artist bharat

నన్ను గుర్తుపట్టడం లేదు

తెలుగు తెరపై మెరిసిన బాల నటులు ఎంతోమంది. కానీ భరత్‌ వేసిన ముద్ర ప్రత్యేకమైనది. బొద్దుగా కనిపిస్తూ… ప్రత్యేకమైన హావభావాలు, సంభాషణలతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. చిట్టినాయుడుకి నేను పెద్ద అభిమానిని అని ఇటీవల అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ ఓ వేడుకలో చెప్పారు. ‘రెడీ’లో ఆ పాత్రపై భరత్‌ వేసిన ముద్ర అలాంటిది.  మొన్నటిదాకా మాస్టర్‌ భరత్‌  అని పిలిపించుకున్న ఆయన… ఇప్పుడు ఫ్రెండ్‌ భరత్‌గా మారిపోయాడు. అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏబీసీడీ’లో స్నేహితుడిగా నటిస్తున్నాడు. ఈ సందర్భంగా భరత్‌ చెప్పిన కబుర్లు…

* చాలా విరామం తర్వాత.. పూర్తిగా మారిపోయి తిరిగొచ్చారు?
చదువు కోసమే కొన్నాళ్లు సినిమాలకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ‘సైజ్‌జీరో’, ‘మిస్టర్‌’ తర్వాత నేను సినిమాలేమీ చేయలేదు. నా వయసు కూడా నా కెరీర్‌పై ప్రభావం చూపించింది. అటు చిన్నపిల్లాడిలా కనిపించలేను, ఇటు పెద్దవాడినీ కాదు. దాంతో నాకు వచ్చే అవకాశాలు కొద్దివరకు తగ్గాయి. మధ్యలో కొన్ని అవకాశాలు వచ్చినా కాదనుకొన్నా. ఇప్పుడు పెద్దవాడిలా మారిపోయాను కాబట్టి స్నేహితుడి పాత్రలు వస్తున్నాయి.

* పరిశ్రమలో మిమ్మల్ని అందరూ గుర్తు పడుతున్నారా?
చాలామంది గుర్తు పట్టడం లేదు. నన్ను నేను పూర్తిగా పరిచయం చేసుకొన్నాక… ‘హేయ్‌ భరత్‌… నువ్వేంటి ఇలా? ఇంతగా మారిపోయావేంటి?’ అని ఆశ్చర్యపోతుంటారు. ‘మిస్టర్‌’ చేస్తున్నప్పుడు రామోజీ ఫిల్మ్‌సిటీలో మా సెట్‌ పక్కనే ‘డీజే’ చిత్రీకరణ జరుగుతుంటే అల్లు అర్జున్‌ అన్నని కలవడానికి వెళ్లా. ‘హాయ్‌ అన్నయ్యా…’ అని పలకరించా. ఆయన హాయ్‌ అమ్మా… అంటూ  మళ్లీ తన పనిలో బిజీ అయిపోయారు. కాసేపయ్యాక ‘అన్నయ్యా… నేను భరత్‌ని. హ్యాపీ, బద్రీనాథ్‌ సినిమాల్లో మీతో కలిసి చేశాను’ అని చెప్పా. ‘హేయ్‌.. భరత్‌ నువ్వా? చాలా మారిపోయావ్‌’ అంటూ మాట్లాడారు. అలా నన్ను చూసి షాకైపోయినవాళ్లే ఎక్కువ.

* బొద్దుగా ఉన్న మీరు ఇంత నాజూగ్గా ఎలా తయారయ్యారు?
అందరూ నేను సినిమాల కోసమే అలా బొద్దుగా మారానేమో అనుకుంటుంటారు. అది నిజం కాదు. నేను భోజన ప్రియుడిని. మా అమ్మ చేతి వంటలంటే ఎంత ప్రాణమో చెప్పలేను. అలా బాగా తిని లావైపోయా. ఇలా స్లిమ్‌ అవ్వడానికి కూడా సినిమాలు కారణం కాదు.  జలుబు వచ్చిందని డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా… నువ్వెందుకు ఇంత లావుగా ఉన్నావు, వెంటనే తగ్గాలని చెప్పేవారు. దాంతో ఎలాగైనా తగ్గాలని నిర్ణయించుకొని డాక్టర్లని సంప్రదించా. ఇష్టమైన ఆహారం మానేసి ఉడకబెట్టిన కూరగాయలు, కాస్త అన్నమే తినమని చెప్పారు. అప్పుడు నా పరిస్థితిని చూడాల్సింది మీరు. ‘ఏంట్రా ఈ జీవితం… ఇవి తినడానికేనా బతికేది’ అంటూ తెగ బాధపడిపోయా (నవ్వుతూ). కానీ నా అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్నాళ్లు డైట్‌ మెయింటెయిన్‌ చేశా. దాంతో ముప్పై కేజీలు తగ్గా.

* అప్పుడూ-ఇప్పుడూ సెట్‌లో ఎలాంటి తేడాల్ని చూస్తున్నారు?
తేడా అంటే అప్పుడు అందరూ నా దగ్గరికి వచ్చి ముద్దు చేసేవారు. ఇప్పుడు ఎవ్వరూ ముద్దు చేయడం లేదు (నవ్వుతూ). ‘అప్పట్లో హీరోయిన్లంతా నీ దగ్గరికి వచ్చి బుగ్గలు గిల్లీ… ముద్దులు పెట్టుంటారు కదా. అదృష్టవంతుడివి’ అంటూ అల్లు శిరీష్‌ ఇప్పుడు ఆటపట్టిస్తుంటారు.

* చిన్నప్పుడు మీరు చేసిన సినిమాల్ని ఇప్పుడు చూసుకుంటుంటే ఏమనిపిస్తుంటుంది?
నా కామెడీని మాత్రం నేను బాగా ఆస్వాదిస్తుంటాను. మామూలుగా అయితే మనం చేసిన పాత్రలు మనకు అంత గొప్పగా అనిపించవు. నాకు మాత్రం నేను బాగా నచ్చుతున్నా.

* పరిశ్రమలో మీకుమంచి స్నేహితులంటే ఎవరు?
పరిశ్రమలో నాకు పరిచయమైన తొలి స్నేహితుడు, ఒకే ఒక్క స్నేహితుడు వెన్నెల కిషోర్‌. నాకు గేమ్స్‌ అంటే చాలా ఇష్టం. ‘దూసుకెళ్తా’ సినిమా సమయంలో ఖాళీ దొరికినప్పుడంతా సెల్‌ఫోన్‌ గేమ్స్‌తోనే కాలక్షేపం చేసేవాణ్ని. వెన్నెల కిషోర్‌కి కూడా గేమ్స్‌ అంటే ఇష్టం. అలా మేమిద్దరం స్నేహితులమయ్యాం. నేను స్లిమ్‌గా మారాక నా లుక్‌ని కూడా ఆయనే ట్విటర్‌లో పెట్టారు. ఇలియానా, జెనీలియా, అనుష్క… వీళ్లంతా నాకు బాగా ఇష్టం. అనుష్క అయితే నన్ను బ్రదర్‌ అని పిలుస్తుంటారు.

* చదువుల్లో మీరు బాగా చురుకా?
సినిమాల వల్ల చాలా రోజులు స్కూల్‌కి డుమ్మా కొట్టాల్సి వచ్చేది. కానీ చదువుల్లో వెనకబడలేదు. మా టీచర్లు, మా అమ్మ సహకారం వల్లే అంత బాగా చదివేవాణ్ని. షూటింగ్‌ గ్యాప్‌లో తినడం, చదువుకోవడమే నా పని. నోట్సు తీసుకొని బట్టీ పట్టడం కాకుండా… టెక్ట్స్‌ బుక్‌లు మాత్రమే చదివేవాణ్ని. పాఠాల్ని పూర్తిగా అర్థం చేసుకొంటే చాలనుకొనేవాణ్ని. అలా చదవడమే నాకు ప్లస్సయింది. ఇప్పుడు ట్రెడిషనల్‌ చైనీస్‌ మెడిసిన్‌ చదువుతున్నా. ఒక డాక్టర్‌ దగ్గర ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నా.

అదే టర్నింగ్‌ పాయింట్‌

చిన్నప్పట్నుంచే సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. ఒక కార్యక్రమంలో నేను వేదికపై చేసిన సందడిని ఏవీఎమ్‌ సంస్థవారు చూసి నాకు టెలివిజన్‌ ధారావాహికలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత తమిళంలో ‘నైనా’ అనే సినిమాలో నటించా. కమల్‌హాసన్‌ ‘పంచతంత్రం’లో నటించడం నాకెరీర్‌కి టర్నింగ్‌. అందులో నన్ను చూసి శ్రీనువైట్ల ‘ఆనందమానందమాయె’ సినిమాలో అవకాశమిచ్చారు.

తెలుగు అలామా నాన్న తెలుగువారు, అమ్మ తమిళనాడుకి చెందినవారు. నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఏజీఎస్‌ ఆఫీసులో చెన్నైలో పనిచేస్తుంటారు. నా చిన్నప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా గడిపా. మా బాబాయ్‌, అత్తమ్మవాళ్లు ఇక్కడే ఉంటారు. దాంతో తెలుగు మాట్లాడటమే నాకు అలవాటైంది.

– నర్సిమ్‌ ఎర్రకోట, ఫొటో: జయకృష్ణ