Director Naga Aswin

direc nag aswin 1 direc nag aswin 2
తొలి సంపాదన నాలుగువేలు
నాగ అశ్‌‘విన్‌’

క్యాజువల్‌ నైట్‌ ప్యాంటు…పాత టీషర్ట్‌… పెరిగిన గడ్డం.. పెద్ద జుట్టు… ఓ బక్క పల్చని మనిషి ఇంట్లో బాబును ఎత్తుకొని అటూఇటూ తిరుగుతున్నాడు. ఆడిస్తున్నాడు. ఆయనేనా? అని అనుకుంటుండగానే  దగ్గరికొచ్చి సాదరంగా ఆహ్వానించాడు. ఆయనే జాతీయ తెలుగు ఉత్తమ చిత్రం ‘మహానటి’ దర్శకుడు నాగ అశ్విన్‌.
అబ్బా ఎంత నిరాడంబరత! అని ఆశ్చర్యపోయే లోపే… వంటింట్లోకి వెళ్లి ట్రేలో నాలుగు మంచినీళ్ల గ్లాసులు పెట్టుకొని తీసుకొచ్చి అందించాడు… ఎంత ఒద్దిక!
‘ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.. అన్నీ ఉన్న విస్తరి అణగిమణగి ఉంటుంది’ అని అమ్మమ్మలు చెప్పే సామెత గుర్తొచ్చింది.
‘మహానటి’తో సావిత్రిని నేటి తరం గుండెల్లోనూ కొలువుదీర్చి… కీర్తిసురేశ్‌కు దేశంలోనే ఉత్తమ నటిగా గుర్తింపు తెప్పించి… తెలుగు ప్రజలు గర్వించే మంచి సినిమా దర్శకుడు నాగ అశ్విన్‌తో ‘హాయ్‌’ అంటూ మాటలు కలిపితే.. బోలెడు విషయాలు చెప్పాడు.

జీవిత కథకు పురస్కారం
‘మహానటి’కి జాతీయ పురస్కారం వచ్చిందని ఒక జర్నలిస్ట్‌ మిత్రుడే తొలుత నాకు ఫోన్‌ చేశారు. తర్వాత టీవీ పెట్టి చూశాను. ఇది సావిత్రి గారికి ఇచ్చిన గౌరవం. ఆమె ఎంతో గొప్ప నటి… అయినా ఎందుకో ఎప్పుడూ జాతీయ పురస్కారం అందుకోలేదు. ఇప్పుడు ఆమె జీవిత కథకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి సహకరించిన సావిత్రిగారి కుమార్తె చాముండేశ్వరి, కుమారుడు సతీష్‌లకు ముందుగా కృతజ్ఞతలు. తీయడానికి ముందుకొచ్చిన ప్రియాదత్‌, స్వప్నదత్‌లకు అభివందనాలు. ఈ సినిమా పూర్తిచేయడానికి సహకరించిన నటులు, సాంకేతిక నిపుణులు.. ఇలా ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.

సావిత్రిగారు ఎప్పుడూ నటించలేదు
చిన్నప్పటి నుంచి ఇంట్లో పాత సినిమాలు చూసేవాళ్లు. నేనూ వాటిని చూసేవాడ్ని. అలా సావిత్రిగారి హావభావాలు, ఆహార్యం నాకు ఎంతో నచ్చేవి. సావిత్రి గారు ఎప్పుడూ, ఎక్కడా నటించలేదు. సినిమాల్లోని పాత్రల్లోనూ ఆమె జీవించారు. జీవితంలోనూ తనకు ఇష్టమొచ్చినట్లే జీవించారు. మనసులో ఎలా ఉంటే అలాగే బయటికి నడుచుకునేవారు. అందుకే ఆమె నన్ను ఇన్‌స్పైర్‌ చేశారు. ఆమె కథ నేటి తరానికి చెప్పాలనిపించింది. ఆమె తాగి చనిపోయిందని, ఏవేవో ఆమె జీవితంలో జరిగాయని… రకరకాల కథలు ప్రచారంలో ఉండేవి. అలా కాదు.. ఆమెను గొప్పగా గుర్తుపెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశా. రెండేళ్లు కష్టపడ్డాం. ఈ చిత్రాన్ని సావిత్రిగారి గురించి తెలిసిన పెద్దలే కాక, యువత, ఇప్పటి పిల్లలు కూడా ఇష్టపడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

కీర్తి మొదట చేయనంది
ఈ కథకు మొదట ఎంతో మందిని మనసులో అనుకున్నాం. ప్రియా, స్వప్నలు… మేమనుకున్న వారి ఫొటో, సావిత్రిగారి ఫొటో పక్కపక్కన పెట్టి… చాలా మందికి వాట్సప్‌ గ్రూపుల్లో పంపారు. వారి అభిప్రాయాలు స్వీకరించారు.  కీర్తిసురేష్‌ను అనుకున్నాక.. ఆమె చేయలేను అని చెప్పింది. మిగతా సినిమాలు ఎప్పుడైనా చేయొచ్చు… ఇలాంటి అవకాశం మళ్లీ రాదని చెప్పి ఒప్పించాం. ఆమె కష్టానికి ప్రతిఫలం దక్కింది. దీపికపదుకొనే, ఆలియాభట్‌ వంటి వారు పోటీలో ఉన్నా… కీర్తి ఉత్తమ నటిగా ఎంపికవడం చాలా గొప్ప విషయం. అవార్డు ప్రకటించిన వెంటనే ఫోన్‌ చేసి అభినందించా.

స్కూల్‌ మేగజీన్‌ ఎడిటర్ని
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివేటప్పుడు స్కూల్‌ మేగజీన్‌ ఎడిటర్‌గా ఉండేవాడ్ని. కథనాలు, వ్యాసాలు రాసేవాడ్ని. అప్పుడు రానా నా క్లాస్‌మేట్‌. స్కూల్‌ ఆవరణలో ఎక్కువగా కొండరాళ్లు, చెట్లు  ఉండేవి. విరామంలో అలా బండరాళ్లలోకి వెళ్లిపోయి… బెల్‌ కొట్టగానే మళ్లీ వెనక్కి పరిగెత్తుకొచ్చే వాళ్లం. ఒకసారి అలా అక్కడి బండరాళ్లు పగలగొడుతుంటే చూశా. ఫొటోలు తీశా. ‘అసలు స్కూల్‌లో ఏం జరుగుతోంది? అడవి నాశనం చేస్తున్నదెవరు? అంటూ… ఓ పరిశోధన కథనం రాసి పత్రికలో ప్రచురించా. మా స్కూల్‌ మేగజీన్‌కి ఒక టీచర్‌ పర్యవేక్షకురాలిగా ఉండేవారు. ఆమెకు తెలియకుండా… ఈ పనిచేశాం. తర్వాత ప్రార్థన సమయంలో ప్రిన్స్‌పల్‌గారు ఆ టీచర్‌కి చీవాట్లు పెట్టారు. నాకూ చీవాట్లు పడ్డాయి.

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ నచ్చక
నాన్న జయరామ్‌రెడ్డి, అమ్మ జయంతి. ఇద్దరూ వైద్యులే. చిన్నప్పటి నుంచి నేను తక్కువే మాట్లాడతా. అయితే యాక్టివ్‌గా ఉంటా. ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని చూస్తుంటా. అమ్మా, పిన్నమ్మ అందరూ ఫస్ట్‌ ర్యాంకర్లే. నేను ఎప్పుడూ ఫస్ట్‌ వచ్చేవాడ్ని కాదు. ఈ విషయంలో అమ్మ బాధపడేది. ఫస్ట్‌ర్యాంకర్ని కాదు గానీ… టాప్‌ టెన్‌లో అయితే ఉండేవాడ్ని. ఏదో ఒక సబ్జెక్టులో మంచి మార్కులొచ్చేవి. నాకు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ లాంటి రెగ్యులర్‌ కోర్సులు చదవడం ఇష్టం లేదు. అందుకే ఇంటర్‌ అయ్యాక… ఎన్ని పోటీ పరీక్షలుంటే అన్నీ రాశా. మణిపాల్‌లో మల్టీమీడియా కోర్సులో సీటొచ్చింది. అక్కడికి వెళ్లిపోయా. అక్కడే నాకు వీడియో ఎడిటింగ్‌పై అవగాహన వచ్చింది. అమ్మానాన్నలు ఎప్పుడూ నామీద ఒత్తిడి చేయలేదు. నేను ఏది చేసినా ప్రోత్సహించారు. మొదట మీడియాలో స్థిరపడతాడేమో అనుకున్నారు. తర్వాత యాడ్స్‌… చివరికి ఇలా దర్శకుడ్ని అయ్యా.

సొంతంగా తీద్దామనుకున్నా
‘లైఫ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత… ఫ్రెండ్స్‌ంతా కలిసి ఒక బృందంగా ఏర్పడి పనిచేసేవాళ్లం. అప్పుడు ఒక యాడ్‌ తీశాను. ఏదో రాసుకొని కొంతమందికి వినిపించేవాడ్ని. ఇదే సమయంలో ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీశా. అది ఫిల్మ్‌ఫెస్టివల్‌కు వెళ్లింది. దీంతో ప్రియాంక, సప్నలకు నాపై నమ్మకం వచ్చింది. వాళ్లకే ఒక కథ వినిపించాను. అది చర్చల దశలో ఉన్నప్పుడే ‘ఎవడే సుబ్రమణ్యం’ రాసుకున్నా. తక్కువ బడ్జెట్‌లో సొంతంగా అయినా తీసి… నన్ను నేను నిరూపించుకోవాలని ఏర్పాట్లు చేసుకున్నా. ఈ కథ సప్నదత్‌ వాళ్లకు నచ్చింది. వాళ్లు నానీని తీసుకొచ్చి ఈ కథకు మరింత న్యాయం చేశారు. విజయ్‌ పాత్రకు ముందునుంచి తననే అనుకున్నా. తను నాకు లైఫ్‌ఈజ్‌ బ్యూటిఫుల్‌ నుంచి పరిచయం. విజయ్‌ మంచి నటుడు అవుతాడని అప్పుడే అనుకునేవాడ్ని.

మూడో చిత్రం వాళ్లతోనే..
వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌లతో కలిసే మూడో చిత్రం చేయాలనుకుంటున్నా. ఇందులో మరో నిర్మాణ సంస్థ ఎవరైనా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల క్రితమే ఈ సబ్జెక్టుపై సినిమా తీయాలని అనుకుంటున్నాం. అన్నీ అనుకూలిస్తే… ఇదే చేపడతాం. కథ ఇంకా స్క్రిప్ట్‌ దశలోనే ఉంది. నటీనటులను ఎవరనేది అప్పుడే అనుకోవడం లేదు.

తొలి రెమ్యునరేషన్‌పై ఇంక్‌ పడింది
ఏవేవో రాసి తీయాలని ఆశపడేవాడ్ని. అది చూసి అమ్మనే నన్ను దర్శకులు శేఖర్‌కమ్ముల దగ్గరికి పంపారు. అప్పటికే ఆయన ‘గోదావరి’ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ‘నెక్ట్స్‌ ప్రాజెక్టుకు చేద్దాం’ అన్నారు. నేను మంచు మనోజ్‌ నటించిన ‘నేను మీకు తెలుసా?’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. అప్పట్లో నాకు నాలుగువేలు రెమ్యునరేషన్‌ ఇచ్చారు. అదే నా తొలి సంపాదన. నాలుగు వెయ్యిరూపాయల నోట్లు. వాటిపై ఇంక్‌ పడింది. ఎక్కువ ఇంక్‌ పడ్డ నోట్‌ని అమ్మకిచ్చి దాచాను. మిగతా డబ్బు మామూలుగానే ఖర్చు పెట్టాను. తర్వాత లీడర్‌, లైఫ్‌ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రాలకు అసిస్టెంటుగా చేశాను. క్యాస్టుమ్స్‌ చూసుకునేవాడ్ని. ‘లీడర్‌’ ట్రైలర్‌ను కట్‌ చేశా. అది శేఖర్‌కమ్ములకు నచ్చి విడుదల చేశారు. సినిమాను ఎంత ఫ్రెండ్లీ వాతావరణంలో తీయొచ్చో ఆయన వద్దే నేర్చుకున్నా.

కూరగాయలు పండిస్తా
ఉప్పల్‌ దగ్గర చిన్న పొలం ఉంది. అక్కడికి వెళ్లి కూరగాయల సాగులో పనులు చేస్తా. పొలం దున్నడం, విత్తనాలు వంటి వాటిల్లో సాయపడతా. పొలంలో ఏదో నాకు తోచిన పనిచేస్తుంటా.

టైం అంతా మా అబ్బాయితోనే!
ఎవడే సుబ్రమణ్యం అయ్యాక… పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అనుకున్నా. అప్పటికే రెండేళ్లుగా ప్రియాంకదత్‌తో స్నేహం ఉండేది. ఒకానొక సందర్భంలో సరే మనమే చేసుకుందామని నిర్ణయించున్నాం. ఇంట్లో ఒప్పుకొన్నారు. సంతోషంగా ఉన్నాం. మా బాబు రుషి. ఇప్పుడు సమయం మొత్తం వాడికే సరిపోతోంది. చూశారుగా ఎత్తుకొని తిప్పమని ఒకటే అల్లరి…(నవ్వు).

ఇష్టమైన వంట : ముద్దపప్పు అన్నం, పచ్చిపులుసు
బాగా చేసేవంట : బిర్యానీ
ఆరాధ్య దర్శకులు : కేవీ.రెడ్డి, సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్‌
రచయిత : జంధ్యాల
ఇష్టమైన ప్రదేశం : కొండప్రాంతాలు
నచ్చిన నటుడు : వెంకటేశ్‌(చిన్నప్పుడు)…
నచ్చిన నటి : ఐశ్వర్యారాయ్‌
మెచ్చే ఆట : టెన్నిస్‌
పుస్తకం : స్కూల్‌ రోజుల్లో ‘కర్పూర దీప యాత్ర’(నాన్‌ డీటెయిల్డ్‌) బాగా ఆకట్టుకుంది. ఆ పుస్తకమిప్పుడు దొరకడం లేదు.
సామాజిక సేవ : సామాజిక సేవ చేయడం గొప్ప కాదు. మన బాధ్యత. నీటి పొదుపు, కాలుష్య నియంత్రణ, నదుల సంరక్షణలాంటివి ప్రతి ఒక్కరూ చేయాలి.
విమర్శలు బాధ పెట్టలేదు‘మహానటి’ చిత్రంపై వచ్చిన విమర్శలు నన్ను ఏమీ బాధ పెట్టలేదు. మంచి హిట్‌ ముందు అవన్నీ చిన్నవిగా కన్పించాయి. స్క్రీన్‌ప్లే కోసం కొన్ని మార్పులు చేశాం.  ఆమె జీవితంలో ముఖ్యమైన ఇంకా కొంతమంది గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేకపోయాం. స్క్రిప్ట్‌లో రాసుకున్నాం గానీ… చిత్రీకరించలేకపోయాం. కొన్ని సన్నివేశాలు తీసీ ఫైనల్‌ కాపీలో ఉంచలేకపోయాం. సావిత్రి గారి జీవితం మొత్తం చేయాలంటే మూడు గంటల సినిమా సరిపోదు. సీరీస్‌ చేయాల్సి ఉంటుంది. మాకు వీలైనంత వరకూ ఆమె గౌరవానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా తీయగలిగాం.
– అయితరాజు రంగారావు, ఈనాడు, హైదరాబాద్‌
రాళ్లపల్లి రాజావలి, ఫొటోలు : రాజమౌళి