Heroine Sumalatha

ఆ ఆలోచన ఆయనకు ఎప్పుడూ లేదు!
07-04-2019 00:25:57
సుమలతా అంబరీశ్‌… ఈ ఎన్నికల వేళ మారుమోగుతున్న పేరు. నిన్నటి వరకు బహుభాషా నటి, కన్నడ రెబల్‌ స్టార్‌ అంబరీశ్‌ సతీమణి మాత్రమే! నేడు… భర్తను ఆరాధించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పిడికిలి బిగించిన ధీశాలి. కర్ణాటకలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె… జనతాదళ్‌(ఎస్‌) ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, హీరో నిఖిల్‌తో ఢీకొంటున్నారు. బాల్యంలో ఒడుదొడుకులు… రాజకీయాల్లోకి రాగానే ఎదురుదెబ్బలు… అన్నింటికీ ఎదురొడ్డి గెలుపుపై ధీమాతో దూసుకుపోతున్న సుమలత అంతరంగం ఇది…
సినిమాల్లోకి ఎలా వచ్చారు?
నాకు ఏడేళ్ల వయస్సులోనే నాన్న మాకు దూరమయ్యారు. మేం ఐదుగురు పిల్లలం. అందరి బాధ్యతా అమ్మ భుజాలపై పడింది. అయితే నేను పదో తరగతి చదువుతుండగా అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఒకటో రెండో అనుకున్నా… కానీ అవకాశాలు పెరిగి, ఏకంగా చదువు ఆపేయాల్సి వచ్చింది. చివరకు సినిమానే జీవితంగా మారిపోయేంతగా అనుబంధం ఏర్పడింది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళం, హిందీ భాషలన్నింటిలోను నటించాను. ఆ తర్వాత కన్నడంలో రెబల్‌స్టార్‌గా రాణిస్తున్న అంబరీశ్‌తో పెళ్లయింది.
సహ నటులలానే రాజకీయాలలోకి రావాలనుకున్నారా?
సినిమాల్లో బిజీగా గడిపే కాలమది. అప్పట్లో నేను నటిస్తున్న అన్ని భాషలలోనూ ప్రముఖ నటులు రాజకీయాల వైపు వచ్చి రాణించారు. ఎన్నో సినిమాల్లో రాజకీయ ఇతివృత్తం కలిగిన పాత్రలు పోషించాను. కానీ ఎప్పడూ అటువైపు వెళ్లాలని ఆలోచించలేదు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటకలోనూ ఎందరో నటులు రాజకీయ పార్టీలు స్థాపించినా… ఏ పార్టీలోకీ వెళ్లాలని కానీ, ప్రచారాలు చేయాలని కానీ అనుకోలేదు.
 
అంబరీశ్‌ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
ఇరువురం సినిమా రంగంలో బిజీగా గడిపే రోజులలోనే పెళ్లి చేసుకున్నాం. అప్పట్లో అంబరీశ్‌ను ఒక నటుడుగానే కాకుండా… కర్ణాటక చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కుగా భావించేవారు. అదే సమయంలో అంబరీశ్‌ రాజకీయాల వైపు దృష్టి సారించారు. ఆయనకు తన సొంత జిల్లా మండ్య అంటే ఎక్కడ లేని అభిమానం. పండుగలు, పెళ్లిళ్లు… మండ్యలో ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవారు. అక్కడి ప్రజలతో మమేకమైపోయేవారు. ఆయనది విభిన్న జీవనశైలి. కష్టమని ఎవరొచ్చినా సాయం చేసేవారు. అందుకే ఆయన్ను ‘అభినవ కర్ణుడ’ని ప్రజలు పిలుచుకునేవారు.
 
ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏవైనా సలహాలిచ్చేవారా?
అంబరీశ్‌ ఎప్పుడూ సామాన్యుల గురించి ఆలోచించేవారు. ఆయనకు సలహాలిచ్చేంతటి పరిస్థితి మాకుండేది కాదు. ఎక్కువమందితో మాట్లాడేవారు. వారిలో అధికారులు, రైతులు, సినిమా రంగానికి చెందినవారుండేవారు. అందరి అభిప్రాయాలూ విని ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకునేవారు. కావేరీ నదీ జలాల విషయంలో వివాదం తలెత్తినప్పుడు, కర్ణాటక ప్రజల పక్షాన నిలబడి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో పేదలకు మంచి చేసే అవకాశం దక్కిందని సంతోషించేవారు. ప్రచారాలకు దూరంగా, రాష్ట్రమంతటా వేలాదిమంది నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేశారు. తన కుటుంబం నుంచి మరెవరినీ రాజకీయాల్లోకి తేవాలన్న ఆలోచన ఆయనకు ఎప్పుడూ ఉండేది కాదు.
మరి మీరు రాజకీయాల వైపు ఎలా నడిచారు?
అంబరీశ్‌ ఉన్నంత కాలం… ‘రాజకీయాలలోకి రావాలి… పదవులు అనుభవించాల’ని నేనెప్పుడూ అనుకోలేదు. ఆయన మాకు దూరమయ్యాక మండ్య జిల్లాలో లెక్కలేనన్ని సంతాప సభలు జరిగాయి. అంతటి అభిమానం అక్కడి ప్రజలది! ఆ సభలకు మా అబ్బాయి అభిషేక్‌తో వెళ్లాను. ప్రతి చోటా ఒకటే డిమాండ్‌… ‘ అంబరీశ్‌ అంటే మాకు ప్రాణం. ఆయనను మా కుటుంబ సభ్యుడిగా భావించాం. ఆయన ఆకాంక్షలు నెరవేరాలంటే మీరు రాజకీయాల్లోకి రావాలి’ అని! కానీ నేను అవేమీ పట్టించుకోలేదు. దీంతో వారు ‘అంబి (అంబరీశ్‌ను ప్రజలు ముద్దుగా పిలిచే పేరు) ఆశయాలు సాధించే దిశగా రాజకీయాల్లోకి రండి. లేదంటే ఈ సభల తర్వాత మాకు కనిపించొద్దు’ అన్నారు. ఏ పల్లెకెళ్లినా ఇదే డిమాండ్‌. అంబరీశ్‌ తర్వాత నా కొడుకే జీవితం అనుకున్నా. కానీ ఇంతమంది నన్ను అంబి రూపంలో ప్రాణం కంటే గొప్పగా అభిమానిస్తున్నారని తెలిసి భావోద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణమే మండ్య నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నా.
 
కానీ, అంబరీశ్‌ పనిచేసిన కాంగ్రెస్‌ను ఎందుకు కాదనుకున్నారు?
కాంగ్రె్‌సలో ఉన్నప్పుడు అంబరీశ్‌ ఎన్నో పదవులు అనుభవించారు. అందుకే నేను సైతం అదే పార్టీ ద్వారా వెళ్లాలని అనుకున్నా. కానీ కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉన్నందున ఈ సీటు జేడీఎ్‌సకు వెళ్లింది. రాజకీయాలు చేయాలనీ, పదవులు పొందాలనీ, ఇంకేదో చేయాలనీ, మా అబ్బాయి భవిష్యత్తుకు బాటలు వేయాలనీ నాకెప్పుడూ లేదు. మండ్య ప్రజలతో కలిసి ఉండటమే నా భవిష్యత్తు అనుకున్నా. అయితే మండ్యలో కాకుండా బెంగళూరు దక్షిణ లేదా ఉత్తర నుంచి పోటీ చేయాలనీ, లేదంటే రాజ్యసభ సీటిస్తామని కాంగ్రెస్‌ చెప్పింది. జేడీఎస్‌ కూడా నన్ను ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తామంది. సరే అంటే పదవి వచ్చేస్తుంది. కానీ నాకు ఆ పదవి కంటే మండ్య ప్రజలతో అనుబంధమే ముఖ్యమనుకున్నా.
కన్నడనాట ఎన్నికల్లో ఇప్పుడు మండ్యనే ప్రముఖంగా మారింది కదా!
మండ్యలో ఎన్నికలంటే ఆత్మాభిమానానికీ… అధికార పాలనకూ మధ్య జరుగుతున్న పోరాటం. నేను నామినేషన్‌ వేసినప్పటి నుంచి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. నామినేషన్‌కు జనమొస్తే జీర్ణించుకోలేకపోయారు. నా సొంత పిల్లల్లాంటి సినీ హీరోలు దర్శన్‌, యశ్‌లు ప్రచారానికొస్తే బెదిరిస్తున్నారు. దీనికంతటికీ కారణం సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ జేడీఎ్‌స-కాంగ్రె్‌సల ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయడమే. ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రులు, ఐదుగురు శాసనసభ్యులు… ఇంతమంది కలిసి నిఖిల్‌ తరపున ప్రచారం చేస్తున్నారు. నిఖిల్‌ నామినేషన్‌లో తప్పులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశా. నాపై కసితో సుమలత పేరున్న మరో ముగ్గురి చేత నామినేషన్లు వేయించారు. నా వ్యక్తిగత జీవితం గురించి, నా కులం గురించీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు. ఇవేవీ పట్టించుకోని నేను ప్రశాంతంగానే ఉన్నా. కానీ ఉత్కంఠ అంతా ప్రత్యర్థుల్లోనే కనిపిస్తోంది.
ప్రచారంలో సుమలత ప్రత్యేకతలేంటి?
ప్రచారంలోనే కాదు… సుమలత అంటే ఎప్పుడూ సౌమ్యంగా ఉండాలనుకుంటా. కానీ అంబరీశ్‌ను సోదరుడనీ, తమ కుటుంబం సభ్యుడనీ చెప్పుకున్నవారు, ఆయనకు పాదాభివందనాలు చేసినవారే ఇప్పుడు నాపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోను. పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు వెళుతున్నా.
మీ అబ్బాయి అభిషేక్‌ను రాజకీయాలలోకి తీసుకొస్తారా?
అభిషేక్‌ ఇప్పుడే తొలి సినిమాలో నటిస్తున్నాడు. ఆ రంగంలో రాణించి, జీవితమంటే ఏంతో తెలుసుకోవాలి. ఎటువైపు నడవాలనేది వాడి నిర్ణయానికే వదిలేశాను. రాజకీయాలలోకి వస్తానంటే వద్దనేది లేదు.
 
గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు?
గెలిచిన వెంటనే మండ్యను సింగపూర్‌ చేస్తానని చెప్పడం లేదు. అలాంటి వాగ్దానాలు చేయను. మండ్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకున్నా. వాటికి కేంద్రం ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇక ఓడిపోతే… ప్రజల తీర్పును గౌరవిస్తా. కానీ మండ్య ప్రజల అభిమానానికి మాత్రం దూరమవ్వను. జీవితకాలం వారితోనే కలిసివుంటా.
 
 
చిరంజీవి, రజనీకాంత్‌లను ఆహ్వానించలేదు…
చిరంజీవి, రజనీకాంత్‌లతో కలసి చాలా చిత్రాలు చేశాను. సహనటులుగానే కాదు… వారిద్దరూ నాకు సన్నిహితులు. అంబరీశ్‌కు వారంటే ఎంతో ఇష్టం. ఇరువురూ అపార అనుభవం కలిగినవారు. నా రాజకీయరంగ ప్రవేశాన్ని అభినందించారు. కానీ ప్రచారాలకు నేను ఆహ్వానించలేదు. అయితే మీడియాలో ప్రచారం జరుగుతోంది. అటువంటి ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదు.
 
అమ్మ, ఆయనే నాకు స్ఫూర్తి…
నా చిన్నప్పుడే నాన్న చనిపోతే… ఐదుగురు పిల్లలను మా అమ్మ పెంచి పెద్ద చేసింది. ఇందుకు ఆమె పడిన కష్టాలు చూశాను. అందుకే నాకు అమ్మకు మించిన స్ఫూర్తి ఎవరూ లేరు. ఆ తర్వాత అంబరీశ్‌తో గడిపిన 27 ఏళ్లలో ఎన్నో నేర్చుకున్నా. కష్టంలో ఉండేవారి పట్ల దయ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రేమాభిమానాలు చూపడం ఆయనలోని ప్రత్యేకత. సమాజంలో నేటికీ మహిళలంటే తక్కువనే అభిప్రాయాలు పూర్తిగా పోలేదు. ఎన్నికలలో పోటీ చేస్తే ఆప్తులు, బంధువులు కూడా గేలి చేస్తున్నారు. వీటన్నింటికీ ఎదురు నిలిచి ముందుకెళ్లాలనేది… మా అమ్మ, ఆయన నుంచే నేర్చుకున్నా.
 
సేకరణ: హిందూపురం రవి
ఫొటోలు: కె.ఎన్‌.శివణ్ణ