Heroine Rituvarma

మానసికంగా… పెద్ద పోరాటమే చేశాను!

 

కొందరు హీరోయిన్లని చూడగానే ‘ఈ అమ్మాయి చాలా స్పెషల్‌!’ అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాదీ అందం రితూ వర్మ అలాంటమ్మాయే అని చెప్పక్కర్లేదు కానీ తను ఆ చిన్న గుర్తింపుతోనే ఆగిపోలేదు. ‘ఈ అమ్మాయి చేస్తున్న ప్రతి సినిమా స్పెషల్‌గానే ఉంటుంది!’ అనేంతగా పేరు తెచ్చుకుంది. కెరీర్‌ ప్రారంభంలోనే ‘నాకిష్టమైన కథలే చేస్తాను!’ అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. కాస్త ఆలస్యమైనా సరే… ఆ ధైర్యమే రితూకి మంచి ఫలితాన్ని ఇస్తోందిప్పుడు. వచ్చే ఏడాది రాబోయే తెలుగు సినిమాల్లో ఎక్కువ భాగాన్ని తన ఖాతాలో వేసుకున్న రితూ ప్రయాణం ఇది…

2011… ఆ ఏడాది భాగ్యనగరం తొలిసారి ‘మిస్‌ హైదరాబాద్‌’ పోటీలకి సిద్ధమవుతోంది. అప్పటికి చిన్నచిన్నగా జరుగుతున్నా భారీ స్థాయిలో చేయడం తొలిసారి. ఇంకేముంది… కాస్త రంగూరూపూ ఉన్న అమ్మాయిలమందరం దానికోసం పోటీపడాలనుకున్నాం. అప్పటిదాకా నాకు మోడలింగ్‌ అంటే ఏమిటో తెలియదు. ఏదో హంసనడకలు నడిచి తళుక్కున నవ్వితే చాలనుకునే వెళ్లాను. కానీ, ఈ రంగం ఎంత లోతైందో, ఫ్లడ్‌లైట్‌ల నడుమ జిగేల్మనే ప్రతి నవ్వు వెనకా ఎంత సాధనా శ్రమా ఉంటాయో వెళ్లాకే తెలిసింది. మేమంతా కొత్తవాళ్లం కాబట్టి దాదాపు నెలరోజులపాటు ‘గ్రూమింగ్‌ సెషన్‌’ నిర్వహించారు. దేశంలోని పేరున్న మోడలింగ్‌ శిక్షకులందరూ వచ్చారు.  జీవితంలో అప్పటిదాకా మరే విషయానికీ లేనంతగా దానిపైన మనసుని లగ్నం చేశాను. దేనికీ శ్రమపడనంతగా సాధన చేశాను. అది నాకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఈ పోటీలో నేను ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచాను. ఆ తర్వాత చిన్నాచితక యాడ్స్‌ చేస్తూ వచ్చాను. అలా చేస్తున్న నా దగ్గరకు హీరోయిన్‌గా నటించాలంటూ ఓ ఆఫర్‌తో వచ్చాడు తరుణ్‌భాస్కర్‌. ఇప్పుడైతే అందరూ షార్ట్‌ఫిల్మ్స్‌ చేస్తున్నారు కానీ, అప్పట్లో షార్ట్‌ఫిల్మ్‌లైనా, సినిమాలైనా… నటన అనగానే అమ్మాయిల తల్లిదండ్రులు ఉలిక్కిపడేవారు. మా ఇంట్లో కేవలం ఉలిక్కిపడటం కాదు… ఏకంగా షాక్‌కి గురయ్యారు! ఎందుకో చెబుతాను…

అప్పట్లో ఎంత సిగ్గరినో…
నేను పుట్టిపెరిగింది హైదరాబాద్‌ అయినా… మా అమ్మానాన్నలది మధ్యప్రదేశ్‌. నేను పుట్టక ముందే ఇక్కడికొచ్చి స్థిరపడ్డారు. నాన్న బిజినెస్‌మ్యాన్‌. నాకో అక్క. నేను పుట్టాక మా అమ్మ సంగీతా వర్మ జూబ్లీ హిల్స్‌లో రిచ్‌మండ్‌ స్కూల్‌ని స్థాపించింది. ఇంట్లో నన్నెవరూ చూసుకునేవాళ్లు లేకపోవడంతో రెండేళ్లు రాకముందే అమ్మ నన్ను బడికి తీసుకెళ్లడం మొదలుపెట్టిందట. నన్ను ఒళ్లో పెట్టుకునే ప్రిన్స్‌పాల్‌గా తన పనులన్నీ చూసుకునేదట. అలా అమ్మ ఒడి అలవాటైపోయినందువల్లేమో… మూడున్నరేళ్లొచ్చినా-అంటే ఎల్‌కేజీ క్లాసులకి వెళ్లాల్సి వచ్చినా నేను ఆమె చేయి వదిలేదాన్ని కాదట. ఒకవేళ క్లాసుకి వెళ్లినా ఏడ్చి గీపెట్టి మళ్లీ అమ్మ దగ్గరకి వచ్చేసేదాన్నట. మూడో తరగతి దాకా నా పరిస్థితి ఇదే! అలా బాల్యంలో ఎక్కువగా అమ్మతోనే ఉండటం వల్లనేమో… నలుగురితో కలవడం నాకు ఇబ్బందిగా ఉండేది. అమ్మ పదకొండేళ్ల దాకా నాకు జుట్టు కట్‌చేయిస్తూ, ప్యాంటూ షర్టులు వేయిస్తూ ‘టామ్‌ బాయ్‌’గానే పెంచినా… ఆ సిగ్గరితనం పోలేదు. అమ్మ స్కూల్‌లోనే పదో తరగతిదాకా చదువుకుని విల్లా మేరీ కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేశాను. మల్లారెడ్డి కాలేజీలో బీటెక్‌లో చేరాను. అప్పుడే ఇలా మోడలింగ్‌ వైపు వెళ్లాను. మొదట్లోమోడలింగ్‌ అనగానే ఏదో సరదాకి చేస్తుందిలే అనుకున్నారు కానీ నటన అవకాశం అనే సరికి షాక్‌కి గురయ్యారు. ‘ఇండస్ట్రీ ఎలా ఉంటుందో… మన చుట్టపక్కాలు ఏమనుకుంటారో’ …ఇలా ఎన్నో తర్జనభర్జనలు వాళ్లలో. చివరికి ‘ఓ ప్రయత్నం చేసి చూడనీ!’ అనుకుని పచ్చజెండా ఊపారు. అలా తరుణ్‌భాస్కర్‌ తీసిన ‘అనుకోకుండా..’ షార్ట్‌ఫిల్మ్‌లో నటించాను.

 

అవకాశాలు వచ్చినా…
‘ది 48 అవర్స్‌ ఫిల్మ్‌ ప్రాజెక్టు’ అనే పోటీ కోసం కేవలం రెండురోజుల్లో తీసిన షార్ట్‌ఫిల్మ్‌ అది. నటన అనగానే నేనేదో శిక్షణ తీసుకోవాల్సిన విషయమని అనుకోలేదు. అందులోని హీరోయిన్‌ పాత్రలోనే నన్ను నేను ఊహించుకుని ఆ సిట్యుయేషన్‌లో నేనుంటే ఎలా ప్రవర్తిస్తానో అలాగే చేశానంతే! తరుణ్‌భాస్కర్‌కీ అదే బాగా నచ్చింది. మొత్తానికి ఆ పోటీలో మా షార్ట్‌ఫిల్మ్‌కే ఫస్ట్‌ప్రైజు వచ్చింది. నాకూ ఉత్తమ నటిగా అవార్డొచ్చింది. అంతేకాదు- ఆ ఫిల్మ్‌తో సినిమారంగం చూపు మావైపు పడింది. అయితే, అప్పుడే నాకు సంబంధించి ఓ పెద్ద గాసిప్‌ బయల్దేరింది. ‘అనుకోకుండా…’ షార్ట్‌ ఫిల్మ్‌ షూటింగ్‌ తర్వాతే నాకు పెళ్లైపోయిందనీ, ఇక నేను నటించననీ ఎవరో పుకారు లేవదీశారు. అసలే నన్ను నటనవైపు పంపించడానికి ఆచితూచి నిర్ణయించుకున్న అమ్మానాన్నల్ని ఈ వదంతులు బాగా చికాకుపెట్టాయి. నాకైతే ఏడుపొక్కటే తక్కువ. అమ్మే ముందు తేరుకుని… ‘అమ్మాయిలు అడుగు బయటకేశాక ఇలాగే మాట్లాడతారు.  పట్టించుకోవద్దు’ అని ధైర్యం నూరిపోసింది. ఎలాగోలా ఆ పుకార్ల గండం గడిచి జూ.ఎన్టీఆర్‌ ‘బాద్‌షా’లో నటించాను. కాజల్‌కి చెల్లెలిగా పింకీ అనే పాత్ర నాది. అంతగా గుర్తింపులేని పాత్రే కావొచ్చుకానీ… సినిమారంగంపైన ఎంతోకొంత అవగాహన ఇచ్చింది. ఆ తర్వాత… ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ అనే సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా మారాను. ఆ తర్వాత ‘నా రాకుమారుడు’ అనే చిత్రంలో పూర్తిస్థాయి హీరోయిన్నైపోయాను. కాకపోతే వీటి ఫలితాలు నన్ను నిస్పృహలోకి నెట్టేశాయి. ఓ దశలో ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామా అనే ఆలోచనా వచ్చింది. అప్పుడే నాని ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో చేయమన్నారు. ‘ఇందుకోసమే ఇంతకాలం వేచి చూశానేమో!’ అనిపించింది ఒక్కసారిగా ఆ సినిమా విజయం చూసి. ‘ఊహూ… నువ్వు వెళ్లాల్సిన దూరం ఇంకెంతో ఉంది!’ అని దేవతలెవరో భావించినట్టు తరుణ్‌భాస్కర్‌ ‘పెళ్ళి చూపులు’ కథతో వచ్చాడు.

ఒక్కసారే అంత ఫేమ్‌!
నటనలో నేను తొలి అడుగులేసిన టీమ్‌తో మళ్లీ పనిచేసే అవకాశం కాబట్టి తరుణ్‌ భాస్కర్‌ పిలవగానే ‘డబుల్‌ ఓకే’ చెప్పాను. ‘పెళ్ళిచూపులు’ నాయిక చిత్ర పాత్ర కూడా నా మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. ఇంకేముంది… షూటింగ్‌ జరుగుతున్నన్ని రోజులూ నటించినట్లే అనిపించలేదు. సినిమా రిలీజైన వారానికే ఫేమసైపోయాను. ఒక్కసారిగా నంది, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులూ వచ్చాయి. వాటితోపాటూ వ్యక్తిగా పరిణతి కూడా ఆ సినిమాతోనే వచ్చిందని చెప్పాలి. నాకొచ్చిన అవకాశాలు అన్నింటినీ కాకుండా… మనసుకి నచ్చినవాటినే ఒప్పుకోవడం అప్పటి నుంచే నేర్చుకున్నాను. ‘పెళ్ళి చూపులు’ తర్వాత వచ్చిన అచ్చం అదేలాంటి పాత్రల్నీ, మసాలా సినిమాలనీ మరోమాటలేకుండా వద్దనుకున్నాను. ఇప్పుడైతే ఈజీగా చెప్పేస్తున్నాను కానీ అప్పట్లో మానసికంగా పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ‘ఇలా చేస్తే… అవకాశాలు రాక ఏడాదిలోనే ఫేడ్‌-అవుట్‌ అవుతానేమో!’ అనే భయం వేధిస్తుండేది. మరోవైపు ‘మనసుకి నచ్చింది చేస్తేనే మనదైన ప్రత్యేకత నిలుపుకోగలం’ అనే గుడ్డి నమ్మకం ధైర్యాన్నిచ్చేది. మొత్తానికి నాకు నచ్చిన వైవిధ్యమైన కథలకే ఓటెయ్యడం ప్రారంభించాను. ‘కేశవ’ అలాగే వచ్చింది. ఆ సినిమా హిట్టుతో పర్సనల్‌గా నేనో మెట్టు పైకెదిగినట్టు అనిపించింది. దానికి ప్రతిఫలం అన్నట్టు గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ ‘ధ్రువ నక్షత్రం’ సినిమాకి పిలిచారు. విక్రమ్‌గారు అందులో హీరో!

‘నెెగెటివ్‌ షేడ్స్‌’ ఉంటేనేం!
ధ్రువ నక్షత్రం… ఇప్పటిదాకా నేను చేసినవాటిల్లో అతిపెద్ద ప్రాజెక్టు. దానికోసమే రెండేళ్లపాటు మరే సినిమాకీ సైన్‌ చేయలేదు. కానీ అంత చేసినా ఆ సినిమా రిలీజు ఆలస్యం కావడంతో ఉసూరుమనిపించింది. ఆ నిస్పృహని పోగొట్టడానికేనేమో ‘కనులు కనులు దోచాయంటే’ అవకాశం వచ్చింది. ఇది నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర. మామూలు లేడీ విలన్‌గా చేయడం వేరు… కథానాయికగానే హై-టెక్‌ ఆడదొంగ పాత్ర చేయడం వేరు. ఇందులో అసలైన ఛాలెంజ్‌ ఉందనిపించింది. ఈ సినిమాకి తమిళంకంటే తెలుగులోనే మంచి హిట్‌ టాక్‌ వచ్చింది. ఈ అమ్మాయి ఏం చేసినా స్పెషల్‌గానే ఉంటుందనే పేరూ తెచ్చింది. ఆ చిత్రం విజయాన్ని ఆస్వాదిస్తుండగానే నానీతో ‘టక్‌ జగదీశ్‌’ ప్రారంభమైంది. ఆ షూటింగ్‌ జరుగుతుండగానే కరోనా లాక్‌డౌన్‌ మొదలైంది.

ఆరు సినిమాలున్నాయి…
కరోనా లాక్‌డౌన్‌లో ఇంతకాలం తీరికలేక వదిలేసిన పెయింటింగ్‌ వైపు దృష్టిపెట్టాను. నేను పెన్సిల్‌ స్కెచెస్‌ చాలా బాగా వేస్తాను. నాన్న నుంచి వచ్చిన వారసత్వం అది. ఎగ్జిబిషన్‌ పెట్టే ఆలోచనలేవీ లేవుకానీ… మా అమ్మ ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ ఆర్ట్‌స్కూల్‌ నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసుల్లో వీటిని ప్రదర్శించింది. ఆర్టిస్టుగా నాలోని ఈ కోణాన్ని సానపడుతుండగానే మళ్లీ గౌతమ్‌ మేనన్‌గారి నుంచి మరోసారి పిలుపు. అమెజాన్‌ ప్రైమ్‌ వాళ్లు నిర్మించిన ‘పుత్తం పుదు కాలై’ అనే తమిళ అంథాలజీలో ఆయన దర్శకత్వంలో నటించాను! ఓ మోడర్న్‌ తాతా-మనవరాళ్ల మధ్య నడిచే అద్భుతమైన కథ అది. రిలీజుకాగానే నా నటనకి దేశవిదేశాల నుంచీ ప్రశంసలు రావడం మొదలయ్యాయి! క్రికెటర్‌ అశ్విన్‌లాంటివాళ్లు నన్ను ప్రశంసిస్తూ ప్రత్యేకంగా వీడియోలూ పెట్టారు.
ఇప్పుడే మొదలైందేమో…
తొలిసారి మిస్‌ హైదరాబాద్‌ మొదటి రన్నరప్‌ కిరీటం అందుకునేటప్పుడు ప్రపంచం అంటే ఏమిటో తెలియని అమ్మాయిన్నేను. ఈ తొమ్మిదేళ్లలో ఏదో గొప్పగా నేర్చుకున్నానని చెప్పలేనుకానీ సమాజంతో కలిసిపోతూ మనదైన లక్ష్యాలని చేరుకోవడం ఎలాగో అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా నా సిగ్గరితనం నుంచి బయటపడగలిగాను… ప్రతి దానిపైనా అతిగా ఆలోచించడం మానుకున్నాను. నాలో వచ్చిన ఆ పరిణతికి కానుకగానో ఏమో ఎన్నడూలేనంతగా ఈసారి నాకు నచ్చిన అవకాశాలు తలుపు
తట్టాయి. ‘టక్‌ జగదీశ్‌’ షూటింగ్‌ పూర్తికాగానే రవితేజగారితో ‘కిలాడీ’, తమిళ హీరో అశోక్‌ సెల్వన్‌ నిత్యామేనన్‌లతో కలిసి ‘నిన్నిలా నిన్నిలా’ చిత్రాలకి సైన్‌ చేశాను. శర్వానంద్‌తో ఒకటీ, నాగశౌర్యతో మరొకటీ ఈ మధ్యే పట్టాలకెక్కాయి. ఎప్పుడో ఒకసారి మనకూ మంచి రోజులు వస్తాయని అంటుంటారు కదా, ఆ రోజులు నాకు ఈ ఏడాదే మొదలయ్యాయనిపిస్తోంది!


అమ్మ… ఆల్‌-ఇన్‌-వన్‌!

మా అమ్మ స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌ అనగానే చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని పిస్తుంది కానీ… అమ్మ ఎప్పుడూ జోవియల్‌గానే ఉంటుంది. ఇంట్లోనైతే ఇక చెప్పక్కర్లేదు. అక్క పెళ్లైయ్యాక ఓ స్నేహితురాలిగా తనులేని లోటు అమ్మే తీరుస్తోందంటే నమ్మండి! ‘పెళ్ళి చూపులు’ తర్వాత నాకు నచ్చిన సినిమాలని ఎంచుకోవాలని గట్టిగా నిలబడటంలో అమ్మ పాత్రే పెద్దది. అమ్మ ‘కేశవ’ దాకా నాతోనే వస్తుండేది కానీ ఆ తర్వాత మానేసింది. అయితేనేం… ఇప్పటికీ ప్రతి పూటకీ ఫోన్‌ చేసి ‘తిన్నావా లేదా… ఏం తిన్నావ్‌!’ అని అడుగుతూ ఉంటుంది. ఒక్కోసారి విసుగ్గా ఉంటుంది కానీ… అమ్మకాకుండా అంత శ్రద్ధగా ఇంకెవరు అడుగుతార్లే అనిపిస్తోంది. అంతే కదా!
heroine reetuvarma