singer sidh sreeram

‘రేయ్‌ పాడకురా బాబు… నీ వాయిస్‌ వింటే ప్రేమలో ఫెయిలైనవాళ్లు చచ్చిపోతారు. నీ గొంతు పాత జ్ఞాపకాలన్నీ తోడేస్తోందిరా!’-  ఈ మధ్య యువతని కట్టిపడేసిన ‘ఏమైపోయావే…’(పడిపడిలేచే మనసు) పాట యూట్యూబ్‌ వీడియో కింద ఇలాంటి కామెంట్స్‌ బోలెడన్ని కనిపిస్తాయి. ఇక, ‘ఉండిపోరాదే’(హుషారు) పాటకి వచ్చిన స్పందనల్ని చూస్తే కన్నీళ్లే అక్షరాలుగా మారాయేమో అనిపిస్తుంది. అంతగా నేటి యువత గుండె లోతుల్ని తడుముతోంది సిధ్‌ శ్రీరామ్‌ గొంతుక! ఆ యువ సంచలనంతో కబుర్లాడితే…

మా అమ్మానాన్నలు ఇద్దరిదీ చెన్నైయే. మా తాతయ్య-అంటే మా అమ్మవాళ్ల నాన్న రాజగోపాలన్‌ కర్ణాటక సంగీత విద్వాంసుడు, గాయకుడు. ఆ విద్యే అమ్మ లలితకి వారసత్వంగా వచ్చింది. నేనూ మా అక్క పల్లవీ ఇక్కడే పుట్టాం. నాకు ఏడాది వయసులో అమ్మానాన్నా అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశారు. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్థిరపడ్డారు. అమ్మ అక్కడే ‘శ్రీ లలిత గాన విద్యాలయ’ పేరుతో కర్ణాటక సంగీత పాఠశాల స్థాపించారు. అందులో నేనూ, మా అక్కయ్యే తొలి విద్యార్థులం. అలా నాకు సంగీతంలో అమ్మే తొలి గురువైంది. సంగీత శిక్షణలో సరిగమలు నేర్పుతూనే నేరుగా కీర్తనలూ పాడించడం గురువుగా అమ్మ అనుసరించే పద్ధతి. పాడించడమే కాదు… వేదికలూ ఎక్కించేది. అలా మూడేళ్ల నుంచే నేను సభల్లో పాడటం మొదలుపెట్టాను. పదమూడో ఏడు వచ్చేదాకా రోజూ ఉదయాన్నే ఇంట్లో రెండుగంటలపాటు సాధన చేయడం, స్కూలుకెళ్లడం, వచ్చాక మళ్లీ సాధన చేయడం… ఇలాగే ఉండేది నా జీవితం. కానీ టీనేజీలోకి వచ్చాక సహజంగానే అమెరికన్‌ జీవితంపైన క్రేజ్‌ పెంచుకున్నా. అమెరికన్‌ యువతనే అనుకరించడం మొదలుపెట్టా! నేనే కాదు అమెరికాలో పెరిగే ఎన్నారై యువతలో చాలామంది ఇలానే ఉంటారు. అదృష్టవశాత్తూ నా విషయంలో ఆ అనుకరణ వాళ్ల సంగీతానికే పరిమితమైంది! ముఖ్యంగా, రిథమ్‌ అండ్‌ బ్లూస్‌ (ఆర్‌ అండ్‌ బీ) పాప్‌ నన్ను పూర్తిగా వశం చేసుకుంది. అమెరికా యువతతో సమానంగా దానిపైన పట్టు సాధించాను.

ఇదో సమస్యా అనిపించొచ్చు…!
ఇంటర్‌స్థాయికి వచ్చాక నేనూ ‘ఆర్‌ అండ్‌ బీ’ షోలు ఇవ్వడం మొదలుపెట్టా! ఇంత సాధిస్తున్నా లోలోపల మనకి ఇక్కడి అమెరికన్‌ యువతకి ఉన్నంత ఆదరణ రావట్లేదు కదా అనే బాధ వేధిస్తుండేది. ఎంతగా వాళ్ల వేషభాషల్ని అనుకరిస్తున్నా వాళ్లలో కలిసిపోలేకపోతున్నందువల్ల అసహనంగా అనిపించేది. దానికి తోడు మన సంస్కృతికి దూరమైపోతున్నామనే అపరాధభావం కూడా తోడయ్యేది. ఆ ఆత్మన్యూనత, అపరాధభావం, గుర్తింపు కోసం తపన… ఇవన్నీ నన్నెంతో వేధించేవి. భారతదేశం నుంచి చూస్తే ఇదంతా ఓ సమస్యా అనిపించొచ్చుకానీ ఆ బాధ అనుభవిస్తేకానీ అర్థంకాదు. నేనైతే ఎవ్వరితోనూ కలవలేక బాగా ఒంటరినైపోయాను. ఆ సందర్భంలోనే నాన్న ఓ మంచి పనిచేశారు. డిగ్రీలో నన్ను మెడిసిన్‌నో, టెక్నాలజీనో కాకుండా మ్యూజిక్‌ తీసుకోమని ప్రోత్సహించారు. నా జీవితంలో మొదటి మలుపు అదే.

ఇది తర్వాతది…
బెర్క్‌లీ కాలేజీ ఆఫ్‌ మ్యూజిక్‌లో చేరాను. ‘మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ అండ్‌ ఇంజినీరింగ్‌’ అన్నది నా కోర్సు పేరు. చిన్నప్పటి నుంచీ నాలో అంతర్భాగమైన కర్ణాటక సంగీతం ఎంత మహోన్నతమైందో తెలుసుకున్నది అక్కడే. ఆ సంగీతాన్నీ, ఇక్కడి పాశ్చాత్య ఆర్‌ అండ్‌ బీతో ఫ్యూజన్‌ చేయొచ్చనే ఆలోచనా నాకు అక్కడే వచ్చింది. సంగీత రంగంలో నేను వెళ్లాల్సిన దిశ అదేనని కూడా అర్థమైంది. ఆ రెండు శైలుల్నీ కలుపుతూ పాటలు కట్టడం మొదలుపెట్టాను. వాటికి సాహిత్యం కూడానాదే. అన్నింటికీ ఇతివృత్తం ఒక్కటే… అమెరికా జీవితంలో మానసికంగా నాకున్న ఏకాకితనం! అప్పుడే కాదు ఇప్పటికీ నేను ఏ పాట పాడినా నా గొంతులో అంతర్లీనంగా ఆ బాధే వినిపిస్తోందేమో! ఆ శోకమే అందరికీ ఇంతగా నచ్చుతోందేమో!! సరే… అలా నేను రూపొందించిన పాటల్ని నెట్‌లో అప్‌లోడ్‌ చేయడం మొదలుపెట్టాను. దానికొచ్చే స్పందనలు నాకు ప్రోత్సాహాన్నిచ్చినా నాపై నాకు పూర్తిస్థాయిలో నమ్మకాన్ని ఇవ్వలేకపోయాయి. ఆ నమ్మకాన్ని నాలో నింపింది ఏఆర్‌ రెహ్మాన్‌గారే!

ఏడాది తర్వాతే రిప్లై వచ్చింది…
2009… ఏఆర్‌ రెహ్మాన్‌గారికి జంట ఆస్కార్‌లు వచ్చిన సంవత్సరం. ఆరోజు ఆయన్ని చూడటానికి నాలాంటి వందలాదిమంది ఎన్నారై యువకులం ఆస్కార్‌ వేదిక బయట నిల్చున్నాం. ఆయనతో షేక్‌ హ్యాండ్‌కు ఎగబడ్డాం. ఆ తర్వాతి వారానికే ఎంతో శ్రమించి రెహ్మాన్‌ ఈమెయిల్‌ సంపాదించాను. నేను సొంతంగా చేసిన పాటలన్నింటినీ ఆయనకి పంపించడం మొదలుపెట్టాను. ఆరునెలల తర్వాత చిన్న రిప్లై వచ్చింది… ‘నీ వాయిస్‌ కొత్తగా ఉంది. అవకాశం వస్తే వర్క్‌చేద్దాం’ అని. ఆమాత్రం జవాబు రావడమే ఆనందంగా అనిపించినా ఆయన పిలుస్తారనే నమ్మకమైతే రాలేదు. ఆ ఏడాది నుంచే నేను చెన్నైకి వచ్చి డిసెంబర్‌లో జరిగే శాస్త్రీయ సంగీతోత్సవాల్లో సంగీత కచేరీలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. 2011లో అలా ఇక్కడికి వచ్చినప్పుడే రెహ్మాన్‌ స్టూడియో నుంచి పిలుపొచ్చింది. కలా నిజమా… అనుకుంటూ వెళ్లాను. పాట పాడిస్తారని ఆశపడ్డానుకానీ జస్ట్‌ నన్ను కలవడానికి పిలిచానని చెప్పారు. ఉసూరుమనిపించినా ఆయన్ని ఆమాత్రం కలవడమే ఆనందమేసింది. నేనొచ్చిన రెండు నెలల తర్వాత రెహ్మాన్‌ ఓ రోజు ఫోన్‌ చేసి ‘మణిరత్నం ‘కడలి’ చిత్రానికి నీ వాయిస్‌ ట్రై చేయాలనుకుంటున్నా!’ అన్నారు. వారం గడిచాక ఓ రోజు రాత్రి 10.00కి ఫోన్‌ చేసి ‘అరగంటలో రికార్డింగ్‌కి తయారుకండి!’ అన్నారు. గబగబా నా స్టూడియోకి పరుగెత్తాను. రెహ్మాన్‌ స్కైప్‌లోకి వచ్చారు. నాకు ఓ ట్యూన్‌ ఇచ్చి దాన్ని అమెరికన్‌ ‘బ్లూస్‌’ శైలిలో పాడమన్నారు. నాకు రకరకాలుగా సూచనలిస్తూ నాలుగు గంటలసేపు పాడించారు! ఇంత చేశాక కూడా అది కేవలం ఆడిషన్స్‌ కోసం జరిగిన టెస్టు మాత్రమే అనుకుంటూ ఉన్నాన్నేను. నెల తర్వాత మళ్లీ రెహ్మాన్‌గారే ఫోన్‌ చేసి ‘మీ వాయిస్‌కి మణిరత్నంగారు ఓకే చెప్పారు. ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు. ‘మరి రికార్డింగ్‌ ఎప్పుడు సార్‌’ అని అడిగాను. ‘ఆరోజు మనం చేసింది రికార్డింగే కదయ్యా!’ అన్నారాయన నవ్వుతూ. అప్పుడుకానీ నాకు విషయం బోధపడలేదు! ఆ పాట ‘కడలి’ సినిమాలో వచ్చే ‘యాడికే…’ పాటకి తమిళ మాతృక. ఆ పాట ద్వారా నా గొంతుతో భారతీయ సినిమాకి తొలిసారి బ్లూస్‌ శైలిని పరిచయం చేశారు రెహ్మాన్‌. అదే ఏడాది నేను చెన్నైకి వచ్చాక తెలుగు వర్షన్‌ పాడించారు. ఆ రకంగా రెహ్మాన్‌ స్టూడియోలో నేను మొదట పాడింది తెలుగుపాటే అని చెప్పాలి!

ప్రపంచ పర్యటన…
కడలి తర్వాత మరోపాట పాడటానికి ఏడాది వెయిట్‌ చేయాల్సి వచ్చింది. ఈసారి కూడా రెహ్మాన్‌ నుంచే పిలుపొచ్చింది. ‘ఐ’ సినిమాలో ‘నువ్వుంటే నా జతగా…’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాలో ‘కాలం లేడిలా మారెనే…’ పాటలు పాడించారు. ఆ రెండింటి తర్వాతే ఇక్కడి సినిమా సంగీత ప్రపంచంలో నన్ను గుర్తించడం మొదలుపెట్టారు! ఆ తర్వాతే మిగతా సంగీత దర్శకులు వరసగా అవకాశాలివ్వడం మొదలుపెట్టారు. సినిమా పాటలు డబ్బు మాత్రమే కాదు నాకెంతో ఆత్మవిశ్వాసాన్నీ ఇచ్చాయి. ఆ నమ్మకంతోనే కర్ణాటక సంగీతంతో-పాశ్చాత్య ఆర్‌ అండ్‌ బీని జతచేసి ఫ్యూజన్‌ సృష్టిస్తూ సొంత ఆల్బమ్స్‌ తీసుకురావడం మొదలుపెట్టాను. అందులో నేనే నటిస్తున్నాను కూడా! రెండేళ్లకిందట ‘ఇన్సోమ్నియాక్‌ సీజన్స్‌’ అనే ఆల్బమ్‌ తెచ్చాను. గత నెలే ‘ఎంట్రోపీ’ పేరుతో మరో ఆల్బమ్‌ కూడా విడుదల చేశాను. ఆ పాటలన్నింటితో ప్రస్తుతం భారత్‌, అమెరికాల్లో మ్యూజికల్‌ టూర్‌ కూడా నిర్వహిస్తున్నాను.

నా పాట మీ నోట…!
నేను మిగతా భాషల్లో పాడిన పాటలన్నీ ఒకెత్తయితే తెలుగులో పాడినవి మాత్రం ఒకెత్తు! 2017 దాకా నేను తెలుగులో తమిళ డబ్బింగ్‌ పాటలే పాడుతూ వచ్చాను. ఆ ఏడాదే దర్శకుడు కోన వెంకట్‌ పిలిచి ‘నిన్ను కోరి’ సినిమాలో ‘అడిగా అడిగా’ పాడమన్నారు. గోపీ సుందర్‌ చేసిన ఆ బాణీ వినగానే నాకు బాగా నచ్చింది. 2017లో తెలుగు యువత అత్యధికంగా కవర్‌లు చేసిన పాట అదేనట! 2018 మొదట్లో పరశురామ్‌గారు ‘గీత గోవిందం’ గురించి చెప్పారు. గోపీ సుందర్‌ కర్ణాటక సంగీత ఛాయలతో చేసిన ‘ఇంకేం ఇంకేం… ’ బాణీ అద్భుతంగా అనిపించింది. దాంట్లో మరింతగా మెలడీ చొప్పించగలిగాను.
అమెరికాలో ఉంటూనే ఆ పాటని రికార్డు చేశాను. పరశురామ్‌, అనంతశ్రీరామ్‌ సహకారంతో ఉచ్చారణ సమస్యలేకుండా చూసుకున్నాను! ఆ పాట ఎంత హిట్టంటే… ఇండియాలో మాత్రమే కాదు అమెరికాలో ఎక్కడ ప్రోగ్రామ్‌ ఇచ్చినా తెలుగురానివారు కూడా ఆ పాట పాడమంటున్నారు. నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న తమిళ విలేకర్లు కూడా ఆ పాట నాలుగులైన్లయినా పాడాకే… ప్రశ్నలు వేస్తామని భీష్మించుకుంటున్నారు! అదిప్పుడు కేవలం తెలుగుపాట కాదు… భారతీయులందరి పాట. ఇంతటి ఆదరణ నేను కూడా ఊహించలేదు. ‘గీతగోవిందం’ తర్వాత తెలుగులో చాలా పాటలు పాడాను. ‘నీవెవరో’ సినిమాలోని ‘వెన్నెలా’, శైలజారెడ్డి అల్లుడులో ‘ఎగిరెగిరే’, ‘టాక్సీవాలా’లో ‘మాటే వినదుగా…’ ఇక్కడి యువతకి నన్ను మరింతగా దగ్గరచేశాయి. గత ఏడాది చివర్లో వచ్చిన ‘ఉండిపోరాదే…’(హుషారు), ‘ఏమైపోయావే…’
(పడిపడిలేచె మనసు) 2018ని తెలుగుకి సంబంధించినంత వరకు నేను మరచిపోలేని ఏడాదిగా మిగిల్చాయి! ఇంతకంటే ‘ఇంకేం ఇంకేం కావాలే…’ అని నా కోసం నేను పాడుకుంటున్నాను ఇప్పుడు!


 

ఫ్రెండ్‌గా ఉంటే చాలన్నారు..!

నా పాటకి జీవాన్నిచ్చేది కర్ణాటక సంగీతమైతే…  ఆ సంగీతం నాలో సంపూర్ణంగా నిండడానికి కారణం మా అమ్మ. ఆమె నా ఆదిగురువైతే మా తాతయ్య, అంటే అమ్మవాళ్ల నాన్న, రాజగోపాల్‌ నాకు అందులోని లోతులు చూపారు. మా నాన్న శ్రీరామ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సంస్థ నడుపుతున్నారు. ఆయన వ్యాపారిగా ఎంత విజయం సాధించారో అంతటి సున్నితమనస్కుడు. కెరీర్‌పరంగా నా మార్గదర్శి. మా అక్కయ్య పల్లవి డ్యాన్సర్‌ మాత్రమే కాదు అమెరికాలోని కేంబ్రిడ్జిలో ప్రొఫెసర్‌ కూడా! వయసొచ్చాక ఎవరో ఒకరి ఆకర్షణకి గురికాకుండా ఉంటామా చెప్పండి. అమెరికాలో నాకూ అంతే. కాకపోతే అప్పట్లో నేను ప్రపోజ్‌ చేసిన అమ్మాయిలంతా నన్ను ‘ఫ్రెండ్‌జోన్‌’ చేసేశారు! సినిమాల్లో నా పాటలు వినిపించడం మొదలుపెట్టాక… వాళ్లే ‘ఐ మిస్‌ యూ’ అంటూ లేఖలు రాస్తున్నారు. కాకపోతే, వాటికి జవాబు ఇచ్చేందుకు నాకు టైం ఉండట్లేదు ఇప్పుడు. నాకింకా ఇరవై ఎనిమిదేళ్లే కాబట్టి పెళ్లి గురించి ఆలోచించడంలేదు!

Heroine shalini pandey

అలాంటివాడు ఎదురైతే ప్రేమిస్తా!

విజయ్‌ దేవరకొండ ఎన్ని సినిమాలు చేస్తున్నా తెలుగు ప్రేక్షకులకు అర్జున్‌రెడ్డిగానే గుర్తొస్తాడు. అలాగే షాలినిపాండే ఎన్ని పాత్రలు చేసినా ప్రీతి శెట్టిగానే మనకు గుర్తొస్తుంది. మొదటి సినిమాతోనే తన నటనతో అంత గుర్తింపు తెచ్చుకుంది షాలిని. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో బిజీగా ఉన్న ఆమెను ఓసారి పలకరించి కబుర్లలోకి దించితే… అర్జున్‌రెడ్డికి ముందు, తర్వాత తన జీవితం గురించి చెబుతోందిలా!

పెద్దయ్యాక ఏమవ్వాలన్న విషయంమీద స్కూల్‌ రోజుల్లోనే చాలా ఆలోచించేదాన్ని. నైన్‌ టు ఫైవ్‌ జాబ్‌ ఏదైనా బోర్‌ కొట్టేస్తుందనిపించింది. బోర్‌కొట్టని జాబ్‌ అంటే యాక్టింగ్‌ మాత్రమే అనిపించింది. కానీ ఆ మాట ఇంట్లో చెప్పేంత ధైర్యం లేదు. మా సొంతూరు మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ గృహిణి. అక్క, నేను… ఇద్దరం పిల్లలం. నాన్న ఎప్పుడూ మేం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలనేవారు. ఇష్టంలేకపోయినా ఇంజినీరింగ్‌లో చేరాను. జబల్‌పూర్‌… కళలూ, సంస్కృతుల నిలయం. నాటక రంగానికీ మంచి పేరుంది. సినిమాల్లోకి వెళ్తానని చెబితే ఏమంటారోనని నాటకాల్లో శిక్షణ తీసుకుంటానని ఇంట్లో చెప్పాను. అప్పటికి ఇంజినీరింగ్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నాను. మార్కులు బాగానే వస్తున్నాయి కాబట్టి సరేనన్నారు నాన్న. సెలవు రోజుల్లో అక్కడే ఉండేదాన్ని. అలా నటనలో అనుభవం సంపాదించాను. దాని మూలాన ఈరోజుకీ గ్లిజరిన్‌ లేకుండానే ఏడ్వగలను. థర్డ్‌ ఇయర్‌కి వచ్చాక సినిమాల్లోకి వెళ్తానని చెబితే ఇంట్లో ఒప్పుకోలేదు. ‘ఉద్యోగం సంపాదించి సెటిల్‌ అవ్వు’ అన్నారు. చదువు పూర్తవడానికి టైమ్‌ ఉందికదాని నేనూ ఊరుకున్నాను. అప్పుడే సోనీ వాళ్లు చేస్తున్న ‘మన్‌ మే విశ్వాస్‌ హై’ షోకి సంబంధించిన ఓ ఎపిసోడ్‌ జబల్‌పూర్‌లో షూటింగ్‌ జరిగితే అందులో నటించాను.

అర్జున్‌రెడ్డి అవకాశం
మా నాటక బృందంలో చాలామంది సినిమా ప్రయత్నాలు చేస్తుండేవారు. ఫొటో షూట్‌తో ప్రొఫైల్‌ తయారుచేసి ముంబయిలోని కాస్టింగ్‌ డైరెక్టర్లకి పంపేవారు. అలా నా ఫొటోలు కూడా పంపాను. వాళ్లు ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి పంపారు. వాటిని దర్శకుడు సందీప్‌రెడ్డి చూసి నాకు ఫోన్‌ చేశారు. అప్పటికి నా ఇంజినీరింగ్‌ పూర్తయింది. నాన్నతో విషయం చెప్పాను. వారం రోజులు బతిమలాడితేగానీ అంగీకరించలేదు. డైరెక్టర్‌తో డిస్కషన్స్‌కి నాతోపాటు హైదరాబాద్‌ వచ్చారు. ఇక్కడికి రాకముందు నేను తెలుగు సినిమాలు చూసింది లేదు. కానీ ఒకసారి కథ విన్నాక మాత్రం నేను చేసి తీరాల్సిన సినిమా అనిపించింది. నాటక రంగం నుంచి వచ్చిన నాకు ఇలాంటి ఛాలెంజింగ్‌ పాత్రకంటే ఏం కావాలి అనిపించిది. మొదటరోజే నాన్న సందీప్‌ని కలిసి ఎలాంటి ముద్దు సీన్లూ, క్లోజ్‌గా ఉండే సీన్లూ లేకపోతేనే మా అమ్మాయి పనిచేస్తుందని చెప్పారు. ఆయన సరేనంటూ తలూపారు. కథ చెప్పినప్పుడు నాతోకూడా ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. ఒకవేళ ముందే చెప్పుంటే చేసేదాన్ని కాదేమో!

అప్పుడు నాన్నతో మాటల్లేవ్‌!
అర్జున్‌రెడ్డికి నా ఎంపిక ఖరారైపోయింది. కానీ, సినిమా స్టార్ట్‌ కావడానికి టైమ్‌ పడుతుందని చెప్పారు. పది రోజులయ్యాక… ‘వాళ్లు ఎప్పుడు పిలుస్తారో అంతవరకూ టైమ్‌ వేస్ట్‌ చేసే బదులు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చుగా’ అని చెప్పడం మొదలుపెట్టారు నాన్న. ‘నన్ను ముంబయి పంపండి అక్కడ కూడా సినిమా ప్రయత్నాలు చేస్తా’నని నాన్నకి చెప్పాను. ఒక వారం మాత్రం టైమ్‌ ఇవ్వమన్నాను. అంతలోనే అవకాశాలు రావని తెలుసు కానీ, అక్కడ మా ఫ్రెండ్స్‌ ఉన్నారు. వాళ్లని కలిసినట్లూ ఉంటుంది, పరిశ్రమ గురించి అవగాహనా వస్తుందనేది నా ప్లాన్‌. రిటర్న్‌ టికెట్‌ కూడా తీసిచ్చి ముంబయి పంపించారు. కానీ వెళ్లిన రెండో రోజునుంచే ‘ఎక్కడ ఉన్నావ్‌, ఏం చేస్తున్నావ్‌’ అంటూ ఫోన్‌ చేసేవారు. నేను మరీ అంత చిన్న పిల్లని కాదని చెప్పేదాన్ని. నేను సినిమాలకు దూరమవుతానేమోనని నా భయం. సినిమాలంటూ తిరిగి నేను ఏమైపోతానో అని ఆయన భయం. చివరికి ‘లాభంలేదు, 22 ఏళ్లవరకూ ఆయన చెప్పిందే చేశాను. ఈ ఒక్కసారికి నా మనసుకు నచ్చింది చేద్దాం’ అనిపించింది. వారం దాటినా తిరిగి వెళ్లలేదు. ‘నేను ఇంటికి రాను. నా కలల్ని నిజం చేసుకోనివ్వండి’ అని ఫోన్లో చెప్పడానికి ధైర్యం చాలక ఈ-మెయిల్‌ పెట్టాను. ఆ తర్వాత దాదాపు ఏడెనిమిది నెలలు నాన్న నాతో మాట్లాడలేదు. ‘అర్జున్‌రెడ్డి’ స్టార్ట్‌ అయ్యేదాకా ముంబయిలోనే ఉండాలనుకున్నాను. నా చేతిలో ఎక్కువ డబ్బులేదు. మా ఫ్రెండ్‌ తన ఫ్రెండ్స్‌తో ఉంటావా అని అడిగింది. కాకపోతే వాళ్లు అబ్బాయిలు. అయినా ఆ పరిస్థితుల్లో షెల్టర్‌ ముఖ్యమని ఉండటానికి సిద్ధపడ్డాను. ఓ 15 రోజులు అని వాళ్లతో చెప్పాను. వాళ్లు నన్ను బాగా చూసుకున్నారు. రెంట్‌ ఇస్తానన్నా తీసుకోలేదు. పొదుపుగా బతకడానికి ఒక పూట భోజనం చేస్తే మరోపూట టిఫిన్‌తో సరిపెట్టుకునేదాన్ని. అక్కడ పృథ్వీ కెఫేలోనే ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసేదాన్ని. రెండు నెలలకు సందీప్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘హమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాను.

దక్షిణాది అబ్బాయిలు ఇష్టం!
అర్జున్‌రెడ్డి షూటింగ్‌కి ముందు నటీనటులతో పదిరోజుల పాటు వర్క్‌షాప్‌ చేశారు. అప్పుడే నాకు సినిమా హిట్‌ అవుతుందన్న నమ్మకం వచ్చింది. సందీప్‌ ఆలోచనల్లో ఉన్న ప్రీతి పాత్రను నేనూ, అర్జున్‌ పాత్రను విజయ్‌ బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టే సినిమా అంత బాగా వచ్చింది. ప్రివ్యూ చూడ్డానికి నాన్న కూడా వచ్చారు. ఏం అంటారోనని భయం వేసింది. కానీ నేను చాలా సహజంగా నటించాననీ, కథలోని వాస్తవికత బావుందనీ అక్కతో చెప్పారు. నాన్న నోట అలాంటి మాటలు మొదటి సినిమాతోనే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. విజయ్‌, నేనూ ప్రివ్యూ చూసినపుడు మా ఫీలింగ్స్‌ చెప్పే పొజిషన్‌లో లేం. థియేటర్లో ఆడియన్స్‌తో కలిసి చూసినపుడు మాత్రం బాగా ఎంజాయ్‌ చేశాం. శాలినీ పాండేని కాస్తా ఒక్కరోజులోనే ప్రీతీ శెట్టి అయిపోయాను. ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లూ, పొగడ్తలూ, సెల్ఫీలూ… ఇప్పుడనిపిస్తుంది అవన్నీ ఎలా డీల్‌ చేయగలిగానా అని. ఒకబ్బాయి అయితే వీపుమీద నా ఫొటోని పచ్చబొట్టు పొడిపించుకుని ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టాడు. ఏం చెప్పాలో అర్థంకాలేదు. ఫోన్‌ చేసి ఒకసారి మాట్లాడాను. ‘అర్జున్‌రెడ్డి’తో చాలా భావోద్వేగాలు ఉన్నాయి. అందుకే ఆ సినిమాని ఎక్కువగా చూడను. నిజజీవితంలో ప్రీతి, అర్జున్‌ రెండు పాత్రల స్వభావాలూ ఉన్నదాన్ని. ప్రీతి తన ఇష్టాల్ని మాటల్లో చెప్పలేదు. కానీ తన నిర్ణయాలు తాను తీసుకుంటుంది. నేనూ అంతే. అర్జున్‌రెడ్డిలా నేను లక్ష్యం కోసం ఏదైనా చేస్తాను. దక్షిణాదికి వచ్చి చూశాక ఇక్కడ అబ్బాయిలపైన ఇష్టం పెరిగింది. అర్జున్‌ లాంటి నిజాయతీ, ధైర్యం ఉన్న వ్యక్తి నిజజీవితంలో ఎదురైతే కచ్చితంగా ప్రేమిస్తాను.

తమిళంలో చాలా బిజీ…
అర్జున్‌రెడ్డి తర్వాత తెలుగులో చాలా కథలు విన్నాను. కానీ వాటిలో కొత్తదనం కనిపించలేదు. అందుకే చేయడానికి నచ్చలేదు. తక్కువ నిడివి పాత్రలైనా మహానటిలో సుశీలగా, ఎన్టీఆర్‌ కథానాయకుడులో షావుకారు జానకిగా కనిపించాను. నన్ను ప్రీతి లాంటి పాత్రలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని తెలుసు. కానీ అలాంటి ఛాన్స్‌లు ఎప్పుడోకానీ రావు కదా! అంతవరకూ వేేచిచూస్తూ ఉండిపోలేనుగా. పక్కంటి అమ్మాయి తరహా పాత్రల్ని చేయడమన్నా నాకు ఇష్టమే. ‘118’లో అలాంటి పాత్ర చేశాను. దీనికీ మంచి పేరొచ్చింది. ప్రస్తుతం తమిళంలో ‘100 పర్సెంట్‌ కాదల్‌’ చేస్తున్నాను. రెహ్మాన్‌ మేనల్లుడు జీవీ ప్రకాష్‌ దీంట్లో హీరోగా నటిస్తున్నాడు. ‘100 పర్సెంట్‌ లవ్‌’కి రీమేక్‌ ఇది. ‘100 పర్సెంట్‌ లవ్‌’ చూశాను. అందులోని మహాలక్ష్మి పాత్ర నాకు బాగా నచ్చింది. అందుకే ఆ సినిమాకి అడిగేసరికి వెంటనే ఓకే చెప్పాను. అది చేస్తుండగానే ‘గొరిల్లా’ అనే మరో తమిళ సినిమాలోనూ అవకాశం వచ్చింది. హాస్య ప్రధానంగా సాగే సినిమా అది. విజయ్‌ ఆంటోనితో ‘జ్వాలా’ అనే చిత్రంలోనూ చేస్తున్నాను. అది తమిళంతోపాటు తెలుగులోనూ వస్తుంది. త్వరలోనే నేరుగా తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్టు చేయబోతున్నా. ‘బామ్‌ఫాద్‌’తో ఈ ఏడాది బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నాను. రెండేళ్ల సినిమా ప్రయాణంలో వ్యక్తిగా నేను చాలా నేర్చుకున్నాను. అదే సమయంలో నాలోని సాధారణ మధ్య తరగతి అమ్మాయిని మాత్రం దూరం చేసుకోలేదు!

సోషల్‌ మీడియా నచ్చదు!

నేను ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూస్తాను, ఇక్కడి పాటలు వింటుంటాను. సిధ్‌ శ్రీరామ్‌ పాడిన పాటలు బాగా నచ్చుతాయి. దర్శకుల్లో మణిరత్నం, నటుల్లో కమల్‌ హాసన్‌లకు అభిమానిని. బీ డైట్‌ అంటూ నోరు కట్టుకోను. సినిమాల్లోకి వచ్చాక వెజిటేరియన్‌గా మారిపోయాను. వెజ్‌లో ఏదైనా తింటాను.
* ముంబయిలో ఉంటే పృథ్వీ కేఫ్‌కి వెళ్తాను. అక్కడ థియేటర్‌కి సంబంధించి ప్రదర్శన, వర్క్‌షాప్‌… ఏదో ఒకటి జరుగుతుంటుంది. నేర్చుకోవడానికి మంచి అవకాశం.
* జిమ్‌కంటే కూడా వాకింగ్‌, రన్నింగ్‌ చేయడం ఇష్టం. బయటకు వెళ్లే పరిస్థితి లేకుంటేనే జిమ్‌ చేస్తాను. వారంలో కనీసం అయిదురోజులు వ్యాయామం చేస్తాను.
* పుస్తకాలు బాగా చదువుతాను. వాటితో ఊహా శక్తి పెరుగుతుంది. సినిమా పాత్రల్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
* సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టడం, కామెంట్లు రాయడం…. నాకు నచ్చదు. వాటికి వీలైనంత దూరంగా ఉంటాను.
* నాకు స్నేహితులు చాలా తక్కువ. నా సర్కిల్‌లో కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారితో తప్పిస్తే బయటివాళ్లతో అంత త్వరగా కలవలేను.

Heroine Esharebba

heroine esharebba
ఈషారెబ్బా పక్కా లోకల్‌..!
 

తెలుగు హీరోయిన్లు టాలీవుడ్‌లో రాణించడం కష్టం అనుకున్న సమయంలో ఈషా రెబ్బా వరస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. వైవిధ్య భరితమైన పాత్రలు చేస్తూ విమర్శకుల దగ్గరా మంచిమార్కులే కొట్టేసింది. అందంతో అభినయంతో తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తనగురించి ఏం చెబుతోందంటే…


అలా వచ్చాను

నేను పక్కా లోకల్‌ అమ్మాయిని. పుట్టింది వరంగల్‌లో అయినా పెరిగిందీ చదువుకుందీ అంతా హైదరాబాద్‌లోనే. చిన్నప్పటి నుంచీ నటిని కావాలని కలలు కనేదాన్ని. అందుకే ఎంబీఏ పూర్తయిన వెంటనే మోడలింగ్‌లో అడుగుపెట్టాను. ఆ సమయంలోనే ఫేస్‌బుక్‌లో నా ఫొటోలను చూసిన ఇంద్రగంటి మోహన కృష్ణగారు ‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమా కోసం నన్ను ఎంపిక చేశారు. అలా సినిమాల్లోకి రావాలన్న నా కల నెరవేరింది.


సెలవు దొరికితే…

నాకు చిన్నప్పటి నుంచీ ట్రావెలింగ్‌ అంటే పిచ్చి. అందుకే బిజీ షెడ్యూళ్ల మధ్య ఏ కాస్త తీరిక దొరికినా విహారయాత్రలకు వెళ్తా. స్విట్జర్లాండ్‌, ప్యారిస్‌ నాకు ఇష్టమైన ప్రదేశాలు. వీటన్నింటికంటే పుట్టిపెరిగిన హైదరాబాద్‌ అంటే చాలాచాలా ఇష్టం. కొన్నిసార్లు విదేశాలకు వెళ్లేంత టైం ఉండదు. అలాంటప్పుడు స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో చక్కర్లు కొడతా. కుటుంబ వేడుకల్లో సందడిచేయడం ఎంతిష్టమో స్నేహితులతో కలిసి పార్టీలకు వెళ్లడం కూడా అంతే ఇష్టం.


ఎప్పుడూ అనుకోలేదు

‘అంతకు ముందు ఆ తరవాత’ నా మొదటి సినిమా. ఇది ప్రేక్షకాదరణ పొందడంతోపాటు దక్షిణాఫ్రికాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించడానికి నామినేట్‌ కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే నాని నిర్మాతగా వచ్చిన చిత్రం ‘అ!’లో నాది లెస్బియన్‌ పాత్ర. ఇందులోని నా నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. కెరీర్‌ ప్రారంభంలోనే ఇలా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.


అడగడంలో తప్పులేదు

నాకు వచ్చిన కథల్లో నచ్చినవి ఎంచుకుంటున్నాను. ‘ఈ పాత్రకు నేనైతే సరిపోతాను’ అనిపించిన పాత్రలే చేస్తున్నాను. నాకు ఎప్పుడూ కొత్త దర్శకులతో కొత్త కాంబినేషన్స్‌లో వర్క్‌ చేయాలని ఉంటుంది. అలాంటి పాత్రల కోసం ఆ దర్శకుడు లేదా నిర్మాతను అప్రోచ్‌ అవుతూ ఉంటాను కూడా. పని అడగడంలో తప్పులేదు కదా. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు పెరుగుతున్నాయి.


రాజ్మా ఉంటే చాలు

అమ్మచేతి వంట అయితే ముందూవెనకా ఆలోచించకుండా ఓ పట్టుపటేస్తా. రాజ్మాతో చేసిన పదార్థాలన్నా, పిజ్జా అన్నా చాలా ఇష్టం. లావైపోతానన్న భయం ఉన్నప్పటికీ అవి కనిపించాయంటే తినేయాల్సిందే. నా ఒంటికి నప్పే అన్ని రంగులూ ఇష్టమే కానీ నలుపు, నీలం రంగులంటే కాస్త ఎక్కువ ఇష్టం.


బోర్‌ కొట్టదు

తెలుగు సినిమానీ, తెలుగువాడి ప్రతిభనూ ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ నా ఆల్‌టైం ఫేవరెట్‌ సినిమా. బాలీవుడ్‌ విషయానికి వస్తే ‘దంగల్‌’ సినిమా చాలా నచ్చుతుంది. ఈ రెండు సినిమాల్నీ ఎన్నిసార్లు చూసినా బోర్‌ కొట్టదు.

Heroine Nandita sweta

ఒక్కోసారి ఒక్కొక్కరు నచ్చేవారు

కళ్లతోనే వేల భావాలు పలికిస్తుంది. నవ్వుతో మాయ చేస్తుంది. మాట అయితే భలే ముద్దుగా ఉంటుంది. హుషారుకు పెట్టింది పేరైన కన్నడ కస్తూరి నందిత శ్వేత గురించే ఇదంతా. అందం, అభినయం, పాత్రల ఎంపిక… ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె ప్రత్యేకమే. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ…  ‘శ్రీనివాస కళ్యాణం’, ‘బ్లఫ్‌ మాస్టర్‌’ చిత్రాలతో మెరిసింది. ప్రస్తుతం ‘ప్రేమకథా చిత్రమ్‌2’తో పాటు… ‘కల్కి’, ‘అక్షర’ చిత్రాలు చేస్తోంది. చిన్ననాటి సంగతులు, కుటుంబం, స్నేహితులు… ఇలా పలు విషయాలు పంచుకుంది.
* ఇంతటి పోటీలోనూ వరుసగా అవకాశాలు సొంతం చేసుకొంటున్నారు. ఏమిటా రహస్యం?
అన్ని సినిమాలు హిట్టు కావాలి. నిర్మాతకి డబ్బు రావాలి. నేను ఆలోచించేది అంతవరకే. ఎవరు గొప్ప అనేది నేనో, నాకు పోటీ అనుకుంటున్న కథానాయికలో కలిసి నిర్ణయించుకోలేం కదా. అది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అందుకే పోటీ గురించి ఎప్పుడూ ఆలోచించను. 2018లో దాదాపు పది సినిమాలకి సంతకం చేశా.
* తెలుగులో తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత చాలా రోజులు కనిపించలేదెందుకు?
‘ఈ అమ్మాయి అభినయం శక్తివంతంగా ఉంటుంది. ఇలాంటి పాత్ర ఇవ్వడం కరెక్టా కాదా?’ అని చాలామంది దర్శకులు  మాట్లాడుకొన్నారట. కొద్దిమంది నన్ను ఎంపిక చేసుకోవాలనుకొన్నా… గందరగోళానికి గురయ్యారట. ఆ విషయం చాలా మంది చెప్పారు నాకు. నేను అన్ని రకాల పాత్రల్లో మెప్పించగలనని నిరూపించడానికి కొంచెం సమయం పట్టింది. అయితే నాకొచ్చిన గుర్తింపు మాత్రం సంతోషాన్నిచ్చింది. ఈ యేడాది ఫక్తు వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లోనూ కనిపిస్తా.
* తెలుగు, తమిళం, కన్నడ… ఏ భాషలోకి వెళితే ఆ భాష మాట్లాడేస్తున్నారు. అదెలా సాధ్యమవుతోంది?
ఒక ఉద్యోగం చేయాలంటే, దానికి ఏమేం కావాలో ముందే నేర్చుకుంటారు కదా. ఇదీ అంతే. తమిళంలోకి వెళ్లిన కొత్తలో కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాను తప్ప… ఎక్కడా భాష పరంగా సమస్య ఎదురు కాలేదు. ఇక తెలుగంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. అందుకే తొలి సినిమా చేస్తున్నప్పుడే నేర్చుకున్నా.
* మీ అసలు పేరు శ్వేత అంట కదా. నందిత శ్వేత అని ఎందుకు మార్చుకున్నారు?
నా తొలి సినిమానే నా పేరును మార్చేసింది. కన్నడంలో ‘నంద లవ్స్‌ నందిత’ అనే సినిమాతో పరిచయమయ్యా. ఆ చిత్ర దర్శకనిర్మాతలు జ్యోతిష్యుడిని సంప్రదించి నా పేరు నందిత అయితే బాగుంటుందని అలా మార్చారు. అయితే నా అసలు పేరును వదులుకోవడం ఇష్టం లేక… నేను నందిత శ్వేత అని మార్చుకున్నా.
* కథానాయిక కావాలని చిన్నప్పుడే అనుకున్నారా?
చిన్నప్పుడు అసలు సినిమా ఆలోచనలే ఉండేవి కాదు. ఒక అబ్బాయిలాగా అల్లరి చేసేదాన్ని. డ్యాన్స్‌, బ్యాడ్మింటన్‌ అంటే ఇష్టం ఉండేది. ఎక్కడో నేను చేసిన డ్యాన్స్‌ చూసి, ఇంకెవరో చెప్పడంతో నాకు కన్నడంలో తొలి సినిమా అవకాశం వచ్చింది. అయితే స్కూల్‌లోనే నేనొక సెలబ్రిటీని. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండటంతో నన్నంతా గుర్తుపట్టి, ప్రత్యేకంగా చూసేవాళ్లు.
* సినిమా రంగంలోకి వెళతానన్నప్పుడు ఇంట్లో అభ్యంతరం చెప్పారా?
మొదట నాన్న వద్దన్నారు. నేను నాలుగు రోజులు అన్నం తినలేదు. ఎంతోమంది ప్రయత్నిస్తే కానీ రాని అవకాశం నాకు అనుకోకుండా వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి కదా అనేది నా తాపత్రయం. అదే విషయం ఇంట్లో చెప్పి ఒప్పించా. కానీ ఇప్పుడు నా సినీ ప్రయాణం చూసి మా ఇంట్లో అంతా సంతోషిస్తుంటారు.

* కామెడీ అంటే నాకు బాగా ఇష్టం. తమిళంలో కామెడీ చేశాను కానీ, తెలుగులోనే ఆ అవకాశం రాలేదు. రొమాంటిక్‌గా సాగే ప్రేమకథల్లోనూ నటించాలని ఉంది.
*నేను చేసిన కొన్ని సినిమాల్ని చూసి నన్ను హోమ్‌లీ అంటుంటారు కానీ… నేను చాలా ట్రెండీ. బెంగళూరు అమ్మాయినండీ, నేను చాలా హాట్‌(నవ్వుతూ).
* నా చిన్నప్పటి మిత్రులు నలుగురున్నారు. ఏదైనా వాళ్లతోనే పంచుకుంటుంటా. తెరపై నన్ను చూసి వాళ్లు ఆటపట్టిస్తుంటారు. వాళ్లతో కలిసి నా సినిమా చూస్తున్నప్పుడు భలే సరదాగా ఉంటుంది.
*ప్రేమపై నమ్మకముంది. స్కూల్‌లో, కాలేజీలో ఇలా ఒక్కోసారి ఒకొక్కరు నచ్చేవారు. క్రష్‌ అనేది సహజమే కదా. కానీ ఎప్పుడూ సీరియస్‌గా ప్రేమలో మాత్రం పడలేదు. ప్రేమలో పడాలని నాకూ ఉంది. కానీ అది ఒక సినిమాకి సంతకం చేసినట్టుగా, ప్రణాళికతో చేసేది కాదు కదా. అనుకోకుండా పుట్టాలి. చూద్దాం… ఎవరితో ప్రేమలో పడతానో!

Heroine Vidyabalan

ఆరోజు బాగా ఏడ్చేశాను..!

బాలీవుడ్‌లో స్టార్‌ హీరో అనగానే వాళ్ల పేరు చివరన ఖాన్‌, కపూర్‌, సింగ్‌ పదాలు వినిపిస్తాయి. కానీ స్టార్‌ హీరోయిన్‌ అంటే మాత్రం విద్యాబాలన్‌ పేరు వినిపిస్తుంది. మహిళా ప్రధాన పాత్రలతో సినిమాల్ని చేస్తూ తనకంటూ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న నటి విద్య. ‘ఎన్టీఆర్‌’ జీవితకథలో ‘బసవతారకం’ పాత్రతో తెలుగువారి ప్రశంసలూ అందుకున్న విద్య తన సినిమా ప్రస్థానం గురించి చెబుతోందిలా…

దక్షిణాది అమ్మాయినే అయినా ఇక్కడ సినిమాలు చేయని లోటు కెరీర్‌ మొదలుపెట్టిన 15 ఏళ్ల తర్వాత ‘ఎన్టీఆర్‌’తో తీరింది. డైరెక్టర్‌ క్రిష్‌, హీరో బాలకృష్ణ నన్ను బసవతారకం క్యారెక్టర్‌ చేయమని అడిగినపుడు ‘ఈ పాత్ర చేయడానికి పెద్దగా ఏముంటుందిలే’ అనుకున్నా. కానీ వాళ్లిద్దరూ ఆమె వ్యక్తిత్వం, ఎన్టీఆర్‌తో ఆమెకున్న అనుబంధం, పిల్లలపట్ల ఆమె అనురాగం… ఇలా ఒక్కో విషయమూ చెబుతుంటే నోరు తెరుచుకుని విన్నా. అప్పుడే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. సినిమా షూటింగ్‌ మొదలవ్వక ముందే వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ వచ్చి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ బసవతారకంగారి గురించి  తెలుసుకునేదాన్ని. ఈ సినిమాతో మరో మంచి పాత్ర చేశానన్న సంతృప్తి కలిగింది. నా సినిమా ప్రస్థానాన్ని మొదట్నుంచీ చెప్పాలంటే మాత్రం ముంబయి నుంచి మొదలుపెట్టాలి.
17 ఏళ్ల వయసులో మా నాన్న పాలక్కడ్‌ రామయ్యర్‌ బాలన్‌ కేరళ నుంచి ముంబయికి వలసవచ్చారు. టైపిస్టుగా కెరీర్‌ మొదలుపెట్టి వివిధ హోదాల్లో పనిచేసి డిజీ కేబుల్‌లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ సరస్వతి. అమ్మానాన్నలకు మేం ఇద్దరం ఆడపిల్లలం. నేను పుట్టి పెరిగింది ముంబయిలోనే. ‘ఏక్‌ దో తీన్‌…’ పాటలో మాధురీదీక్షిత్‌ని చూశాక సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన మొదటిసారి వచ్చింది. మాది కేరళలో స్థిరపడ్డ తమిళ అయ్యంగార్ల కుటుంబం. అప్పట్లో ప్రతి ఆదివారం దూరదర్శన్‌లో వచ్చే తమిళ, మలయాళీ సినిమాల్నీ మా అక్క ప్రియా, నేనూ చూసేవాళ్లం. ప్రియ ఒక యాడ్‌ ఏజెన్సీలో పనిచేసేది. నా ఫొటోల్ని ఆ ఏజెన్సీ వాళ్లకి చూపిస్తే ప్రకటనల్లో అవకాశాలు ఇచ్చారు. ఇంటర్మీడియెట్‌ నుంచీ ప్రకటనలకు మోడలింగ్‌ చేసేదాన్ని. ఇంటర్‌ తర్వాత సెయింట్‌ జేవియర్స్‌లో సోషియాలజీ మేజర్‌ తీసుకుని డిగ్రీలో చేరాను. నటి అవ్వడానికి నేనేమీ యాక్టింగ్‌ స్కూల్లో శిక్షణ తీసుకోలేదు. మోడల్‌గా చేస్తూనే యాడ్స్‌ తీసే మా స్నేహితుల్లో కొందరు షార్ట్‌ఫిల్మ్స్‌ తీస్తుంటే వాటిలో నటించేదాన్ని. ప్రకటనలకు వాయిస్‌ ఓవర్లు చెప్పేదాన్ని. కార్పొరేట్‌ సంస్థలు నిర్వహించే సమావేశాల్లో వ్యాఖ్యాతగా ఉండేదాన్ని. కానీ సినిమా అవకాశం కావాలంటూ ఎవరినీ అడగలేదు. ఎందుకంటే అలా ఒకరి దగ్గర చేయి చాస్తే అమ్మాయిలు ఇబ్బంది పడాల్సి వస్తుందని చాలామంది దగ్గర విన్నాను. ఆ పరిస్థితి వద్దనుకున్నాను.

పరిణీతతో మొదలు…
ప్రకటనల్లో చూసినవాళ్లు నన్ను సినిమాలకి సంప్రదించేవాళ్లు. చాలా మలయాళీ సినిమాల్లో ముందు నన్ను ఎంపికచేసినట్టు చెప్పి మళ్లీ వేరేవాళ్లని తీసుకునేవారు. ఒక సినిమా అయితే షూటింగ్‌ పూర్తయినా రిలీజ్‌ కాకుండా ఆగిపోయింది. తమిళంలోనూ అవకాశాలు వచ్చినట్టే వచ్చి పోయేవి. బాలీవుడ్‌లోనూ ఇలాంటి అనుభవాలే. మా ఇంటి దగ్గర్లో సాయిబాబా గుడి ఉంటుంది. అవకాశాలు వచ్చిపోయినప్పుడల్లా అక్కడ కూర్చుని బాధతో ఏడ్చేసేదాన్ని.

ఇక సినిమాలు వద్దు అనుకునేదాన్ని. కానీ మర్నాడు నిద్రలేచి మళ్లీ అద్దంలో చూసుకోగానే సినిమానే గుర్తొచ్చేది. ఆ దశలో కొన్ని టీవీ సీరియల్స్‌లో అవకాశం వస్తే అయిష్టంగానే చేశాను.
89 యాడ్స్‌, మూడు మ్యూజిక్‌ వీడియోలు, రెండు సీరియళ్లు చేశాక, పన్నెండు సినిమాల్లో వచ్చిన అవకాశాలు పోయిన తర్వాత 2003లో ఓ బెంగాలీ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. తర్వాత రెండేళ్లకు హిందీలో ‘పరిణీత’ ఛాన్స్‌ వచ్చింది. నాతో ప్రకటనలూ, వీడియో ఆల్బమ్‌లూ చేసిన ప్రదీప్‌ సర్కార్‌ నాకు అందులో ఛాన్స్‌ ఇచ్చారు. అప్పట్నుంచీ ఆయనే నా మార్గదర్శి. నా ముఖం కుడివైపుకంటే కూడా ఎడమవైపు అందంగా కనిపిస్తుందని ప్రదీప్‌ చెప్పారు. అప్పట్నుంచీ నా ఫొటోల్నీ, వీడియోల్నీ ఎడమవైపే ఎక్కువగా తీయమని చెబుతుంటా.

‘పరిణీత’తో మంచి విజయాన్ని అందుకున్నాను. రెండో చిత్రం ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ కూడా మంచి హిట్‌. తర్వాత వరసగా ఫ్లాప్‌లు వచ్చాయి. దాంతో ఎన్నో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘విద్య నటన అంత బాగుండదు’, ‘లావుగా ఉంది’, ‘డ్రెస్‌ సెన్స్‌ లేదు’, ‘ఫ్యాషన్లు తెలీదు’… ఇలాంటి మాటలు ఎన్నో విన్నాను. ‘ఎంత చక్కగా ఉంది నీ ముఖం. కాస్త ఒళ్లు తగ్గించుకోవచ్చు కదా!’ అన్న మాటలు సినిమాల్లోకి రాకముందు కూడా తరచూ వింటుండేదాన్ని. ఆ మాటలు వినీ వినీ నా శరీరాకృతిని నేనే అసహ్యించుకునేదాన్ని. కష్టపడి మరీ వ్యాయామం చేసేదాన్ని. దాంతో శరీరంలో హార్మోన్ల బ్యాలెన్స్‌ తప్పేది. బరువు తగ్గడం, పెరగడం… ఇదే రొటీన్‌ అయ్యేది. ఈ క్రమంలోనే నా శరీరం తీరుని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నా శరీరాన్ని కష్టమైన వ్యాయామాలతో నరకయాతన పెట్టను. ఆహార నియమాలతో కడుపు మాడ్చుకోను. ‘మన శరీరాన్ని మనం ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు’ అనే పాలసీకి వచ్చేశాను. ఇప్పుడు జనం కూడా నన్ను ఇలాగే చూడ్డానికి ఇష్టపడుతున్నారు.

ఆ దశను దాటేశాను…
నేను ఎక్కువగా పాతికేళ్ల మహిళ, గృహిణి పాత్రల్ని పోషిస్తూ వచ్చాను. ‘ఇలా అయితే నీ కెరీర్‌ త్వరలోనే ముగుస్తుంది’ అనేవారు. అందుకే హే బేబీ, కిస్మత్‌ కనెక్షన్‌లాంటి సినిమాల్లో కాలేజీ అమ్మాయి, పెళ్లికాని అమ్మాయి పాత్రల్లో నటించాను. కానీ వాటిలో అనుకున్నంతగా మెప్పించలేకపోయాను. అందుకే తర్వాత నుంచీ అమ్మాయిల పాత్రలు మానేసి నా వయసుకీ, శరీరాకృతికీ సరిపోయే క్యారెక్టర్లని చేయడం మొదలుపెట్టాను. దాంతో మళ్లీ సక్సెస్‌ రుచి చూశాను. నేను చేసిన ‘ఇష్కియా’, ‘పా’, ‘నో వన్‌ కిల్డ్‌ జెస్సికా’, ‘డర్టీ పిక్చర్‌’, ‘కహానీ’ లాంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. సిల్క్‌స్మిత జీవితకథ ఆధారంగా వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’కిగానూ ఉత్తమనటిగా జాతీయ అవార్డునీ అందుకున్నాను. ఆ తర్వాత కూడా నావి కొన్ని సినిమాలు బాగా ఆడలేదు. నటులు ఎవరైనా ఈ దశలన్నీ దాటాల్సిందేనని తర్వాత అర్థమైంది. లేకుంటే మనకు ఏది సరైనదో తెలియదు. ఈ ప్రయాణంలో నాకు అర్థమైందేంటంటే హిట్లు మనల్ని ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉండేలా చేయలేవు, అలాగే ఫ్లాప్‌లూ ఇక్కణ్నుంచి బయటకు పంపేయలేవు. వైఫల్యాలు ఎదురైనపుడు తమలోని ఉత్సాహాన్ని కోల్పోనివాళ్లే విజయవంతమవుతారు. ఏదైనా పాత్ర వచ్చినపుడు దర్శకుడిని సందేహాలు అడిగి క్యారెక్టర్‌ని లోతుగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను. పాత్రకు న్యాయం చేయడానికి అవసరమైన పుస్తకాలు చదువుతాను, సినిమాలు చూస్తాను, వ్యక్తుల్ని కలుస్తాను. నేను చేసినవాటిలో ఎక్కువగా కష్టాలూ, బాధల్ని ఎదుర్కొన్న పాత్రలు ఉన్నాయి. ‘హమారీ అధూరీ కహానీ’లో కోపంగా కనిపించే పాత్రను చేశాను. 2017లో వచ్చిన ‘తుమ్హారీ సులు’ సినిమాలో పూర్తి నిడివి కామెడీ పాత్ర చేశాను. ఇప్పుడు జీవితంలోనూ చాలా సంతోషంగా, నవ్వుతూ ఉంటున్నాను. అందుకేనేమో ఆ క్యారెక్టర్‌ బాగా పండింది. ప్రతి సినిమాకీ ఒక ప్రత్యేకమైన ఫెర్‌ఫ్యూమ్‌ని వాడతాను. ఆ క్యారెక్టర్‌ స్వభావానికి సరిపోయేలా ఘాటుగా లేదంటే మృదువుగా ఉండే ఫ్లేవర్లని ఎంచుకుంటాను. ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం నుంచి ప్రమోషన్ల వరకూ అదే వాడతాను. నటిగా నన్ను నేనొక ఆడపులిగా భావిస్తాను. ప్రతి సినిమా తర్వాత నటన పరంగా నా ఆకలిని మరింత పెôచుకుంటాను.

అనుభవంతో అందం!
ఈ మధ్య వయసుతోపాటు అందం కూడా పెరుగుతోందని కాంప్లిమెంట్‌లు ఇస్తున్నారు. వయసుతో చాలా విషయాలు తెలుస్తాయి. మనల్ని మనం అర్థం చేసుకుంటాం. మన పరిధిలో లేని విషయాల గురించి తక్కువ ఆలోచిస్తాం. ఈ మార్పులవల్ల మనం సంతోషంగా ఉంటాం. అది ముఖంలో కనిపిస్తుంది. 20లలో ఉన్నపుడు నా కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచించాను. 30లలో నన్ను నేను తెలుసుకోవడం గురించి ఆలోచించాను. నలభైకి దగ్గరయ్యాక నన్ను నేను ప్రేమించడం మొదలుపెట్టాను.
అందుకేనేమో అందంగా కనిపిస్తున్నాను.


నేను… న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!

నేను పుట్టింది 1979 జనవరి 1న. అందుకే  మా వాళ్లంతా నన్ను కొత్త సంవత్సరం కానుక అనేవారు.
*మావారు సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌. సినీ నిర్మాత. మా వివాహ బంధానికి ఎనిమిదేళ్లు. ఇద్దరం కలిసి పనిచేయడం గురించి చాలామంది అడుగుతారు. వృత్తిగత, వ్యక్తిగత జీవితాల మధ్య గ్యాప్‌ ఉండటానికి మేం కలిసి పనిచేయకూడదని నిర్ణయించుకున్నాం. పిల్లలు ఎప్పుడు అని సన్నిహితులు అడుగుతుంటారు. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే!
* నేను పుట్టిపెరిగింది చెంబూరులో. నా పెళ్లి అయ్యేంత వరకూ అదే ప్రాంతంలో ఉన్నాను. అక్కడ మాకో సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ ఉండేది.
ఈ మధ్యనే అది అమ్మేశాం. ఆరోజు నేను బాగా ఏడ్చేశాను. ఎందుకంటే నా జీవితంలో ఎక్కువ కాలం ఉన్నది ఆ ఇంట్లోనే.
* వేడుక ఏదైనాసరే చీరలో వెళ్లడానికే ఇష్టపడతాను. చాలామంది నన్ను చీరకట్టుకే ట్రేడ్‌మార్క్‌ అంటారు.
* నటి ప్రియమణి నాకు కజిన్‌.
* ఇంట్లో తమిళం, మలయాళం మాట్లాడుకుంటాం. నాకు హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ భాషలూ వచ్చు.
* ప్రస్తుతం తమిళంలో ‘పింక్‌’ రీమేక్‌లో నటిస్తున్నాను.
* నేను పనిచేసిన సినిమా షూటింగ్‌ ఆఖరి రోజున తోటి నటులకు బహుమతులు ఇవ్వడం అలవాటు. అది ఒక విధంగా వాళ్లకి థ్యాంక్స్‌ చెప్పడమే.