపస్‌, కశ్మీర్‌లోని ఆర్మీ కార్యాలయాలకు వెళ్లగలిగా. దేశవిదేశాల్లో అనేక ప్రాంతాల్ని చూడగలిగా. అలాంటపుడూ, చేసిన పనికి గుర్తింపు వచ్చినపుడూ కష్టాలన్నీ మర్చిపోతా.


అదే రిటైర్మెంట్‌ ప్లాన్‌…

కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!

నా పూర్తిపేరు బ్రహ్మేశ్వరరావు. నా శ్రీమతి రాధిక. మాది ప్రేమ వివాహం. వాళ్లది గుంటూరు జిల్లా కొలకనూరు. హైదరాబాద్‌లో చదివేది. మా కజిన్‌ క్లాస్‌మేట్‌. తనను చూడగానే నచ్చేసింది. తనకు అంగీకారమైతే పెళ్లి చేసుకుంటా నని మా చెల్లితో చెప్పించా. రెండ్రోజుల తర్వాత నా ప్రేమను అంగీకరించింది. కానీ వాళ్లింట్లో ఒప్పుకోలేదు. సినిమా రంగంలోని వాళ్లు వద్దని అభ్యంతరం చెప్పారు. మేం పెళ్లి చేసుకున్న ఆరు నెలలకు వాళ్ల మనసు మారింది.

* మాకు ఇద్దరు అబ్బాయిలు. తన్విన్‌ సాయి, రిత్విక్‌ సాయి. గురువుగారు ఆనంద్‌సాయి మీద గౌరవంతో పిల్లల పేర్ల చివర్లో సాయి అని పెట్టాను.

* కథనుబట్టి సినిమాకి అవసరమయ్యే ప్రాపర్టీస్‌ మారుతుంటాయి. వాటిని తెచ్చుకోవడానికి ఆర్ట్‌ డైరెక్టర్లకి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశాల్లో వస్తువులు అద్దెకు ఇచ్చే దుకాణాలు ఉంటాయి. మన దగ్గర అలాంటిది ఒకటి ఉండాలన్న ఆలోచనతో ‘రైట్‌ చాయిస్‌ ప్రాప్స్‌’ పేరుతో హైదరాబాద్‌లో షాప్‌ తెరిచా. ఇది నా రిటైర్మెంట్‌ ప్లాన్‌ కూడా.