Heroine Esharebba

heroine esharebba
ఈషారెబ్బా పక్కా లోకల్‌..!
 

తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌లో రాణించడం కష్టం అనుకున్న సమయంలో ఈషా రెబ్బా వరస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. వైవిధ్య భరితమైన పాత్రలు చేస్తూ విమర్శకుల దగ్గరా మంచిమార్కులే కొట్టేసింది. అందంతో అభినయంతో తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తనగురించి ఏం చెబుతోందంటే…


అలా వచ్చాను

నేను పక్కా లోకల్‌ అమ్మాయిని. పుట్టింది వరంగల్‌లో అయినా పెరిగిందీ చదువుకుందీ అంతా హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచీ నటిని కావాలని కలలు కనేదాన్ని. అందుకే ఎంబీఏ పూర్తయిన వెంటనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌లో నా ఫొటోలను చూసిన ఇంద్రగంటి మోహన కృష్ణగారు ‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అలా సినిమాల్లోకి రావాలన్న నా కల నెరవేరింది.


సెలవు దొరికితే…

నాకు చిన్నప్పటి నుంచీ ట్రావెలింగ్‌ అంటే పిచ్చి. అందుకే బిజీ షెడ్యూళ్ల మధ్య ఏ కాస్త తీరిక దొరికినా విహారయాత్రలకు వెళ్తా. స్విట్జర్లాండ్‌, ప్యారిస్‌ నాకు ఇష్టమైన ప్రదేశాలు. వీటన్నింటికంటే పుట్టిపెరిగిన హైదరాబాద్‌ అంటే చాలాచాలా ఇష్టం. కొన్నిసార్లు విదేశాలకు వెళ్లేంత టైం ఉండదు. అలాంటప్పుడు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో చక్కర్లు కొడతా. కుటుంబ వేడుకల్లో సందడిచేయడం ఎంతిష్టమో స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం కూడా అంతే ఇష్టం.


ఎప్పుడూ అనుకోలేదు

‘అంతకు ముందు ఆ తరవాత’ నా మొదటి సినిమా. ఇది ప్రేక్షకాదరణ పొందడంతోపాటు దక్షిణాఫ్రికాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడానికి నామినేట్‌ కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే నాని నిర్మాతగా వచ్చిన చిత్రం ‘అ!’లో నాది లెస్బియన్‌ పాత్ర. ఇందులోని నా నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. కెరీర్‌ ప్రారంభంలోనే ఇలా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.


అడగడంలో తప్పులేదు

నాకు వచ్చిన కథల్లో నచ్చినవి ఎంచుకుంటున్నాను. ‘ఈ పాత్రకు నేనైతే సరిపోతాను’ అనిపించిన పాత్రలే చేస్తున్నాను. నాకు ఎప్పుడూ కొత్త దర్శకులతో కొత్త కాంబినేషన్స్‌లో వర్క్‌ చేయాలని ఉంటుంది. అలాంటి పాత్రల కోసం ఆ దర్శకుడు లేదా నిర్మాతను అప్రోచ్‌ అవుతూ ఉంటాను కూడా. పని అడగడంలో తప్పులేదు కదా. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు పెరుగుతున్నాయి.


రాజ్మా ఉంటే చాలు

అమ్మచేతి వంట అయితే ముందూవెనకా ఆలోచించకుండా ఓ పట్టుపటేస్తా. రాజ్మాతో చేసిన పదార్థాలన్నా, పిజ్జా అన్నా చాలా ఇష్టం. లావైపోతానన్న భయం ఉన్నప్పటికీ అవి కనిపించాయంటే తినేయాల్సిందే. నా ఒంటికి నప్పే అన్ని రంగులూ ఇష్టమే కానీ నలుపు, నీలం రంగులంటే కాస్త ఎక్కువ ఇష్టం.


బోర్‌ కొట్టదు

తెలుగు సినిమానీ, తెలుగువాడి ప్రతిభనూ ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ నా ఆల్‌టైం ఫేవరెట్‌ సినిమా. బాలీవుడ్‌ విషయానికి వస్తే ‘దంగల్‌’ సినిమా చాలా నచ్చుతుంది. ఈ రెండు సినిమాల్నీ ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు.