Heroine Priyadarshini (Hello)

ఎప్పటికైనా డైరెక్షన్‌ చేస్తా!
 

2017లో ‘హలో’ అంటూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కల్యాణి ప్రియదర్శన్‌. అమ్మాయి బావుంది, బాగా చేసింది అనుకున్నారంతా. ఆమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌, అలనాటి నటి లిజీల తనయ అని ఆ తర్వాతే తెలిసింది. తాజాగా ‘చిత్రలహరి’లో లహరిగా మరోసారి నటిగా మార్కులు కొట్టేసింది. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన కెరీర్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఇలా బదులిచ్చింది…

సినిమా మీ జీవితంలోకి ఎప్పుడొచ్చింది?
చిన్నప్పుడు స్కూల్‌కి సెలవులొస్తే నాన్నతోపాటు షూటింగ్‌కి వెళ్లిపోయేదాన్ని. నాన్న చాలా బిజీ డైరెక్టర్‌. ఏడాది పొడుగునా సినిమాలు చేసేవారు. సెట్‌లో నాన్న తన పనిని చాలా ఎంజాయ్‌ చేస్తారు. నేను కూడా రోజంతా ఆడుతూపాడుతూ టైమ్‌పాస్‌ చేసేదాన్ని. ‘సెలవులు అయిపోయాయి. మళ్లీ స్కూల్‌కి వెళ్లాలి’ అంటే, అప్పుడే అయిపోయాయా అనుకునేదాన్ని. కాస్త పెద్దయ్యాక అమ్మ సినిమాల్ని టీవీలోనే ఎక్కువగా చూశాను. అలా చిన్నప్పట్నుంచీ సినిమా నా జీవితంలో భాగం అయిపోయింది. సినిమాలంటే ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది.

ఏం చదువుకున్నారు?
సినిమాల్లోకి వెళ్తానని తెలుసు. కానీ ఏ విభాగంలో అన్న క్లారిటీ లేదు. ‘ముందు బాగా చదువుకో. చదువుద్వారానే నీకు మిగిలిన వాళ్లకంటే భిన్నంగా, ఉన్నతంగా ఆలోచించే సామర్థ్యం వస్తుంది’ అని చెప్పేవారు నాన్న. సింగపూర్‌లో చదువుకుంటూనే నాటకరంగానికి సంబంధించిన కోర్సునీ చేశాను. అక్కడే యాక్టింగ్‌, డైరెక్షన్‌ రెంటినీ నేర్చుకున్నాను. తర్వాత న్యూయార్క్‌ వెళ్లి పార్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌ నుంచి ఆర్కిటెక్చర్‌ కోర్సు చేశాను. అక్కడ రంగస్థల సంస్థ ‘బ్రాడ్‌వే’ ఆధ్వర్యంలో ప్రదర్శించే నాటకాల్లో తెరవెనక పాత్ర పోషించాను. అప్పటికీ నా సినిమా కెరీర్‌ ఏ విభాగంలో అన్న క్లారిటీ లేదు. అమెరికా నుంచి ఇండియా వచ్చాకే యాక్టింగ్‌వైపు వెళ్లాలనుకున్నాను. మనిషి కదలికల్ని బట్టి డిజైన్‌ ఉండాలని ఆర్కిటెక్చర్‌ చెబుతుంది. అలాగే సినిమాలోని నా పాత్రని బట్టి నా బాడీ లాంగ్వేజ్‌, డ్రెస్సింగ్‌ అన్నీ ఉండేలా చూసుకుంటాను. ఆ విధంగా నా చదువు నాకు ఉపయోగపడుతోంది.

సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నాది సున్నిత స్వభావం. ఎవరైనా విమర్శిస్తే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునే రకం. అందుకే నా స్వభావానికి యాక్టింగ్‌ సరిపోదు అనుకునేదాన్ని. సినిమా ప్రపంచానికి దగ్గరగా పెరిగినదాన్ని కాబట్టి సినిమాలకి దూరంగా ఉండలేను. అందుకని తెరవెనక ఏదైనా విభాగాన్ని ఎంచుకోవాలనుకున్నాను. అమెరికాలో డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నపుడు ఆర్ట్‌ డైరెక్షన్‌ వైపు వెళ్దామనుకున్నాను. నాన్నా, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ మంచి స్నేహితులు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కూడా. అందుకే సిరిల్‌ అంకుల్‌కి సహాయకురాలిగా ‘క్రిష్‌ 3’, ‘ఇరుముగన్‌’ సినిమాలకి పనిచేశాను. అలా సినిమాల్లో ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో అరంగేట్రం చేశాను.

తెరమీదకు రావాలన్న నిర్ణయం?
మొదట్నుంచీ అమ్మానాన్న నాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ పెంచారు. ఎప్పుడూ ‘ఇది చెయ్యి, అది చెయ్యకు’ అని చెప్పలేదు. ఏదైనా విషయం గురించి వాళ్ల అభిప్రాయం చెబుతారు కానీ, నేను ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తారు. ఇక నేను తెరమీద కనిపిస్తే ప్రేక్షకులు నా నటనని మొదటిరోజు నుంచీ అమ్మా, నాన్నల సామర్థ్యంతో పోలుస్తారు. అలాంటపుడు వచ్చే విమర్శల్ని తట్టుకోలేనేమో అన్న సందిగ్ధంలోనే చాన్నాళ్లు ఉండిపోయాను. కొన్నాళ్లు ఆలోచించాక ‘ఈ ఒక్క విషయమే నన్ను ఆపుతోంది. దాన్ని పక్కనపెట్టి పనిచేస్తా’ అనుకున్నాను. ఆ తర్వాత నాన్నతో విషయం చెప్పాను. నాన్న సినిమా ద్వారా నేను పరిచయం కావొచ్చు. కానీ నేను సొంతంగా అవకాశం  తెచ్చుకుంటే, అది నాకూ, పరిశ్రమకీ కూడా మంచిదన్నారు.

‘హలో’ ఛాన్స్‌ ఎలా?
తెలుగు సినిమా ద్వారా పరిచయం అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. నేను మలయాళీని. చెన్నైలో చదువుకోవడంవల్ల తమిళం కూడా తెలుసు. ఈ రెండు పరిశ్రమల్లో ఏదో ఒకచోట అరంగేట్రం చేస్తే బావుంటుందన్న ఆలోచన ఉండేది. ‘హలో’ దర్శకుడు విక్రమ్‌కుమార్‌ కథ చెప్పాక నో చెప్పడానికి నాకు కారణం దొరకలేదు. అంతా విధి రాత. ఆ సినిమా కూడా అదే అంశంమీద ఉంటుంది. సినిమా పట్టాలెక్కడానికి ఇంకా పదిరోజులు ఉందనగా నేను సంతకం చేశాను. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన అనుభవంవల్ల మొదట్లో సెట్‌లో అడుగుపెట్టగానే అన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా అని చూసేదాన్ని. నేను హీరోయిన్‌ అన్న సంగతి తర్వాత గుర్తొచ్చి నా క్యారెక్టర్‌ గురించి ప్రధానంగా దృష్టిపెట్టాలని నాకు నేను చెప్పుకునేదాన్ని. వారం రోజుల తర్వాతే ఆర్ట్‌ డైరెక్షన్‌ సంగతి మర్చిపోగలిగాను. అప్పట్నుంచీ సెట్స్‌లో మిగతా అంశాల్లో మరీ ఎక్కువగా ఇన్‌వాల్వ్‌ అవ్వకుండా జాగ్రత్తపడ్డాను. ఆ సినిమా సమయంలో మంచి టీమ్‌తో పనిచేశానన్న సంతృప్తి కలిగింది. నాకు తెలుగు రాదు. అందుకే ముందు రోజే నాకు డైలాగులు ఇచ్చేసేవారు. విక్రమ్‌కుమార్‌ నన్ను క్యారెక్టర్‌కి తగ్గట్టు బాగా తీర్చిదిద్దారు. ఆ సినిమాలోని నా పాత్ర పేరు
‘జున్ను’తో నన్ను ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. అది చూడగానే నవ్వొస్తుంది.

అమ్మానాన్నల పాత్ర ఏంటి?
నాన్న దర్శకుడే కాదు, మంచి నటుడు కూడా. ఇక అమ్మ గురించి చెప్పేదేముంది. వాళ్లిద్దరూ నన్ను చేయిపట్టుకుని నడిపిస్తుంటారని అంతా అనుకుంటుండొచ్చు. కానీ ‘హలో’ సమయంలో నేను ఎలా చేస్తున్నానూ, ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నానూ… వంటి విషయాల్ని ఒక్కరోజు కూడా అడగలేదు వాళ్లు. షూటింగ్‌కి వచ్చి చూసిందీ లేదు. నేను ఒక్కదాన్నే షూటింగ్‌కి వస్తుంటే చాలామంది ఆశ్చర్యపోయేవారు. ఆ సినిమా టీజర్‌ వచ్చాక అందరిలానే అమ్మానాన్నా నా వర్క్‌ని చూశారు. సినిమా చూశాక అమ్మ భావోద్వేగానికి లోనై నన్ను 10 నిమిషాలు కౌగిలించుకుని ఏడ్చేసింది. తర్వాత డైరెక్టర్‌ చేతులు పట్టుకునీ ఏడ్చేసింది. నాన్న నాకు మంచి విమర్శకుడు. చిన్నప్పట్నుంచీ ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని లోతుగా విశ్లేషించి చెప్పేవారు. మొదటి సినిమాలో నా పాత్రకు పూర్తిగా న్యాయం చేయగలనన్న నమ్మకం నాన్నకి లేదు. ఆ సినిమా చూశాక నన్ను ఏమీ అనలేదు. అదే ఆయనిచ్చిన కాంప్లిమెంట్‌.

‘చిత్రలహరి’ అనుభవాలు చెప్పండి?
దాదాపు ఏడాదిన్నర తర్వాత ‘చిత్రలహరి’తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ‘లహరి’ పాత్రలో ఈతరం అమ్మాయిలు తమని చూసుకున్నారు. ఈసారి తెలుగు నేర్చుకుని నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పాను. డబ్బింగ్‌ సమయంలో డైరెక్షన్‌ టీమ్‌ చాలా హెల్ప్‌ చేశారు. దర్శకుడు కిశోర్‌ తిరుమల చాలా పొయెటిక్‌గా డైలాగులు రాస్తారు. పొరపాటుగా పలికి వాటి తీవ్రతని తగ్గించకూడదని ప్రతి పదం అర్థం తెలుసుకుని మరీ చెప్పేదాన్ని. ఈ సినిమా షూటింగ్‌ చాలా సరదాగా గడిచిపోయింది. ఓసారి నా పుట్టినరోజు గురించి డిస్కషన్‌ వచ్చింది. ‘ఆరోజు నీకు ఏం గిఫ్ట్‌ కావాలి’ అని అడిగాడు తేజూ. ఐపాడ్‌ కావాలన్నాను నవ్వుతూ. సరదాగా అడిగాడు అనుకున్నాను. కానీ పుట్టినరోజు నాడు ఐపాడ్‌ పట్టుకుని వచ్చాడు. అంత ఫ్రెండ్లీ నేచర్‌ తనది. ఈ సినిమాతో నటనలోనూ, తెలుగు భాషలోనూ చాలా మెరుగయ్యానని చెప్పాలి. ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌రోజు తెలుగులోనే మాట్లాడాను. కానీ ఇంకా బాగా నేర్చుకోవాలి.

మీరు మోహన్‌లాల్‌ ఫ్యానా?
మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆయన్ని ‘అంకుల్‌’ అని పిలుస్తాను. మా రెండు కుటుంబాలూ కలిసి ఐరోపా పర్యటనకు వెళ్లిన రోజులు నాకింకా గుర్తే. ఆయన సినిమాల్ని చూస్తూ పెరిగిన నాకు ఆయన ఫీడ్‌బ్యాక్‌ చాలా ముఖ్యం. అందుకే నా మొదటి సినిమాను ఆయనకు చూపించాను. సినిమా చూశాక కౌగిలించుకున్నారు. ఆయనకు సినిమా నచ్చిందని ఆ స్పర్శతో నాకు అర్థమైంది. అంకుల్‌ వాళ్లబ్బాయి ప్రణవ్‌ కూడా నాకు మంచి ఫ్రెండ్‌. చాలా సింపుల్‌గా ఉంటాడు. తనూ సినిమాల్లోకి వచ్చాడు. ప్రణవ్‌తో కొద్దిరోజులు మాట్లాడితే ఏ అమ్మాయి అయినా ఇతణ్ణి ఇష్టపడుతుంది. ఎవరైనా మంచి స్క్రిప్టుతో వస్తే కచ్చితంగా ప్రణవ్‌, నేనూ కలిసి పనిచేస్తాం.

సినిమా ఎంపిక ఎలా?
20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను గర్వంగా ఫీలయ్యే పాత్రలు కొన్నయినా ఉండాలనేది నా లక్ష్యం. అందుకే స్క్రిప్టు నచ్చితే అయిదు నిమిషాలుండే పాత్ర అయినా చేస్తాను. వారసురాలిగా అమ్మానాన్నల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాపైన ఉంటుంది. ఆ విషయాన్నీ కథ ఓకే చేసినపుడు ఆలోచిస్తాను. నిజానికి కొత్తవాళ్లకి ఛాయిస్‌లు ఎక్కువ ఉండవు. కానీ కథ నచ్చకపోతే నేను చేయను. నటన పరంగా ఏ భాష అయినా పెద్దగా తేడా ఉండదు. నాకు తెలుగు బాగా రాదు కాబట్టి, ఇక్కడ డైరెక్టర్‌ చెప్పినట్టు చేస్తాను. మలయాళం, తమిళం తెలుసుకాబట్టి, డైలాగులో అంతర్లీనంగా ఉన్న అర్థం తెలుసుకుని నా ఆలోచనలకు అనుగుణంగా నటిస్తాను. డైరెక్టర్‌ని బట్టి కూడా అప్రోచ్‌ మారుతుంది. భవిష్యత్తులో మూడు భాషల్లోనూ చేస్తాను.

అమ్మానాన్నా విడిపోయారా?
అవును… అయిదేళ్లకిందట విడిపోయారు. మాకోసం మాత్రం కలిసి మాట్లాడుకుంటారు. నాకు మాత్రం వాళ్లు దూరమైన ఫీలింగ్‌ లేదు. నిజంగా నాకూ, తమ్ముడికీ ఏరోజూ ఎలాంటి లోటూ రాకుండా చూసుకున్నారు,చూసుకుంటున్నారు. వాళ్లతో ప్రతి విషయాన్నీ పంచుకుంటాను. వాళ్లూ అంతే. దానికి తోడు చిన్నప్పట్నుంచీ నా నిర్ణయాలు నేనే తీసుకునేలా పెంచారు. ఇప్పుడు స్క్రిప్టులు నేనే విని సినిమాలు ఎంపిక చేసుకుంటాను.

ఏ సినిమాలు చేస్తున్నారు?
తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నాను. అది త్వరలోనే రిలీజవుతుంది. తమిళంలో ‘హీరో’, ‘మానాడు’ చేస్తున్నాను. హీరో పక్కా కమర్షియల్‌ సినిమా, ‘మానాడు’ రాజకీయ నేపథ్యంతో సాగే కథ. మోహన్‌లాల్‌ అంకుల్‌తో నాన్న చేస్తున్న మలయాళీ సినిమా ‘మరక్కర్‌’లో చిన్న పాత్ర చేస్తున్నాను. అది పీరియడ్‌ సినిమా. 16వ శతాబ్దంలో పోర్చుగీసువాళ్లు ఇండియాకి వచ్చిన సమయం నాటి కథ.

మీ జీవిత లక్ష్యం?
జీవితంలో ఒక్క సినిమాకైనా డైరెక్షన్‌ చేయాలనేది నా లక్ష్యం.