director Gowtam Tinnanuri

నానీకి కథ నచ్చలేదు అనుకున్నా!

జెర్సీ… టాలీవుడ్‌ని మరో మెట్టెక్కించిన సినిమాగా ప్రేక్షకులతోపాటు సినీ వర్గాలూ ప్రశంసిస్తున్నాయి. ఆంధ్రా, నైజాం, సీడెడ్‌ ప్రాంతాలూ… ఏ, బీ, సీ సెంటర్లూ అన్న తేడా లేకుండా అంతటా కలెక్షన్లు కురిపిస్తున్న ‘జెర్సీ’ వెనక కీలకవ్యక్తి దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. సుఖంగా ఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సినిమాల కోసం వచ్చి ఎదుర్కొన్న కష్టాల్నీ,  జెర్సీ కోసంపడ్డ శ్రమనీ, తన విజయం వెనకున్న వ్యక్తుల్నీ గుర్తుచేసుకుంటున్నాడిలా…

మా సొంతూరు రాజమండ్రి. అక్కడే ఇంటర్మీడియెట్‌ వరకూ చదువుకున్నా. 2004లో గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక దిల్లీ వెళ్లి ఎంబీఏ చేశా. తర్వాత బెంగళూరు యాక్సెంచర్‌లో ఐటీ కన్సల్టెంట్‌గా చేరా. చదువుకునే రోజుల్లో ‘మంచి ఉద్యోగం సంపాదిస్తే జీవితంలో అంతకంటే ఏం కావాలి’ అనుకునేవాణ్ని. కానీ ఉద్యోగంలో చేరిన కొన్నేళ్లకే ఇంకేదో కావాలీ, చెయ్యాలీ అనిపించింది. అప్పటికే బెంగళూరులో స్టార్టప్‌ల సందడి బాగా ఉండేది. కొద్దిమంది ఫ్రెండ్స్‌తో కలిసి ఆ ప్రయత్నమూ చేశాను. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అప్పుడే హైదరాబాద్‌లో ఉంటున్న స్కూల్‌ ఫ్రెండ్‌ ఫోన్‌ చేసి సినీ హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ‘ఒక వెబ్‌సైట్‌ పెట్టి అందులో సినిమాల్లోకి రావాలనుకునేవాళ్లు ప్రొఫైల్స్‌ పెడితే, వాటిని దర్శకనిర్మాతలు చూసి ఆఫర్లు ఇచ్చేలా చేస్తే…’ అన్నాను. వాడూ సరే అన్నాడు. హైదరాబాద్‌లో ఉంటేనే ఇది సాధ్యమని, ఇక్కడకు వచ్చి డెలాయిట్‌లో చేరాను.

అనుకోకుండా సినిమాల్లోకి…
మా వెబ్‌సైట్‌కి అనుకున్న స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా మా ఫ్రెండూ నేనూ సినిమాల గురించే మాట్లాడుకునేవాళ్లం. వాడికి కొన్ని కథల ఆలోచనలు ఉండేవి. స్కూల్‌ రోజుల నుంచీ చిన్న చిన్న కథలూ, కాన్సెప్ట్‌లు రాయడం నాకు అలవాటు. మావాడి ఆలోచనలకి నా అనుభవాన్ని జోడించి కథలు రాసేవాణ్ని. అలా రాసే క్రమంలో ఒక కథ పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టుగా తయారైంది. దాన్ని నిర్మాణ సంస్థలకు అమ్మే ప్రయత్నం చేశాం. అప్పుడు ఒకాయనకి మా కథ నచ్చి ‘డబ్బు పెడతా, మీరే డైరెక్షన్‌ చెయ్యండి’ అన్నాడు. నా ఫ్రెండ్‌ దర్శకుడిగా, నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సినిమా మొదలుపెట్టాం. ఫుల్‌టైమ్‌ పనిచేయాలని ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఓ ఆరు నెలలు పూర్తిగా సినిమాకి కేటాయించాలనుకున్నాను. ఎప్పుడైనా షూటింగ్‌ చూడ్డం తప్పించి సినిమా తీసిన అనుభవం మాకు లేదు. అయినా కష్టపడి నెలరోజుల్లో షూటింగ్‌ పూర్తిచేశాం. మా ఫ్రెండ్‌ హైదరాబాద్‌లో సినిమా పనులు చూసుకుంటే, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల కోసం నేను చెన్నై వెళ్లాను. ఆ పనులు జరుగుతుండగానే నిర్మాత చేతులు ఎత్తేశాడు. ఆలోపు చెన్నైలో మా సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్‌ అందరూ నాకు ఫ్రెండ్స్‌ అయిపోయారు. వాళ్లతో పనిచేస్తున్నపుడే సినిమా తీయడం గురించి అవగాహన వచ్చింది. ఇష్టమూ పెరిగింది. అక్కడే వాళ్లకి అసిస్టెంట్‌గా ఉంటూ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌… లాంటివి తెలుసుకున్నాను. 2011-12 మధ్య దాదాపు ఏడాదిన్నరపాటు అక్కడ పనిచేశా. 2012 చివర్లో మళ్లీ
హైదరాబాద్‌ వచ్చి సొంతంగా కథలు రాసేవాణ్ని. వాటిని ఎవరికైనా ఇద్దాం అని నిర్మాతల్ని సంప్రదించేవాణ్ని. కానీ సరైన స్పందన వచ్చేది కాదు. అప్పుడే డైరెక్షన్‌ వైపు వెళ్లాలనుకున్నాను.

హిట్‌ అంటే నమ్మలేదు!
కొంతమంది నిర్మాతల్ని కలిసి ‘మళ్లీరావా’ స్క్రిప్టుని వినిపించినా ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడే రాహుల్‌ యాదవ్‌ సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవరో స్టోరీ చెబుతామంటే, విని సరిగ్గా జడ్జ్‌ చేయడానికి ఒకరు తోడుంటే బావుణ్నని చూస్తున్నాడు. ఆ సమయంలో ఒక ఫ్రెండ్‌ నన్ను రాహుల్‌కి పరిచయం చేశాడు. ఇద్దరమూ వెళ్లి కథ విన్నాం. బయటకు వచ్చాక ‘కథ ఎలా ఉంది’ అని అడిగాడు. ‘నేను చెప్పలేను’ అన్నాను. ‘లేదు చెప్పాలి’ అని గుచ్చి గుచ్చి అడిగితే నచ్చలేదని చెప్పాను. దాంతో రాహుల్‌ అతడికి ‘నో’ చెప్పేశాడు. అది జరిగిన వారం తర్వాత ఫోన్‌చేసి ‘నీ దగ్గర కథ ఉందన్నావు అది నాకు చెబుతావా’ అన్నాడు. తనకు ‘మళ్లీరావా’ స్క్రిప్టు ఇస్తే, చదివి నచ్చిందన్నాడు. ‘నాకూ పరిశ్రమ కొత్త… నేను 30 శాతం బడ్జెట్‌ పెడతాను. మిగిలిన 70 శాతం పెట్టేవాళ్లు ఎవరైనా ఉంటారేమో చూద్దాం’ అన్నాడు. నేను ఒక్క షార్ట్‌ఫిల్మ్‌ కూడా తీయలేదు… అయినా నా మీద నమ్మకంతో కొంతైనా డబ్బు పెడుతున్నాడంటే ఎలా కాదనగలను… అందుకే ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పాను. ఇద్దరం కలిసి పార్ట్నర్‌ కోసం ఎంత వెతికినా దొరకలేదు. రోజులు గడిచిపోతున్నాయి. రాహుల్‌ ఓరోజు వచ్చి ‘నేనే పూర్తి బడ్జెట్‌ పెడతాను’ అన్నాడు. నామీద సానుభూతితో అలా అంటున్నాడేమోనని ‘వద్దు ఇంకొన్నాళ్లు వేచి చూద్దాం’ అన్నాను. తను మాత్రం చేద్దాం అన్నాడు. అప్పుడు నాకో ఐడియా వచ్చింది. ‘ఒక అయిదు నిమిషాల డెమో వీడియో తీద్దాం. అది బాగా వస్తే ముందుకు వెళ్దాం. లేకపోతే వద్దు’ అని రాహుల్‌కి చెప్పాను. అతను ఓకే అన్నాడు. నా కథలో భాగమైన ఒక పాటని తీశాను. అది అందరికీ నచ్చింది.  దాంతో మా ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ టీనేజ్‌లో, ఇరవైల్లో, ఇంకాస్త పెద్దయ్యాకా ఎలా ఉంటుందనేది కథ. సుమంత్‌కి కథ చెబితే నచ్చిందన్నారు. డెమో వీడియోకి పాట రాసిన కేకే, సంగీతం అందించిన శ్రావణ్‌ భరద్వాజ్‌, కెమెరామేన్‌గా పనిచేసిన సతీష్‌ ముత్యాల వీళ్లనే సినిమాకీ తీసుకున్నాను. సినిమా పూర్తిచేసి బయ్యర్లకి చూపిస్తే బాగుందన్నారు కానీ కొనడానికి వెనకాడారు. రాహుల్‌ మరో సాహసం చేసి సొంతంగా రిలీజ్‌ చేశాడు. 2017 డిసెంబరు ఎనిమిదిన రిలీజ్‌ అయింది. ఆరోజు ఉదయం ప్రసాద్స్‌ ఐమ్యాక్స్‌లో సినిమా చూస్తున్నాను. ప్రేక్షకుల నుంచి స్పందన బాగుంది. కానీ అక్కడ ఉన్నవారిలో చాలామంది మా టీమ్‌లోవాళ్లూ, బంధువులూనూ. అందుకని ఇంటర్వెల్‌ తర్వాత ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి థియేటర్‌కి వెళ్లాను. మార్నింగ్‌ షో స్టార్ట్‌ అయింది. లోపల చూస్తే 30-40 మంది కనిపిస్తున్నారు. ‘చచ్చింది గొర్రె’ అనుకున్నాను. బయటకు వచ్చాక ప్రసాద్స్‌లో షో చూసిన మావాళ్లంతా ఫోన్‌చేసి సినిమా బాగుందని చెబుతున్నారు. నాకు నమ్మబుద్ది కాలేదు. మొదటి సినిమా కదా, సరిగ్గా తీశానా లేదా అన్నది నా సందేహం. వెబ్‌సైట్లలో రివ్యూలు బాగా వచ్చాయి. మార్నింగ్‌ షోకి 10 శాతం సీట్లు నిండితే మేట్నీకి 50 శాతం, ఫస్ట్‌షోకి 80 శాతం నిండాయని రిపోర్ట్‌ వచ్చింది. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. తక్కువ బడ్జెట్‌లో తీయడంవల్ల మా పెట్టుబడికి మంచి లాభాలే వచ్చాయి.

హిట్‌ తర్వాత పాఠాలు
‘మళ్లీరావా’ తర్వాత చాలామంది నిర్మాతలు ఫోన్లు చేసి కథ ఉంటే చెప్పమన్నారు. కానీ బ్రేక్‌ తీసుకుంటానని చెప్పి ఊరుకున్నాను. ‘మళ్లీరావా’ తీస్తున్నపుడు కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. నేను ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయలేదు. మెరుగవ్వాలంటే శిక్షణ అవసరమనిపించింది. అప్పుడు ముంబయిలోని ‘న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ’లో నిర్వహించే మూడు నెలల స్క్రీన్‌ప్లే కోర్సులో శిక్షణ తీసుకున్నాను. సినిమా అనుభవానికి అది తోడయ్యేసరికి నా రాతలో చాలా మార్పు వచ్చింది. ఉదయం పూట క్లాసుకి వెళ్తూనే, సాయంత్రం కథలు రాసుకునేవాణ్ని. శిక్షణ పూర్తిచేసి హైదరాబాద్‌ తిరిగి వచ్చేసరికి చేతిలో రెండు కథలు ఉన్నాయి.

‘మళ్లీరావా’ని ఓ ఆప్‌లో చూశారట నిర్మాత నాగ వంశీ. ‘నాకు బాగా నచ్చింది, ఏదైనా కథ ఉంటే చెప్పు’ అని ఫోన్‌చేసి చెప్పారు. అప్పుడే ‘జెర్సీ’ కథని చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ‘హీరోగా ఎవరిని అనుకుంటున్నావు’ అన్నారు. నానీ పేరు చెప్పాను. ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు. నానీ కథ విన్నంతసేపు ఎలాంటి ఎక్స్‌ప్రెషనూ ఇవ్వలేదు. ‘ఏంటీ ఈయనకి నచ్చడంలేదా’ అనుకున్నాను మనసులో. ఫస్ట్‌ హాఫ్‌ విన్నాక… ‘సెకండ్‌ హాఫ్‌ కూడా ఇంతే బావుంటుందా’ అన్నారు. అప్పుడు ధైర్యం వచ్చింది. సెకండ్‌ హాఫ్‌ కూడా విన్నాక… ‘బాగుంది, చేద్దాం’ అన్నారు. సచిన్‌ గొప్ప క్రికెటర్‌ ఎలా అయ్యాడన్న విషయం మీద హర్షభోగ్లే స్పీచ్‌ ఇస్తూ, టాప్‌-10లో అందరూ సచిన్‌ అంత టాలెంట్‌ ఉన్నవాళ్లే ఉంటారు. కానీ యాటిట్యూడ్‌ కారణంగా సచిన్‌ నంబర్‌వన్‌ అయ్యాడని చెప్పారు. మరి మిగిలిన తొమ్మిది మంది పరిస్థితి ఏంటన్న ఆలోచన నుంచి పుట్టిందే జెర్సీ కథ. ఈ కథకి ఆత్మ మానవ సంబంధాలూ, భావోద్వేగాలు. క్రికెట్‌ అనే కాకుండా ఫుట్‌బాల్‌, బిజినెస్‌, సినిమా… వీటిలో దేన్నైనా నేపథ్యంగా ఎంచుకోవచ్చు. కానీ నాకు క్రికెట్‌ గురించి తెలుసు కాబట్టి ఆ నేపథ్యమైతే చెప్పడానికి సులభంగా ఉంటుందని కథ అలా రాసుకున్నాను. అదే సమయంలో ఆటలో సహజత్వం లేకపోతే ప్రేక్షకుల్ని మెప్పించలేం. అందుకే ప్రొఫెషనల్‌గా కనిపించడానికి ప్రత్యేకంగా నానీ క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నారు. షూటింగ్‌ సమయంలో మాతోపాటు కోచ్‌ డానియల్‌ కూడా ఉండి షాట్స్‌ ఓకే చెప్పాకే వాటిని ఫైనల్‌ చేసేవాళ్లం. హైదరాబాద్‌లోని వివిధ అకాడమీల్లోని 250 మంది క్రికెటర్లని ఎంపికచేసి వాళ్లతో షూటింగ్‌ చేశాం. ఒక ఫిజియో, డాక్టర్‌ కూడా మాతో ఉండేవారు.

చాలావరకూ సహజంగా ఆడిస్తూ వాటినుంచి చాలా క్లిప్‌లు తీసుకున్నాం. స్లిప్‌లో ఒక క్యాచ్‌ కోసం రెండున్నర గంటలపాటు ప్రయత్నించామంటే అర్థం చేసుకోండి. సినిమాలో న్యూజిలాండ్‌ జట్టుగా కనిపించింది ఇంగ్లాండ్‌కి చెందిన లివర్‌పూల్‌ కౌంటీ టీమ్‌. ఆటగాళ్లతోపాటు వాళ్ల కోచ్‌, ఫిజియో కూడా వచ్చారు. దాంతో సినిమాలో సహజత్వం వచ్చింది. సినిమా బాగా తీశానంటే ఆ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు, మా టీమ్‌ అందరిదీ. ‘మళ్లీ రావా’కి పనిచేసిన నా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అంతా ఈ సినిమాకీ పనిచేసింది. వివేక్‌ సాగర్‌, వీరూ… నాకంటే అనుభవజ్ఞులు. మధ్యలో ఏ ప్రాజెక్టూ చేయకుండా నా రెండో సినిమా కోసం వేచి చూశారు. మిగతా విభాగాలకీ మంచి సాంకేతిక నిపుణుల్ని ఎంపికచేశాం. జెర్సీలాంటి హిట్‌ కెరీర్‌లో రెండో సినిమాగా రావడం నిజంగా నా అదృష్టం. కొద్దిరోజులు సినిమా ప్రపంచానికి దూరంగా స్నేహితులూ, కుటుంబ సభ్యులతో గడుపుతాను. ఆ దశలోనే మళ్లీ ఏదో ఒక అనుభవం కథ రాసేందుకు స్ఫూర్తినిస్తుంది.


ఆమె సహకారం…

నా శ్రీమతి సుధ. మాది ప్రేమ వివాహం. ఇంజినీరింగ్‌లో నా క్లాస్‌మేట్‌. పెళ్లయిన రెండేళ్లకే ఉద్యోగం మానేశాను. సినిమా ప్రయత్నంలో అయిదేళ్లపాటు ఉద్యోగానికి దూరంగా ఉన్నాను. ఆ సమయంలో తన జీతంతో ఇంటిని నడిపించేది.
* మాకో అబ్బాయి. పేరు… కార్తీక్‌.
* నాన్న గణేష్‌బాబా రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి. అమ్మ నాగమణి గృహిణి. రాజమండ్రిలోనే ఉంటారు. నా సినిమా రిలీజ్‌ ఉందంటే కచ్చితంగా హైదరాబాద్‌ వస్తారు. అమెరికాలో ఉండే మా చెల్లి కూడా వచ్చేస్తుంది.
* సినిమా తీస్తున్నన్నిరోజులూ అదే ప్రపంచం. ఖాళీ దొరికితే పుస్తకాలూ, జర్నల్స్‌ చదువుతాను. చరిత్ర పుస్తకాలంటే బాగా ఇష్టం. స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు వింటాను.