Actor Mohanlal

…నేను నేర్చుకున్నది అదే
...నేను నేర్చుకున్నది అదే

గుర్తుందా? అప్పుడు ‘యోధ’ సినిమాలో ‘అక్కసోటో’ అని ముద్దుముద్దుగా పిలిపించుకున్న నటుడు… ఇప్పుడు ‘జనతాగ్యారేజీ’లో, మన్యంపులిలో నట విశ్వరూపం చూపిస్తూ ‘ది కంప్లీట్‌ మేన్‌’ అయ్యారు. అయినా మోహన్‌లాల్‌ ఊరికే కంప్లీట్‌ మ్యాన్‌ అవ్వలేదు. ఖాళీ దొరికితే సేవచేస్తారు. తీరిక దొరికి మనసు స్పందిస్తే అనేక విషయాలపై అలవోకగా బ్లాగులు రాస్తారు. నటనకోసం పదేళ్లు నేర్చుకోవాల్సిన కథాకళిని ప్రాణాలన్నీ పెట్టి నెలరోజుల్లోనే నేర్చుకున్నారు. అదీ ఆయన సత్తా… ‘హాయ్‌’ అంటూ మాట కలిపితే  ఎన్నో విషయాలపై మనసువిప్పారు…
* వైఫల్యాలు లేకుండా సినీజీవితం, సవాళ్లు లేకుండా జీవితం ఉండవు కదా! మరి మీ జీవితంలో గెలుపుఓటములని ఎలా ఎదుర్కొన్నారు?
హ్హ..హ్హ మొదటే ఇంత కఠినమైన ప్రశ్నా? నాది నలభై ఒక్క సంవత్సరాల సినీ జీవితం. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో వృత్తిపరంగా ఎన్నో విజయాలు చూశాను. అలాగే వైఫల్యాలని కూడా. అయితే ఒకమాట, వైఫల్యాలని  ఎదుర్కోవడం, విజయాలని ఆస్వాదించడంలోనూ ఒకటే తీరునాది. విజయం కోసం మరీ ఎక్కువగా పరితపించిపోను. అలాగని గెలుపు వచ్చినప్పుడు అంతా నావల్లే అనుకోను. అథ]ఃపాతాళంలో ఉన్నప్పుడూ, గెలుపు పలకరించినప్పుడు నాది ఒకటే తీరు. ఈ అలవాటు ఇప్పటిదికాదు. సినీ జీవితంలో అడుగుపెట్టినప్పుడే నేర్చుకున్నాను. కానీ ఒక సినిమా 365 రోజులు ఆడాలని చాలా బలంగా  అనుకుంటాను.
* మీరు సినిమాల్లోకి వచ్చి నలభై సంవత్సరాలవుతుంది కదా.. వందల సినిమాల కోసం పనిచేశారు. ఈ ప్రయాణంలో ఎలాంటి మార్పులని గమనించారు? ...నేను నేర్చుకున్నది అదే
నేను గమనించిన అతిపెద్ద మార్పు సాంకేతిక విప్లవమే. దాని కారణంగానే సినీ నిర్మాణంలో ఊహించని విధంగా గొప్ప సినిమాలు వచ్చి చరిత్ర సృష్టించాయి.  అక్కినేని,  శివాజిగణేశన్‌, రాజ్‌కుమార్‌ వంటి వాళ్లతో పనిచేయడం గొప్ప అనుభవం. వాళ్ల వల్లే నేనింతటి వాడిని అయ్యానేమో! అంకిత భావంతోనే పెద్ద బడ్జెట్‌ సినిమాలని నిర్మించాం. అలాంటి సినిమాలు తీయగలమని అనుకోలేదు.  మలయాళం సినిమా ఎదుగుతోంది. తెలుగు, తమిళ సినిమాలు ఎదుగుతున్నట్టుగానే. చక్కని ఎక్స్‌పోజర్‌ అందుతోంది. గతంతో పోలిస్తే ప్రింట్‌, సోషల్‌ మీడియా నటీనటులకి పెద్ద బలంగా మారాయి. సినిమాలని విస్తృతంగా ప్రచారం చేసుకోడానికి ఉపయోగపడుతున్నాయి.
* ‘యోధ’ మొదలుకుని ‘ఒడియన్‌’ వరకూ నటుడిగా కొన్ని తరాల వారిని మీరు ప్రభావితం చేశారు కదా! ఇప్పటి తరం నటులకు ఏం చెబుతారు?
నా జీవితంలో ఎంతో మంది లెజెండ్స్‌ని చూశాను. వాళ్ల కమిట్‌మెంట్‌నీ దగ్గరగా చూశాను. పరిశ్రమని వాళ్లు గౌరవించే విధానం కూడా చూశాను. మనం ఎదగడం ఎంత ముఖ్యమో ఎదుటివారిని గుర్తించి, గౌరవించడం కూడా అంతే ముఖ్యం అని వాళ్ల నుంచే నేర్చుకున్నాను. ‘మైండ్‌ ఫుల్‌నెస్‌’ అనేపదం బాగా నచ్చుతుంది. నా హృదయానికి దగ్గరగా ఉండే పదం అది. ఒక్క నటనలోనే కాదు జీవితంలోనూ అది చాలా అవసరం.
* అక్కినేని నాగేశ్వరరావువంటి  మహా నటులతో చేశారు. వారి నుంచి మీరు ఏం గ్రహించారు?
వాళ్ల నుంచి ప్రేమించడం నేర్చుకున్నాను. అలాగే హస్యచతురత కూడా. వాళ్లతో దగ్గరగా పనిచేసే వాళ్లకు మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయేమో! నాకా అదృష్టం దక్కింది. చాలా నిరాండంబరంగా డౌన్‌టు ఎర్త్‌గా ఉండే వ్యక్తి ఆయన. వాళ్లలో వృత్తిపట్ల నిబద్ధతని గమనించాను. ఇక్కడా నేనా మైండ్‌ఫుల్‌నెస్‌ని గమనించాను. హృదయపూర్వకంగా పనిచేయడం ఎలానో నేర్చుకున్నాను. నేను తర్వాత తరానికి కూడా అలాగే ఉండమని చెబుతాను.
* మైండ్‌ఫుల్‌నెస్‌ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు. మీరు జీవితాన్ని ఆధ్యాత్మికంగా చూస్తారా?
ఆధ్యాత్మికత అనేపదాన్ని, జీవితాన్ని వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదు. మీరు చేసే డ్యాన్స్‌లో, పాడుతున్నప్పుడు, అన్నింటిలోనూ ఆ ఆధ్యాత్మికత ఉంటుంది. ఇక్కడా నేను ఆ మైండ్‌ఫుల్‌నెస్‌ అనే విధానాన్నే పాటిస్తాను. సింపుల్‌గా చెప్పాలంటే చేసే ప్రతి పనిలోనూ ఆధ్యాత్మికత ఉంటుంది. దాన్నే మనసా, వాచా, కర్మణా ఆచరించడం అనుకుందాం. దాన్నర్థం చేసుకుంటే జీవితంలో విజయాలు సాధారణ విషయాలవుతాయి.

...నేను నేర్చుకున్నది అదే
* మీ అబ్బాయి గురించి..?
మా అబ్బాయి ప్రణవ్‌ ఆస్ట్రేలియాలో ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేశాడు. మా సొంత నిర్మాణ సంస్థనే చూసుకుంటున్నాడు. డైరెక్షన్‌ అంటే ఇష్టం. అందుకే మొదట దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు. కొన్ని చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
* దక్షిణాదిన వస్తున్న చిత్రాల్లో బడ్జెట్‌పరంగా, సాంకేతికంగా ఉన్నతంగా ఉంటున్నాయి కానీ… కథ, కథనాల పరంగా ఉన్నతంగా ఉండటం లేదని ఓ విమర్శ ఉంది. అది నిజమేనా?
నా కొత్త సినిమా ‘ఓడియన్‌’ తీసుకోండి. అది పెద్ద బడ్జెట్‌ చిత్రం. అందులో సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు పాటించాం. అలాని నేలవిడిచి సాము చేయలేదే. కుటుంబం, విలువలు, స్థానికత వంటి విషయాలకే పెద్ద పీట వేశాం. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని దాంతోనే అద్భుతాలు చేయాలని అనుకోలేదు. ఒక సినిమాకి ఈ రెండూ సమపాళ్లలో ఉంటేనే విజయం సాధిస్తుంది. ఇప్పుడొస్తున్న కొన్ని చిత్రాలు అలా ఉన్నమాట నిజమైనా ఒక మంచి పాట, మంచి సంగీతం, మంచి సన్నివేశం… అన్నిటికీ మించి పట్టి నిలిపేసే ఎమోషన్‌ చిత్రానికి ప్రాణప్రదాలే. రెండున్నర గంటలు పాఠకుడిని కట్టిపడేయడం పక్కా స్క్రీన్‌ప్లేతోనే సాధ్యం. అయితే ఇప్పుడు అన్ని సాంకేతిక హంగులను వాడుకుంటూనే చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో ఎన్నో గొప్పవి ఉంటున్నాయి.
* కష్టం అనిపించిన పాత్ర ఏదైనా ఉందా?
ఏది కష్టం అనిపించలేదు. శారీరకంగా కష్టమనిపించినవి ఉన్నాయి కానీ… నటనాపరంగా కష్టం అనిపించనవి అయితే లేవు.
* డ్రీమ్‌రోల్‌?
లేదు.
* వానప్రస్థం సినిమాలో కఠినతరమైన కథాకళిని నెలరోజుల్లో నేర్చుకున్నారు కదా! కష్టం అనిపించలేదా? ఏళ్లు తరబడి సాధన చేయాల్సిన నాట్యాన్ని అంత తక్కువ రోజుల్లో ఎలా నేర్చుకున్నారు?
సినిమాలో ఆ పాత్ర డిమాండ్‌ చేసినప్పుడు అదెంత కష్టం అనే విషయాన్ని నేను ఆలోచించలేదు. ఆ పాత్రకు న్యాయం చేయాలంటే చేయక తప్పనిసరి పరిస్థితి.
* వానప్రస్థంలో మీ నటవిశ్వరూపం చూసిన  ఓ విదేశీ నటుడు మీరు ఏ అమెరికాలోనో, యూరోప్‌లోనో పుడితే ఆస్కార్లన్నీ ఇతనికే సొంతమయ్యేవి అన్నారట. నిజమేనా?
పొగడ్త నిజమే. కానీ నాకు ఈ దేశంలో పుట్టడం, ఇక్కడ నటుడిగా రాణించడం మాత్రమే ఇష్టం.   తక్కినవన్నీ నాకనవసరం
* మీటూ గురించి ఏం చెబుతారు?
చెప్పడానికేం లేదు.

లాల్‌స్టోర్‌అభిమాన నటుడి సంతకం, అతని ముఖచిత్రంతో ముద్రించిన టీషర్టు, ఆయన ఇష్టంగా చెప్పిన ఊసులు, ఆయన వేసుకున్న దుస్తులు, ఆయనపై రాసిన పుస్తకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ అభిమానం వృథాపోకుండా ‘లాల్‌స్టోర్‌’ అనే ఈకామర్స్‌ సైట్‌ ద్వారా అభిమానుల ద్వారా అందించిన సొమ్ముని సేవకార్యక్రమాలకు మళ్లిస్తున్నారు మోహన్‌లాల్‌. ఆయనపై రాసిన పుస్తకాలని ఈ సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.
...నేను నేర్చుకున్నది అదేదృశ్యం చిత్రాన్నే చూడండి. మా ప్రొడక్షన్‌లో మలయాళంలో తీశాం. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఇది రీమేక్‌ చేశారు. ప్రతి భాషలోనూ ఇది విజయవంతమైంది. దానికి కారణం ఈ చిత్రంలో ఉన్న విషయం. సింహళ భాషలో అనువదించి దీన్ని శ్రీలంకలో విడుదల చేస్తే అక్కడా మంచి విజయం సాధించింది. హిందీలో అజయ్‌దేవగన్‌, తమిళంలో కమల్‌, తెలుగులో వెంకటేష్‌ చేశారు. ప్రతి వాళ్లూ ఆ పాత్రకు న్యాయం చేశారు.


ఇప్పుడొస్తున్న కుర్రాళ్లనే చూడండి. ప్రతివాళ్లూ వాళ్ల ప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగులో నేను జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఒక చిత్రం చేశాను. ఆయన ఎప్పుడూ వంద శాతం ప్రతిభ చూపడానికి ప్రయత్నిస్తారు.


ఒకప్పుడు నాకు సంగీతం అంటే ప్రత్యేకమైన ఆసక్తి. ఆ ఆసక్తితోనే ‘లాలిజమ్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ నిర్వహించేవాడిని.


కొన్నాళ్లు కేరళలో అవయవదానానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా పనిచేశాను. నేను కూడా నా కళ్లను దానం చేశాను.


నాకు రాత అంటే ఇష్టం. బ్లాగులు రాయడం అంటే చాలా ఇష్టం. ఐదేరాళ్లుగా బ్లాగులు రాస్తున్నాను. ట్రావెలాగ్స్‌ని ఇష్టంగా రాస్తాను. ‘యాత్ర’ పేరుతో రాస్తున్నాను.


నా పనిని నేను ఇష్టపడుతూ ఎంజాయ్‌ చేస్తూ పనిచేస్తాను. అదే నాకు ఇంధనం. ఆ ఇష్టం పోతే నేను ఆ పనిని ఆపేస్తాను.


నాది మీలాంటి జీవితమే. మీరేం చేస్తారో నేనూ అదే చేస్తాను. నేనో సెలబ్రిటీని కాబట్టి దానికి  తగ్గట్టుగా ఉండాలని అనుకోను.


...నేను నేర్చుకున్నది అదే
దర్శకుడు చెప్పింది చేయడం.. నటుడిగా  వంద శాతం ఇవ్వడం, ఆ చిత్రం విజయవంతమవడం అనేక ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే విజయం రావాలని కోరుకుంటానుగానీ, అపజయానికి కుంగిపోవడం ఉండదు.


కొత్తవాళ్లకయినా, పాతవాళ్లకయినా నేను చెప్పేదొకటే. వృత్తి విషయంలో మీకెంత అంకితభావం ఉందో ప్రశ్నించుకోండి.


నా సంతోషమే నా ఫిట్‌నెస్‌ రహస్యం.


డైరెక్టర్‌, నటుడికి మధ్య కమిట్‌మెంటే ఆ సినిమా భవిష్యత్తుని నిర్దేశిస్తుంది.

– శ్రీ సత్యవాణి గొర్లె, ఎం.రవికుమార్‌
– చిత్రాలు: సతీష్‌లాల్‌