Heroine Anupama Parameswaran

heroine anupama

 

 

అలా.. నా వల్ల కాదు!: అనుపమా పరమేశ్వరన్
10-11-2018 23:11:12
స్నేహం… సంతోషం… సహజమైన వ్యక్తిత్వం… సమాజాన్ని చూసే కోణం… అనుపమా పరమేశ్వరన్‌అంతరంగ ఆవిష్కరణలో కొన్ని అంశాలు ! ఆమె తన ఆహారపు అలవాట్లు, ఆలోచనల గురించి చెబుతుంటే నిజంగా మన పక్కింటి అమ్మాయి మాట్లాడుతున్నట్టే ఉంటుంది! ‘నవ్య’ కోసం అనుపమతో మాటా మంతీ!!
ఎమోషన్స్‌ను చాలామంది మనసులో దాచేసుకుంటారు. పరిస్థితులు సంక్లిష్టమయ్యాక డిప్రెషన్‌లోకి వెళతారు. సూసైడ్‌ చేసుకుంటారు. బేసిక్‌ థింగ్‌ ఏంటంటే… వాళ్లు చెప్పుకోవడానికి ఎవరూ లేరనుకుంటారు. కానీ, అమ్మానాన్న ఉన్నారు. ప్రపంచంలోని ఏ విషయాన్నైనా తల్లిదండ్రులతో చెప్పుకోవచ్చు. లేదంటే ఒక ఫ్రెండ్‌తోనైనా మాట్లాడవచ్చు కదా! బీ ఓపెన్‌ టు పీపుల్‌… ఎబౌట్‌ యువర్‌ ఎమోషన్స్‌!
నిజ జీవితంలో అనుపమ ఎలా ఉంటారు?
అనుపమ అంటే… (బాగా ఆలోచిస్తూ) నాకు ‘లైఫ్‌ అంటే ఇలా ఉండాలి. ప్రాపర్‌ టైమ్‌ టేబుల్‌తో ఇలా ఇలా చేయాలి. ఇది తినాలి. బిహేవియర్‌ ఇలా ఉండాలి. డ్రస్సింగ్‌ స్టైల్‌ ఇలా ఉండాలి’ అంటే నచ్చదు. ‘అమ్మో… నాకు ఈ లైఫ్‌ వద్దు’ అని చెబుతా! ఎందుకంటే… ఐ వాంట్‌ టు లివ్‌ ఎ ఫ్రీ లైఫ్‌! మనకు నచ్చింది మనం చేయాలి. ఐ లైక్‌ టు ఎంజాయ్‌ స్మాల్‌ స్మాల్‌ థింగ్స్‌. చిన్న చిన్న విషయాల్లో నాకెంతో సంతోషం లభిస్తుంది. ఉదాహరణకు… అప్పుడప్పుడూ నాకు మ్యాగీ న్యూడుల్స్‌ తినాలని అనిపిస్తుంది. ఒకసారి మ్యాగీ నూడుల్స్‌ తినడానికి నా హోటల్‌ నుంచి మాదాపూర్‌ వెళ్లాను. నాకు ఇటువంటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. వాటిని నేరవేర్చుకోవడంలో నాకెంతో సంతోషం ఉంటుంది. దట్‌ ఈజ్‌ ద బిగ్గెస్ట్‌ హ్యాపీనెస్‌ ఐ గెట్‌!
మీరు స్టార్‌ కాబట్టి…
(ప్రశ్న పూర్తికాకముందు…) నేను స్టార్‌ కాదండీ! (నవ్వుతూ) అయామ్‌ నాట్‌ ఎ స్టార్‌… ఫస్ట్‌ ఆఫ్‌ ఆల్‌!
మీరు నటి కాబట్టి మిమ్మల్ని జనాలు సులభంగా గుర్తుపడతారు! అందువల్ల, కొన్నిసార్లు మ్యాగీ న్యూడుల్స్‌ తినడానికి బయటకు వెళ్లలేక చిన్న చిన్న ఆనందాలు కోల్పోతున్నారా?
అటువంటిది ఏం లేదు! నేను అనుకున్నది చేస్తాను. ఒక రోజు వెళ్లి నూడుల్స్‌ తిన్నాను. అంతకు ముందు ఒకసారి హుస్సేన్‌సాగర్‌ దగ్గర షూటింగ్‌ చేస్తున్నాం. నాకు చోకో లావా కేక్‌ తినాలనిపించి… నేను, మేకప్‌ ఆర్టిస్ట్‌, డ్రైవర్‌ అన్న, హెయిర్‌ స్టైలిస్ట్‌ అందరం కలిసి దగ్గరలోని బేకరీకి వెళ్లాం. నేను బురఖా లాంటిది వేసుకున్నా. అందరి మధ్యలో కూర్చుని తిన్నా. కొంతసేపటికి ఎవరో గుర్తు పట్టారు. వెంటనే పరిస్థితి నాకు అర్థమైంది. కొంతమంది వచ్చి ఫొటోలు అడిగితే… ఇచ్చేసి, వెంటనే కారు ఎక్కేశా.
ఇలాంటివి ఇంకా ఏమైనా చేశారా?
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని చైనా బిస్ట్రో రెస్టారెంట్‌కి వెళ్లా. హుడీ వేసుకుని ఒక సైడ్‌ టేబుల్‌లో కూర్చుని తిన్నా. రెస్టారెంట్‌లో చాలామంది ఉన్నారు. నేను కామ్‌గా తినేసి వచ్చా. విశాఖలో ‘వెంకటాద్రి వంటలు’ అని ఫేమస్‌ టిఫిన్‌ సెంటర్‌ ఉంది. అక్కడ నెయ్యితో వేసే స్పాంజ్‌ దోస నాకు చాలా ఇష్టం. ‘ఉన్నది ఒకటే జిందగీ’ కోసం విశాఖలో షూటింగ్‌ చేసినప్పుడు నేను, సినిమాటోగ్రాఫర్‌ సమీర్‌రెడ్డిగారు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌… అందర్నీ అక్కడికి తీసుకువెళ్లా. సుమారు ఓ వంద మంది ఉన్నారు. అక్కడే తినాలని నేను పట్టుబట్టాను. ఒక హుడీ వేసుకుని వెళ్లి తిన్నా. ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు.
మీరు ఫుడ్‌ లవర్‌ అన్నమాట! 
ఊఊఊఊఊ! చాలా….
డైటింగ్‌ టెన్షన్స్‌ ఏమీ లేవా? బరువు పెరుగుతానని… ఇలా!!
ఉంటాయండీ! నేను ఈజీగా బరువు పెరుగుతా. కానీ, నేను తినే క్వాంటిటీ తక్కువ. మరీ అంత ఎక్కువ తినకుండా… ప్రతి ఐటమ్‌ కొద్ది కొద్దిగా టేస్ట్‌ చేస్తా.
ఇంట్లోనూ ఇంతేనా? కొంచెం కొంచెం తింటారా?
పుడ్‌ అంటే చాలా ఇష్టమని చెప్పాను కదా! అందులోనూ అమ్మచేతి వంట అంటే మరింత ఇష్టం!! ఇప్పుడు ఎక్కువ రోజులు హైదరాబాద్‌లో ఉండటం వల్ల అమ్మచేతి వంట ఎక్కువ తినే ఛాన్స్‌ దొరకడం లేదు. లొకేషన్‌లో ఉన్నప్పుడు మనకు పప్పు, పెరుగు, అన్నం, చికెన్‌… అన్నీ దొరుకుతాయి. ఫరవాలేదు. కానీ, హోటల్‌లో ఉన్నప్పుడు దొరకవు కదా! ఇప్పుడు నాకు పప్పు అంటే చాలా ఇష్టం. కేరళలో పప్పు లేదు. అక్కడ సాంబార్‌ ఉంటుంది. నేను కేరళలో ఇంటికి వెళ్ళినప్పుడు ‘అమ్మా… పప్పు మిస్‌ చేస్తున్నాను!’ అని చెప్తుంటే అమ్మకు కోపం వస్తుంది. షి బికమ్‌ జలస్‌. ‘ఇప్పుడు నా వంట కంటే నీకు పప్పు ఎక్కువ అయిపోయిందా?’ అని ముద్దుగా కోప్పడుతుంటుంది.
ఇప్పుడు పప్పు ఇష్టమంటున్నారు! చిన్నతనంలో ఎక్కువ ఇష్టంగా తిన్న వంట ఏది?
రైస్‌ అండీ! చిన్నప్పటి నుంచి రైస్‌ పర్సన్‌. రోజుకు నాలుగుసార్లు అన్నం పెట్టినా తినేస్తా. రైస్‌తో పాటు ఏదో ఒక కర్రీ ఉంటే చాలు! లైఫ్‌ హ్యాపీ!
షూటింగ్‌ లేకపోతే అనుపమ ఏం చేస్తారు?
‘బ్రష్‌ చేయాలి… బ్రష్‌ చేయాలి’ అనుకుంటాను. కానీ, చేయను. నిద్రలేచిన తర్వాత రెండు గంటల పాటు అటు ఇటు తిరుగుతా. ఫోన్‌ చెక్‌ చేస్తా. లేదంటే మళ్ళీ నిద్రపోతా. అదంతా జరుగుతుంది. దాని తర్వాత బ్రష్‌ చేస్తా. గుర్తుంటే… బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తా. లేదంటే లేదు. కొన్నిసార్లు నేను మర్చిపోతా. నా ప్రపంచంలో నేనుంటా. అసిస్టెంట్స్‌ వచ్చి ‘బ్రేక్‌ఫాస్ట్‌ తిన్నారా మేడమ్‌?’ అంటే…. ‘అయ్యో! నేను మర్చిపోయా’ అని చెబుతా (నవ్వులు)! షూటింగ్‌ ఉంటే బిజీ బిజీగా ఉంటాను కాబట్టి… ఆఫ్‌డే నాకు నచ్చినట్టు ఎంజాయ్‌ చేస్తా.
ఇంట్లోనూ ఇలాగే ఉంటారా?
మీరు మా అమ్మను అడగాలి. చాలా చెబుతుందండీ… ‘షీ ఈజ్‌ వెరీ ఇర్‌-రెస్పాన్సిబుల్‌. ప్రాపర్‌గా ఏమీ చేయదు. లేటుగా లేస్తుంది. 12 గంటలకు బ్రష్‌ చేస్తుంది. 4 గంటలకు లంచ్‌ చేస్తుంది’ అని! నేను ఇక్కడ (హైదరాబాద్‌లో) హీరోయిన్‌గా ఒక లైఫ్‌ లీడ్‌ చేస్తున్నా. ప్రతిరోజూ ఉదయమే నిద్రలేచి షూటింగ్‌కి వెళ్ళి, అక్కణ్ణుంచి లేటుగా వచ్చి, మళ్ళీ డైలాగులు ప్రాక్టీస్‌ చేసుకోవడం లేదా చదువుకోవడం, మళ్ళీ పడుకోవడం… ఒక రిజర్వ్డ్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నా. ఇంటికి వెళ్ళినప్పుడు రిలాక్స్‌ అవ్వాలనుకుంటా. కంప్లీట్‌లీ ఐ వాంట్‌ టు రిలాక్స్‌. ఐ హ్యావ్‌ ఎ డాగ్‌. దాంతో ఆడుకుంటాను. ల్యాప్‌టాప్‌ ముందు పెట్టుకుని ఎంజాయ్‌ చేస్తా. ఐ వాంట్‌ టు ఫీల్‌ మై సెల్ఫ్‌. అందుకనే, నేను ఇంటికి వెళతా.
తమ్ముడితో చిన్న చిన్న గొడవలు పడటం సహజం కదా!
చిన్నప్పుడు టీవీ రిమోట్‌ కోసం కొట్టుకునేవాళ్ళం. అది ప్రతి ఇంట్లోనూ ఉండే గొడవే కదా! బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌ అంటే టామ్‌ అండ్‌ జెర్రీ రిలేషన్‌. ఇప్పుడు నేను, నా తమ్ముడు ఒకరిని మరొకరం చూసే విధానం మారింది. బాగా క్లోజ్‌ అయ్యాం. మమ్మల్ని అమ్మానాన్న చూసే విధానం కూడా మారింది. ఇప్పుడు ఫైట్స్‌ అంటూ ఏం లేవు. హెల్దీ డిబేట్స్‌ ఉంటాయి. జనరల్లీ… ఉయ్‌ డోంట్‌ ఫైట్‌ మచ్‌!
స్నేహితులు ప్రేమ కబుర్లు మీతో పంచుకుంటారా?
నేనా? (ఆలోచిస్తూ…) నాకు అమ్మాయిల మైండ్‌సెట్‌ తెలుసు కాబట్టి, నేను అమ్మాయిని కాబట్టి… అమ్మాయిలానే సలహా ఇస్తా. ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలో హీరో రామ్‌ చెప్పినట్టు ‘అమ్మాయిలు అబద్ధాలు చెబితే పడతారు’ అని నేను చెప్పను. నిజాయతీగా ఉండాలని చెబుతా. ఇప్పుడు మోస్ట్‌ ఆఫ్‌ ద రిలేషన్‌షిప్స్ లో ఏమవుతుందంటే… కొన్ని నెలలు లేదా ఏడాది వరకూ అబ్బాయిలు డిఫరెంట్‌ పర్సన్‌లా బిహేవ్‌ చేస్తారు. వాళ్ళ బెస్ట్‌ పార్ట్‌ని చూపించి, బ్యాడ్‌ పార్ట్స్‌ని మొత్తం కవర్‌ చేస్తారు. ఫస్ట్‌ టైమ్‌ మీట్‌ కావడానికి వెళ్ళేటప్పుడు మేకప్‌ అంతా వేసుకుని ఒక గెట్‌పలో వెళతారు. కానీ, రియల్‌గా ఇంట్లో ఒక్కోసారి పని ఒత్తిడి వల్ల బెగ్గర్‌లా ఉంటారు కదా! సో… అది చూపించకుండా వేరే పర్సనాలిటీ చూపిస్తున్నారు. అక్కడ సమస్య వస్తుంది. రిలేషన్‌షి్‌పలో ఫస్ట్‌ డే నుంచి… మనం అసలు ఎలా ఉంటామో, అలానే ఉండాలి. చిన్న చిన్న విషయాల్లో అడ్జస్ట్‌ కావాలి. వాట్‌ ఉయ్‌ ఆర్‌? అనేది ఆ అదర్‌సైడ్‌ కూడా యాక్సెప్ట్‌ చేయాలి. అలా ఉంటే అన్ని ప్రేమకథలూ బావుంటాయి.
ఫ్రెండ్స్‌కి ఈ విధంగా సలహాలు ఇస్తారా?
కాలేజ్‌ డేస్‌లో, స్కూల్‌ డేస్‌లో ఫ్రెండ్స్‌ సలహాలు అడిగేవారు. ఎక్కువగా శాడ్‌ మూమెంట్స్‌లో వచ్చేవారు. ‘నా లైఫ్‌లో ఇలా జరిగింది. హెల్ప్‌ చెయ్‌’ అని బాధపడుతూ అడిగితే… కొన్ని కొన్ని సలహాలు ఇచ్చేదాన్ని!
స్కూల్‌, కాలేజ్‌ డేస్‌లో మీకు ఎంతమంది ప్రపోజ్‌ చేశారు?
చాలామంది చేశారు. (ముసిముసి నవ్వులతో) నాకు ప్రపోజ్‌ చేసినవాళ్లు చాలామంది ఉన్నారు.
అంతమందికి ‘నో’ అని ఎలా చెప్పేవారు? రిజెక్ట్‌ చేయడం…
చూడండి… నేను కూడా ఒక హ్యూమన్‌ బీయింగ్‌ని కదా! నా మనసు కూడా డెలికేట్‌గా ఉంటుంది. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే… మనకు నచ్చుతుందా? లేదా? నచ్చుతుంది కదా! నిజం చెప్పాలంటే… అటెన్షన్‌ను ఎవరు కోరుకోరు! కొంతమంది ప్రపోజ్‌ చేసినప్పుడు… వాళ్ళ మీద మనకు క్రష్‌ ఉంటే హ్యాపీ ఫీలింగ్‌ ఉంటుంది. మన కోసం ఒకరు వెయిట్‌ చేస్తుంటే… ‘ఈ ఫీలింగ్‌ ఏదో బావుందే’ అనిపిస్తుంది. రోజూ మనల్ని చూసే అబ్బాయి ఒక రోజు రాకపోతే… ‘ఈ రోజు ఎందుకు రాలేదు’ అని మనకూ చాలాసార్లు అనిపిస్తుంది. రిజెక్ట్‌ చేయడం అనేది డిఫికల్ట్‌ సిచ్యువేషన్‌. కానీ, నేను రిజెక్ట్‌ చేసినవాళ్ళలో చాలామంది నా ఫ్రెండ్సే. సో… నాకు ప్రాబ్లమ్స్‌ లేవు. వాళ్ళందరూ నా లైఫ్‌లో ఉన్నారు. కొంతమంది ఒక అబ్బాయి వెంటపడుతుంటే… మనసులో హ్యాపీ ఫీలింగ్‌ ఉన్నా బయటకు ఎక్స్‌ప్రెస్‌ చేయరు. ‘ఓహ్‌… నాకిది ఇష్టం లేదు. వై ఆర్‌ యు ఇరిటేటింగ్‌ మి’ అని చెప్పి, లోపల సంతోషపడతారు. కొంతమంది తమ హ్యాపీనెస్ ను ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు.
సొసైటీలో కొంతమంది అబ్బాయిలు తమను అమ్మాయి రిజెక్ట్‌ చేస్తే… యాసిడ్‌ పోస్తారు. వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతారు. ఈ విషయంలో అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా?
నేను చెప్పేది విమెన్‌ స్ట్రెంగ్త్‌, ఈక్వాలిటీ గురించి కాదు. ఉదాహరణకు… నాకు ఏమైనా అయితే? తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడుతుంది. వైల్డ్‌గా బిహేవ్‌ చేసిన వ్యక్తికి శిక్ష పడుతుంది. కానీ, ముఖం మీద యాసిడ్‌ పోస్తే… నష్టపోయేది ఎవరు? అమ్మాయే! ఇక్కడ మన (అమ్మాయిల) లైఫ్‌ పోతుంది. తప్పు జరిగిన తర్వాత మనం ఏం చేసినా… ఇట్స్‌ డిఫరెంట్‌ థింగ్‌! చాలాసార్లు అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకు పెద్దగా, వయలెంట్‌గా రియాక్ట్‌ అవుతారు. వెరీ వయలెంట్‌ వే! కానీ, మెచ్యూర్డ్‌గా తీసుకోవాలి. కాలేజ్‌ టైమ్‌లో నాకూ బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌లు ఉన్నాయి.
బస్‌లో నిలబడితే… వెనుక నుంచి ఎవరో వ్యక్తి వచ్చి ఒంటి మీద చేతులు వేస్తారు. అక్కడ ఇక్కడ ముట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అటువంటి సందర్భాల్లో.. కొంతమంది అమ్మాయిలు వెంటనే చెంప ఛెళ్ళుమనిపిస్తారు. ఒకవేళ అబ్బాయి సైకో అయితే… మనకి నెక్ట్స్‌ రియాక్షన్‌ గురించి తెలియదు. ఆ ఒక్క నిమిషంలో… ‘కొంచెం పక్కకు జరగండి. నాకు డిస్ట్రబెన్స్‌గా ఉంది’ అని ప్రాపర్‌గా చెప్పండి. మాట వినకపోతే తర్వాత స్టెప్‌ తీసుకోండి. కానీ, ముందు కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నించండి… డోంట్‌ ఇన్సల్ట్‌ పీపుల్‌. ఇన్సల్ట్‌ అనేది ఎవరికీ ఇష్టం ఉండదు. నాకు ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉండదు. తప్పు చేసినవాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. వాళ్ళకు ముందు ‘మీరు చేస్తున్నది తప్పు’ అని చెప్పాలి. వాళ్ళకు అర్థం కాకపోతే నెక్ట్స్‌ స్టెప్‌ తీసుకోవడమే!
 ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పోస్ట్‌ చేసే సెల్ఫీల్లో లైటింగ్‌ మీద ఎక్కువ కాన్సంట్రేట్‌ చేస్తారు! ఎందుకు?
థాంక్యూ! యాక్టర్‌ కాకముందు సెల్ఫీలు ఎక్కువ తీసుకునేదాన్ని. ఇప్పుడు తగ్గించాను. ఐ లైక్‌ ప్లేయింగ్‌ విత్‌ లైట్స్‌ అండ్‌ ఆల్‌! లైట్స్‌ మంచి మేజిక్‌ క్రియేట్‌ చేస్తాయి. బేసికల్లీ… దర్శకురాలు కావాలనేది నా కల. కెమెరా ముందు కంటే కెమెరా వెనుక ఉండటమంటే ఎక్కువ ఇష్టం. అందుకని, సెల్ఫీల్లో సన్‌లైట్‌తో ప్రయోగాలు చేస్తుంటా!
కథలు ఏవైనా రాశారా?
ఇంకా రాయలేదు. కాన్సెప్ట్స్‌ ఉన్నాయి. డెవలప్‌ చేయాలి. ఐ లైక్‌ టు క్యాప్చర్‌ బ్యూటిఫుల్‌ థింగ్స్‌. మణిరత్నంగారి సినిమాలు చూస్తే… ఎంత అందంగా విజువల్స్‌ను క్యాప్చర్‌ చేస్తారో! బాయ్స్‌, గాళ్స్‌, బర్డ్స్‌, నేచర్‌… ఫ్రేమ్‌ ఎక్కడ పెట్టినా అందంగా ఉంటుంది. ఆ విధంగా నేను కూడా ఆయన లాగా అందమైన విజువల్స్‌ క్యాప్చర్‌ చేయాలని నా ఆశ. అందుకని, నా మీద నేను ప్రయోగాలు చేస్తుంటా. సెల్ఫీలు తీసుకోవడం వగైరా వగైరా!
దర్శకురాలిగా అనుపమా పరమేశ్వరన్‌ని ఎప్పుడు చూడొచ్చు?
నాకు తెలియదు. కొన్నేళ్ళు పట్టొచ్చు… ఆ కల నెరవేరడానికి! నేను పనిచేసిన దర్శకుల్లో కొంతమందిని ‘మీ దగ్గర అసిస్టెంట్‌ డెరెక్టర్‌గా చేసే ఛాన్స్‌ ఇవ్వండి’ అని చాలాసార్లు అడిగా. త్రివిక్రమ్‌ గారికి గుర్తుందో? లేదో? ఆయన్ను కూడా అడిగా. ‘తప్పకుండా! అసిస్టెంట్‌ డెరెక్టర్‌ ఛాన్స్‌ ఇస్తా’ అన్నారు.
‘టిక్‌ టాక్‌’ (మొబైల్‌ యాప్‌)లో యాక్టివ్‌గా ఉంటున్నారు!
హాహాహా… ప్రస్తుతం దానికి ఎడిక్ట్‌ అయ్యా. నాకు మ్యూజికల్లీ (టిక్‌ టాక్‌ యాప్‌కి ఫస్ట్‌ పేరు) ఉన్నప్పటి నుంచి అందులో అకౌంట్‌ ఉంది. అప్పుడు నేనేం పోస్ట్‌ చేయలేదు. ఇప్పుడు ఒక సినిమా అంటే… డైరెక్టర్‌, ఒక సినిమాటోగ్రాఫర్‌, మంచి యాక్టర్స్‌, వాళ్ళకు మేకప్‌, మంచి సెట్‌ ఇలా కంప్లీట్‌ టీమ్‌ ఉంటుంది. ఒక సెటప్‌ ఉంటుంది. కానీ, ‘టిక్‌ టాక్‌’లో కొంతమంది చేసిన వీడియోస్‌ చూస్తే… మతి పోతుంది. ‘ఎక్కడి నుంచి వస్తుందీ టాలెంట్‌? హౌ కెన్‌ బి దే సో క్రియేటివ్‌’ అనిపిస్తుంది. ‘టిక్‌ టాక్‌’లో వీడియోలు చూడండి… అమేజింగ్‌ టాలెంటెడ్‌ పీపుల్‌ ఉన్నారు. నేను కొన్ని వీడియోలు చూసి ‘వాట్‌ యామ్‌ ఐ? అయామ్‌ జస్ట్‌ జీరో. లుక్‌ ఎట్‌ దెమ్‌… ఎంత బాగా చేశారో!! ఆ అమ్మాయి ఎంత క్రియేటివ్‌గా చేసిందో?’ అని చాలాసార్లు అనుకున్నా. ముందు ఒక ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేసేదాన్ని. రెండు నెలల ముందు అనుకుంటా… తమిళ సినిమా ‘96’లో మ్యూజిక్‌కి ఏడుస్తున్న వీడియో రూపొందించి పోస్ట్‌ చేశా. మంచి స్పందన వచ్చింది. అందుకని, మరికొన్ని వీడియోలు చేశా.
– సత్య పులగం
ఫొటోలు: ఎం. గోపీకృష్ణ