singer sidh sreeram

‘రేయ్‌ పాడకురా బాబు… నీ వాయిస్‌ వింటే ప్రేమలో ఫెయిలైనవాళ్లు చచ్చిపోతారు. నీ గొంతు పాత జ్ఞాపకాలన్నీ తోడేస్తోందిరా!’-  ఈ మధ్య యువతని కట్టిపడేసిన ‘ఏమైపోయావే…’(పడిపడిలేచే మనసు) పాట యూట్యూబ్‌ వీడియో కింద ఇలాంటి కామెంట్స్‌ బోలెడన్ని కనిపిస్తాయి. ఇక, ‘ఉండిపోరాదే’(హుషారు) పాటకి వచ్చిన స్పందనల్ని చూస్తే కన్నీళ్లే అక్షరాలుగా మారాయేమో అనిపిస్తుంది. అంతగా నేటి యువత గుండె లోతుల్ని తడుముతోంది సిధ్‌ శ్రీరామ్‌ గొంతుక! ఆ యువ సంచలనంతో కబుర్లాడితే…

మా అమ్మానాన్నలు ఇద్దరిదీ చెన్నైయే. మా తాతయ్య-అంటే మా అమ్మవాళ్ల నాన్న రాజగోపాలన్‌ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు. ఆ విద్యే అమ్మ లలితకి వారసత్వంగా వచ్చింది. నేనూ మా అక్క పల్లవీ ఇక్కడే పుట్టాం. నాకు ఏడాది వయసులో అమ్మానాన్నా అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడ్డారు. అమ్మ అక్కడే ‘శ్రీ లలిత గాన విద్యాలయ’ పేరుతో కర్ణాటక సంగీత పాఠశాల స్థాపించారు. అందులో నేనూ, మా అక్కయ్యే తొలి విద్యార్థులం. అలా నాకు సంగీతంలో అమ్మే తొలి గురువైంది. సంగీత శిక్షణలో సరిగమలు నేర్పుతూనే నేరుగా కీర్తనలూ పాడించడం గురువుగా అమ్మ అనుసరించే పద్ధతి. పాడించడమే కాదు… వేదికలూ ఎక్కించేది. అలా మూడేళ్ల నుంచే నేను సభల్లో పాడటం మొదలుపెట్టాను. పదమూడో ఏడు వచ్చేదాకా రోజూ ఉదయాన్నే ఇంట్లో రెండుగంటలపాటు సాధన చేయడం, స్కూలుకెళ్లడం, వచ్చాక మళ్లీ సాధన చేయడం… ఇలాగే ఉండేది నా జీవితం. కానీ టీనేజీలోకి వచ్చాక సహజంగానే అమెరికన్‌ జీవితంపైన క్రేజ్‌ పెంచుకున్నా. అమెరికన్‌ యువతనే అనుకరించడం మొదలుపెట్టా! నేనే కాదు అమెరికాలో పెరిగే ఎన్నారై యువతలో చాలామంది ఇలానే ఉంటారు. అదృష్టవశాత్తూ నా విషయంలో ఆ అనుకరణ వాళ్ల సంగీతానికే పరిమితమైంది! ముఖ్యంగా, రిథమ్‌ అండ్‌ బ్లూస్‌ (ఆర్‌ అండ్‌ బీ) పాప్‌ నన్ను పూర్తిగా వశం చేసుకుంది. అమెరికా యువతతో సమానంగా దానిపైన పట్టు సాధించాను.

ఇదో సమస్యా అనిపించొచ్చు…!
ఇంటర్‌స్థాయికి వచ్చాక నేనూ ‘ఆర్‌ అండ్‌ బీ’ షోలు ఇవ్వడం మొదలుపెట్టా! ఇంత సాధిస్తున్నా లోలోపల మనకి ఇక్కడి అమెరికన్‌ యువతకి ఉన్నంత ఆదరణ రావట్లేదు కదా అనే బాధ వేధిస్తుండేది. ఎంతగా వాళ్ల వేషభాషల్ని అనుకరిస్తున్నా వాళ్లలో కలిసిపోలేకపోతున్నందువల్ల అసహనంగా అనిపించేది. దానికి తోడు మన సంస్కృతికి దూరమైపోతున్నామనే అపరాధభావం కూడా తోడయ్యేది. ఆ ఆత్మన్యూనత, అపరాధభావం, గుర్తింపు కోసం తపన… ఇవన్నీ నన్నెంతో వేధించేవి. భారతదేశం నుంచి చూస్తే ఇదంతా ఓ సమస్యా అనిపించొచ్చుకానీ ఆ బాధ అనుభవిస్తేకానీ అర్థంకాదు. నేనైతే ఎవ్వరితోనూ కలవలేక బాగా ఒంటరినైపోయాను. ఆ సందర్భంలోనే నాన్న ఓ మంచి పనిచేశారు. డిగ్రీలో నన్ను మెడిసిన్‌నో, టెక్నాలజీనో కాకుండా మ్యూజిక్‌ తీసుకోమని ప్రోత్సహించారు. నా జీవితంలో మొదటి మలుపు అదే.

ఇది తర్వాతది…
బెర్క్‌లీ కాలేజీ ఆఫ్‌ మ్యూజిక్‌లో చేరాను. ‘మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌’ అన్నది నా కోర్సు పేరు. చిన్నప్పటి నుంచీ నాలో అంతర్భాగమైన కర్ణాటక సంగీతం ఎంత మహోన్నతమైందో తెలుసుకున్నది అక్కడే. ఆ సంగీతాన్నీ, ఇక్కడి పాశ్చాత్య ఆర్‌ అండ్‌ బీతో ఫ్యూజన్‌ చేయొచ్చనే ఆలోచనా నాకు అక్కడే వచ్చింది. సంగీత రంగంలో నేను వెళ్లాల్సిన దిశ అదేనని కూడా అర్థమైంది. ఆ రెండు శైలుల్నీ కలుపుతూ పాటలు కట్టడం మొదలుపెట్టాను. వాటికి సాహిత్యం కూడానాదే. అన్నింటికీ ఇతివృత్తం ఒక్కటే… అమెరికా జీవితంలో మానసికంగా నాకున్న ఏకాకితనం! అప్పుడే కాదు ఇప్పటికీ నేను ఏ పాట పాడినా నా గొంతులో అంతర్లీనంగా ఆ బాధే వినిపిస్తోందేమో! ఆ శోకమే అందరికీ ఇంతగా నచ్చుతోందేమో!! సరే… అలా నేను రూపొందించిన పాటల్ని నెట్‌లో అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాను. దానికొచ్చే స్పందనలు నాకు ప్రోత్సాహాన్నిచ్చినా నాపై నాకు పూర్తిస్థాయిలో నమ్మకాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ నమ్మకాన్ని నాలో నింపింది ఏఆర్‌ రెహ్మాన్‌గారే!

ఏడాది తర్వాతే రిప్లై వచ్చింది…
2009… ఏఆర్‌ రెహ్మాన్‌గారికి జంట ఆస్కార్‌లు వచ్చిన సంవత్సరం. ఆరోజు ఆయన్ని చూడటానికి నాలాంటి వందలాదిమంది ఎన్నారై యువకులం ఆస్కార్‌ వేదిక బయట నిల్చున్నాం. ఆయనతో షేక్‌ హ్యాండ్‌కు ఎగబడ్డాం. ఆ తర్వాతి వారానికే ఎంతో శ్రమించి రెహ్మాన్‌ ఈమెయిల్‌ సంపాదించాను. నేను సొంతంగా చేసిన పాటలన్నింటినీ ఆయనకి పంపించడం మొదలుపెట్టాను. ఆరునెలల తర్వాత చిన్న రిప్లై వచ్చింది… ‘నీ వాయిస్‌ కొత్తగా ఉంది. అవకాశం వస్తే వర్క్‌చేద్దాం’ అని. ఆమాత్రం జవాబు రావడమే ఆనందంగా అనిపించినా ఆయన పిలుస్తారనే నమ్మకమైతే రాలేదు. ఆ ఏడాది నుంచే నేను చెన్నైకి వచ్చి డిసెంబర్‌లో జరిగే శాస్త్రీయ సంగీతోత్సవాల్లో సంగీత కచేరీలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. 2011లో అలా ఇక్కడికి వచ్చినప్పుడే రెహ్మాన్‌ స్టూడియో నుంచి పిలుపొచ్చింది. కలా నిజమా… అనుకుంటూ వెళ్లాను. పాట పాడిస్తారని ఆశపడ్డానుకానీ జస్ట్‌ నన్ను కలవడానికి పిలిచానని చెప్పారు. ఉసూరుమనిపించినా ఆయన్ని ఆమాత్రం కలవడమే ఆనందమేసింది. నేనొచ్చిన రెండు నెలల తర్వాత రెహ్మాన్‌ ఓ రోజు ఫోన్‌ చేసి ‘మణిరత్నం ‘కడలి’ చిత్రానికి నీ వాయిస్‌ ట్రై చేయాలనుకుంటున్నా!’ అన్నారు. వారం గడిచాక ఓ రోజు రాత్రి 10.00కి ఫోన్‌ చేసి ‘అరగంటలో రికార్డింగ్‌కి తయారుకండి!’ అన్నారు. గబగబా నా స్టూడియోకి పరుగెత్తాను. రెహ్మాన్‌ స్కైప్‌లోకి వచ్చారు. నాకు ఓ ట్యూన్‌ ఇచ్చి దాన్ని అమెరికన్‌ ‘బ్లూస్‌’ శైలిలో పాడమన్నారు. నాకు రకరకాలుగా సూచనలిస్తూ నాలుగు గంటలసేపు పాడించారు! ఇంత చేశాక కూడా అది కేవలం ఆడిషన్స్‌ కోసం జరిగిన టెస్టు మాత్రమే అనుకుంటూ ఉన్నాన్నేను. నెల తర్వాత మళ్లీ రెహ్మాన్‌గారే ఫోన్‌ చేసి ‘మీ వాయిస్‌కి మణిరత్నంగారు ఓకే చెప్పారు. ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు. ‘మరి రికార్డింగ్‌ ఎప్పుడు సార్‌’ అని అడిగాను. ‘ఆరోజు మనం చేసింది రికార్డింగే కదయ్యా!’ అన్నారాయన నవ్వుతూ. అప్పుడుకానీ నాకు విషయం బోధపడలేదు! ఆ పాట ‘కడలి’ సినిమాలో వచ్చే ‘యాడికే…’ పాటకి తమిళ మాతృక. ఆ పాట ద్వారా నా గొంతుతో భారతీయ సినిమాకి తొలిసారి బ్లూస్‌ శైలిని పరిచయం చేశారు రెహ్మాన్‌. అదే ఏడాది నేను చెన్నైకి వచ్చాక తెలుగు వర్షన్‌ పాడించారు. ఆ రకంగా రెహ్మాన్‌ స్టూడియోలో నేను మొదట పాడింది తెలుగుపాటే అని చెప్పాలి!

ప్రపంచ పర్యటన…
కడలి తర్వాత మరోపాట పాడటానికి ఏడాది వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఈసారి కూడా రెహ్మాన్‌ నుంచే పిలుపొచ్చింది. ‘ఐ’ సినిమాలో ‘నువ్వుంటే నా జతగా…’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాలో ‘కాలం లేడిలా మారెనే…’ పాటలు పాడించారు. ఆ రెండింటి తర్వాతే ఇక్కడి సినిమా సంగీత ప్రపంచంలో నన్ను గుర్తించడం మొదలుపెట్టారు! ఆ తర్వాతే మిగతా సంగీత దర్శకులు వరసగా అవకాశాలివ్వడం మొదలుపెట్టారు. సినిమా పాటలు డబ్బు మాత్రమే కాదు నాకెంతో ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చాయి. ఆ నమ్మకంతోనే కర్ణాటక సంగీతంతో-పాశ్చాత్య ఆర్‌ అండ్‌ బీని జతచేసి ఫ్యూజన్‌ సృష్టిస్తూ సొంత ఆల్బమ్స్‌ తీసుకురావడం మొదలుపెట్టాను. అందులో నేనే నటిస్తున్నాను కూడా! రెండేళ్లకిందట ‘ఇన్సోమ్నియాక్‌ సీజన్స్‌’ అనే ఆల్బమ్‌ తెచ్చాను. గత నెలే ‘ఎంట్రోపీ’ పేరుతో మరో ఆల్బమ్‌ కూడా విడుదల చేశాను. ఆ పాటలన్నింటితో ప్రస్తుతం భారత్‌, అమెరికాల్లో మ్యూజికల్‌ టూర్‌ కూడా నిర్వహిస్తున్నాను.

నా పాట మీ నోట…!
నేను మిగతా భాషల్లో పాడిన పాటలన్నీ ఒకెత్తయితే తెలుగులో పాడినవి మాత్రం ఒకెత్తు! 2017 దాకా నేను తెలుగులో తమిళ డబ్బింగ్‌ పాటలే పాడుతూ వచ్చాను. ఆ ఏడాదే దర్శకుడు కోన వెంకట్‌ పిలిచి ‘నిన్ను కోరి’ సినిమాలో ‘అడిగా అడిగా’ పాడమన్నారు. గోపీ సుందర్‌ చేసిన ఆ బాణీ వినగానే నాకు బాగా నచ్చింది. 2017లో తెలుగు యువత అత్యధికంగా కవర్‌లు చేసిన పాట అదేనట! 2018 మొదట్లో పరశురామ్‌గారు ‘గీత గోవిందం’ గురించి చెప్పారు. గోపీ సుందర్‌ కర్ణాటక సంగీత ఛాయలతో చేసిన ‘ఇంకేం ఇంకేం… ’ బాణీ అద్భుతంగా అనిపించింది. దాంట్లో మరింతగా మెలడీ చొప్పించగలిగాను.
అమెరికాలో ఉంటూనే ఆ పాటని రికార్డు చేశాను. పరశురామ్‌, అనంతశ్రీరామ్‌ సహకారంతో ఉచ్చారణ సమస్యలేకుండా చూసుకున్నాను! ఆ పాట ఎంత హిట్టంటే… ఇండియాలో మాత్రమే కాదు అమెరికాలో ఎక్కడ ప్రోగ్రామ్‌ ఇచ్చినా తెలుగురానివారు కూడా ఆ పాట పాడమంటున్నారు. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న తమిళ విలేకర్లు కూడా ఆ పాట నాలుగులైన్లయినా పాడాకే… ప్రశ్నలు వేస్తామని భీష్మించుకుంటున్నారు! అదిప్పుడు కేవలం తెలుగుపాట కాదు… భారతీయులందరి పాట. ఇంతటి ఆదరణ నేను కూడా ఊహించలేదు. ‘గీతగోవిందం’ తర్వాత తెలుగులో చాలా పాటలు పాడాను. ‘నీవెవరో’ సినిమాలోని ‘వెన్నెలా’, శైలజారెడ్డి అల్లుడులో ‘ఎగిరెగిరే’, ‘టాక్సీవాలా’లో ‘మాటే వినదుగా…’ ఇక్కడి యువతకి నన్ను మరింతగా దగ్గరచేశాయి. గత ఏడాది చివర్లో వచ్చిన ‘ఉండిపోరాదే…’(హుషారు), ‘ఏమైపోయావే…’
(పడిపడిలేచె మనసు) 2018ని తెలుగుకి సంబంధించినంత వరకు నేను మరచిపోలేని ఏడాదిగా మిగిల్చాయి! ఇంతకంటే ‘ఇంకేం ఇంకేం కావాలే…’ అని నా కోసం నేను పాడుకుంటున్నాను ఇప్పుడు!


 

ఫ్రెండ్‌గా ఉంటే చాలన్నారు..!

నా పాటకి జీవాన్నిచ్చేది కర్ణాటక సంగీతమైతే…  ఆ సంగీతం నాలో సంపూర్ణంగా నిండడానికి కారణం మా అమ్మ. ఆమె నా ఆదిగురువైతే మా తాతయ్య, అంటే అమ్మవాళ్ల నాన్న, రాజగోపాల్‌ నాకు అందులోని లోతులు చూపారు. మా నాన్న శ్రీరామ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థ నడుపుతున్నారు. ఆయన వ్యాపారిగా ఎంత విజయం సాధించారో అంతటి సున్నితమనస్కుడు. కెరీర్‌పరంగా నా మార్గదర్శి. మా అక్కయ్య పల్లవి డ్యాన్సర్‌ మాత్రమే కాదు అమెరికాలోని కేంబ్రిడ్జిలో ప్రొఫెసర్‌ కూడా! వయసొచ్చాక ఎవరో ఒకరి ఆకర్షణకి గురికాకుండా ఉంటామా చెప్పండి. అమెరికాలో నాకూ అంతే. కాకపోతే అప్పట్లో నేను ప్రపోజ్‌ చేసిన అమ్మాయిలంతా నన్ను ‘ఫ్రెండ్‌జోన్‌’ చేసేశారు! సినిమాల్లో నా పాటలు వినిపించడం మొదలుపెట్టాక… వాళ్లే ‘ఐ మిస్‌ యూ’ అంటూ లేఖలు రాస్తున్నారు. కాకపోతే, వాటికి జవాబు ఇచ్చేందుకు నాకు టైం ఉండట్లేదు ఇప్పుడు. నాకింకా ఇరవై ఎనిమిదేళ్లే కాబట్టి పెళ్లి గురించి ఆలోచించడంలేదు!