Heroine Aliabhat

8922745f-f1fb-4eae-80e0-8d3e9a1cc44f

 

 

వారం రోజులు బెంచీలు తుడవమన్నారు! 

ఆలియాభట్‌… సినిమా రంగంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అందాల నాయిక. త్వరలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తో తెలుగులోనూ తెరంగేట్రం చేయబోతున్న ఈ బాలీవుడ్‌ భామ ఇష్టాయిష్టాలేంటంటే…


మరచిపోలేని జ్ఞాపకం

నేను జమ్నాబాయ్‌ నర్సీ స్కూల్లో చదువుకున్నా. ఏ క్లాస్‌లో ఉన్నప్పుడో గుర్తులేదు కానీ… చిన్నప్పుడు రోజూ స్కూలుకెళ్లి బాత్రూంలో నిద్రపోయేదాన్ని. ఓ రోజు టీచరు చూసి.. వారంరోజుల పాటు క్లాసులోని బెంచీలన్నింటినీ తుడవమని పనిష్మెంట్‌ ఇచ్చారు. ఆ సమయంలో అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది కానీ… ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.


పెరుగు ఉండాల్సిందే

చేపలు, రాగి చిప్స్‌, ఫ్రెంచ్‌ఫ్రైస్‌, రసగుల్లా, పెరుగన్నం, పెసరపప్పు హల్వా… ఇలా చాలా పదార్థాలు ఇష్టంగా లాగించేస్తా. ఏవి ఉన్నా లేకపోయినా భోజనంలో మాత్రం పెరుగు కచ్చితంగా ఉండాల్సిందే. అది లేకపోతే భోజనం పూర్తయినట్లు అనిపించదు.


ఇష్టపడే పెంపుడు జంతువు

మొదటినుంచీ నాకు పిల్లులంటే ఇష్టం. నేను పెంచుకునే పిల్లి పేరు ఎడ్వర్డ్‌. ఆ ఇష్టంతోనే పెటా నిర్వహించే అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నా.


నిద్రంటే…

నిద్రపోవడమంటే చెప్పలేనంత ఇష్టం. అవకాశం వస్తే.. దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలపాటు హాయిగా నిద్రపోతా. అయితే నాకు చీకటంటే భయం. అందుకే రాత్రుళ్లు కూడా నా బెడ్‌రూంలో లైటు వెలుగుతుంటుంది.


అలవాటు

మొదటినుంచీ నాకు డైరీ రాయడం అలవాటు. ఎంత రాత్రయినా సరే.. అలసటగా అనిపిస్తున్నా.. డైరీ రాసుకున్నాకే నిద్రపోతా.


ఇష్టమైన నటీనటులు

హీరోయిన్లలో కరీనా, కరిష్మా కపూర్లంటే ఇష్టం. హీరోల్లో షారుఖ్‌ఖాన్‌, తెలుగులో అయితే ప్రభాస్‌. బాహుబలి సినిమాలో ప్రభాస్‌ నటన ఎంతో నచ్చింది. అతడితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.


తీరిక దొరికితే

స్నేహితులతో కలిసి హాయిగా సినిమాలు చూస్తా. ఈ మధ్య అప్పుడప్పుడూ వంటింట్లోకి దూరి ప్రయోగాలూ చేస్తున్నా.


కార్లంటే

ప్రస్తుతం నా దగ్గర అయిదు కార్లున్నాయి. ఆడీలోనే క్యూ5, క్యూ7లతోపాటూ ఏ6 మోడళ్లు ఉన్నాయి. అలాగే రేంజ్‌రోవర్‌ వోగ్‌, బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ని కొనుక్కున్నా. వీటిల్లో నాకు నచ్చిన దాంట్లో వెళ్తుంటా.


ఇష్టపడే ప్రాంతాలు

మొదటినుంచీ నాకు ప్రకృతికి దగ్గరగా ఉండటమే నచ్చుతుంది. అలాంటి ప్రాంతాలనే వెతుక్కుంటా. మనదగ్గర హిమాచల్‌ప్రదేశ్‌, విదేశాల్లో అయితే… లండన్‌లో గడిపేందుకు ఇష్టపడతా. లండన్‌లోని హైడీపార్కులో హాయిగా జాగింగ్‌ చేయడం ఓ మజా.


బాగా నచ్చిన సినిమా

దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే. ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు.