Hero Gopichand

మా కోసం నాన్న స్కూలే పెట్టారు
‘కష్టం తెలిసిన మనిషి… కసితో పెరిగినవాడు గోపీచంద్‌’.

మా కోసం నాన్న స్కూలే పెట్టారు

– దర్శకుడు పూరి జగన్నాథ్‌.

ఈ మాటలు చాలు గోపీచంద్‌ జీవితం… అతనెదుర్కొన్న కష్టాలు… అనుభవించిన బాధలు చెప్పడానికి… ఎనిమిదేళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు గోపీచంద్‌. ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. సినిమాలే వద్దనుకున్న అతను అన్నయ్య మరణంతో ఇటువైపు అడుగులేశాడు. ప్రతినాయకుడిగా, నాయకుడిగా ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాడు. తన తండ్రి, దర్శకుడు టి.కృష్ణ పేరును నిలబెట్టే తనయుడనిపించుకున్నాడు. నాన్న తమ కోసమే ఏర్పాటుచేసిన స్కూల్‌… రష్యాలో పార్ట్‌టైం ఉద్యోగం, శ్రీకాంత్‌తో బంధుత్వం, ప్రభాస్‌తో స్నేహం… ఇలా అనేక  విషయాలు ‘హాయ్‌’తో పంచుకున్నాడు.
* మీ బాల్యం ఎలా గడిచింది? ఎక్కడ చదువుకున్నారు?
పుట్టింది నేను టంగుటూరు పక్కన, కాకుటూరువారి పాలెంలో. మా తాతయ్య పొగాకు వ్యాపారం చేసేవారు. నాన్నదీ అదే ఊరు. అక్కడే పెళ్లి చేసుకొని, తాతయ్యలాగే పొగాకు ఎగుమతి వ్యాపారం చూసుకొనేవారట. తర్వాత సినిమాలపై ఆసక్తితో చెన్నై వెళ్లారు. దాంతో మమ్మల్ని చదువు కోసం ఎక్కడ చేర్పించాలా అని చాలాచోట్ల ఆరా తీశారు. చెన్నైలో ఎక్కడా నచ్చకపోవడంతో మా కోసమని ఒంగోలులో నిల్‌ డిస్పరాండమ్‌ పేరుతో ఓ స్కూల్‌ పెట్టారు. చెన్నై నుంచి డి.కోమలం అనే ప్రిన్సిపాల్‌నీ తీసుకొచ్చారు. నిల్‌ డిస్పరాండమ్‌ అనేది ఫ్రెంచ్‌ పదం. నిరాశపడొద్దు అనేది దానర్థం. ఒంగోలు, టంగుటూరు చుట్టుపక్కలున్న నాన్నగారి స్నేహితుల పిల్లలు, మిగతావాళ్లు ఆ స్కూల్‌లో చదువుకొనేవాళ్లు. స్కూల్‌తో పాటు, హాస్టల్‌ ఉండేది. నేను, మా అన్నయ్య, మా చెల్లెలు.. ముగ్గురం అక్కడే చదువుకొన్నాం. ఆ జీవితమే వేరుగా ఉండేది. మూడో తరగతి అయ్యాక, నాన్న ‘నేటి భారతం’ తీశారు. తర్వాత చెన్నై వెళ్లాం. అక్కడ రామకృష్ణ మిషన్‌ స్కూల్‌లో మా చదువు సాగింది. అక్కడి నుంచే నేను రష్యా వెళ్లా. మా చెల్లెలు బీడీఎస్‌ చేసింది. మా నాన్న ఏర్పాటు చేసిన నిల్‌ డిస్పరాండమ్‌ స్కూల్‌ ఇప్పుడూ ఉంది. నాన్న స్నేహితులు ఆ స్కూల్‌ని నిర్వహిస్తున్నారు.
* సినిమాల్లో నటించాలనే కోరిక ఎప్పుడు పుట్టింది?
నాకైతే ఆ ఆలోచనే ఉండేది కాదు. చదువు అవ్వగానే వ్యాపారం చేయాలనుండేది. మా అన్నయ్య ప్రేమ్‌చంద్‌ నాన్నబాటలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నాన్న పేరు నిలబెట్టేందుకు అన్నయ్య ఉన్నాడు కదా అనుకొనేవాణ్ని. దాంతో నా ఆలోచనలు చదువుపైనే ఉండేవి. కానీ మా అన్నయ్య అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోయారు. దాంతో సినిమా రంగంలో ఎవరో ఒకరు ఉండాలనుకొన్నాం, నాన్న పేరు నిలబెట్టాలనుకొన్నాం కదా అనే ఆలోచన వచ్చింది. అప్పుడే నేను సినిమా రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నా. అదే విషయాన్ని మా నాన్నకి మంచి మిత్రుడు, నాకు చిన్నప్పట్నుంచి తెలిసిన నాగేశ్వరరావు మావయ్యకి చెప్పా. అన్నయ్యకి అలా జరిగింది కదా, మళ్లీ నువ్వెందుకని ఆయన భయపడ్డారు. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గరికి వెళితే, నన్ను చూసి ‘బాగున్నాడు కదా, సినిమా చేద్దాం’ అన్నారు. దాంతో మా నాన్నకి స్నేహితులైన నాగేశ్వరరావు, తిరుపతిరావు, హనుమంతరావు కలిసి నాతో ‘తొలివలపు’ నిర్మించారు. అన్నయ్య మరణం తర్వాత కుటుంబమంతా అండగా నిలిచింది. నేను నటుడిగా నిలదొక్కుకున్నా. చెల్లెలికి పెళ్లి చేశాం.
* శ్రీకాంత్‌, మీరూ బంధువులయ్యారు కదా. అప్పటికీ, ఇప్పటికీ మీ మధ్య అనుబంధంలో మార్పులేమైనా వచ్చాయా?
తొలి సినిమా కోసం హైదరాబాద్‌ వచ్చినప్పట్నుంచే నాకు శ్రీకాంత్‌గారు తెలుసు. ముత్యాల సుబ్బయ్యని కలవడానికి వెళ్లినప్పుడు రామానాయుడు స్టూడియోలో శ్రీకాంత్‌గారు పరిచయమయ్యారు. తన గురించి అప్పటిదాకా వినడమే. ఆ పరిచయం తర్వాత తెలిసింది ఆయన ఎంత మంచి వ్యక్తో. లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరొకలా మాట్లాడే రకం కాదు. ఆయన బంధువు కాకముందు ఎలా ఉండేవారో, ఇప్పుడు కూడా అంతే. మార్పేమీ లేదు. కాకపోతే ఇప్పుడు బంధువులం కాబట్టి ఎక్కువగా కలుస్తుంటాం. శ్రీకాంత్‌ సోదరి కూతురే నా భార్య రేష్మ. ఇంట్లో నాకూ, రేష్మకీ మధ్య సినిమాకి సంబంధించిన చర్చలు తక్కువే. కలిసి బాగా సినిమాలు చూస్తుంటాం, తను సెట్‌కి తరచుగా వస్తుంటుంది. అయితే సినిమా గురించి మరీ లోతుగా తెలియదు. నా సినిమాలో ఏది బాగుందో, ఏది బాగోలేదో చెబుతుంటుందంతే.
* మీరు విదేశాల్లో చదువుకుంటున్నప్పుడు డబ్బుకి ఇబ్బంది పడిన రోజులేమైనా ఉన్నాయా?
డబ్బుకి లోటుండేది కాదు కానీ… ప్రతిసారీ ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడం సరైంది కాదనిపించేది. మాదాల రంగారావుగారి అబ్బాయిలు రష్యాలో ఉంటూ వ్యాపారం చేసేవాళ్లు. వాళ్ల దగ్గరే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తూ నా ఖర్చులకి సరిపడేలా డబ్బు సంపాదించేవాడిని. రంగారావుగారి అబ్బాయిలు నన్ను చాలా బాగా చూసుకొనేవాళ్లు.
* మీ అబ్బాయి విరాట్‌కృష్ణ ఏం చేస్తున్నాడు?
వాడికి యాక్షన్‌ సినిమాలంటే బాగా ఇష్టం. ఎప్పుడూ నా సినిమాల్ని చూస్తూ, అలా ఫైట్లు చేయాలని ప్రయత్నిస్తుంటాడు. నువ్వు అక్కడ అలా కొట్టావు కదా, నేను కూడా నిన్ను కొడతా అంటూ నాపైనే ప్రయోగాలు చేస్తుంటాడు. ‘అది సినిమా నాన్నా.. బయట  అలా చేయకూడదు’ అని చెబుతుంటా (నవ్వుతూ). వాడితో గడుపుతున్నంతసేపూ సమయమే గుర్తుకు రాదు. బయట ఎన్ని ఒత్తిళ్లున్నా ఇంటికెళ్లాక వాడితో ఆడుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది.

ఒక్క సినిమా తప్ప…కథ విన్నప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది. సినిమా చేసేటప్పుడు మరొక రకమైన నమ్మకం కలుగుతుంది. ఇక డబ్బింగ్‌ థియేటర్లో సినిమా భవితవ్యం దాదాపు తెలిసిపోతుంటుంది. నేను చేసిన సినిమాల్లో ఒక్కటి తప్ప, అన్నీ నేను ఊహించినట్టే ఫలితాలు తీసుకొచ్చాయి. ఆ ఒక్క సినిమా ‘గౌతమ్‌ నందా’. అది ఆడకపోవడానికి వేరే కారణాలున్నాయి.
నేను నాలాగే ఉంటా‘‘చిన్నప్పట్నుంచీ నేను సిగ్గరిని. అది ఎప్పటికీ పోదు. కొద్దిమంది చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. నా దృష్టిలో అదొక కళ. నాలాంటి వాళ్లు అలా ఉండటానికి ప్రయత్నించారనుకో, నటిస్తున్నట్టే ఉంటుంది తప్ప సహజంగా ఉండదు. అందుకే నేను నాలాగే ఉంటా. ఎదుటివాళ్లతో చనువు ఏర్పడేంతవరకు కాస్త బెరుగ్గానే ఉంటుంది. చనువు  ఏర్పడిందంటే ఇక వాళ్లతో మాట్లాడుతూనే ఉంటా.  కథానాయికలతో కూడా ఒకట్రెండు రోజుల్లో కలిసిపోతుంటా.
కావాల్సింది కథే..‘‘నేను దర్శకుడిని నమ్ముతా. అదీ కథ చెప్పాకే. చివరికి నాకు కావల్సింది కథే. ఎవర్నయినా ఆ కథే తీసుకెళుతుంది. ‘నువ్వు కథలు మరీ ఎక్కువ అడుగుతుంటావ’ని అంటుంటారు. ఈ రోజు అడగటం వల్ల ఎదుటివాళ్లు ఫీల్‌ అయితే అవ్వొచ్చు. రేపు అతణ్ని, నన్నూ కాపాడేది ఆ కథే కదా! ఒక్కసారి కథ ఒప్పుకొన్నాక, కథ చదివేసుకొన్నాక సెట్లో దర్శకుడితో స్క్రిప్టు గురించి కానీ, సన్నివేశాల గురించి కానీ మళ్లీ మాట్లాడను. దర్శకుడు ఏం చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోతుంటా. ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను. నాతో సినిమా చేసే దర్శకుడికి అంత స్వేచ్ఛ ఉంటుంది. వాళ్లకీ తీస్తున్న సినిమా జీవితంతో సమానం కదా. అందుకే వాళ్లు ప్రాణం పెట్టి పనిచేస్తారు’’.
రోజు సరిపోదు‘‘చిత్రీకరణ లేని రోజులంటే ఖాళీ అనే అనుకుంటారంతా. కానీ నాకు ఆ రోజు ఏ మాత్రం సరిపోదు. నాకు సంబంధించిన పనుల్ని స్వయంగా చేసుకోవడమే మొదట్నుంచీ అలవాటు. ఒకరిపై ఆధారపడటం ఇష్టం ఉండదు. ఈ రోజు నేను ఆధారపడటం మొదలుపెట్టానంటే రేపన్న రోజున నాకేమీ తెలిసే అవకాశం ఉండదు. అసలు మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే వీలైనంతవరకు నా పనుల్ని నేనే చూసుకుంటా. నేను చేయలేనివి ఒకట్రెండు పనులేమైనా ఉంటే పక్కవాళ్లకి చెబుతుంటా’’.
ప్రభాస్‌ నేనూ కలిస్తే…‘‘చిత్ర పరిశ్రమలో నాకు బాగా సన్నిహిత మిత్రుడంటే ప్రభాసే. తనకీ నాలాగా సిగ్గు ఎక్కువ. కానీ ప్రభాస్‌ నాకంటే బాగా మాట్లాడతాడు. మేం స్నేహితులం కాబట్టి ఎప్పుడూ కలుస్తూనే ఉంటారనుకుంటారు. మేం కలవడానికి ఒక్కోసారి నెల పట్టొచ్చు, నాలుగు నెలలు పట్టొచ్చు. ఎక్కువగా ఫోన్‌లోనే మాట్లాడుకుంటాం. మా ఇద్దరికీ కుదిరిన రోజు, కలిసి కూర్చున్నామంటే ఇక సమయం తెలియదు. ఒకొక్కసారి రాత్రి మొత్తం గడిచిపోతుంటుంది. మా మధ్య కబుర్లు ఎక్కువగా సినిమాల గురించే. తను ట్రూ హార్టెడ్‌ పర్సన్‌. నేను మొదటిసారి తనని చూసింది వాళ్ల ఆఫీసులో. జూబ్లీహిల్స్‌ క్లబ్‌కి  ఎదురుగా కృష్ణంరాజుగారి ఆఫీసు ఉండేది. ‘తొలివలపు’ ఫ్లాప్‌ అయ్యాక అక్కడికి వెళితే ప్రభాస్‌ కనిపించాడు. చూడగానే పెద్ద హీరో అవుతాడనిపించింది. అప్పుడే మేం స్నేహితులం అయ్యాం కానీ, ‘వర్షం’ సినిమాతో మా మధ్య అనుబంధం పెరిగింది. మా ఇద్దరికీ మళ్లీ కలిసి సినిమా చేయాలని ఉంది కానీ.. అందుకు తగ్గ కథ కుదరాలి కదా’’.
ఆ రుచి దేనికుంది?‘‘కొత్త కొత్త రుచులంటూ రెస్టారెంట్లకి వెళ్లి ఏవేవో ఆర్డర్‌ చేస్తాం. కానీ అక్కడ ఎన్ని తిన్నా… ఇంటికొచ్చి పప్పులో మామిడికాయ పచ్చడి, నెయ్యి వేసుకొని తిన్నంత రుచి దేనికైనా వస్తుందా? అందుకే ఇంటికి రాగానే అమ్మతో అవన్నీ పెట్టించుకొని తినాల్సిందే, కడుపు నింపుకోవల్సిందే. అలా ఎప్పటికైనా మన సంస్కృతి విలువేంటో తెలుసుకోవల్సిందే, తిరిగిరావల్సిందే. మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి. విదేశాల్లోనూ మన భారతీయత గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతి మాయలో పడి మన గొప్పతనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. కొంతమందికి తెలిసొస్తోంది ఆ విలువేంటో’’.
* మీ నాన్న టి.కృష్ణ కమ్యూనిజం భావాలతో సినిమాలు చేశారు కదా. ఆయన ప్రభావం మీపై ఎంత వరకు ఉంటుంది?
నిజంగా కమ్యూనిజం గురించి నాకు లోతుగా తెలియదు. ఇప్పటికీ కమ్యూనిజం గురించి నాకు నేను అనుకొనేదొక్కటే. ప్రతి ఒక్కరూ సమానమే అని. ఉన్నవాడి దగ్గర ఒకలాగా, లేనివాడి దగ్గర ఒకలాగా ఉండటం, ఒకొక్కరితో ఒకలాగా మాట్లాడటం నాకు నచ్చదు. నాన్నని చూసి నేర్చుకొన్నదంటే అదే. డబ్బు ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది. మనుషులు అలా కాదు, ఉన్నవాళ్లని వదులుకోకూడదు.
* నాన్న బాటలో దర్శకత్వం వైపు వెళ్లాలని ఎప్పుడూ అనిపించలేదా?
దర్శకత్వం అంటే చాలా కష్టమైన పని. అన్ని క్రాఫ్ట్‌లతోపాటు, భాషపైనా పట్టుండాలి. నాకు అంత లేదని తెలుసు. దర్శకత్వంతో పోలిస్తే నటనే సులభం అనిపించింది. అందుకే అటువైపు వెళ్లే ఆలోచన చేయలేదు. మా అన్నయ్య దర్శకుడు కావాలనుకున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉండగానే ఆయన చనిపోయారు. అప్పటికి నేను రష్యాలో ఉన్నా. వీసా సమస్యలతో ఆయన్ని చివరిచూపూ చూడలేకపోయా. అన్నయ్య మరణం నన్ను బాగా కుంగదీసింది. నెల రోజులు కాలేజీకి కూడా వెళ్లలేదు. ఇప్పటికీ మా అన్నయ్యని  చాలా చాలా మిస్‌ అవుతుంటా. మేమిద్దరం స్నేహితుల్లాగే ఉండేవాళ్లం. నాకూ తనకీ మధ్య రెండేళ్ల వయసే తేడా. నా తర్వాత చెల్లి. నన్ను స్కూల్‌కి తన సైకిల్‌మీదే తీసుకెళ్లేవాడు అన్నయ్య. తన స్నేహితులంతా నాకూ స్నేహితులే.